ఐసన్‌హోవర్ నుంచి ఒబామా వరకు.. భారత్‌లో అమెరికా అధ్యక్షుల పర్యటనలు ఇలా సాగాయి...

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్ష హోదాలో తొలిసారి డోనల్డ్ ట్రంప్ భారత్‌కు రాబోతున్నారు. రెండు రోజులపాటు ఆయన పర్యటన సాగనుంది.

ఈ పర్యటన గొప్పగా జరగబోతుందని ట్రంప్ విశ్వాసంతో ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఆయనకు దారిపొడవునా జనాలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ట్రంప్ కన్నా ముందు అమెరికా అధ్యక్షులు చాలా మంది భారత్‌కు వచ్చారు. వారిలో అపూర్వ స్వాగతాలు అందుకున్నవారు కొందరైతే, కాస్త ఇబ్బందులు పడుతూనే పర్యటనలు ముగించినవారు ఇంకొందరు.

అలా ఎవరవరి పర్యటనలు ఎలా సాగాయో చూద్దాం...

అడ్డగీత
News image
అడ్డగీత

బాగా జరిగినవి ఇవే...

భారత్‌లో పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ . 1959 డిసెంబర్‌లో ఆయన దేశ రాజధాని దిల్లీలో 21-గన్ సెల్యూట్‌తో స్వాగతం అందుకున్నారు.

ఓపెన్ టాప్ కార్‌లో ఆయన వస్తుంటే చూసేందుకు జనం దారిపొడవునా బారులుతీరారు.

డ్వైట్ డి ఐసన్‌హోవర్, నెహ్రూ

ఫొటో సోర్స్, US Emabssy Archives

ఫొటో క్యాప్షన్, ఐసన్‌హోవర్, నెహ్రూ

అమెరికా-భారత్ సంబంధాలకు అది ఒడిదొడుకుల కాలమే. ఐసన్‌హోవర్, నెహ్రూల మధ్య ఉన్న సఖ్యత అప్పుడు కొంచెం సహకరించింది. ప్రచ్ఛన్న యుద్ధ ఆరంభ సమయం అది. అమెరికా, పాకిస్తాన్ దగ్గరి మిత్రులయ్యాయి. భారత్ అలీన విధానానికి కట్టుబడి ఉంది.

ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే ఉంది. భారత్-అమెరికా సమీకరణంలో చైనాతో సంబంధాలు కేంద్రంగా మారాయి. టిబెట్ విషయంలో చైనాతో దూకుడు వైఖరి అవలంబించాలని భారత్‌ను అమెరికా ఒత్తిడి చేస్తోంది.

ఐసన్‌హోవర్ నాలుగు రోజుల పర్యటన మొత్తంగా చూస్తే విజయవంతమైనట్లే. ఐసన్‌హోవర్ తర్వాత భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులందరూ దాదాపు ఆయన పంథానే అనుసరించారు.

ఐసన్‌హోవర్ తన పర్యటనలో మహాత్మగాంధీ స్మారకానికి నివాళులు అర్పించి, తాజ్‌మహల్‌ను సందర్శించారు. పార్లమెంటులో మాట్లాడారు. దిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రసంగించారు. ఓ వార్తా కథనం ప్రకారం ఈ సభకు పది లక్షల మంది జనం వచ్చారు.

ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు.. ‘మా హృదయం నుంచి ఓ ముక్కను తీసుకువెళ్తున్నారు’ అని నెహ్రూ వ్యాఖ్యానించారు.

ఐసన్‌హోవర్

ఫొటో సోర్స్, US Embassy Archives

ఫొటో క్యాప్షన్, ఐసన్‌హోవర్

భారీ మార్పులకు కారణమైన పర్యటన అంటే బిల్ క్లింటన్‌దే. 2000 మార్చిలో అది జరిగింది. అప్పుడు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ. క్లింటన్‌‌కు ముందు 20 ఏళ్లపాటు అమెరికా అధ్యక్షులు ఎవరూ భారత్‌కు రాలేదు.

