ఉత్తరప్రదేశ్: ఈ కొండల కింద టన్నుల కొద్దీ బంగారం...

ఫొటో సోర్స్, PRAKASH CHATURVEDI
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలో భూగర్భంలో వేల టన్నుల బంగారం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఖనిజ శాఖ దానిని నిర్థారించింది. ఆ శాఖ త్వరలో ఇక్కడ బంగారం నిక్షేపాలను బయటకు తీయడానికి తవ్వకాలు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) బృందం గత 15 ఏళ్లుగా దీనికోసం సోన్‌భధ్రలో పనిచేస్తోంది. 8 ఏళ్ల క్రితం భూమిలో బంగారం ఖనిజం ఉన్నట్టు వారు ధ్రువీకరించారు. ఇక్కడ బంగారం తవ్వకాలే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ గుట్టను అమ్మడానికి ఈ-వేలం ప్రక్రియ ప్రారంభించింది.
"జీఎస్ఐ టీమ్ చాలాకాలం నుంచి ఇదే పనిలో ఉంది. ఇప్పుడు వేలం కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే క్రమంలో జియో ట్యాగింగ్ కూడా ప్రారంభించారు. త్వరలో వేలం ప్రక్రియ కూడా మొదలుకానుంది. ఈ జిల్లాలో యురేనియం నిల్వలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. దీని అన్వేషణ కోసం కేంద్రం కొన్ని బృందాలను నియమించింది. వారు త్వరలో ఆ పనిలో విజయవంతం అవుతారు" అని సోన్‌భద్ర తవ్వకాల అధికారి కేకే రాయ్ చెప్పారు.
"జియో ట్యాగింగ్ కోసం నియమించిన ఏడుగురు సభ్యుల టీమ్, వీటిని వేలం వేసే ముందే ఖనిజాలు గుర్తించిన స్థలాలపై తమ రిపోర్టును ఫిబ్రవరి 22 నాటికి తవ్వకాల డైరెక్టర్‌కు అందిస్తుంది.

ఫొటో సోర్స్, GYAN PRAKASH CHATURVEDI
ఆ తర్వాత ఆన్‌లైన్ టెండర్లు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. టెండర్‌కు పచ్చజెండా ఊపిన తర్వాత తవ్వకాలకు అనుమతులు లభిస్తాయని ఆయన చెప్పారు.
జీఎస్ఐ వివరాల ప్రకారం సోన్‌భద్రలోని సోన్ కొండపై సుమారు మూడు వేల టన్నుల బంగారం, హరదీ బ్లాక్‌లో సుమారు 600 కిలోల బంగారం నిక్షేపాలు ఉన్నాయి. దీనితోపాటు పుల్వార్, సలయ్యాహీడ్ బ్లాక్‌లో కూడా ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముడి ఖనిజం నుంచి ఎంత బంగారం లభిస్తుంది అనేది దాని క్వాలిటీని బట్టి ఉంటుంది. నిపుణులు మాత్రం ఖనిజం నాణ్యమైనది అయితే, దాని నుంచి లభించే బంగారం ఆ ఖనిజంలో దాదాపు సగం ఉంటుందని చెబుతున్నారు.
ఇక్కడ భూమిలో 90 టన్నుల అండలూసైట్, 9 టన్నుల పొటాష్, పది లక్షల టన్నుల సిలెమినాయిడ్ నిల్వలను కూడా జీఎస్ఐ అన్వేషించింది. ఈ ఖనిజాల తవ్వకాలకు త్వరలో మార్గం సుగమం కానుంది. భూగర్భ-ఖనిజ శాఖ ఈ-వేలం ప్రక్రియ చర్యలు ప్రారంభించింది. త్వరలో బంగారం బ్లాకులను వేలానికి పెట్టనుంది.
2005లో సోన్‌భద్రలో సర్వే చేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇక్కడ బంగారం ఉందని చెప్పింది. దాన్ని ధ్రువీకరించేసరికి 2012 వచ్చింది. అయితే, దాన్ని వెలికితీసే దిశగా ఇప్పటివరకూ గట్టిగా ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోయారు. కానీ, ఇప్పుడు బ్లాకుల వేలం కోసం అధికారులు ఏడుగురు సభ్యుల టీమ్ ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆ ప్రాంతం మొత్తాన్నీ జియో ట్యాగింగ్ చేసి 2020 ఫిబ్రవరి 22 నాటికి తమ రిపోర్టును లక్నోలోని భూగర్భ తవ్వకాల డైరెక్టరేట్‌కు అప్పగిస్తుంది.

ఫొటో సోర్స్, PRAKASH CHATURVEDI
ఖనిజాలు భారీ స్థాయిలో లభించే అవకాశం ఉండడంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వే చేస్తున్నారు. వాటికోసం ఎలక్ట్రోమాగ్నెట్, స్పెక్ట్రోమీటర్ లాంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటిని హెలికాప్టర్ కింద వేలాడదీసి, భూ ఉపరితలానికి దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఎగురుతూ సర్వే చేస్తున్నారు.
సోన్‌భద్ర్ కలెక్టర్ ఎన్.రాజలింగం "బంగారం లభించే ఈ కొండ ప్రాంతం దాదాపు 108 హెక్టార్లలో ఉంది. సోన్ కొండల్లో అమూల్యమైన ఖనిజ సంపద ఉండడం వల్ల గత 15 రోజులుగా ఆ ప్రాంతంలో హెలికాప్టర్ సర్వే చేస్తున్నారు. సోన్‌భధ్ర డీఎం వివరాల ప్రకారం సోన్‌భద్రతోపాటు మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా, యూపీలోని బలరాంపూర్, జార్ఖండ్‌లోని గడ్వాజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రం హెలికాప్టర్ ద్వారా సర్వే చేయిస్తోంది" అన్నారు.
స్థానిక జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాశ్ చతుర్వేది ఈ ప్రాంతం గురించి చెబుతూ "సోన్‌భద్ర దుద్ధీ తాలూకాలో ఉన్న సోన్ కొండలకు శతాబ్దాల పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ ఒకప్పుడు రాజా బరియార్ షా కోట ఉండేది. కోటకు రెండు వైపులా శివ కొండ, సోన్ కొండలు ఉండేవి. రాజు కోట నుంచి రెండు కొండల వరకూ కింద అపారమైన బంగారం, వెండి, విలువైన ఖజానా దాగివుందని నమ్ముతారు. దాదాపు పదేళ్ల క్రితం ఒక రైతు ఇదే ప్రాంతంలో దున్నుతుంటే, అమూల్యమైన లోహాలు లభించాయి. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్ల కంటే దిగువన
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?
- హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు
- తరుగు పేరుతో నిలువు దోపిడీ.. ధాన్యం విక్రయాల్లో రైతులకు రూ. 64 కోట్లు టోపీ
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు: Ground Report
- ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా?
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









