అఫ్గానిస్తాన్ గృహహింస: 'నా భర్త నన్ను తోటలోకి బరబరా ఈడ్చుకెళ్లి కత్తితో నా ముక్కు కోశాడు'

శస్త్రచికిత్స తరువాత సంతోషం వ్యక్తం చేసిన జర్కా

ఫొటో సోర్స్, BBC

ఫొటో క్యాప్షన్, శస్త్రచికిత్స తరువాత సంతోషం వ్యక్తం చేసిన జర్కా
    • రచయిత, స్వామినాథన్ ‌నటరాజన్‌, నూర్‌షఫాక్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

దాదాపు పదివారాల వేదన తర్వాత జర్కాలో ఆశలు మొలకెత్తాయి. అతికించిన తన ముక్కును, దానిపై ఉన్న కుట్లను తన చేతి అద్దంలో పరిశీలనగా చూసుకున్నారు జర్కా. “నా ముక్కు మళ్లీ వచ్చింది’’ డాక్టర్లతో సంతోషంగా అన్నారామె. వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా ఆమె ముక్కును తిరిగి అతికించి, గాయపడిన ఆమె ముఖాన్ని సరిచేశారు.

అఫ్గానిస్తాన్‌లో గృహహింస చాలా సర్వసాధారణమైన విషయం. 87% మంది అఫ్గాన్ మహిళలు భౌతిక, లైంగిక, మానసిక హింసల్లో ఏదో ఒకదానిని ఎదుర్కొంటారని ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఓ సర్వే తేల్చింది.

ఈ గృహహింసకు పరాకాష్టగా భర్త, ఇంట్లోని బంధువులు మహిళలపై కత్తులతో లేదంటే యాసిడ్‌తో దాడి చేస్తారు. జర్కా భర్త ఓ కత్తితో ఆమె ముక్కును కోసేశారు.

“ఆయనకు ప్రతిదీ అనుమానమే’’ అన్నారు జర్ఖా. ఏదో మిషతో గొడవ పెట్టుకోవడం, ఆ తర్వాత తీవ్రంగా కొట్టటం సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. జర్కాకు పెళ్లయి పదేళ్లయింది. ఆరేళ్ల కొడుకున్నాడు. అయినా భర్త నుంచి ఆమె హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది తనను జీవితాంతం వెంటాడే సమస్యని ఆమెకు అర్ధమయింది.

జర్కాను పరీక్షిస్తున్న డాక్టర్ జల్మాయి

ఫొటో సోర్స్, Dr Zalmai Khan Ahmadzai

ఫొటో క్యాప్షన్, జర్కాను పరీక్షిస్తున్న డాక్టర్ జల్మాయి

దాడి నుంచి కోలుకుని...

“అద్దంలో చూసుకున్నా. నా ముక్కు చాలా వరకు యథాతథ స్థితికి వచ్చిందనిపిస్తోంది’’ అని జర్కా బీబీసీతో అన్నారు. మూడు గంటలపాటు జరిగిన ఆపరేషన్‌కు ముందు, ఆమెకు మత్తు ఇచ్చారు.“ఆపరేషన్‌కు ముందు నా ముఖం అస్సలు బాగా లేదు’’ అన్నారు జర్కా.

అఫ్గానిస్తాన్‌లో ఈ తరహా అరుదైన ఆపరేషన్లు చేసే డాక్టర్‌జల్మాయ్‌ ఖాన్‌అహ్మద్జాయ్‌తన పేషెంట్‌ముఖంలో కనిపించిన మార్పు చూసి సంతోషించారు. “ఆపరేషన్‌చాలా బాగా జరిగింది. ఇన్‌ఫెక్షన్‌ కాలేదు. ఆమెకు ముక్కు దగ్గర కాస్త మంట ఉంది. కానీ అది పెద్ద సమస్య కాదు’’ అన్నారు డాక్టర్‌జల్మాయ్‌

గత పదేళ్లలో గృహహింసకు ఇలా అవయవాలు పోగొట్టుకున్న డజన్లమంది మహిళలకు డాక్టర్‌జల్మాయ్‌ చికిత్సలు చేశారు. ముఖాన్ని గాయపరచడం ఇస్లామిక్‌చట్టాలకు విరుద్ధం. కానీ ఈ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది.

జర్కాను పరీక్షిస్తున్న డాక్టర్ జల్మాయి

సుదీర్ఘ ప్రయాణం

కాబూల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌సరిహద్దుల్లో ఉన్న ఖాయిర్‌కోట్ జిల్లాలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు జర్కా. ఆమెకు చదవడం, రాయడం రాదు. ఆమె ఉంటున్న గ్రామం తాలిబన్‌ల గుప్పిట్లో ఉంటుంది. స్థానిక నేతలు తాలిబన్లతో చర్చల తర్వాత, ఆమె ఆపరేషన్‌ కోసం కాబుల్ వెళ్లడానికి అనుమతి లభించింది.

