హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు

హర్మన్ ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, facebook/Harmanpreet Kaur

    • రచయిత, వందన
    • హోదా, బీబీసీ టీవీ ఎడిటర్

అది 2009. మహిళా ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. టీమ్‌లోకి కొత్తగా వచ్చిన యువ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ 8 లేదా 9వ స్థానంలో ఆడాలి.

కానీ కెప్టెన్ అంజుమ్ చోప్రా హఠాత్తుగా ఆమెను ముందే పంపించాలని నిర్ణయించింది.

ఆ మ్యాచ్‌లో హర్మన్ 8 బంతుల్లో 19 పరుగులు చేసింది. అందులో ఒక సిక్సర్ కూడా ఉంది. ఆమె కొట్టిన సిక్సర్ ఎంత బలంగా ఉందంటే, ఒక కొత్త ప్లేయర్ అలాంటి షాట్ ఎలా కొట్టగలరా అని సందేహం వచ్చి, మ్యాచ్ తర్వాత హర్మన్‌కు డోప్ టెస్ట్ చేయాలన్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

ఆ రోజు వారిని ఆశ్చర్యపరిచిన, అదే హర్మన్‌ప్రీత్ ఇప్పుడు టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ మహిళా జట్టుకు కెప్టెన్‌గా ఉంది. మైదానంలో బాదే ఫోర్లు, సిక్సర్లు ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయి.

మహిళా వరల్డ్ కప్ తొలి మ్యాచ్

ఫొటో సోర్స్, Twitter/Harmanpreet Kaur

మహిళా ప్రపంచ కప్ గెలవాలనే కల

భారత్ మహిళా టీ-20 వరల్డ్ కప్ గెలవాలనేది హర్మన్ కల. ఈ టోర్నీ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం అవుతోంది. మొదటి మ్యాచ్‌లో భారత్ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాను ఎదుర్కొంటోంది.

హర్మన్ ప్రీత్ టీ-20ల్లో వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ కూడా.

1989 మార్చి 8న పంజాబ్‌లోని మోగాలో పుట్టిన హర్మన్‌కు చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఇష్టం. హర్మన్ తండ్రి హర్మిందర్ సింగ్ భుల్లర్ క్రికెట్ ఆడేవారు. ఆమె తన తండ్రి ఫోర్లు, సిక్సర్లు కొట్టడం చూస్తూ పెరిగింది. ఆమెలో బౌండరీలు బాదాలనే కోరిక అప్పుడే మొదలైంది.

మోగాలో అమ్మాయిలు మైదానంలో ఆడడం తక్కువగా కనిపించేది. దాంతో ఆమె అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించింది.

హర్మన్ అబ్బాయిలతో కలికి క్రికెట్ ఆడడం, భారీ షాట్లతో బౌలర్లను ఉతికారేయడం చూసిన దగ్గరలోని ఒక స్కూల్ కోచ్ కమల్‌దీప్ సింగ్ సోధీ, ఆమెను తమ స్కూల్లో చేర్చారు. అక్కడి నుంచి కోచింగ్‌తోపాటు ఆమె కొత్త క్రికెట్ జీవితం కూడా ప్రారంభమైంది.

హర్మన్ ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, facebook/Harmanpreet Kaur

రాత్రికి రాత్రే స్టార్

"చిన్న పట్టణాల్లో అమ్మాయిలు క్రికెట్ ఆడితే, బంధువుల నుంచి నానా మాటలూ వినాల్సి వస్తుంది. కానీ హర్మన్‌ప్రీత్ సాధించిన విజయాలు అందరి నోరూ మూయించాయి" అని బీబీసీకి ఏడాది క్రితం ఇంటర్వ్యూ ఇచ్చిన హర్మన్ తండ్రి చెప్పారు.

పంజాబ్, రైల్వే క్రికెట్ జట్టు తరఫున ఆడిన తర్వాత హర్మన్ 2009లో 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది.

ఇప్పుడంటే, తన మెరుపు బ్యాటింగ్ వల్ల హర్మన్ గురించి అందరికీ తెలుసు, కానీ అప్పట్లో బక్కగా సన్నగా ఉన్న ఆమెకు మొదట మీడియం పేస్ బౌలర్‌గా జట్టులో చోటు లభించింది.

