పౌరసత్వం మా పరిధి కాదు, అలాంటి పదాలు వాడి ఉంటే సరిచేస్తాం... హైదరాబాద్ వాసులకు నోటీసులపై అధికారుల వివరణ

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తప్పుడు పత్రాలతో ఆధార్ తీసుకున్నారన్న అభియోగం నేపథ్యంలో భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ ప్రాంతీయ కార్యాలయం తనకు నోటీసులు జారీ చేసిందని హైదరాబాద్‌లో నివసిస్తున్న మొహమ్మద్ సత్తార్ ఖాన్ తెలిపారు.
తాను ఆటో రిక్షా నడుపుతుంటానని, తన తండ్రి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్విన్ కంపెనీలో పనిచేశారని, తన తల్లికి పెన్షన్ కూడా వస్తోందని సత్తార్ ఖాన్ బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో చెప్పారు.
తనకు ఓటర్ ఐడీ కూడా ఉందని, పదవ తరగతి మార్కుల లిస్టు ఉందని ఆయన వెల్లడించారు.


అయితే, హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దీనిపై వివరణనిచ్చారు.
ఆధార్ పరిధిలో లేని అంశాలను నోటీసుల్లో ప్రస్తావించి ఉంటే సరి చేస్తామని, ఇలాంటి నోటీసులు కేవలం ఆధార్ డేటా నాణ్యతను పెంచేందుకే జారీ చేస్తామని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
"ఈ 127మంది జాబితా ఇచ్చిన పోలీసు అధికారి ఎవరో యూఐడీఏఐ స్పష్టం చేయాలి. తాము 127మందితో కూడిన జాబితా యూఐడీఏఐకి సమర్పించామని తెలంగాణ డీజీపీ నిర్థరించగలరా? ఏ ప్రాతిపదికన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు యూఐడీఏఐ దీనికి సంబంధించిన బాధ్యత తెలంగాణ పోలీసులదే అని చెబుతోంది. అందువల్ల దీని వల్ల ఏర్పడిన గందరగోళాన్ని తొలగించే బాధ్యత కూడా తెలంగాణ పోలీసులదే" అని ఒవైసీ ట్విటర్లో పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
మూడు రోజుల క్రితం తనకు ఈ నోటీసులు అందాయని, అవేంటో అర్థం కాకపోవటంతో స్థానిక రాజకీయ నాయకుడి వద్దకు వెళ్లానని సత్తార్ ఖాన్ చెప్పారు.
ఆధార్ రెగ్యులేషన్స్ 2016 చాప్టర్ 6, రూల్ 30 కింద ఈ నోటీసులను యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్, విచారణాధికారి అమిత బింద్రూ ఈనెల 3వ తేదీన జారీ చేశారు.
‘‘మీరు భారతీయ పౌరుడు కాదని, తప్పుడు పత్రాలను సమర్పించి మీరు ఆధార్ పొందారని మా కార్యాలయానికి ఫిర్యాదు/ఆరోపణలు అందాయి. వీటిని పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం ఒక విచారణకు ఆదేశించింది’’ అని ఈ నోటీసులో పేర్కొన్నారు.
ఈనెల 20వ తేదీన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ రాయల్ కాలనీలోని మెగా గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు విచారణాధికారి ఎదుట హాజరు కావాలని సత్తార్ ఖాన్‌కు సూచించారు.
విచారణకు వచ్చేప్పుడు పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాలని, ఒకవేళ భారత జాతీయుడు కాకపోతే భారతదేశంలోకి చట్టబద్ధంగానే అడుగుపెట్టినట్లు నిరూపించుకునే డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించారు.
ఒకవేళ ఈ విచారణకు హాజరు కాకపోయినా, పౌరసత్వం నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా.. పైన పేర్కొన్న ఫిర్యాదు/ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవని భావించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ మజ్లిస్ మచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ.. తాను స్వయంగా సత్తార్ ఖాన్ డాక్యుమెంట్లు అన్నింటినీ పరిశీలించానని, అవన్నీ సరైనవేనని, సత్తార్ ఖాన్ కుటుంబం హైదరాబాదీలేనని చెప్పారు.
అసలు ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని ఒకపక్క చెబుతూనే మరోపక్క ఆధార్ కార్డు తీసుకున్నందుకు పౌరసత్వం నిరూపించుకోవాలని అడగటం ఏమిటని సత్తార్ ఖాన్ తరపు న్యాయవాది ముజఫర్ ఉల్లా ఖాన్ ప్రశ్నించారు. ఇలాంటి నోటీసులు చాలామందికి వచ్చాయని, వారి సంఖ్య ఎంత అనేది 20వ తేదీన తేలుతుందని చెప్పారు.
ఈ వ్యవహారంలో అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

