చైనా - భారత్ సరిహద్దు: బ్రహ్మపుత్ర నది అడుగున సొరంగం నిర్మించాలని భారత్ భావిస్తోంది.. ఎందుకు?

బ్రహ్మపుత్ర నది

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సచిన్ గొగోయ్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మించటానికి భారతదేశం ప్రణాళిక రచిస్తోంది.

బ్రహ్మపుత్ర నదికి ఇటీవల వచ్చిన భీకర వరదలు అస్సాంలోని చాలా భూభాగాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తంగా ఉన్న చైనా సరిహద్దులతో నిరాఘాటంగా రాకపోకలు సాగించటానికి వీలుగా ఆ భారీ నది కింద నుంచి 15 కిలోమీటర్ల నిడివి గల సొరంగం నిర్మించటానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

ఈ సొరంగం ప్రణాళిక గురించి కేంద్రంలోనూ, అస్సాంలోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జూలై 16వ తేదీన వెల్లడించింది.

నాలుగు లేన్ల సొరంగం నిర్మాణానికి కేంద్రం ''సూత్రప్రాయ ఆమోదం'' తెలిపిందంటూ అస్సాం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రంజీత్ కుమార్ దాస్ ట్వీట్ చేశారు. ''అస్సాం, ఈశాన్య భారతదేశంతో పాటు మొత్తం భారతదేశానికి భద్రత, రవాణా పరంగా ఇది చరిత్రాత్మక నిర్ణయం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల వరద నీరు దాదాపు 70 లక్షల మంది ప్రజల మీద ప్రభావం చూపాయని, గత కొద్ది రోజుల్లో 85 మంది చనిపోయారని అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ సోమవారం నాడు ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ప్రభావానికి గురైన, మరణించిన వారి సంఖ్య కన్నా ఈ వరద ప్రభావిత ప్రజల సంఖ్య, మృతుల సంఖ్య రెండూ చాలా ఎక్కువగా ఉన్నాయి. అస్సాంలో మంగళవారం నాటికి మొత్తం 25,382 మందికి కరోనావైరస్ నిర్ధారణ కాగా.. దానివల్ల 58 మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.

2020 జూలై 14వ తేదీన తాగునీటి కోసం వెళ్తున్న అసోం మహిళ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బ్రహ్మపుత్ర నదికి ఇటీవల వచ్చిన భీకర వరదలు అస్సాంలోని చాలా భూభాగాలను ముంచెత్తాయి

నది కింద సొరంగం ఎందుకు?

బ్రహ్మపుత్ర నది చైనాలోని టిబెట్‌లో పుట్టి.. దిగువకు ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి మొత్తం 5,80,000 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఉంది. నీటి ప్రవాహం విషయంలో ప్రపంచంలోని అగ్రస్థాయి ఐదు నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటిగా ఉంది. నదీ ముఖం దగ్గర సెకనుకు 19,830 క్యూబిక్ మీటర్ల నీరు విడుదలవుతుంది. ఇది అమెజాన్, కాంగో, యాంగ్జే నదుల తర్వాతి స్థానం దీనిదే.

భారతదేశం ఈశాన్య ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. నిజానికి 1228 నుంచి 1826 వరకూ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అహోం సామ్రాజ్యం.. మొఘలులు సహా శత్రువులను దూరంగా ఉంచటానికి ఒక నౌకాదళాన్ని నిర్వహించింది. మొఘలు చక్రవర్తి ఔరంగజేబు సేనాని రామ్‌సింగ్ దండెత్తి వచ్చినపుడు జరిగిన 1671 సరియాఘాట్ యుద్ధంలో.. అహోం నౌకాదళం తమకన్నా చాలా పెద్దదైన మొఘలుల సైన్యాన్ని నిర్వీర్యం చేసింది. తద్వారా ఈ ప్రాంతం మొఘలుల ఆక్రమణలోకి వెళ్లకుండా అడ్డుకుంది.

అయితే ఒకప్పుడు అహోం రాజ్యానికి సంరక్షణగా ఉన్న అదే నదీ ప్రవాహం ఇప్పుడు భారత సైనిక వ్యూహకర్తలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది వల్ల అస్సాం ఉత్తర ప్రాంతంతో పాటు అరుణాచల్ రాష్ట్రం మొత్తానికి చైనా సైన్యం నుంచి ప్రమాదానికి వీలుండటమే దీనికి కారణం. 1962 భారత్ - చైనా యుద్ధంలో ఈ ప్రాంతాల్లోకి చైనా సైన్యం వేగంగా దూసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ నది మీద ఉన్న ఐదు వంతెనలను.. లేదంటే వాటిలో కొన్నిటిపైన అయినా దాడి చేయగలిగే సామర్థ్యం చైనాకు ఉండటం వల్ల.. అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉందని భారత రక్షణ రంగ వ్యూహకర్తల ఆందోళన.

