అఫ్గానిస్తాన్ తాలిబాన్లు: శాంతిచర్చల రద్దుతో అమెరికాకే ఎక్కువ నష్టం: తాలిబాన్

ఫొటో సోర్స్, AFP
అఫ్గాన్ శాంతి చర్చల నుంచి తప్పుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని తాలిబాన్లు తప్పుబట్టారు. దానివల్ల అమెరికాకే ఎక్కువ నష్టం అన్నారు.
దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన తాలిబాన్లు ఈ నిర్ణయం ఆయన పరిపక్వత, అనుభవాన్ని బయటపెట్టిందన్నారు.
చర్చల దిశగా చివరి క్షణం వరకూ అంతా సజావుగానే జరిగిందని, కానీ ట్రంప్ వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆదివారం క్యాంప్ డేవిడ్‌లో తాలిబాన్ సీనియర్ నేతలు, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశం కావాల్సి ఉంది. కానీ దానిని రద్దు చేసుకున్నట్లు ట్రంప్ ఒక రోజు ముందే ట్వీట్ చేశారు.
తాలిబాన్లు, అఫ్గాన్ ప్రభుత్వంతో ట్రంప్ వేరువేరుగా చర్చలు జరపాల్సి ఉంది. ఎందుకంటే అఫ్గాన్ ప్రభుత్వం అమెరికా ఆడించినట్లు ఆడుతోందని తాలిబాన్లు భావిస్తున్నారు. వారితో నేరుగా చర్చలు జరిపేందుకు నిరాకరించారు.
అయితే, అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మాత్రం అమెరికా నిర్ణయాన్ని స్వాగతించింది. దీనిని సరైన సమయంలో తీసుకున్న సరైన చర్యగా వర్ణించింది.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ వెనకడుగు ఎందుకు
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లతో శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు.
ఒక్కొక్కటిగా వరుస ట్వీట్లు చేసిన ట్రంప్ "తను ఆదివారం క్యాంప్ డేవిడ్‌లో తాలిబాన్ నేతలు, అఫ్గాన్ అధ్యక్షుడితో ఒక రహస్య సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేసుకుంటున్నానని" చెప్పారు.
ఆయన అందులో "కాబూల్‌లో జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత ఈ చర్యలు తీసుకున్నాం. ఆ ప్రమాదంలో ఒక అమెరికా సైనికుడు సహా 12 మంది చనిపోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబాన్లు ప్రకటించారు" అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి జల్మే ఖలీల్‌జాద్ గత సోమవారం తాలిబాన్లతో 'సిద్ధాంతపరంగా' ఒక శాంతి ఒప్పందం జరగబోతున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడు చెబుతున్న ఈ ఒప్పందం ప్రకారం అమెరికా ఆ తర్వాత 20 వారాల్లోపు అఫ్గానిస్తాన్ నుంచి తమ 5400 సైనికులను వెనక్కు పిలిపించాలి.
అయితే ఈ ఒప్పందంపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది అధ్యక్షుడు ట్రంపే అని అమెరికా రాయబారి చెప్పారు.
తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నప్పటికీ, అఫ్గానిస్తాన్‌లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న హింస ఆగడం లేదని గురువారం కారు బాంబు పేలుడు తర్వాత అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, EPA
తాలిబాన్ల బలోపేతం
2001లో అమెరికా సైనిక ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం మొదటిసారి అఫ్గానిస్తాన్‌లోని ఒక పెద్ద ప్రాంతం తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చింది.
అమెరికా ఆడినట్లు ఆడుతోందంటూ తాలిబాన్లు ఇప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి అంగీకరించడం లేదు.
అమెరికా, తాలిబాన్ల మధ్య కతార్‌లో ఇప్పటివరకూ 9 సార్లు శాంతిచర్చలు జరిగాయి.
ఇప్పుడు చెబుతున్న ఒప్పందం ప్రకారం అగ్రరాజ్యం సైనికులు ఆ దేశం వదిలి వెళ్లిపోతే, బదులుగా అఫ్గానిస్తాన్ భూభాగాన్ని అమెరికా, దాని మిత్ర దేశాలపై దాడులకు ఎప్పటికీ ఉపయోగించమని తాలిబాన్లు మాట ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, ఈ ఒప్పందం తర్వాత తమపై మళ్లీ తాలిబన్ల పాలనలో ఉన్న ఆంక్షలు వస్తాయేమోనని అఫ్గానిస్తాన్‌లో చాలా మంది భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్‌లో సంకీర్ణ దళాలు
తాలిబాన్లు 1996 నుంచి 2001 వరకూ అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్నారు.
2001లో అమెరికా నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో ప్రారంభమైన సైనిక ఆపరేషన్ల తర్వాత నుంచి ఇప్పటివరకూ సంకీర్ణ సేనలకు చెందిన దాదాపు 3500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2300 మంది అమెరికన్లు.
అఫ్గానిస్తాన్‌లో సామాన్యులు, మిలిటెంట్లు, భద్రతాదళాలు ఎంతమంది చనిపోయారో అంచనా వేయడం కూడా కష్టం.
2019లో ఐక్యరాజ్యసమితి తన ఒక నివేదికలో అక్కడ 32 వేల మందికి పైగా సామాన్యులు చనిపోయారని తెలిపింది.
అటు, అఫ్గానిస్తాన్‌లో 58 వేల మంది భద్రతా దళాలు, 42 వేల మంది మిలిటెంట్లు చనిపోయారని బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మిసైళ్ళే...
- అఫ్గానిస్తాన్ కరవు: యుద్ధం కంటే దుర్భిక్షంతోనే ఎక్కువ వలసలు
- నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








