డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి భారత పర్యటనకు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం అమెరికాలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో దాదాపు అదే శైలిలో అమెరికా అధ్యక్షుడి రాక సందర్భంగా గుజరాత్‌లోనూ సన్నాహాలు జరుగుతున్నాయి.
హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోడీ' తరహాలోనే అహ్మదాబాద్‌లో 'కేమ్ ఛో ట్రంప్' కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.


గుజరాతీలో 'కేమ్ ఛో ట్రంప్' అంటే 'ఎలా ఉన్నారు ట్రంప్' అని అర్థం.
ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారని చెబుతున్నారు. ఆ వేదికపై ట్రంప్‌తోపాటు భారత ప్రధాని మోదీ కూడా ఉండబోతున్నారు.
అయితే, అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఉన్న ఒక మురికివాడ కనిపించకుండా చేయడానికి గోడ కట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ మురికివాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమానికి వెళ్లే దారిలో ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.

మురికివాడ కనిపించకుండా గోడ
స్థానిక పత్రికల్లో గురువారం ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ప్రధాన మార్గం పక్కనే ఉన్న మురికివాడను కనిపించకుండా చేయడానికి ఆరేడు అడుగుల ఎత్తు గోడ కడుతున్నారు. ఈ గోడ దాదాపు అర కిలోమీటర్ పొడవు ఉంటుంది.
అహ్మదాబాద్‌లోని ఇందిరా బ్రిడ్జికి సమీపంలోని సరణియావాస్ ప్రాంతం నుంచి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కాన్వాయ్ వెళ్తుందని, అక్కడ ఉన్న బస్తీలో దాదాపు 2500 మంది నివసిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం పేదరికాన్ని దాచిపెట్టాలని, మురికివాడను కనిపించకుండా చేయాలని అనుకుంటోందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వానికి అవి సమస్యగా అనిపిస్తే, అక్కడివారికి పక్కా ఇళ్లు ఎందుకు కట్టించడం లేదని ప్రశ్నించారు.
ఆ మురికివాడలో ఉండే కమలా బెన్ "రెండు మూడు రోజుల నుంచీ పని జరుగుతోంది. ఈ గోడ కడితే మా బస్తీ మూసుకుపోతుంది. గాలి, నీళ్లు ఆగిపోతాయి. ఇక్కడ మురుగు కాలువలు లేవు, కరెంటు, నీళ్లు లేవు. చీకట్లో ఉండాల్సి వస్తోంది. ఉన్న చిన్న దారిలో జనం పడుతూ లేస్తూ వెళ్తుంటారు. వర్షం వస్తే, ఇక్కడ మోకాళ్లలోతు నీళ్లొస్తాయి" అన్నారు.

మొదట్లో తెరలతో దాచేవారు
"ఈ గోడ కట్టకపోతే మా సమస్య ఏంటో కనీసం ఈ దారిలో వెళ్లే అమెరికా అధ్యక్షుడికైనా కనిపిస్తుంది కదా. కానీ, ప్రభుత్వం నిజాలు దాచిపెట్టాలని అనుకుంటోంది" అని మరో స్థానిక మహిళ అన్నారు.
ఈ ప్రాంతం విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దాంతో, నగరానికి ఎప్పుడు వీఐపీలు వచ్చినా, మురికివాడ ఉన్న ప్రాంతం పక్కనే తెరలు కట్టేవారు. అది కనిపించకుండా కప్పేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఏకంగా గోడే కట్టి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా కనిపించకుండా దాచేయాలని ప్రయత్నిస్తోంది అన్నారు.
"ఈ గోడ కట్టకూడదు. నరేంద్ర మోదీకి మురికివాడలు నచ్చకపోతే, మా పేదరికం కనిపిస్తోందని అనుకుంటే మాకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వండి" అని మరో మహిళ అన్నారు.
ప్రభుత్వం గోడ కట్టి దారి మూసేసిందని స్థానికులు చెబుతున్నారు. "ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చే నేతలు, తర్వాత కనిపించరు. ఈ ప్రాంతంలో టాయిలెట్లు, విద్యుత్, నీళ్ల సౌకర్యాలు లేవు, దారులు వెళ్లడానికి తగినట్లు ఉండవు" అన్నారు.
80 ఏళ్ల ఒక మహిళ బీబీసీతో మాట్లాడుతూ "మా పేదరికంపై తెరలు వేసి, గోడ కట్టి మూసేయడానికి బదులు ప్రభుత్వం మాకు సౌకర్యాలు కల్పించాలి. దానివల్ల మా జీవితాలు మెరుగుపడతాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వాగతం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
గతేడాది డిసెంబర్‌లో భారత ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంయుక్తంగా హ్యూస్టన్‌లో దాదాపు 50 వేల మంది అమెరికన్లు, భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అహ్మదాబాద్‌లో కూడా అలాంటి కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ మొటేరా ప్రాంతంలో ఇటీవల నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంను కూడా ప్రారంభించనున్నారు. ఆ సమయంలో స్టేడియంలో దాదాపు లక్ష మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.
"ఈ స్టేడియం సామర్థ్యం 1.10 లక్షలు, ఇది ఆస్ట్రేలియా క్రికెట్ మైదానాల కంటే పెద్దది" అని ఒక అధికారి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది
స్థానిక పత్రికల కథనాల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు.
ట్రంప్, మోదీ సభకు జనం భారీ సంఖ్యలో హాజరు కానుండడంతో, వారికి తగినట్లు నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వీటితోపాటు అహ్మదాబాద్‌లో ట్రంప్ భారీ రోడ్ షో కూడా ఏర్పాటు చేశారు. ఆయన నగరంలో సబర్మతి ఆశ్రమానికి కూడా వెళ్తారు. ఇది మహాత్మాగాంధీ బస చేసిన ప్రాంతం, భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ఇది కేంద్రంగా నిలిచింది.
డోనాల్డ్ ట్రంప్ రోడ్ షోకు సన్నాహాలకు సంబంధించిన వివిధ పనులను అహ్మదాబాద్ కార్పొరేషన్ తమ అధికారులకు అప్పగించింది.

