భారతీయ ప్రాచీన చిత్రకారుల అద్భుత కృషి 'కంపెనీ పెయింటింగ్స్' పేరుతో ఎందుకు మరుగున పడింది?

అక్బర్ 2, బహుదూర్ షా 2ల ఆస్థాన చిత్రకారుడు గులామ్ అలీ ఖాన్ వేసి చిత్రం

ఫొటో సోర్స్, Free Gallery of Art and Arthur M. Sachler Gallery

ఫొటో క్యాప్షన్, అక్బర్ 2, బహుదూర్ షా 2ల ఆస్థాన చిత్రకారుడు గులామ్ అలీ ఖాన్ వేసి చిత్రం
    • రచయిత, రాహుల్ వర్మ
    • హోదా, బీబీసీ కోసం

లండన్‌లోని వాలస్ కలెక్షన్‌లో 'ఫర్గాటెన్ మాస్టర్స్-ఇండియన్ పెయింటింగ్స్ ఫర్ ది ఈస్టిండియన్ కంపెనీ' పేరిట భారత్‌లో బ్రిటిష్ పాలన నాటి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. పద్దెనిమిదో శతాబ్దం చివర్లో, 19వ శతాబ్దం తొలినాళ్లలో ఈస్ట్ ఇండియా కంపెనీ వేయించిన చిత్రాలివి. వీటిని 'కంపెనీ పెయింటింగ్'లు, 'కంపెనీ స్కూల్' అంటారు.

ప్రధానంగా ఇక్కడ గతంలో ఆదరణకు నోచుకోని చిత్రకారులు వేసిన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. ''గొప్ప సామర్థ్యాలున్న ముఖ్యమైన చిత్రకారులు'’గా వీరిని గుర్తించాలని ప్రదర్శన క్యురేటర్, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు.

అడ్డగీత
News image
అడ్డగీత

వలస పాలన నాటి కళా తృష్ణను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలో చిత్రాలున్నాయి. భారతదేశ జంతు, వృక్షజాలాన్ని, ప్రజలను, భవనాలను చిత్రకారులు తమ కళాఖండాల్లో చిత్రీకరించారు. ఐరోపాకు చెందిన వృక్ష, జంతు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆర్కిటెక్టులు అధ్యయనం చేయడానికి ఇవి వీలు కలిగించాయి.

ఆ కాలం నాటి వేల చిత్రాలు ప్రస్తుతం క్యూ, ఎడిన్‌బరోల్లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లో కొలువై ఉన్నాయి.

గంధపు చెట్టు కొమ్మపై పాలపిట్ట

ఫొటో సోర్స్, Gift of Elizabeth and willar clark

ఫొటో క్యాప్షన్, గంధపు చెట్టు కొమ్మపై పాలపిట్ట - షేక్ జైనుద్దీన్ చిత్రం

వీటిలో కొన్ని 200 ఏళ్ల కిందటివి అయినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఫ్రెంచ్ పాలనలో పనిచేసిన క్లాడ్ మార్టిన్ వంటి అధికారులు దిగుమతి చేసుకున్న అత్యుత్తమమైన కాగితంపై ఈ చిత్రాలు వేశారు. గంధపు చెట్టు చిటారుకొమ్మన పాలపిట్ట కూర్చున్న చిత్రం వంటి కట్టిపడేసే చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. దీన్ని 1779లో షేక్ జైనుద్దీన్ వేశారు. ఇందులో యూరోపియన్ శైలితో పాటు మొఘల్ కాలం నాటి చిత్రకళా రీతులూ కనిపిస్తాయి.

ఇలాంటి అత్యద్భుత చిత్రకళా కౌశలం నిరాదరణకు గురైనట్లుగా అనిపిస్తుంది.

''ఈ చిత్రకారులు అటు బ్రిటన్, ఇటు భారత్ రెండిటికీ నచ్చలేదు. భారత్ వైపు నుంచి చూస్తే వారు తమ దేశానికి చెందిన చిత్రాలు వేసినప్పటికీ వారు వలసవాదం చిమ్మిన దుర్గంధమే.. బ్రిటన్‌ వారిని ఐరోపావ్యాప్తంగా ఇబ్బందికరంగా భావించింది. భారత్‌లో బ్రిటన్ పాలన పతనం తరువాత ఈ చిత్రరాజాలను అటకెక్కించేశారు.