అదే సమయంలో డాక్టర్ జల్మాయ్‌కోవిడ్‌బారినపడి ఉన్నారు. ఆయన భార్య కూడా కరోనా కారణంగా మరణించారు. జర్కా కాబూల్‌కు వచ్చే సమయానికి డాక్టర్‌జల్మాయ్‌తన భార్య అంత్యక్రియలు ముగించి తిరిగి విధులలో జాయినయ్యారు. “నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముక్కంతా ఇన్‌ఫెక్షన్‌తో నిండిపోయింది’’ అని డాక్టర్‌ జల్మాయ్‌చెప్పారు.

యాంటీ సెప్టిక్‌ ఇంజెక్షన్లతోపాటు, రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు మల్టివిటమిన్‌ మాత్రలు ఇచ్చి పంపారు డాక్టర్‌ జల్మాయ్‌. ఆ తర్వాత ఐదు వారాలకు ఆమె తిరిగి కాబూల్ వచ్చారు. జులై 21న సర్జరీకి ఏర్పాటు జరిగింది.

జర్కాకు ఫీజు తీసుకోకుండా చికిత్స చేసిన డాక్టర్ జల్మాయి

ఫొటో సోర్స్, Dr Zalmai Khan Ahmadzai

ఫొటో క్యాప్షన్, జర్కాకు ఫీజు తీసుకోకుండా చికిత్స చేసిన డాక్టర్ జల్మాయి

నిత్యం అనుమానం-హింస

తన ముక్కు ఆపరేషన్‌ను వీడియో తీయడానికి జర్కా బీబీసీకి అనుమతి ఇచ్చారు. తన ఇంట్లో జరిగే హింస గురించి ఆమె బీబీసీకి వివరంగా చెప్పారు. తన భర్త కూడా దాదాపు తన వయసు వారేనని, పశువుల కాపరిగా జీవనం సాగిస్తుంటారని వెల్లడించారు.

పదేళ్ల కిందట తమకు పెళ్లయినట్లు చెప్పారు. “ నా చిన్నప్పుడే అతనితో నాకు నా మామ వివాహం కుదిర్చారు. పెళ్లయ్యే నాటికి నేను చిన్నదాన్ని. పెళ్లి గురించి, వైవాహిక జీవితం గురించి ఏమీ తెలియదు.

అప్పట్లో నా వయసెంతో కూడా గుర్తు లేదు’’ అన్నారు జర్కా. పెళ్లి చేసుకుంటావా అని తనను ఎవరూ అడిగినట్లు జ్జాపకం లేదని చెప్పారామె.

జర్కాను పరీక్షిస్తున్న డాక్టర్ జల్మాయి

ఫొటో సోర్స్, Dr Zalmai Khan Ahmadzai

ఒకరికి కట్నంగా ఆమె పెళ్లి

తనకు పెళ్లి కుదిర్చిన మామ తనను తన భర్తకు అమ్మేశారన్న విషయం జర్కాకు చాలా కాలం తర్వాత తెలిసింది. తన భర్త చెల్లెళ్లలో ఒకరిని తన మామ పెళ్లాడారు. ఆయన కట్నం బదులు తనను ఇచ్చేశారు.

“నా మామ నా భర్త కుటుంబానికి కన్యాశుల్కం చెల్లించలేదు. దానికి బదులుగా నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేశారు’’ అని జర్కా చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో కొందరు తల్లిదండ్రులు పెళ్లి కొడుకుల నుంచి కట్నం తీసుకుంటారు. అది చట్ట విరుద్ధమైనా, తరతరాలుగా అది అలా జరిగిపోతూనే ఉంది.

నాకు ప్రాణభయం పట్టుకుంది

జర్కాను పెళ్లి చేసుకున్న ఏడాది తర్వాత ఆమె భర్త మరో మహిళను పెళ్లి చేసుకోడానికి సిద్ధ పడ్డారు. బహు భార్యత్వం అక్కడ చాలా సర్వసాధారణ విషయం. ”నువ్వు నాకు నచ్చలేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’’ అని ఆయన అన్నారు. చేసుకోండని చెప్పాను’’ అని జర్కా వివరించారు.

కానీ, కట్నంగా చెల్లించడానికి అతని దగ్గర డబ్బులు లేవు. దీంతో ఆ అసహనాన్నంతా ఆమెపై చూపడం మొదలు పెట్టారు. “అతను పెడుతున్న హింసతో నాకు ప్రాణాల మీద ఆశ పోయింది’’ అన్నారామె.