ఇప్పుడు బ్రహ్మపుత్రా నది దక్షిణ ఒడ్డున గల నుమాలీగఢ్‌ను ఉత్తరం ఒడ్డున గల గోపూర్‌తో కలుపుతూ.. నది కింది నుంచి నిర్మించటం కోసం ప్రతిపాదించిన 14.85 కిలోమీటర్ల నిడివి గల సొరంగం.. పౌర, సైనిక రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తుంది.

బ్రహ్మపుత్ర నది మీద ఉన్న వంతెనలను శత్రు బలగాలు లక్ష్యంగా చేసుకోగలవని.. కాబట్టి నది కింది నుంచి సొరంగాలను నిర్మించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భారత సైన్యం ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంగ్ల దినపత్రిక హిందుస్తాన్ టైమ్స్ ఇటీవల ఒక కథనంలో చెప్పింది.

ఈ నది కింద సొరంగం నిర్మించటానికి భారత ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక గత ఏడాది ఒక కథనంలో పేర్కొంది. ఈ సొరంగం ''సైనిక కాన్వాయ్‌కి పూర్తి రక్షణ కల్పిస్తుంద''ని 2019 ఏప్రిల్‌లో ప్రచురించిన ఆ కథనం చెప్తోంది.

భారత్ చైనా

ఫొటో సోర్స్, AFP

ఇప్పుడు ఎందుకీ సొరంగం?

బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదించారనే వార్తలకు, ప్రస్తుతం భారత్ - చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధం ఉన్నట్లు భావించటం సులభమే. అయితే.. జాతీయవాద ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం.. చైనాకు సరితూగే విధంగా సరిహద్దులో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటానికి ఇంతకుముందు నుంచే ప్రయత్నిస్తోంది.

బ్రహ్మపుత్ర నది కింద సొరంగ నిర్మాణ ప్రణాళికను కూడా ఇందులో భాగంగానే చూడొచ్చు. ఈ సొరంగం నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికకు మార్చి నెలలోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. అంటే జూన్ 15-16 తేదీ రాత్రి భారత్ - చైనా సరిహద్దులో ఘర్షణ ముదిరి 20 మంది భారత జవాన్లు చనిపోయిన ఘటనకు చాలా ముందుగానే ఇది జరిగింది.

ఇంగ్లిష్ న్యూస్ చానల్ డబ్ల్యూఐఓఎన్ కథనం ప్రకారం.. చైనా సరిహద్దు వెంట రోడ్ల నిర్మాణం కోసం భారతదేశం చేస్తున్న వ్యయం 2016లో 61.5 కోట్ల డాలర్లుగా ఉంటే అది 2020లో 1,600 కోట్ల డాలర్లకు పెరిగింది. ''మరిన్ని రోడ్లు, వంతెనలు, సొరంగాల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించారు'' అని ఆ కథనం చెప్తోంది.

నరేంద్ర మోదీ షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిస్పందన ఏమిటి?

ఈ విషయానికి అంత ప్రాధాన్యత లేదని చెప్పటానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కీలకమైన అధికారి ఎవరూ ఈ సొరంగం గురించి ఇంతవరకూ వ్యాఖ్యానించలేదు. చైనా నుంచి కూడా ఎటువంటి స్పందనా రాలేదు.

భారతదేశంలో జాతీయ స్థాయి మీడియా కూడా ఈ విషయం గురించి పెద్దగా కథనాలు రాయలేదు. కానీ అస్సాంలోని మీడియా సంస్థలు మాత్రం.. సొరంగం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి విస్తృత కథనాలు ఇచ్చాయి.

అస్సామీ భాషలో అగ్రస్థాయి దినపత్రిక 'అసోమియా ప్రతిదిన్' జూలై 17న రాసిన సంపాదకీయంలో.. బ్రహ్మపుత్ర నది ఇరువైపులా ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం, నది డ్రెడ్జింగ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల హామీలు అమలుకు నోచుకోకపోగా.. నది కింద సొరంగం గురించి మాటల ద్వారా 'అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం' చేస్తోందని ఆరోపించింది.

ఏటా లక్షలాది మంది జనం మీద విరుచుకుపడుతున్న వరదల నుంచి ప్రజలను రక్షించటంలో విఫలమైన ప్రభుత్వం.. నది కింద సొరంగం నిర్మించే ప్రణాళికలు రచిస్తోందంటూ సోషల్ మీడియా యూజర్లు కూడా ఎద్దేవా చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా సోషల్ మీడియా, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో వ్యంగ్యాస్త్రాలతో మీమ్‌లు షేర్ చేస్తున్నారు.

''నది కింద సొరంగం అవసరం లేదు. ముందు అస్సాం ప్రజలను వరదల నుంచి కాపాడటానికి నది కరకట్టలను బలోపేతం చేయండి'' అని ఒక ఫేస్‌బుక్ యూజర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)