''మైఖెలాంజెలో, రఫేల్ వేసిన సిస్టిన్ చాపెల్‌ను పాపల్ ఆర్ట్‌గా భావించరు. కానీ, ఈ ప్రదర్శనలో చిత్రాలను భారతీయులు వేయడం, వారి పేర్లు కూడా చాలామందికి తెలియకపోవడంతో వారి అద్భుత చిత్రాలన్నీ మరుగునపడ్డాయి. అంతేకాదు, కంపెనీ స్కూల్ ఆర్ట్‌గానే వాటికి గుర్తింపు మిగిలిపోయింది. ఈ గొప్ప చిత్రాలు వేసిన గులామ్ అలీ ఖాన్, షేక్ జైనుద్దీన్, వెల్లూరుకు చెందిన యెల్లప్ప పేర్లు ప్రజలకు తెలియకపోవడం విషాదం'' అని విలియం డాల్రింపుల్ అన్నారు.

మలబార్ ఉడుత

ఫొటో సోర్స్, Private collection

ఫొటో క్యాప్షన్, జైనుద్దీన్ వేసిన మలబార్ ఉడుత చిత్రం

ఎడిన్‌బరో యూనివర్సిటీలో భారతీయ, దక్షిణాసియా చిత్రకళ బోధించే డాక్టర్ యుతికా శర్మ ఈ ప్రదర్శన క్యాటలాగ్‌లో 'ది లేట్ మొఘల్ మాస్టర్ ఆర్టిస్ట్స్ ఆఫ్ దిల్లీ అండ్ ఆగ్రా' అనే చాప్టర్ రాశారు. 'కంపెనీ పెయింటింగ్' అనే ముద్ర వల్ల భారతీయ చిత్రకారులకు తగిన పేరు రాలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

''ఈస్టిండియా కంపెనీ అధికారుల కోసం భారతీయులు వేసిన చిత్రాలను 'కంపెనీ పెయింటింగ్' అనేవారు. ఇది యజమాని, చిత్రకారుడి మధ్య బంధాన్ని సూచిస్తుంద''ని యుతికా శర్మ 'బీబీసీ కల్చర్'తో అన్నారు.

''చిత్రకారులను ప్రతిఘటన, మార్పులకు ప్రతినిధులుగా గుర్తించాలని వాదిస్తూ ఈ అభిప్రాయం ఇప్పుడు స్కాలర్‌షిప్‌లో సవరించారు. చిత్రాలపై వలసపాలన ప్రభావాన్ని తొలగించడం, భారతీయ చిత్రకళా చరిత్రను వెలుగులోకి తేవడం రెండూ ప్రస్తుతం సవాళ్లే'' అన్నారామె.

యల్లప్ప స్వీయచిత్రం

ఫొటో సోర్స్, Victoria and Albert museum, LOndon

ఫొటో క్యాప్షన్, యల్లప్ప స్వీయచిత్రం

వెల్లూరుకు చెందిన యెల్లప్ప తన పనిని తుడిచిపెట్టడాన్ని ఇష్టపడినట్లుగా కనిపించరు. 'యెల్లప్ప ఆఫ్ వెల్లూరు'(1832-1835) అనే మంత్రముగ్థ స్వీయచిత్రంలో ఆయన వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఆ చిత్రంలో చిన్నచిన్న వివరాలు కూడా అత్యంత స్పష్టంగా ఉంటాయి. ఆయన చేతుల నీడ కానివ్వండి.. మీసాల వెంట్రుకలు కానివ్వండి కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అంత వివరంగా ఉంటుందా చిత్రం.

అన్నిటికీ మించి స్వీయచిత్రం ఆయన కళకు, వ్యక్తిత్వానికి, ఏజెన్సీకి గౌరవం, భరోసా ఇవ్వడమే కాకుండా తనకు జీతమిచ్చేవారిపై ధిక్కారమూ అందులో కనిపిస్తుంది. 1806లో వెల్లూరులో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారత సిపాయిలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.