హింస శ్రుతిమించడంతో భర్తకు చెప్పకుండా తన తల్లిగారింటికి పారిపోయారు జర్కా. భర్త నుంచి విముక్తి కల్పించమని తండ్రిని వేడుకున్నారామె. ఈలోగా జర్కాను వెతుక్కుంటూ ఆమె భర్త అత్తగారింటికి వచ్చారు.

“నేను ఆ రోజు రాత్రి నా తల్లిదండ్రుల ఇంటికి రాగానే, తెల్లవారుజామున అతను మా ఇంటికి ఒక కత్తి పట్టుకుని వచ్చారు. నా భార్యను పంపించమంటూ మా నాన్నను డిమాండ్‌చేశారు. అయితే, మా నాన్న, అన్న అందుకు ఒప్పుకోలేదు. నువ్వు ఆమెను బాగా చూసుకుంటానని మాట ఇస్తేనే పంపిస్తామని చెప్పారు. కొందరు మధ్యవర్తులుగా వచ్చి నాన్నకు హామీ ఇచ్చి రాజీ కుదిర్చారు’’ అని జర్కా ఆనాటి ఘటనను వివరించారు.

ఆమెను ఏమీ చేయనని, బాగా చూసుకుంటానని జర్కా తండ్రికి ఆమె భర్త మాటిచ్చారు. కాని అత్తగారింటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

“ఇంటికొచ్చాక అతను నన్ను తీవ్రంగా కొట్టారు. నీ ముక్కును కోస్తానంటూ కత్తితో బెదిరించారు. నేను పొరుగింటికి పారిపోయాను” అని జర్కా చెప్పారు.

పొరుగువాళ్లు కల్పించుకోవడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించింది. “మా ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు’’ అని జర్కా చెప్పారు.

భర్త తన పట్ల చాలా కాలంగా కోపంగా ఉన్నారని చెప్పిన జర్కా
ఫొటో క్యాప్షన్, భర్త తన పట్ల చాలా కాలంగా కోపంగా ఉన్నారని చెప్పిన జర్కా

విపరీతంగా రక్తస్రావం...తీవ్రమైన నొప్పి

అతని వల్లో పడిపోయినట్లు ఆమెకు తర్వాత అర్దమైంది. అప్పుడు అతని దగ్గర తుపాకీ కూడా ఉంది. “ఎక్కడికి పారిపోతావే అంటూ నన్ను బరబరా తోటలోకి ఈడ్చుకెళ్లారు. తన జేబులోంచి ఒక కత్తి తీశారు. నా ముక్కును కోసేశారు” అని జర్కా వెల్లడించారు. నాకు చెప్పకుండా మీ ఇంటికి పారిపోయి నా పరువు తీసినందుకు ఇది నీకు శిక్ష అని జర్కా భర్త ఆమెతో అన్నారు.

ముక్కును కోసిన తర్వాత అలా రక్తం మడుగులోనే వదిలేసి వెళ్లిపోయారు ఆమె భర్త.

“నాకు చాలా రక్తం కారింది. విపరీతమైన నొప్పి. గాలి పీల్చడం కూడా కష్టంగా మారింది’’ అని నాటి ఘటనను వివరించారామె.

ఆమె అరుపులు విని చుట్టుపక్కల ఇళ్లవాళ్లు సాయం చేయడానికి వచ్చారు. ఒక వ్యక్తి తెగిపడిన ఆమె ముక్కును అక్కడ పడి ఉండగా గుర్తించారు. అంతా కలిసి ఆమెను స్థానిక డాక్టర్‌దగ్గరకు తీసుకెళ్లారు. కానీ ఆ ముక్కును అతికించడం సాధ్యం కాదని ఆ డాక్టర్‌చెప్పారు.

ప్రతీకారేచ్ఛ

ఈ దాడి నుంచి బైటపడిన జర్కా తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని కుంగిపోయారు. ఆమె తండ్రి, సోదరుడు ఆమె భర్తపై ప్రతీకారానికి ప్రయత్నించారు. కానీ అతను దొరక్కుండా తప్పించుకున్నారు. “ దొరికితే చంపేస్తాం అంటూ మా నాన్న, అన్న ఆవేశానికి లోనయ్యారు” అని జర్కా గుర్తు చేసుకున్నారు. “ మధ్యవర్తులుగా వచ్చినవారిపై మా నాన్న, మామ మండి పడ్డారు” అని చెప్పారు. జర్కా బంధువులు అతనిపై ప్రతీకారం తీర్చుకోక ముందే పోలీసులు అతన్ని పట్టుకుని జైల్లో వేశారు

ముఖమంతా రక్తసిక్తం

జర్కాకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేశారు. కానీ ఆమె తన ముక్కును తిరిగి తెచ్చుకోవాలని కోరుకున్నారు. “ఆపరేషన్‌తర్వాత నా ముఖం ఎలా ఉన్నా పరవాలేదు. కానీ నాకు ముక్కు ఉండాలి. అంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు’’ అన్నారామె.

