అఫ్గాన్ సంక్షోభం: 18 ఏళ్ళ యుద్ధానికి తెర దించుతూ శాంతి స్థాపన దిశగా తాలిబాన్ - అమెరికాల ఒప్పందం

ఫొటో సోర్స్, AFP
పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ యుద్ధం తరువాత అఫ్గానిస్తాన్‌లో శాంతి స్థాపన దిశగా అమెరికా, తాలిబన్లు ఒక ఒప్పందంపై సంతకం చేశారు.
తాలిబన్ మిలిటెంట్లు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటే 14 నెలల్లో తమ బలగాలన్నిటినీ అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడానికి అమెరికా, దాని నాటో మిత్రదేశాలు అంగీకరించాయి.
ఖతర్‌లోని దోహాలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి మైక్ పాంపియో, తాలిబన్ నాయకులు హాజరై ఒప్పందంపై సంతకాలు చేశారు.
అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ మధ్య చర్చలు ఇంకా జరగాల్సి ఉంది.


దోహాలో కుదిరిన ఒప్పందం ప్రకారం, తాలిబన్లు కూడా తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి అల్ ఖైదాను కానీ, ఇతర తీవ్రవాద గ్రూపులను కానీ రానివ్వబోమని మాటిచ్చారు.
అమెరికాపై అల్ ఖైదా తీవ్రవాద సంస్థ 2001 సెప్టెంబరులో దాడులు చేసిన కొద్ది వారాల తరువాత ఆ దేశం అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది.
అప్పటి నుంచి సాగుతున్న యుద్ధంలో 2,400 మందికిపైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్‌లో ఇప్పటికీ 12 వేల మందికిపైగా అమెరికా సైనికులున్నారు. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ట్రంప్ హామీ ఇచ్చారు.