నిజానికి ప్రజల చిత్రాలు ప్రత్యేకంగా అనేక అంశాలను వెల్లడిస్తాయి. ఎగ్జిబిషన్ ప్రారంభంలో, యార్క్ షైర్ అకౌంటెంట్ జాన్ వాంబ్వెల్ చిత్రం ఉంటుంది. జాన్ వాంబ్వెల్ స్మోకింగ్ ఏ హుక్కా(1790) అనే ఆ చిత్రంలో స్థానిక శైలి, సంప్రదాయాలను స్వీకరించిన ఆయన ఉత్తరభారతంలోని లఖ్‌నవూలో ఒక రగ్గుపై కూర్చుని మొఘల్ ఫైనరీ ధరించి హుక్కా తాగుతుండడాన్ని చూడొచ్చు.

కాలా

ఫొటో సోర్స్, Private collection

ఫొటో క్యాప్షన్, అలీ ఖాన్ వేసిన కాలా చిత్రం

డాల్రింపుల్ చెప్పినట్లుగా కంపెనీ పెయింటింగ్ శకం ఆరంభంలో(1770-1840 మధ్య) భారతదేశంలోని మొఘల్ పాలకులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల మధ్య సాంస్కృతిక మార్పిడి ఉంది. 'ఆ దశలో కంపెనీ బలపడుతోంది. కానీ, అప్పటికి వారి పాలనలో లేం. దిల్లీలో మొఘల్ చక్రవర్తే ఉన్నాడు. అలా అని పూర్తిగా మొఘల్ పాలనా కాదు బ్రిటిష్ పాలనా కాదు అన్నట్లుగా ఉన్న సంధి యుగమది. భారత్‌లోని బ్రిటిష్ పురుషుల్లో మూడో వంతు మంది ఇక్కడి తమ ఆస్తులను భారతీయ భార్యలకు కానీ తమ ఆంగ్లో ఇండియన్ సంతానానికి కానీ విడిచిపెట్టి వెళ్లినట్లు కంపెనీ అధికారుల వీలునామాలు చెబుతున్నాయ'ని డారింపిల్ అంటున్నారు.

''షేక్ జైనుద్దీన్ సహజ చరిత్ర చిత్రాలను చూశాక ఇంగ్లిష్ చిత్రకారుడు జార్జ్ స్టబ్స్‌ వేసినవి తేలిపోతాయి. పాట్నాలో జన్మించిన జైనుద్దీన్‌ను కలకత్తాలోని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే, లేడీ ఇంపేలు ప్రశంసించారు. ది ఇంపే చిల్డ్రన్ ఇన్ దెయిర్ నర్సరీ (1780) అనే చిత్రంలో ఇంపే ముగ్గురు పిల్లల దినచర్యను చిత్రించారు. ఇంపే బిడ్డకు ఆయా తన పాలిస్తుండడం ఇందులో ఉంటుంద''ని చెప్పారు డారింపిల్.

''భారత్‌లోని భిన్నత్వంతో పాటు కంపెనీని అనుమతించడం వల్ల ఏనాడూ 2000 మందికి మించి బ్రిటిష్ వారు లేని ఈస్టిండియా కంపెనీ ఇక్కడ విజయవంతమైంది. విస్తారమైన, సంపన్నమైన ఈ దేశాన్ని, అధునాత సంస్కృతిని జయించడానికి వారికి వీలు కలిగింది. బ్రిటిష్ అధికారి పిల్లలకు భారతీయ ఆయా పాలివ్వడమనేది కంపెనీ భారత్‌ను దోచుకుంటోందనడానికి సంకేతంగా చిత్రించినట్లుగా ఉంద''ని ఆయన అన్నారు.