సీఏఏ వివాదం వల్లే ఈ ఆందోళన: ఆర్ఎస్ రాజగోపాల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అడిషనల్ ఇంచార్జ్)
ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు నెలకొని ఉన్న తరుణంలో ఈ నోటీసులు రావడం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అడిషనల్ ఇంచార్జ్) ఆర్ఎస్ రాజగోపాల్ బీబీసీ తెలుగు ప్రతినిధి దీప్తి బత్తినికి వివరించారు.
"తెలంగాణ పోలీసుల నివేదిక ప్రకారం 127మందికి నోటీసులు జారీ చేశాం. ఇందులో 35 నోటీసులు సంబంధితులకు చేరాయి. 52 నోటీసులకు సంబంధించి చిరునామాలు దొరకలేదు. ఇంతకు ముందు చెప్పినట్లు, 20వ తేదీ ఉదయం విచారణ జరగడం లేదు. ఎప్పుడు నిర్వహించేదీ మళ్లీ వెల్లడిస్తాం.
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి అనే పదం నోటీసుల్లో ఉపయోగించడాన్ని మేం పరిశీలిస్తాం. ఆధార్ పరిధిలో లేనిదాని గురించి మేం ప్రస్తావిస్తే, దాన్ని సరిచేస్తాం. ఇలాంటి నోటీసులు గతంలో కూడా జారీ చేశాం. కానీ ఎప్పుడూ సమస్యలు రాలేదు. ప్రస్తుతం సీఏఏపై ఆందోళనలు నెలకొనడం వల్లే ఇలా జరిగింది. గతంలో చెప్పినట్లుగా, పౌరసత్వాన్ని రద్దు చేసే హక్కు యూఐడీఏఐకి లేదు" అని రాజగోపాల్ వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇది మేం నిరంతరం చేపట్టే చర్యల్లో భాగమే: యూఐడీఏఐ
ఈ నోటీసుల వ్యవహారంపై యూఐడీఏఐ స్పందించింది.
"యూఐడీఏఐ కొందరు వ్యక్తులకు అక్రమంగా నివాసం ఉంటున్న శరణార్థులటూ పోలీసుల ద్వారా నోటీసులు జారీచేసిందని వచ్చిన కథనాలు మా దృష్టికి వచ్చాయి. అయితే వీటిని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆధార్‌కు, పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
ఆధార్ కార్డు పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రం కాదు. ఆధార్ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు ఏ వ్యక్తి అయినా భారత్‌లో 182 రోజులు నివాసం ఉండాలని ఆధార్ చట్టం చెబుతోంది. అయితే, అక్రమంగా నివాసం ఉంటున్నవారికి ఆధార్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న 127మంది తప్పుడు పత్రాలతో ఆధార్ పొందారని, ప్రాథమిక విచారణలో వారు అక్రమంగా నివసిస్తున్న శరణార్థులని చెబుతూ పోలీసులు నోటీసులు జారీచేశారు. వారికి ఆధార్ పొందేందుకు అర్హత లేదు. ఆధార్ చట్టం ప్రకారం, వారి ఆధార్ కార్డును రద్దు చేయాలి. అందువల్లే, వారిపై వచ్చిన ఆరోపణలకు వ్యక్తిగతంగా హాజరై బదులివ్వాలని నోటీసులు జారీచేశారు.

ఫొటో సోర్స్, UIDAI/Twitter
వారి వివరణలు విన్న తర్వాత, వాటిని పరిశీలించి.. ఎవరైనా తప్పుడు పత్రాలతో ఆధార్ పొందారని నిర్థరణైతే, ఆ అతిక్రమణ స్థాయిని బట్టి వారి ఆధార్ రద్దు లేదా సస్పెండ్ చేయడంపై నిర్ణయం తీసుకుంటాం.
ఇది మా సేవల నాణ్యతను పెంచుకునే ప్రక్రియల్లో భాగంగా నిరంతరం చేపట్టే సాధారణ చర్య. అయితే, నోటీసులు అందుకున్న 127 మంది ఏ పత్రాలను ఆధారాలుగా సమర్పించారో సేకరించడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి, వ్యక్తిగత విచారణను మే నెలకు వాయిదా వేస్తున్నాం."

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..
- హైదరాబాద్: బాలాపూర్‌లో ఉన్న రోహింజ్యాలు బర్మాకు వెళ్లాల్సిందేనా?
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- గ్రౌండ్ రిపోర్ట్: మియన్మార్‌లో హిందువులను హతమార్చిందెవరు?
- టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు
- ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది
- ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- ఐఫోన్లకు కరోనా వైరస్ దెబ్బ.. ఉత్పత్తి, అమ్మకాలు, ఆదాయంపై ప్రభావం పడిందన్న ఆపిల్
- పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్ సంస్థకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









