భార్యలను హత్య చేయగల భర్తలను ఇలా ముందే పసిగట్టవచ్చు... 8 దశల హత్యా క్రమాన్ని గుర్తించిన నేరశాస్త్ర నిపుణులు

ఫొటో సోర్స్, iStock
ప్రపంచవ్యాప్తంగా 2017లో దాదాపు 30,000 మంది మహిళలను వారి ప్రస్తుత లేదా మాజీ జీవిత భాగస్వాములు హత్యచేశారు.
భార్య కానీ, సహచరి కానీ.. తమ జీవిత భాగస్వాములను హత్య చేసే పురుషులు ''ఒక హత్యా క్రమాన్ని'' అనుసరిస్తారని నేరశాస్త్రం ప్రవీణులైన డాక్టర్ జేన్ మాంక్టన్ స్మిత్ చెప్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ గ్లోసెస్టర్‌షైర్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె బ్రిటన్‌లో 372 హత్యలను అధ్యయనం చేశారు. ఆ హత్యలన్నిటిలోనూ ఎనిమిది దశలుగా సాగిన ఒక హత్యా క్రమాన్ని గుర్తించారు.
ఎవరైనా ఒక పురుషుడు తన జీవిత భాగస్వామిని హత్య చేయగలడనటానికి.. భౌతికంగా నియంత్రించే అతడి ప్రవర్తన కీలక సూచిక కావచ్చునని డాక్టర్ జేన్ పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు.. ప్రాణాలను కాపాడటానికి దోహదపడగలవని ఒక హతురాలి తండ్రి అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ ఎనిమిది దశలను పసిగట్టగలిగితే చాలా హత్యలను నివారించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
జీవిత భాగస్వాముల చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో మహిళలు 80 శాతం పైగా ఉన్నారని.. అత్యధిక ఉదంతాల్లో హత్య చేసిన భాగస్వామి పురుషుడేనని డాక్టర్ జేన్ చెప్పారు.
ఈ అధ్యయనం కోసం.. హతురాలికి గతంలో కానీ, హత్య జరిగేనాటికి కానీ హంతకుడితో సంబంధాలు ఉన్న కేసులన్నిటినీ ఆమె నిశితంగా పరిశీలించారు. అలాగే పురుషులు.. తమ పురుష భాగస్వాముల చేతుల్లో హతమైన ఉదంతాలనూ పరిశీలించారు.

