డోనల్డ్ ట్రంప్: అధ్యక్షుడిపై అభిశంసన ఆరోపణలను తోసిపుచ్చిన సెనేట్

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద వచ్చిన అభిశంసన ఆరోపణలను సెనేట్ తోసిపుచ్చింది. దాంతో, ట్రంప్‌ను పదవీచ్యుతుడ్ని చేసే ప్రయత్నాలకు పూర్తిగా తెరపడింది.
అధ్యక్షుడి సహచరులైన రిపబ్లికన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న సెనేట్‌లో ట్రంప్ మీద వచ్చిన అభిశంసన అరోపణలు రెండూ వీగిపోయాయి. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణను సెనేట్ 52-48 ఓట్లతో తోసిపుచ్చింది. అలాగే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణ కూడా 53-47 ఓట్లతో చెల్లకుండాపోయింది.
అధ్యక్ష పదవికి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉన్న డెమొక్రటిక్ ప్రత్యర్థిపై బురదజల్లాలని ట్రంప్ ఉక్రెయిన్ మీద ఒత్తిడి తెచ్చారని, ఆ విధంగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గత డిసెంబర్ నెలలో డెమొక్రాట్లు ఆరోపించారు.


అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆయన అభిశంసనకు గురై ఎన్నికల బరిలో దిగుతున్న మొదటి అధ్యక్షుడిగా రికార్డులకు ఎక్కబోతున్నారు.
బుధవారం జరిగిన చరిత్రాత్మక ఓటింగ్‌లో సెనేట్ అమెరికా 45వ అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించకూడదని నిర్ణయించింది.
ఈ రెండు ఆరోపణల్లో ఏ ఒక్క దానికి సెనేట్ అనుకూలంగా ఓటు వేసినా ట్రంప్ తన పదవి నుంచ తప్పుకుని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు పగ్గాలు అప్పగించాల్సి వచ్చేది.
డెమొక్రాట్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని డిసెంబర్ 18న ఆమోదించింది.

ఫొటో సోర్స్, AFP
ట్రంప్ స్పందన
ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని భావిస్తున్న ట్రంప్ మొదటి నుంచీ తన మీద వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవనే చెబుతూ వచ్చారు.
ట్రంప్‌ను మళ్ళీ ఎన్నుకోవాలనే ప్రచారంలో భాగంగా విడుదలైన ప్రకటన కూడా ట్రంప్ మీద పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. "నిరర్థక డెమొక్రాట్లు ఆయనను ఏమీ చేయలేక అభిశంసనకు పాల్పడ్డారు. డెమొక్రాట్ల ఎన్నికల వ్యూహంలో భాగంగా జరిగిన అర్థం పర్థం లేని ప్రహసనం ఇది. ఇక మళ్లీ అమెరికా ప్రజల బాగోగుల వైపు దృష్టి సారించాల్సిన తరుణం వచ్చింది" అన్నది ఆ ప్రకటన సారాంశం.
అంతేకాకుండా, ఈ అభిశంసన నాటకం అంతా అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన తప్పిదంగా మిగిలిపోతుందని కూడా ఆ ప్రకటన తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఓటింగ్ ఎలా జరిగింది...
ట్రంప్ మీద వచ్చిన మొదటి ఆరోపణకు అనుకూలంగా ఉటాహ్‌కు చెందిన ఒకే ఒక రిపబ్లికన్ సభ్యుడు మిట్ రోమ్నీ ఓటు వేశారు. మెయినేకు చెందిన సుసాన్ కోలిన్స్, అలాస్కాకు చెందిన లీసా ముర్కోవస్కీలు కూడా తమ మీద డెమొక్రాట్లు పెట్టుకున్న ఆశలకు భిన్నంగా అధ్యక్షుడిని దోషిగా నిర్ణయించే ఓటింగ్‌లో రోమ్నీతో చేయికలపలేదు.
కొందరు రిపబ్లికన్లు ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రవర్తన బాగా లేదని విమర్శించారు. కానీ, అది ఆయనను అభిశంసించే స్థాయిలో ఏమీ లేదని అన్నారు.
ముగ్గురు డెమొక్రటిక్ సభ్యులు తమ వైపు వస్తారని రిపబ్లికన్లు ఆశించారు. కానీ, వారు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలంటే సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆరోపణలకు మద్దతు లభించాలి. రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న 100 మంది సభ్యుల సెనేట్‌లో అది అసాధ్యమనే అంతా భావించారు.

అభిశంసన చరిత్ర
అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన మూడవ అధ్యక్షుడు ట్రంప్.
అంతకుముందు 1868లో ఆండ్ర్యూ జాన్సన్, 1999లో బిల్ క్లింటన్‌లు అభిశంసనకు గురయ్యారు. సెనేట్ మద్దతునే పదవిలో కొనసాగారు. అయితే, వారు ఆ తరువాత వారు మళ్లీ ఎన్నికల్లో పోటీపడలేదు.
అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ మీద కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే, ఆయన అభిశంసనకు గురి కావడానికి ముందే అధ్యక్షపదవికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేని 5 పనులు
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- కరోనావైరస్: భారత్‌లో బయటపడిన తొలి కేసు.. చైనా నుంచి వచ్చిన విద్యార్థికి ఇన్ఫెక్షన్
- 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'
- ఎన్నడూ కనిపించనంత స్పష్టంగా సూర్యుడు... ఇక్కడ చూడండి
- ఆండ్రాయిడ్ 10తో మొబైల్ ఫోన్ అప్డేట్ చేసుకోవాల్సిందే... లేకపోతే ఏం జరుగుతుందంటే?
- కరోనావైరస్ను అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- ఈయూ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