1999లో భారత్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన తర్వాత అమెరికా ఆంక్షలు విధించింది. అలాంటి కీలక సమయంలో క్లింటన్ పర్యటనకు వచ్చారు.

అప్పుడు టెక్నాలజీ హబ్‌గా అవతరిస్తున్న హైదరాబాద్‌ను, దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కూడా ఆయన సందర్శించారు. ఓ దక్షిణ భారత నగరాన్ని అమెరికా అధ్యక్షుడు సందర్శించడం అదే ప్రథమం. మొత్తం ఐదు రోజులపాటు ఆయన పర్యటన సాగింది.

‘‘క్లింటన్ పర్యటన చాలా ఉల్లాసంగా సాగింది. సైబర్ రంగంలో భారత్‌కున్న శక్తి, ప్రజస్వామ్యం అందిస్తున్న ఫలాలను ఆయన స్వయంగా చూశారు’’ అని గతంలో అమెరికాకు భారత రాయబారిగా పనిచేసిన నవ్‌తేజ్ సరన్నా అన్నారు.

క్లింటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'క్లింటన్ ఫీవర్ - ఆనందంతో తబ్బిబ్బవుతున్న భారత్‌లో లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి' అని అర్థం వచ్చేలా శీర్షిక పెట్టి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది

క్లింటన్ ఓ గ్రామవాసులతో కలిసి డ్యాన్స్ చేశారు. సఫారీకి వెళ్లారు. ఇక్కడి వంటకాల రుచిచూశారు.

‘క్లింటన్ ఫీవర్ - ఆనందంతో తబ్బిబ్బవుతున్న భారత్‌లో లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి’ అని అర్థం వచ్చేలా శీర్షిక పెట్టి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అప్పటి పరిస్థితికి ఆ శీర్షిక సరిగ్గా అద్దం పట్టింది.

ఓసారి ఫోర్బ్స్ మ్యాగజీన్ జార్జ్ బుష్‌ను ‘భారత్‌ పాలిట అత్యుత్తమ అమెరికా అధ్యక్షుడి’గా వర్ణించింది. 2006 మార్చిలో ఆయన మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. ఇరు దేశాల వ్యూహాత్మక బంధాల్లో, ముఖ్యంగా వాణిజ్యం, అణు సాంకేతికత విషయాల్లో అదొక మైలురాయి.

అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో బుష్ మైత్రి అందరినీ ఆకట్టుకుంది. బుష్ మంచి కళాకారుడు. అధ్యక్షుడిగా పదవీవిరమణ చేశాక ఆయన మన్మోహన్ సింగ్ బొమ్మ కూడా గీశారు.

చరిత్రాత్మక, వివాదాస్పద అణు ఒప్పందం వీరిద్దరి హయాంలోనే జరిగింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)‌పై సంతకం చేసేందుకు నిరాకరించి దశాబ్దాల పాటు భారత్ అనుభవించిన ఒంటరితనం దూరమైంది. అణు వ్యవస్థల్లో అమెరికా పరిశీలకులకు అనుమతివ్వడం ద్వారా అమెరికా పౌర అణు సాంకేతికతను భారత్ ఇంధన అవసరాల కోసం పొందింది.

జార్జ్ బుష్, మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, US Embassy Archives

ఫొటో క్యాప్షన్, జార్జ్ బుష్, మన్మోహన్ సింగ్

బుష్‌ది చాలా ముఖ్యమైన పర్యటనే అయినా, మిగతా వారిలాగా ఆడంబరంగా అది సాగలేదు. ఆయన తాజ్‌మహల్‌కు వెళ్లలేదు. పార్లమెంటులో ప్రసంగించలేదు. పర్యటన జరిగిన సమయానికి కూడా పెద్ద ప్రాముఖ్యత లేదు. ఇరాక్ ఆక్రమణ కారణంగా అమెరికాపై అప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బుష్ పర్యటనను వ్యతిరేకిస్తూ వామ పక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. బుష్ కూడా హైదరాబాద్‌కు వచ్చారు.

