భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ఘర్షణ: రెండు దేశాల బలగాలు ఎక్కడ 'ఢీ అంటే ఢీ' అన్నట్లున్నాయి?

లేహ్ వద్ద సైనిక వాహనాలు

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, లేహ్ వద్ద సైనిక వాహనాలు

హాట్ స్ప్రింగ్స్ గ‌స్తీ పాయింట్ 17 ద‌గ్గ‌ర గురువారం సాయంత్రంనాటికి భార‌త్‌, చైనా త‌మ సేన‌ల‌ను వెన‌క్కి తీసుకున్న‌ట్లు భార‌త్ ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

గ‌త‌ వారంతో పోలిస్తే.. ప్ర‌స్తుతం ల‌ద్దాఖ్‌లోని గల్వ‌న్ లోయ‌ స‌మీపంలోని హాట్ స్ప్రింగ్స్ గ‌స్తీ పాయింట్ 14, 15 ద‌గ్గ‌ర కూడా రెండు సైన్యాలు త‌మ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టీ గల్వ‌న్‌కు ఉత్త‌రాన ఉన్న ప్యాంగాంగ్ స‌ర‌స్సుపై పడుతోంది.

డీ-ఎస్కలేష‌న్‌, డిసెంగేజ్‌మెంట్‌ల మ‌ధ్య తేడా ఏమిటి?

డీ-ఎస్క‌లేష‌న్‌తో పోలిస్తే డిస్ఎంగేజ్‌మెంట్ ఒక స్థానిక ప్ర‌క్రియ‌. అంటే ఢీ అంటే ఢీ అంటూ ఎదురుప‌డిన సేన‌లు ఇక్క‌డ వెన‌క్కి త‌గ్గాయ‌న్న‌మాట‌.

డీ-ఎస్క‌లేష‌న్ చాలా పెద్ద, క్లిష్ట‌మైన‌ ప్ర‌క్రియ‌. ప్ర‌స్తుత స్థితితో పోలిస్తే.. ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌ని దీని ద్వారా చూపించాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో డీ-ఎస్క‌లేష‌న్ కోసం ఇంకా చాలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఫింగ‌ర్ 4 ప్రాంతంలో త‌గ్గుతున్న చైనా సైనికుల సంఖ్య‌ను గురించి మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఫింగ‌ర్ 8లో గ‌స్తీ కాసేందుకు భార‌త సేనలు ఈ ప్రాంతం మీద నుండే వెళ్లాల్సి ఉంటుంది.

"చైనా సైనికుల సంఖ్య కొంచెం త‌గ్గిన మాట వాస్త‌వ‌మే. అయితే, మిగ‌తా ప్రాంతాల్లో ఉపసంహ‌ర‌ణ చ‌ర్య‌ల‌తో పోలిస్తే.. ఇక్క‌డ అంతేమీ క‌న‌బడ‌ట్లేదు. ఇక్క‌డ వారు వెనక్కి వెళ్ల‌లేదు. మాకు తెలిసినంత వ‌ర‌కు వారు సైనికుల్ని అటూఇటూ తిప్పుతున్నారు"అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

"ఫింగ‌ర్ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల శిబిరాలు ఉన్నాయి. చైనా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్లే విష‌యానికి వ‌స్తే.. ఫింగ‌ర్‌-4లోని త‌మ నిర్మాణాల‌ను ధ్వంసంచేసి వెన‌క్కి వెళ్తేనే.. మ‌నం న‌మ్మ‌గ‌లం. చాలా పెద్ద సంఖ్య‌లో సైనిక బ‌ల‌గాల‌ను ఇక్క‌డికి తీసుకొచ్చి అందులో కొంద‌రిని వెన‌క్కి పంపించారు. అంటే ఇప్ప‌టికీ ఇక్క‌డ‌ ఎక్కువ‌ మంది సైనికులే ఉన్నారు" అని ప్యాంగాంగ్ స‌ర‌స్సు ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న మ‌రో అధికారి చెప్పారు.

డీ-ఎస్క‌లేష‌న్‌తో పోలిస్తే డిస్ఎంగేజ్‌మెంట్ ఒక స్థానిక ప్ర‌క్రియ‌.

ఫొటో సోర్స్, TWITTER/ANURAGTHAKUR

ఫొటో క్యాప్షన్, డీ-ఎస్క‌లేష‌న్‌తో పోలిస్తే డిస్ఎంగేజ్‌మెంట్ ఒక స్థానిక ప్ర‌క్రియ‌.

డెప్సాంగ్ ప‌రిస్థితి ఎలా ఉంది?

ఉత్త‌రాన ఉన్న‌ డెప్సాంగ్ లాంటి ప్ర‌దేశాల్లో ప‌రిస్థితి ఎలా ఉంది? ఇక్క‌డ చైనా సైనికుల క‌ద‌లిక‌లు వాస్త‌వ‌మేనా?

"నిజానికి రెండు దేశాల మ‌ధ్యా స‌రిహ‌ద్దుపై ఒక అంగీకారం కుద‌ర‌నంత వ‌ర‌కూ.. రెండు దేశాల సైనికుల మోహ‌రింపులు భ‌యాన‌కంగానే క‌నిపిస్తాయి. డెప్సాంగ్ మాత్ర‌మే ఎందుకు? ఇలాంటి చైనా నిర్మాణాలు వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి చాలా చోట్ల ఉన్నాయి. ఇలానే మ‌న నిర్మాణాలు కూడా ఉంటాయి. రెండు వైపులా ఇవి సాధార‌ణ‌మే"అని ఓ అధికారి చెప్పారు.

