తాలిబన్ల నుంచి ఏకే-47 లాక్కుని ఇద్దరిని చంపిన అఫ్గాన్ బాలిక.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్

మిలిటెంట్లకు ఎదురుతిరిగిన బాలిక

ఫొటో సోర్స్, Social media

తన తల్లిదండ్రులను చంపిన తాలిబన్ మిలిటెంట్లకు ఎదురుతిరిగిన ఒక అఫ్గాన్ బాలికను ఇప్పుడు సోషల్ మీడియాలో ‘హీరోగా’ వర్ణిస్తున్నారు.

“మిలిటెంట్ల నుంచి ఏకే-47 అసాల్ట్ రైఫిల్ లాక్కున్న ఆ బాలిక, వారిలో ఇద్దరిని కాల్చిచంపింది. ఆమె చేతిలో చాలామంది మిలిటెంట్లు గాయపడ్డారు” అని ఘోర్ ప్రావిన్సులోని స్థానిక అధికారులు చెప్పారు.

బాలిక తండ్రి ప్రభుత్వ మద్దతుదారుడు కావడం వల్లే, తాలిబన్లు వారి ఇంటిపై దాడి చేశారని వారు చెప్పారు.

తుపాకీ పట్టుకున్న ఆ బాలిక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఫ్గానిస్థాన్‌లోని గ్రివా గ్రామంలో ఈ ఘటన జరిగాక మరికొంతమంది మిలిటెంట్లు మళ్లీ ఆ బాలిక ఇంటిపైకి వచ్చారు. కానీ గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలీషియా వారిని తరిమికొట్టింది.

“బాలికకు 16 ఏళ్ల వరకూ ఉంటాయి, ఆమెను, ఆమె తమ్ముడిని సురక్షిత ప్రాంతానికి తరలించాం” అని అధికారులు చెప్పారు.

సోషల్ మీడియాలో చాలామంది బాలిక ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

“ఆమె ధైర్యానికి హాట్సాఫ్” అని నజీబా రహ్మి అనే యూజర్ ఫేస్‌బుక్‌లో పెట్టారని ఏఎఫ్‌పీ చెప్పింది.

“తల్లిదండ్రులను కోల్పోయిన లోటును తీర్చలేమని మాకు తెలుసు. కానీ నీ ప్రతీకారం నీకు తగిన శాంతిని ఇస్తుంది” అని మహమ్మద్ సలేహ్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో పెట్టారు.

అఫ్గానిస్తాన్‌లో పెద్దగా అభివృద్ధి చెందని ప్రావిన్సుల్లో ఘోర్ ఒకటని, అక్కడ మహిళల పట్ల హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని స్థానిక మీడియా చెబుతోంది.

తాలిబన్లు ఫిబ్రవరిలో అమెరికాతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ వారిలో చాలా మంది సభ్యులు ప్రస్తుత అఫ్గాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునివ్వడం అక్కడ అశాంతి కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)