అఫ్గాన్ ప్రసూతి వార్డుపై దాడి: తల్లులను కోల్పోయిన శిశువులకు పాలిచ్చి కాపాడిన మహిళ

ఫొటో సోర్స్, FIROOZA OMAR
- రచయిత, ఇనయతుల్లా యాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాబూల్‌లో గత వారం ప్రసూతి వార్డుపై ప్రాణాంతక దాడి జరిగిన సమయంలో ఫిరూజా ఒమర్ తన ఇంట్లో ఉన్నారు. నగరంలోని దస్త్-ఏ-బార్చీ ఆస్పత్రిలోని ప్రసూతివార్డులోకి చొరబడిన మిలిటెంట్లు నవజాత శిశువులు, వారి తల్లులు, నర్సుల సహా 24 మందిని కాల్చి చంపారు
“నా బిడ్డకు పాలిస్తున్న నాకు అది వినగానే గుండె పిండేసినట్లయ్యింది. తల్లిలేని ఆ శిశువుల పరిస్థితి ఎలా ఉందో నేను స్వయంగా చూశాను” అని సైకియాట్రిస్టుగా పనిచేస్తున్న 27 ఏళ్ల ఫిరూజా చెప్పారు.
నాలుగు నెలల మగ శిశువుకు తల్లి అయిన ఫిరూజా ఆ పరిస్థితుల్లో తను వారికి ఏ సాయం చేయగలదో అదే చేశారు. మిలిటెంట్ల దాడిలో మృతిచెందిన లేదా గాయపడ్డ తల్లుల శిశువుల కోసం ఒక స్వచ్ఛంద సేవకురాలుగా మారారు.
ఆమెకు భర్త కూడా అండగా నిలిచారు. తను లేని సమయంలో శిశువును చూసుకునేందుకు భర్త అంగీకరించడంతో ఫిరూజా మిలిటెంట్ల దాడి నుంచి కాపాడిన వంద మంది మహిళలు, శిశువులను తరలించిన సమీపంలోని అటతుర్క్ పిల్లల ఆస్పత్రికి వెళ్లారు.
ఫిరూజా ఇంటికి ఆ ఆస్పత్రి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిలిటెంట్ల దాడితో వణికిపోతున్న నగరంలో అంత దూరం ప్రయాణించడం ప్రమాదమే అయినా ఆమె వెనకడుగు వేయలేదు.

ఫొటో సోర్స్, FIROOZA OMAR
తల్లిలేని పిల్లల కడుపు నింపారు
“నేను ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ దాదాపు 20 మంది శిశువులు కనిపించారు. వారిలో కొందరు గాయపడి ఉన్నారు. అక్కడి వైద్య సిబ్బంది ఆ శిశువులకు పౌడరు పాలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు పిల్లలు వాటిని తాగలేకపోతున్నారు” అని ఆమె చెప్పారు.
“నేను నర్సులతో మాట్లాడాను, వార్డులో ఎక్కువగా ఏడుస్తున్న పిల్లలకు నా పాలు పట్టమని వారు నాకు చెప్పారు” అన్నారు.
ఒక్కొక్కరుగా మొదటి రోజు ఆమె నలుగురు శిశువులకు తన పాలు పట్టగలిగారు. “అది నాకు ఒక ప్రశాంతతను ఇచ్చింది. అభంశుభం తెలీని పిల్లలకు సాయం చేశాననే సంతోషాన్ని ఇచ్చింది” అని తెలిపారు.
తర్వాత కొన్నిరోజులపాటు ఆమె ఇంట్లో తన బిడ్డకు పాలు పట్టిన తర్వాత, ఆస్పత్రికి వచ్చేవారు. వార్డులో ఉన్న శిశువులకు తల్లిగా మారి వారి కడుపు నింపేవారు.
ఆ పరిస్థితి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని భావించిన ఫిరూజా తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మిగతా తల్లులు కూడా తనలాగే, ఆ శిశువులకు సాయం అందించాలని కోరారు. స్పందించిన చాలా మంది మహిళలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారని ఆమె చెప్పారు.
వార్డులో చికిత్స పొందుతున్న శిశువులకు డైపర్లు, తల్లి పాల పౌడర్ డబ్బాలు లాంటివి కొనేందుకు విరాళాలు సేకరించడానికి ఫిరూజా తన స్నేహితులను కూడా సంప్రదించారు.

ఫొటో సోర్స్, EPA
అఫ్గాన్‌లో ఆగని మారణహోమం
గత నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఎన్నో దారుణ మారణకాండలకు అఫ్గానిస్తాన్ ప్రత్యక్ష్యసాక్షిగా నిలిచింది.
కానీ గత మంగళవారం జరిగిన దాడి, తల్లులు, నవజాత శిశువులను కాల్చిచంపిన దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
నవజాత శిశువుల్లో చాలా మంది ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నా, నగరంలో ఆగని హింసాత్మక ఘటనలు ఫిరూజాను కలవరపరుస్తున్నాయి.
“తమ తల్లుల ఒడిలో కేరింతలు కొట్టాల్సిన ఈ శిశువులు ఇప్పుడు ఎవరిదగ్గరో పాలు తాగి ఆకలి తీర్చుకోవాల్సి వస్తోంది” అని ఆమె బాధపడుతున్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీలో మిర్చి, తెలంగాణలో పసుపు క్లస్టర్లు.. రూ. 4 వేల కోట్లతో మూలికల సాగు
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- కరోనావైరస్: కోయంబేడు నుంచి కోనసీమ దాకా.. ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’
- కరోనావైరస్: స్కూల్స్‌లో సామాజిక దూరం పాటించడం సాధ్యమేనా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- కరోనావైరస్: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: కోవిడ్‌తో యుద్ధానికి సిద్ధమైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