కాలా

ఫొటో సోర్స్, david collection, copenhagen

ఫొటో క్యాప్షన్, స్కిన్నర్స్ హార్స్ యూనిఫాంలో కాలా(అలీఖాన్ చిత్రం)

ప్రదర్శన ప్రారంభంలోనే మొఘల్ దుస్తులలో ఉన్న యార్క్‌షైర్ వ్యక్తి చిత్రం ఉంది. అక్కడే చివర్లో కత్తి, తుపాకీ పట్టుకుని కరకుగా కనిపిస్తున్న భారతీయుడు కాలా.. యూరోపియన్ సైనిక దుస్తుల్లో ఉన్న కాలా(కాలా ఇన్ యూనిఫాం ఆఫ్ స్కిన్నర్స్ హార్స్ (1815-1816)) ఉన్నాయి. తన యజమాని, కంపెనీ అధికారి విలియం ఫ్రేజర్‌‌కు సన్నిహితుడైన కాలా నెపోలియన్ తరహా జాకెట్, జోధ్‌పూర్ బూట్లు, ఫ్రేజర్ కుటుంబ చిహ్నంగా సాష్‌లో కనిపిస్తాడు. అయినా కూడా ఆయన తన టోపీపై అర్ధ చంద్రాకారం బొమ్మ పెట్టుకోవడం భారతీయ సంస్కృతిని సూచిస్తుంది. శివుడి తలపై చంద్రుడిలా ఇది కనిపిస్తుంది.

కంపెనీ చిత్రాలను ప్రదర్శించడం, పునఃమూల్యాంకనం చేయడం ఎందుకన్న దానికి కాలా చిత్రం సరైన ఉదాహరణని యుతికా శర్మ చెబుతున్నారు. "బ్రిటిష్ అధికార క్రమంలో చిన్న ఉద్యోగైన కాలా తన చిత్రం ద్వారా ఎంతో మాట్లాడారు. కాలా వంటి పురుషులు కంపెనీ అధికారులకు మద్దతు ఇచ్చేందుకు చేపట్టే భారీ క్రమరహిత నియామకాలలో భాగం. వీరి పాత్ర లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం, కంపెనీ యాత్రలు, రోజువారీ కార్యక్రమాల అమలు అంత సులభం కాదు.

సీతారాం వేసిన 'ది గ్రేట్ గన్ ఆఫ్ ఆగ్రా బినీత్ ది షా బుర్జ్'

ఫొటో సోర్స్, British library

ఫొటో క్యాప్షన్, సీతారాం వేసిన 'ది గ్రేట్ గన్ ఆఫ్ ఆగ్రా బినీత్ ది షా బుర్జ్'

ఫర్గాటెన్ మాస్టర్స్ కూడా ఇలాంటి కథే.. జీవనభృతి కోసం కష్టాలు పడుతున్న చిత్రకారుల కథలవి. కనికరం లేని కంపెనీ వల్ల మొఘల్ పాలకులు ఉక్కిరిబిక్కిరి కావడంతో వారి వద్ద ఉన్న చిత్రకారులు బ్రిటిష్ యజమానుల వైపు మళ్లి వారి ఐరోపా ఆసక్తులకు అనుగుణంగా చిత్రాలు గీశారు. ఈ చిత్రకళా ప్రదర్శనలోని చివరి విభాగంలో యూరోపియన్ శైలిలో భారతీయ చిత్రకారులు వేసిన చిత్రాలు కనిపిస్తాయి.

'ది గ్రేట్ గన్ ఆఫ్ ఆగ్రా బినీత్ ది షా బుర్జ్' పేరిట 1815లో సీతారామ్ వేసిన చిత్రం జాన్ కానిస్టేబుల్ బుకాలిక్ రూరల్ ఇంగ్లిష్ వాటర్ కలర్స్ శైలిని తలపిస్తుంది.

''మొత్తానికి ఇది గొప్ప చిత్రకారుల అద్భుత కళ'' అని డాల్రింపుల్ ఈ ప్రదర్శన గురించి అన్నారు. ''దీని అంతిమ లక్ష్యం మరుగునపడిపోయిన కళాకారులకు గుర్తింపు ఇవ్వడం, గుర్తుంచుకోవడం'' అంటారు డారింపిల్. ''ఫర్గాటెన్ మాస్టర్స్ - ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియన్ పెయింటింగ్'' ప్రదర్శన 2020 ఏప్రిల్ 19 వరకు లండన్‌లోని వాలెస్ కలెక్షన్‌లో కొనసాగుతుంది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)