ఫొటో సోర్స్, Getty Images
భద్రత, అలంకరణలు, ఇంకా చాలా...
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ రోడ్ షో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకూ జరుగుతుంది. దీనికోసం 10 కిలోమీటర్ల పొడవున రహదారిని అందంగా అలంకరిస్తున్నారు. సోషల్ మీడియాలో #KemChhoTrump హ్యాష్ టాగ్‌తో ఆ సన్నాహాల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.
సబర్మతి ఆశ్రమం, మొటేరా స్టేడియంలో సుమారు 10 వేల మంది పోలీసులను మోహరించారు. దానితోపాటూ అగ్నిమాపక విభాగం అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ట్రంప్ అహ్మదాబాద్ చేరుకోడానికి రెండు రోజుల ముందే స్టేడియంలో సాయుధ భద్రతా బలగాలను మోహరిస్తారు. ఈ దళాలు 24 గంటల నిఘాలో ఉంటాయి.
అమెరికా అధ్యక్షుడి పర్యటనను దృష్టిలో పెట్టుకుని మొటేరా స్టేడియం, సబర్మతి ఆశ్రమం చుట్టుపక్కల దాదాపు 15 రహదారులను పునరుద్ధరిస్తున్నారు. వాటిని అలంకరించారు. నగరంలో స్కూళ్లు, కాలేజీ విద్యార్థులు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో భాగం అయ్యేందుకు ఆహ్వానించారు.
ట్రంప్ పర్యటనతో అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ, కార్పొరేషన్ అధికారులు చాలా బిజీ బిజీగా ఉన్నారు.
ఇంతకు ముందు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆ దేశ ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అహ్మదాబాద్ వచ్చారు.

ఫొటో సోర్స్, Twitter
ట్రంప్‌కు ఈ పర్యటన ఎందుకు కీలకం
అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డోనల్డ్ ట్రంప్‌కు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
"ట్రంప్ భారత పర్యటన ఒక విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగం. అమెరికాలో గుజరాతీ సంతతి వారు చాలా ఎక్కువ. గుజరాత్ నుంచి జనం పెద్ద సంఖ్యలో అమెరికా వెళ్తుంటారు" అని కొందరు విశ్లేషకులు చెప్పారు.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం 'కేమ్ ఛో ట్రంప్' కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాలోని గుజరాతీ సంతతి వారిని కూడా అహ్మదాబాద్ పిలిపించనున్నారు.
ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన, సెనేట్‌లో తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన తర్వాత ఆయన ఇక్కడకు వస్తున్నారు.
ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య ఏవైనా వాణిజ్య ఒప్పందాలు కూడా జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్సాహంలో ట్రంప్, సంతోషంలో మోదీ
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన భార్య ఈ నెలలో భారత్ రావడంపై ప్రధాని మోదీ బుధవారం ఆనందం వ్యక్తం చేశారు. వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇక్కడ ఘన స్వాగతం పలుకుతామని ట్వీట్ చేశారు.
"అమెరికా రాష్ట్రపతి డోనల్డ్ ట్రంప్, ఆయన భార్య ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత పర్యటనకు రావడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ అతిథులకు అద్భుతమైన స్వాగతం పలుకుతాం. ట్రంప్ భారత పర్యటన ప్రత్యేకం. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా అది మరింత కీలకం అవుతుంది" అన్నారు.
ప్రధానమంత్రి మోదీ మరో ట్వీట్‌లో "భారత్, అమెరికా బంధం బలోపేతం కావడం వల్ల మన పౌరులకే కాదు, మొత్తం ప్రపంచానికి దాని ప్రయోజనం ఉంటుంది. భారత్-అమెరికా ప్రజాస్వామ్యం, బహుళత్వవాదానికి సంయుక్తంగా కట్టుబడి ఉన్నాయి. రకరకాల అంశాలపై రెండు దేశాలు విస్తృత, సన్నిహత సహకారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి" అన్నారు.
ట్రంప్ పర్యటనతో భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం అవుతుందని ఇరుదేశాల ప్రభుత్వాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్ ఈ వారాంతం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ పర్యటనలో భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఈ పర్యటనతో అమెరికా, భారత పౌరుల సంబంధాలు కూడా బలోపేతం అవుతాయని ఇద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- అరవింద్ కేజ్రీవాల్: ఐఐటీ విద్యార్థి నుంచి దిల్లీ సీఎం దాకా...
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