యుద్ధ క్షేత్రంలో పైచేయి కోసం అన్ని పక్షాలూ కోరుకుంటూనే అనేక ఏళ్లుగా చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
తమ సైనికులను స్వదేశానికి రప్పించాలన్న అమెరికా సంకల్పం నుంచి ఈ ఒప్పందం పుట్టింది. దీంతో పాటు కాబూల్‌లో అడుగుపెట్టాలంటే చర్చలే సరైన మార్గమని తాలిబన్లలో కొందరు గుర్తించడంతో ఇది సాధ్యమైంది.
ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ ఇది కీలక ముందడుగే. యుద్ధం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలామంది అఫ్గాన్లు శాంతి కోసం ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా అనిపిస్తోంది.
మరోవైపు తాము పూర్తిగా మారామని తాలిబన్ నాయకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, తాలిబన్‌లు చర్చలు ఎలా సాగాయి
అఫ్గానిస్తాన్‌లో శాంతి కోసం చర్చించేందుకు తాలిబన్ నాయకులకు 2011 నుంచి ఖతర్ ఆతిథ్యం ఇచ్చింది. 2013లో ఖతర్‌లో తాలిబన్ల కార్యాలయం ఏర్పాటైనప్పటికీ జెండా విషయంలో వివాదంతో అదే ఏడాది మూసివేశారు. చర్చలకు సంబంధించిన ఇతర ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి.
శాంతికి మార్గం సుగమం చేసే క్రమంలో తాను అమెరికా అధికారులతో కలవాలనుకుంటున్న తాలిబన్ నాయకులు 2018లో ప్రకటించారు. అయితే, అఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో చర్చలకు మాత్రం వారు ససేమిరా అన్నారు.
అనంతరం ఖతర్‌లో తొమ్మిది విడతలుగా సాగిన చర్చల తరువాత రెండు పక్షాలు ఒక ఒప్పందం దిశగా వచ్చారు.
తాలిబన్లతో సూత్రప్రాయంగా కుదిరిన ఒక అంగీకారం ప్రకారం అఫ్గానిస్తాన్ నుంచి 5,400 మంది బలగాలను 20 వారాల్లోగా ఉపసంహరించుకుంటామని అమెరికా 2019 సెప్టెంబరులో ప్రకటించింది.
అది జరిగిన కొద్దిరోజులకే అమెరికా సైనికుడిని తాలిబన్లు చంపారన్న కారణంతో చర్చల ప్రక్రియను చంపేశారంటూ ట్రంప్ ప్రకటించారు.
కానీ, మళ్లీ కొద్దిరోజులకే రెండు పక్షాలూ చర్చలకొచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
అసలెందుకీ యుద్ధం ?
2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్ ఖైదా దాడి కారకుడిని అప్పగించేందుకు తాలిబన్లు తిరస్కరించడంతో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది.
అంతర్జాతీయంగా అమెరికాతో మరిన్ని దేశాలు జతకట్టడంతో కొద్దిరోజుల్లోనే తాలిబన్లను అధికారం నుంచి తొలగించారు. దీంతో తాలిబన్లు తిరుగుబాటుదారులుగా ప్రాణాంతక దాడులకు తెగబడుతూ అక్కడి ప్రభుత్వాలను అస్థిరపరచడం ప్రారంభించారు.
తాలిబన్లు క్రమంగా పట్టు పెంచుకుంటూ పోయారు.. గత ఏడాది బీబీసీ పరిశీలన ప్రకారం అఫ్గానిస్తాన్‌లోని 70 శాతం ప్రాంతంలో వారు క్రియాశీలంగా ఉన్నారు.
2001 నుంచి అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన 3,500 మంది సైనికులు అఫ్గానిస్తాన్‌లో చనిపోయారు.
ఈ యుద్ధంలో చనిపోయిన అఫ్గానిస్తాన్ పౌరులు, తాలిబన్ మిలిటెంట్లు, అక్కడి ప్రభుత్వ బలగాల సంఖ్యయితే లెక్కించడమే కష్టం.
2019 ఫిబ్రవరిలో ఐరాస వెలువరించిన ఓ నివేదిక ప్రకారం 32 వేల మంది పౌరులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.
బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన వాట్సన్ సంస్థ నివేదిక ప్రకారం భద్రతా దళాలకు చెందిన 58 వేల మంది, తాలిబన్లకు చెందిన 42 వేల మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంత సుదీర్ఘ కాలం యుద్ధం ఎందుకు?
ఇందుకు అనేక కారణాలున్నాయి. అఫ్గాన్ ప్రభుత్వం, భద్రతా బలగాలకు ఉన్న పరిమితులు, తాలిబాన్ల ప్రతిఘటన వంటివన్నీ కారణాలే.
2009లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అఫ్గాన్‌లో తమ దళాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడి అమెరికా సైనికుల సంఖ్య లక్ష వరకూ పెరిగింది.
దక్షిణ అఫ్గాన్‌లోని కొన్ని ప్రాంతాలను తాలిబాన్ల నుంచి విడిపించేందుకు బలగాల పెంపు తోడ్పడింది. అయితే క్రమంగా మళ్లీ బలగాల సంఖ్యను అమెరికా తగ్గించడంతో తాలిబాన్లు మళ్లీ పుంజుకున్నారు.
ఇప్పటికీ యుద్ధం కొనసాగడానికి బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రతినిధి దావూద్ అజామీ చెబుతున్న కారణాలివీ...
* 18 ఏళ్లుగా అమెరికా అనుసరిస్తున్న వ్యూహాలలో లోపాలు, గందరగోళ రాజకీయ పరిస్థితులు.
* ప్రతిష్టంభనను తొలగించాలని రెండు వర్గాలూ కోరుకుంటున్నాయి. అయితే, తమకు చేకూరే ప్రయోజనాలను మరింత పెంచుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.
* అఫ్గాన్‌లో పెరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల హింస. ఇటీవలి కాలంలో వారు విధ్వంసకర దాడులకు తెగబడ్డారు
* ప్రతిష్టంభనలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉంది. పాక్‌లోనూ తాలిబాన్ మూలాలున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
* అమెరికా దాడుల అనంతరం వీరు ఇక్కడే మళ్లీ బలం పుంజుకున్నారు. అయితే, వీరికి సాయం చేస్తున్నామని అంగీకరించేందుకు పాక్ నిరాకరిస్తోంది.

ఇవి కూడా చదవండి:
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
- దిల్లీ హింస: అల్లర్ల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారా? రాష్ట్ర పరిధిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవా?
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?
- కరోనావైరస్: దారుణంగా ప్రభావితమైన దేశాల్లో ముమ్మరంగా నియంత్రణ చర్యలు
- ఐసన్‌హోవర్ నుంచి ఒబామా వరకు.. భారత్‌లో అమెరికా అధ్యక్షుల పర్యటనలు ఇలా సాగాయి...
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