ఇక అధ్యక్ష హోదాలో భారత్‌ను రెండు సార్లు సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయన తొలి పర్యాయం 2010లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌కు వచ్చారు. 2015లో మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు మరోసారి వచ్చారు.

తొలి పర్యటన అప్పుడు అందరిలా దిల్లీకి కాకుండా, నేరుగా ముంబయికి వచ్చారు. పెద్ద వాణజ్య బృందాన్ని వెంట తీసుకువచ్చారు.

అయితే, ఇది కేవలం ఆర్థిక బంధాల బలోపేతానికే కాదు. ముంబయి దాడుల విషయంలో భారత్‌కు సంఘీభావం తెలపాలన్న ప్రధాన ఉద్దేశంతో ఆయన అలా చేశారు. ఆ దాడుల లక్ష్యాల్లో ఒకటైన తాజ్ హోటల్‌లో ఒబామా, తన భార్యతో కలిసి బస చేశారు కూడా.

ఐరాస భద్రత మండలిని సంస్కరించి, అందులో భారత్‌కు చోటు కల్పించాలని కూడా ఒబామా అప్పుడు పిలుపునిచ్చారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని అమెరికా మాజీ డిప్యుటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ ఏసియా అలిస్సా ఎయిరెస్ అన్నారు.

‘‘ఇన్నేళ్లవుతున్నా ఐరాస‌లో ఏదీ మారకపోయి ఉండొచ్చు. కానీ, అమెరికా విధానంలో అదొక భారీ మార్పు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, US Embassy Archives

ఫొటో క్యాప్షన్, బరాక్ ఒబామా

2015లో మోదీ ఆహ్వానంపై గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వాణిజ్యం, రక్షణ, పర్యావరణ మార్పుల అంశాలపై ప్రధానంగా ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇండో-పసిఫిక్ వ్యూహాలకు కూడా ఈ పర్యటనలో ప్రాధాన్యత లభించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు చర్యలపై రెండు దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాస్త అటూ, కాస్త ఇటూ...

1978లో జిమ్మీ కార్టర్ రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించారు.

ఆ పర్యటనతో భారత్-అమెరికా సంబంధాలు మళ్లీ స్నేహపూర్వకంగా మారాయి. అయితే సవాళ్లు రాకపోలేదు.

కార్టర్ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను కలిశారు. పార్లమెంటులో ప్రసంగించారు. తాజ్‌మహల్‌ను సందర్శించారు. హరియాణాలో ఉన్న ఓ ఊరికి కూడా వెళ్లారు.

ఆ ఊరి పేరు చుమా ఖరెగావ్. కార్టర్‌కు దాంతో వ్యక్తిగత అనుబంధం ఉంది. కార్టర్ తల్లి పీస్ కోర్‌లో సభ్యురాలిగా 1960ల్లో భారత్ వచ్చినప్పుడు ఆ ఊరిని సందర్శించారు.

దీంతో కార్టర్, ఆయన భార్య కూడా ఆ ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కార్టర్ ఆ ఊరికి డబ్బులు కూడా ఇచ్చారు. తొలి టీవీ సెట్ కూడా కొనిచ్చారు. ఆ ఊరుకు ‘కార్టర్‌పురి’ అని పేరు కూడా వచ్చింది.

జిమ్మీ కార్టర్

ఫొటో సోర్స్, US Embassy Archives

ఫొటో క్యాప్షన్, జిమ్మీ కార్టర్

అయితే, భారత్ గోప్యంగా అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని నడిపిస్తూ వచ్చింది. 1974లో తొలిసారి పరీక్షలు నిర్వహించింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)‌పై భారత్ సంతకం చేయాలని అమెరికా కోరుకుంది. కానీ, ఆ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల వివక్షపూరితంగా ఉందంటూ భారత్ నిరాకరించింది.

