కేరళ విమాన ప్రమాదం: 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లు అనిపించింది... అందరూ భయంతో వణికిపోయారు'

షర్ఫుద్దీన్

ఫొటో సోర్స్, Sharfudeen @Facebook

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

29 ఏళ్ల షర్ఫుద్దీన్‌ విమానం ఎక్కేముందు ఎంతో ఉల్లాసంగా, ఉద్వేగంగా ఉన్నారు. మరో ఐదు గంటల్లో స్వదేశంలో కాలు పెట్టబోతున్నానంటూ ఆయన సోషల్ మీడియాలో మెసేజ్‌ కూడా చేశారు.

ఆయనను స్వదేశం చేర్చే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ దుబాయ్‌-కోళికోడ్‌ విమానం కరీపూర్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండయింది. కానీ ఆయన ఇంటికి చేరలేదు. మృత్యువు ఒడికి చేరుకున్నారు.

అప్పటి వరకు తల్లి ఒడిలో కూర్చుని కేరింతలు కొట్టిన రెండేళ్ల చిన్నారి షర్ఫుద్దీన్‌ కూతురు ఫాతిమా ఇజ్జా తలకు బలమైన గాయమైంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో క్యాలికట్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు.

"ఆమె ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆమెను ఇంటెన్సివ్ కేర్‌ యూనిట్‌కు తరలించారు'' అని ఆ చిన్నారి బాబాయి హనీ హసన్‌ బీబీసీకి చెప్పారు.

షర్ఫుద్దీన్‌ భార్య 23ఏళ్ల అమీనా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్‌ జరగడానికి కొద్దిసేపటి ముందు ఆమె తనతో మాట్లాడారాని షర్ఫుద్దీన్‌ సోదరుడు హసన్ వెల్లడించారు.

"ఆమె చేతులు కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆపరేషన్‌కు సిద్దం చేస్తుండగా, తన భర్త షర్ఫుద్దీన్‌ గురించి ఆమె పదేపదే అడిగారు. కానీ, మేం నిజం చెప్పలేదు'' అని హసన్‌ గద్గద స్వరంతో చెప్పారు.

చిన్నారి ఫాతిమా ఇజ్జాకు క్యాలికట్ మెడికల్ కాలేజీలో చికిత్స జరుగుతుండగా, ఆమె తల్లి అమీనాకు మలబార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స జరుగుతోంది. షర్ఫుద్దీన్‌ సేల్స్‌మాన్‌గా పని చేసేవారని సోదరుడు హసన్‌ వెల్లడించారు.

కోళికోడ్‌లోని కరీపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయిన తర్వాత విమానం రన్‌వే నుంచి జారి లోయలోపడి రెండు ముక్కలైంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఎంతో అనుభవం గడించిన పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే ఈ విమానాన్ని నడిపారు.

కేరళ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, REUTERS/Stringer

ల్యాండింగ్‌కు ముందు గందరగోళం

విమానంలో ప్రయాణిస్తున్న 46 ఏళ్ల జయమోల్‌ జోసెఫ్ దుబాయ్‌లో ఉంటున్న తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ సాదిక్‌ మహమ్మద్‌కు ప్రమాదం జరిగిన తీరును వివరించారు. "ల్యాండ్‌ అయిన వెంటనే విమానం మళ్లీ గాలిలోకి లేచినట్లు అనిపించిందని ఆమె చెప్పారు. ప్రయాణికులంతా భయపడి పోయారట. మరోసారి ల్యాండ్‌ అయినట్లు అనిపించగానే విమానం ఎక్కడో లోయలో పడిపోయినట్లు ఆమెకు అనిపించిందట'' అని సాదిక్‌ వెల్లడించారు.

"ప్రమాదం జరగబోతోందన్న విషయం విమానంలో ఉన్నవారికి అర్ధమయ్యింది. అందుకే చాలామంది తమ వాళ్లకు ఫోన్‌లు చేశారు. ఆమె మాకు చెప్పినట్లే విమానంలోని మిగిలిన వాళ్లు బంధువులకు తెలిపే ప్రయత్నం చేశారు'' అని సాదిక్‌ అన్నారు.