రక్తంతో నిండిన జర్కా ముఖం సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్‌అయ్యింది. దీన్ని చూసిన డాక్టర్‌ జల్మాయ్‌ ఆమెకు చికిత్స చేస్తానని సోషల్‌మీడియా ద్వారానే ప్రకటించారు. జర్కా ఉంటున్న ప్రాంతపు అధికారులను ఆయన సంప్రదించారు. కాబూల్ రప్పించారు. ఆమె పరిస్థితి కాస్త కుదుటపడ్డాక, తన టీమ్‌తో కలిసి ఆయన ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.

జర్కా

ఫొటో సోర్స్, Dr Zalmai Khan Ahmadzai

తెగిన ముక్కుకు చికిత్స

“కత్తి కారణంగా తెగిపోయిన ఆమె ముక్కు మధ్య ప్రాంతంపై మేం మొదట దృష్టి పెట్టాం. తర్వాత ముక్కు రంధ్రాల చుట్టుపక్కల శరీరం నుంచి కణాలను సేకరించాం. తర్వాత ముక్కును పునర్నిర్మించాం” అని డాక్టర్‌జల్మాయ్‌వివరించారు. ఆపరేషన్‌చేస్తున్నప్పుడు

ముక్కు చుట్టుపక్కల ప్రాంతాల వరకే మత్తు వచ్చేలా డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో ఆపరేషన్‌లో ఎప్పుడేం జరుగుతుందో జర్కా గమనించారు.

“నువ్వు కోలుకుంటావు. నీ ముక్కును తిరిగి పొందగలుగుతావు అని డాక్టర్‌నాతో చెప్పారు” అని జర్కా వెల్లడించారు. ఆ శుభఘడియ కోసం ఆమె ఎదురు చూశారు. డాక్టర్‌జల్మాయి ఆమెను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భవిష్యత్తులో అవసరమైతే లేజర్ ట్రీట్‌మెంట్, సిలికాన్‌ఇంప్లాంట్‌లాంటి సర్జరీలు కూడా చేస్తామని ఆయన చెప్పారు. కొద్దిపాటి ఫీజు తీసుకున్న డాక్టర్‌జల్మాయ్‌, ఆమెలో మానసిక స్థైర్యాన్ని కూడా నింపారు.

జర్కా

ఫొటో సోర్స్, BBC

ఫొటో క్యాప్షన్, నాకు కావాల్సిందల్లా ముక్కు ఒక్కటే మరేమీ కాదన్న జర్కా

కొడుకు కోసం వేదన

ఇప్పుడు జర్కా తన ఆరేళ్ల కొడుకు కోసం ఆందోళన చెందుతున్నారు. అతను ఇప్పుడు భర్త కుటుంబీకుల దగ్గరే ఉన్నాడు. “ నా కొడుకును చూసి మూడు నెలలు అవుతోంది. వాడంటే నాకు ప్రాణం. వాడు నాతోనే ఉండాలి’’ అన్నారామె.

తండ్రి పాల్పడిన అకృత్యాన్ని ఆ చిన్నారి చూడనందుకు ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు. తన కొడుకు తన మరుదుల దగ్గర ఉన్నాడని తెలుసుగానీ, వారు ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమెకు సంపాదన లేదు కాబట్టి స్థానిక చట్టాల ప్రకారం కొడుకు బాధ్యతను, ఖర్చులను ఆమె భర్తే భరించాలి.

కొడుకు తన నుంచి వేరయినందుకు ఆమె చాలా బాధగా ఉన్నారు. “వాడిని చూడాలని ఉంది. ఏదైనా తింటుంటే వాడే గుర్తుకు వస్తున్నాడు’’ అని జర్కా బాధగా చెప్పారు. చిన్నారి కోసం అతని తండ్రితో పోరాడేందుకు జర్కా తల్లిదండ్రులు, బంధువులు ఆసక్తి చూపడం లేదు. వాడి కోసం వాడి తండ్రి మళ్లీ తమ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో వారికి తెలుసు. “వాడిని వాళ్లకే వదిలేయమని మా అమ్మా నాన్న చెబుతున్నారు. కానీ నా వల్ల కాదు’’ అన్నారు జర్కా. కానీ ఏం జరిగినా తన భర్త దగ్గరకు మాత్రం మళ్లీ వెళ్లనన్నారామె. “ నా భర్త నుంచి నాకు స్వేచ్ఛ కావాలి. అతనితో ఉండాలని నేను అనుకోవడం లేదు. కాకపోతే నా భర్త నాకు విడాకులు ఇస్తే, కొడుకును అతనికే ఇవ్వాల్సి ఉంటుంది. అదొక్కటే నా భయం’’ అన్నారు జర్కా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)