అంతర్జాతీయంగా సహకారం పెంపొందించుకుంటామని రెండు దేశాలు సంయుక్త ప్రకటన చేసినా, ఆ పర్యటనను ఆశించిందేమీ లేకుండానే కార్టర్ ముగించారు.

నిక్సన్ హయాంలో అలా...

1969లో అమెరికా అధ్యక్ష హోదాలో రిచర్డ్ నిక్సన్ ఒక్క రోజు పర్యటన కోసం భారత్ వచ్చారు. 1953లో ఉపాధ్యక్షుడిగా, అంతకుముందు పలుమార్లు వ్యక్తిగత పర్యటనల్లో భాగంగా ఆయన భారత్‌కు చాలా సార్లు వచ్చారు.

అయినా, ఆయన భారత్‌కు అభిమాని ఏమీ కాదు.

‘‘నిక్సన్‌కు భారతీయులంటే ఇష్టం ఉండేది కాదు. ఇందిరా గాంధీ అంటే అలుసు. అయితే, అవతలి వైపు నుంచి కూడా అలాంటి తీరే ఉండేది’’ అని బ్లడ్ టెలిగ్రామ్ అనే పుస్తకం రాసిన గేరీ బాస్ అభిప్రాయపడ్డారు.

ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా ఉన్న సమయం అది. భారత్ ‘అలీన విధానం’ అమెరికా అధ్యక్షులను ‘కలవరపెట్టింది’. ఇందిరా గాంధీ హయాంలో అలీన విధానం ‘సోవియట్ అనుకూల విదేశాంగ విధానం’గా స్పష్టంగా మారడం కనిపించిందని గేరీ బాస్ అన్నారు.

రిచర్డ్ నిక్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిచర్డ్ నిక్సన్

బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చినప్పుడు రెండు దేశాల బంధాలు మరింత దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ అప్పుడు అమెరికా సన్నిహిత దేశాల్లో ఒకటి.

1971లో ఇందిరా గాంధీ శ్వేత సౌధం సందర్శించినప్పుడు ఈ భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇందిరా గాంధీని ‘ఓల్డ్ విచ్’ అంటూ నిక్సన్ తిట్టుకునేవారని కొన్ని పత్రాలు బయటపెట్టాయి.

భవిష్యతు ఇది...

భారత్, అమెరికా ఈ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చూశాయి.

అయితే, 2015లో ఒబామా భారత్ వచ్చినప్పుడు ఆయన, మోదీ కలిసి ఓ స్నేహ ప్రకటనపై సంతకం చేశారు. దాని నినాదం ‘చలే సాత్ సాత్’ (కలిసి నడుద్దాం).

కలిసి నడవడం మొదలైంది కూడా.

ఒబామా, మోదీ

ఫొటో సోర్స్, US Embassy Archives

ఫొటో క్యాప్షన్, ఒబామా, మోదీ

ట్రంప్ పర్యటన బంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. అదెలా అన్నది తెలియదు.

అహ్మదాబాద్‌కు ఆయన రాకను పెద్ద ఉత్సవంగా చేస్తున్నారు. చాలా మంది జనం వచ్చే అవకాశం ఉంది. దిల్లీలో ఐసన్‌హోవర్ రోడ్‌షోను ఇది గుర్తుచేయొచ్చు. రెండు దేశాల నాయకుల మధ్య అనుబంధం మరింత బలపడొచ్చు.

ట్రంప్ కోసం జనం గట్టిగా రావొచ్చోమే గానీ, విధానపరమైన విషయాలను మాత్రం ఈ పర్యటన తేలిగ్గానే తీసుకోవచ్చు. ఇదివరకటి అధ్యక్ష పర్యటనల్లా ఇందులో కీలక ఒప్పందాలు జరుగుతాయని ఎవరూ ఆశించడం లేదు. ట్రంప్ గట్టిగా కోరుకుంటున్న వాణిజ్య ఒప్పందం కూడా కుదిరేలా కనిపించడం లేదు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)