జయమోల్ జోసెఫ్‌ దుబాయికి టూరిస్టుగా వెళ్లారు. అక్కడున్న స్నేహితుల ఇంట్లో ఉన్నారు. మార్చిలో ఆమె కుటుంబం తిరిగి రావాల్సి ఉంది. కానీ, లాక్‌డౌన్‌ విధించడంతో విమానాలు లేక దుబాయ్‌లోనే చిక్కుకు పోయారు.

"అదృష్టవశాత్తు ఆమెకు ఎక్కువ ప్రమాదం జరగలేదు. 31వ నంబర్‌ సీటులో కూర్చున్నారు. ముక్కుకు కాస్త దెబ్బతగిలింది. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు'' అని సాదిక్‌ వెల్లడించారు.

కేరళ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, EPA/PRAKASH ELAMAKKARA

గండం తప్పింది

అందరిలో అదృష్టవంతుడిగా 26 ఏళ్ల అఫ్జల్ పరాను చెప్పుకోవాలి. ఈ విమానానికి టిక్కెట్లు కొన్న 189మంది పాసింజర్లలో ఆయన కూడా ఒకరు. కానీ, ఆయన విమానం మిస్సయ్యారు.

"విమానాశ్రయానికి వచ్చేందుకు కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అతని వీసా రద్దయింది. 500 దిర్హామ్‌ల జరిమానా కట్టలేక పోయారు. ఐదు నెలల నుంచి అతనికి ఉద్యోగం లేదు. చేతిలో పైసాలేదు'' అని అఫ్జల్ సోదరుడు షామిల్ మహమ్మద్‌ చెప్పారు.

వందే భారత్‌ మిషన్‌ ఫ్లైట్‌లో వస్తున్న వారిలో సగంమంది వీసాలు రద్దవడంతో ఉద్యోగాలు కోల్పోయినవారే. మిగిలినవారు లాక్‌డౌన్‌కు ముందు దుబాయి వెళ్లి అక్కడ చిక్కుకు పోయారు.

కేరళలో కూలిన విమానం

మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌

ఇక ఈ విమానంలో కోళికోడ్‌ చేరుకున్న 189 మంది ప్రయాణికుల్లో ఒకరికి కరోనా ఉందని అనుమానిస్తున్నారు అధికారులు. చనిపోయిన 18 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. మొత్తం 189 ప్రయాణికుల్లో 19మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. "కరోనా టెస్టుల్లో 8మంది ఫలితాలు మాత్రమే వచ్చాయి. మరణించిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. మరొకరికి కూడా కరోనా ఉందని అనుమానిస్తున్నాం. మిగిలిన వారి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. పోలీసు లాంఛనాలు పూర్తయ్యాక మిగతా వారికి కూడా టెస్టులు చేస్తాం" అని కేరళ మంత్రి కె.టి జలీల్‌ బీబీసీకి చెప్పారు.

విమాన ప్రమాదంలో సహాయం చేయడానికి వచ్చి, కోవిడ్‌-19 నిబంధనలు పాటించలేక పోయిన వారిని క్వారంటీన్‌కు వెళ్లాల్సిందిగా కేరళ ఆరోగ్యశాఖమంత్రి కె.శైలజ సూచించారు.

విమాన ప్రమాదం జరగ్గానే సహాయ చర్యల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. స్థానికులు, పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, డ్రైవర్లు, వైద్యులు, మీడియా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

"ఈ విషయం మీద అనవసరమైన అపోహలు పెంచొద్దు. సహాయ చర్యల్లో పాల్గొన్నవారంతా ముందు జాగ్రత్తగా క్వారంటీన్‌కు వెళతారు. అందరికీ టెస్టులు నిర్వహిస్తాం" అని ఆరోగ్యమంత్రి శైలజ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)