ఫొటో సోర్స్, Science Photo Library
హంతకులు అనుసరించినట్లు డాక్టర్ జేన్ గుర్తించిన ఎనిమిది దశలు ఇవీ...
- జీవిత భాగస్వామిగా మారటానికి ముందు హంతకుడు వెంబడించిన, వేధించిన చరిత్ర ఉంటుంది
- ఆకర్షణ చాలా వేగంగా సీరియస్ జీవిత భాగస్వామ్య బంధంగా మారుతుంది
- ఈ బంధంలో భౌతిక నియంత్రణ ప్రధానంగా ఉంటుంది
- హంతకుడి నియంత్రణను బలహీనపరిచే పరిణామం - ఉదాహరణకు ఆ బంధం ముగియటం లేదా హంతకుడు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం
- హంతకుడి నియంత్రణ ఎత్తుగడల తీవ్రత పెరగటం లేదంటే మరింత అధికమవటం - వెంబడించటం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం వంటివి
- హంతకుడి ఆలోచనలో మార్పు రావటం - ప్రతీకారం ద్వారా కానీ హత్య ద్వారా కానీ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం
- ప్రణాళిక రచన - హంతకుడు ఆయుధాలను కొనటం లేదా బాధితురాలిని ఒంటరిగా దొరికించుకునే అవకాశాల కోసం వెదకటం
- హత్య - హంతకుడు తన భాగస్వామిని హత్య చేస్తాడు, బాధితురాలి పిల్లలు తదితరులకు కూడా హాని చేయవచ్చు
ఈ ఎనిమిది దశల్లో హంతకుడు ఏదైనా ఒక దశ ఎక్కడైనా పాటించలేదంటే అది.. మొదటి దశ. అయితే.. హతులు - హంతకుల మధ్య పూర్వ సంబంధం లేకపోవటమే సాధారణంగా దీనికి కారణం.
''క్షణికావేశంలో అప్పటికప్పుడు హత్య చేశారనే మనం అనుకుంటూ వస్తున్నాం. కానీ అది నిజం కాదు'' అని డాక్టర్ జేన్ బీబీసీతో పేర్కొన్నారు.
''ఈ కేసులన్నిటినీ పరిశీలించటం మొదలుపెడితే.. వీటన్నిటిలో ప్రణాళికా రచన ఉంది.. ఒక సంకల్పం ఉంది.. బలవంతపు నియంత్రణ ఉంది'' అని చెప్పారు.
డాక్టర్ జేన్ పరిశోధనలో గుర్తించిన ఈ ఎనిమిద దశల హత్యా క్రమం గురించి పోలీసులకు తెలిసి ఉంటే.. పరిస్థితులు భిన్నంగా ఉండేవని అలైస్ రగల్స్ అనే యువతి తండ్రి క్లైవ్ రగల్స్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Family photo
ఇరవై నాలుగేళ్ల అలైస్‌ను 2016 అక్టోబర్‌లో ఆమె మాజీ బాయ్-ఫ్రెండ్ హత్యచేశాడు. అతడితో బంధాన్ని ఆమె తెంచుకున్న తర్వాత.. ఆమెను అతడు వెంబడించి హత్య చేశాడు.
''అతడు వెంటపడటం, బలవంతంగా నియంత్రించటం జరిగింది. ఈ హెచ్చరిక సంకేతాలు ముందే కనిపించాయి'' అని చెప్పారు క్లైవ్ రగల్స్.
''నిరంతరం మెసేజ్‌లు పంపటం, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయటం - ఇటువంటివన్నీ అతడు ఐదో దశలో ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నాయి. ఈ ఎనిమిది దశల హత్యా క్రమం గురించి అందరికీ తెలిస్తే.. దీని ఆధారంగా చర్యలు చేపడితే.. పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రాణాలను కాపాడవచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
డాక్టర్ జేన్ తను గుర్తించిన ఈ హత్యా క్రమం గురించి బ్రిటన్ వ్యాప్తంగా న్యాయవాదులు, సైకాలజిస్టులు, పోలీసు అధికారులకు బోధించారు.

ఫొటో సోర్స్, Jane Monckton Smith
ఆమె అధ్యయనాన్ని.. వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ జర్నల్‌లో కూడా ప్రచురించారు.
ఈ ఎనిమిది దశల గురించి తెలుసుకున్న తర్వాత.. పోలీసులు హత్య చేయగల వారిని గుర్తించే వీలు పెరిగిందని డాక్టర్ జేన్ చెప్పారు.
అలాగే.. బాధిత మహిళలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను మరింత స్పష్టంగా వివరించగలుగుతున్నారని పేర్కొన్నారు.
బాధితులు హింసాపూర్వక జీవిత బంధాల నుంచి క్షేమంగా బయటపడే మార్గాల విషయంలోనూ.. అసలు సన్నిహిత సంబంధాల్లో బలవంతపు నియంత్రణ కావాలని కోరుకోవటానికి కారణాలేమిటి అనే అంశంపైనా మరింత పరిశోధన జరగాలని డాక్టర్ జేన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
- ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది?
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- ‘ఆర్థికవ్యవస్థను మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది.. ఇది మానవ కల్పిత సంక్షోభం’
- భర్త వేధింపులకు సంప్రదాయ ‘కట్టె’డి
- వేధింపుల బాధితులు ‘వన్ స్టాప్’ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడెవరూ లేకపోతే ఎక్కడికెళ్లాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








