ఆండ్రాయిడ్ 10తో మొబైల్ ఫోన్ అప్‌డేట్ చేసుకోవాల్సిందే... లేకపోతే ఏం జరుగుతుందంటే?

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రీకాంత్ భక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొబైల్ తయారీదారులు జనవరి 31 తర్వాత ఆండ్రాయిడ్ 10కు అప్‌డేట్ కావాల్సిందే. గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మీద పనిచేసే మొబైళ్లను తయారు చేసే కంపెనీలకు కొత్త నిబంధనలు విధించింది.

జనవరి 31, 2020 నుంచి ఆయా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు, కచ్చితంగా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్‌ సిస్టంతోనే మొబైళ్లు విడుదల చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ 'పై' ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే మొబైళ్లు విడుదల చేస్తే వాటి సాఫ్ట్‌వేర్లను తాము అప్రూవ్ చెయ్యబోమని తెలిపింది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్ సంస్థ 2019 సెప్టెంబర్ 3న విడుదల చేసింది. ఆ తర్వాత చాలా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ మొబైళ్లకు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్లు రిలీజ్ చేశాయి.

Presentational grey line
News image
Presentational grey line

గూగుల్ మొబైల్ సర్వీసెస్ ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మొబైళ్లు తయారుచేసే సంస్థలకు ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు గూగుల్ యాప్స్ కలిగిన సూట్ కూడా... ప్రత్యేకంగా అందించడంతో పాటు, ప్లేస్టోర్లో లక్షలాది యాప్‌లను అందుబాటులో ఉంచుతుంది.

దీంతో పాటు మనం కొనే ఫోన్లలో ముందుగానే గూగుల్ యాప్స్ అన్నీ ప్రీఇన్‌స్టాల్ చేసి ఉంచుతుంది. వాటికి ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్‌డేట్లు, ప్యాచ్‌లు అందిస్తోంది. కానీ ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ 10 విడుదల తర్వాత తమ ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైళ్లు తయారు చేసే సంస్థలన్నీ కచ్చితంగా ఆండ్రాయిడ్ 10తోనే స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చెయ్యాలని నిబంధన విధించింది.

ఆండ్రాయిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకీ నిబంధనలు

ఉదాహరణకు ఆపిల్ ఫోన్‌నే తీసుకుంటే, అందులో స్మార్ట్ ఫోన్‌తో పాటు, దాన్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ios తయారు చేసేదీ ఆపిల్ సంస్థే కాబట్టి, తమ స్మార్ట్ ఫోన్లు వాడేవారికి పూర్తిస్థాయి సెక్యూరిటీ అందించడం వీలవుతుంది. వీటితో పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు, అప్‌డేట్స్ కూడా ఆపిల్ సంస్థనే విడుదల చేస్తుంది.

కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సదుపాయం లేదు. ఎందుకంటే... శాంసంగ్, ఎల్‌జి, వన్ ప్లస్, రెడ్‌మీ, మొటోరోలా, నోకియా ఇలా మొబైళ్లు తయారు చేసే సంస్థలు వేరే. వాటిలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ తయారు చేసే సంస్థ గూగుల్ వేరే. ఇలా వేర్వేరు సంస్థలున్నప్పుడు, స్మార్ట్ ఫోన్లు తయారు చేసే సంస్థల్ని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యు ఫ్యాక్చరర్లు అంటారు. ః

వినియోగదారుల్ని ఆకట్టుకోడానికి సదరు ఫోన్ల మ్యాన్యుఫ్యాక్చరర్లు, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను బేస్ చేసుకుని, దానికి చిన్నచిన్న మార్పులు చేసి, తమదైన శైలిలో యూజర్ ఇంటర్‌ఫేస్‌లు తయారు చేస్తున్నాయి. ఇలా అన్ని మొబైల్ తయారీ సంస్థలకూ ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్‌లున్నాయి. ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ల వల్ల సదరు కంపెనీల మొబైల్స్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌లు వినియోగదారులు వాడుకునేందుకు సులువుగా ఉంటాయి. ఇది కూడా ఆయా మొబైల్ ఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది.

శాంసంగ్, రెడ్‌మీ, వన్ ప్లస్, హువావే, రియల్‌మి, హానర్ వంటి మొబైల్ తయారీ సంస్థలన్నింటికీ తమ ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్‌లున్నాయి. ఇవన్నీ గూగుల్ ఆధారంగానే పనిచేస్తాయి. కానీ వాటి వాడేటప్పుడు మొబైల్ స్క్రీన్ మీద వేరేగా కనిపిస్తాయి.

గూగుల్ ఆండ్రాయిడ్ సంస్థ ఎప్పటికప్పుడు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు రిలీజ్ చేస్తుంది. వాటిని ఫోన్ల మ్యాన్యుఫ్యాక్చరర్లు కూడా యథాతథంగా తమ ఫోన్లలో రిలీజ్ చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని సంస్థలు వాటిని యథాతథంగా రిలీజ్ చేయవు. దీని వల్ల ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఈ యూజర్ ఇంటర్ ఫేస్‌లు కొన్నిసార్లు పూర్తిగా అప్‌డేట్ అవ్వకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

సమస్య ఎక్కడొస్తుంది?

తొలితరం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లకు ఈ అప్‌డేట్లు రిలీజ్ చేయడం గూగుల్ నిలిపేస్తూ వస్తోంది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ 'మార్ష్‌మాల్లో ' ముందున్న వాటిని ఓల్డర్ వెర్షన్లుగా గూగుల్ పరిగణిస్తోంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అవసరమైన అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు రిలీజ్ చేయడం నిలిపేసింది.

కానీ ఆ తర్వాత వెర్షన్లకు మాత్రం విడుదల చేస్తోంది. ఇలా గూగుల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్లు రిలీజ్ చేయకపోతే.. సదరు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి అప్లికేషన్లు రన్ అవ్వవు. దీంతో పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల... సదరు స్మార్ట్ ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే, గూగుల్ తన అప్‌డేట్స్ తప్పనిసరిగా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యు ఫ్యాక్చరర్లు నేరుగా రిలీజ్ చేసేలా ఇలా గడువు విధించిందని టెక్నికల్ ఎక్స్ పర్ట్ నల్లమోతు శ్రీధర్ తెలియచేశారు.

దీనివల్ల జనవరి 31 తర్వాత మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త స్మార్ట్ ఫోన్లన్నీ... పూర్తిగా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. అంటే మొబైల్ కంపెనీల యూజర్ ఇంటర్ ఫేస్‌లు కూడా. కంపాటబులిటీ టెస్ట్ సూట్, వెండర్ టెస్ట్ సూట్, ఇంకా గూగుల్ టెస్ట్ సూట్ వంటి ఆటోమేటెడ్ టెస్ట్ లన్నీ పాసై ఉంటాయి. దీనివల్ల స్మార్ట్ ఫోన్లు మరిన్ని ఫీచర్లతో పాటు, వేగవంతమైన ఆపరేటింగ్, పటిష్టమైన సెక్యూరిటీని సాధ్యమవుతుంది.

అయితే, స్మార్ట్ ఫోన్ వినియోగదారులెవరికీ దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మొబైల్ కంపెనీలే ఆటోమాటిగ్గా ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ పంపిస్తాయి. లేదంటే మీరైనా సిస్టమ్ అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)