"ఈ స‌మ‌స్య పూర్తిగా ప‌రిష్కారం అయ్యేందుకు నాకు తెలిసి ఆరు నుంచి ఎనిమిది నెల‌లు ప‌ట్టవచ్చ‌ు."

జులై 6న విడుద‌ల చేసిన భార‌త్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. వాస్త‌వాధీన రెఖ వెంబ‌డి సైనికుల డిస్ఎంగేజ్‌మెంట్‌, భార‌త్‌-చైనా స‌రిహద్దు వివాదంపై డీ-ఎస్క‌లేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది.

గల్వ‌న్ లోయ‌లో మొద‌లైన ఈ ప్ర‌క్రియ మిగ‌తా ప్ర‌దేశాల్లోనూ కొన‌సాగుతోంది.

ఈ వివాదంపై ప్ర‌త్యేక ప్ర‌తినిధులుగా నియ‌మితులైన భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్‌, చైనా స్టేట్ కౌన్సెల‌ర్‌, విదేశాంగ మంత్రి వాంగ్ యీలు చ‌ర్చ‌లు కొన‌సాగిస్తార‌ని భార‌త్‌, చైనాల మ‌ధ్య అంగీకారం కుదిరింది. రెండు దేశాల మ‌ధ్య దౌత్య‌ప‌రమైన‌, సైనిక చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌ని రెండు దేశాలూ తీర్మానించాయి.

ఉత్త‌రాన ఉన్న‌ డెప్సాంగ్ లాంటి ప్ర‌దేశాల్లో ప‌రిస్థితి ఎలా ఉంది?

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఉత్త‌రాన ఉన్న‌ డెప్సాంగ్ లాంటి ప్ర‌దేశాల్లో ప‌రిస్థితి ఎలా ఉంది?

కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు

"గల్వ‌న్ లోయ‌తో స‌హా వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి వివాదాల‌పై భార‌త వాద‌న‌ను చ‌ర్చ‌ల స‌మ‌యంలో అజిత్ డోభాల్ స్ప‌ష్టంచేశారు. సార్వ‌భౌమ‌త్వం, దేశ భ‌ద్ర‌త విష‌యంలో భార‌త సైనికులు బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆయ‌న నొక్కి చెప్పారు." అని విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

భార‌త ప్రాంతాల నుంచి కూడా బ‌ల‌గాల‌ ఉపసంహ‌ర‌ణ అంటూ మీడియాలో వ‌స్తున్న ప్ర‌శ్న‌ల‌పై విదేశాంగ శాఖ స్పందించింది. "డిస్ఎంగేజ్‌మెంట్ ప్ర‌క్రియ‌కు సంబంధించి కొన్ని వ్యాఖ్య‌లు మా దృష్టికి వ‌చ్చాయి. ఇవి చాలా త‌ప్పుడు వార్త‌లు. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు"

"భార‌త్‌-చైనా స‌రిహద్దులోని ప‌శ్చిమ సెక్టార్‌కు సంబంధించిన ప‌రిస్థితుల‌పై స్ప‌ష్ట‌త‌ను ఇస్తూ గ‌త కొన్ని వారాల్లో ప్ర‌భుత్వం కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేసింద‌ని గుర్తు చేస్తున్నాం. గల్వ‌ాన్ లోయ‌కు సంబంధించి చైనా వాద‌న‌ను త‌ప్ప‌ని ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నాం. రెండు దేశాలూ వాస్త‌వాధీన రేఖ‌ను గౌర‌విస్తూ... స‌రిహ‌ద్దుల వెంబ‌డి ఏక‌ప‌క్ష చ‌ర్య‌లు తీసుకోకూడ‌దు. శాంతి స్థాప‌న‌కు కృషి చేయాలి."

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

డిస్ఎంగేజ్‌మెంట్ ప్ర‌క్రియ పూర్త‌య్యాక స‌రిహ‌ద్దు వివాదాన్ని పూర్తిగా భార‌త్, చైనా ప‌రిష్క‌రించుకుంటాయా? అని ప్రశ్నించ‌గా బీజింగ్‌లోని చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి స్పందించ‌లేదు.

"క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌ల అనంత‌రం గల్వ‌ాన్ లోయ‌తోపాటు ప‌శ్చిమ సెక్టార్‌లోని ప్రాంతాల్లో డిస్ఎంగేజ్‌మెంట్ దిశ‌గా భార‌త్‌, చైనా బ‌ల‌గాలు కృషి చేస్తున్నాయి. ప్ర‌స్తుతం భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇవి ఇంకొంచెం మెరుగు ప‌డాల్సి ఉంది" అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి వ్యాఖ్యానించారు.

"రెండు దేశాల సైనిక‌, దౌత్య అధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగుతాయి. మ‌రోవైపు సైనిక క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతాయి. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వ్య‌వ‌హారాల‌పై వ‌ర్కింగ్ మెకానిజ‌మ్ ఫ‌ర్ క‌న్స‌ల్టేష‌న్ అండ్ కో-ఆర్డినేష‌న్ స‌మావేశం కూడా నిర్వ‌హిస్తారు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)