ముంబై వెస్ట్రన్ రైల్వేలో పనిచేస్తూ హర్మన్ తన బ్యాటింగ్, ఫిట్‌నెస్ కోసం చాలా కష్టపడింది. టీమ్‌లో తన స్థానాన్ని ఎలాగైనా సుస్థిరం చేసుకోవాలంటే, ఏదైనా స్పెషాలిటీ చూపించాల్సిందే అని బలంగా అనుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆ శ్రమతో త్వరలోనే ఆమె తన ఫేవరెట్ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌లా జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా మారింది. దాంతో, చూస్తూ చూస్తూనే 2016లో హర్మన్‌కు టీ-20 టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆమెలో ఒక ప్రత్యేక గుణం ఉంది. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమైనా, తన బ్యాటింగ్ అయినా హర్మన్ రిస్క్ తీసుకోడానికి ఏమాత్రం భయపడదు.

2017లో వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది.

ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ 115 బంతుల్లో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అందులో ఏడు సిక్సర్లు, 20 ఫోర్లు ఉన్నాయి. అందరూ ఆమెను కపిల్ దేవ్‌తో పోల్చడంతో హర్మన్ రాత్రికిరాత్రే స్టార్ క్రికెటర్ అయిపోయింది. ఆ ఇన్నింగ్స్ ఆడిన సమయంలో హర్మన్ గాయపడి ఉంది. వేలు, మణికట్టు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతోంది.

అంతే కాదు, హర్మన్ చాలా తక్కువ మంది మహిళా క్రికెటర్లకు మాత్రమే సాధ్యమైన ఒక ఘనతను అందుకుంది. ఎన్నో పెద్ద బ్రాండ్లు ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నాయి.

ఎప్పుడూ పురుష ఆటగాళ్లను మాత్రమే ఎంచుకునే సియెట్ సంస్థ 2018లో మొదటిసారి ఒక మహిళా క్రికెటర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంది.

హర్మన్ ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, facebook/Harmanpreet Kaur

సంచలనాలు - వివాదాలు

రికార్డులు సాధించడం హర్మన్‌కు ఒక అలవాటులా మారింది. 2018లో హర్మన్‌ను ఐసీసీ టీ-20 కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

భారత పురుష, మహిళా క్రికెటర్లలో ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ కోసం సైన్ చేసిన ఏకైక భారత ప్లేయర్ హర్మన్.

2017లో ఇంగ్లండ్‌ సూపర్ లీగ్‌కు ఎంపికైన తొలి భారత క్రికెటర్ కూడా ఈమే.

2018లో టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్‌పై హర్మన్ సెంచరీ చేసింది. టీ-20 మ్యాచ్‌లో ఒక భారత మహిళా క్రికెటర్ చేసిన మొదటి సెంచరీ ఇదే.

అయితే హర్మన్‌ను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. వాటిలో మిథాలీరాజ్‌తో విభేదాలు, నకిలీ డిగ్రీ ఆరోపణలతో ఆమెను పంజాబ్ పోలీస్ డీఎస్పీ పదవి నుంచి తొలగించడం లాంటివి ఉన్నాయి. కానీ హర్మన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.

ఇటీవల కొన్ని నెలలుగా టీ-20లో హర్మన్‌ప్రీత్ ఫాం గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

2018లో ఆమె ఓ టీ-20 మ్యాచ్‌లో 103 పరుగులు చేసింది. కానీ, ఆ తర్వాత హర్మన్ ప్రదర్శన పెద్దగా చెప్పుకోదగినట్లు లేదు.

గత నెల మాత్రం ఒక టీ-20 మ్యాచ్‌లో 42 పరుగులు చేసిన హర్మన్ ఇంగ్లండ్‌పై భారత్‌ను గెలిపించింది.

హర్మన్ ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, facebook/Harmanpreet Kaur

గాడ్జెట్స్ అంటే ఇష్టం

క్రికెట్ కాకుండా హర్మన్‌ప్రీత్‌కు కార్లు, మొబైల్స్, ప్లే స్టేషన్ అంటే చాలా ఇష్టం.

"ఆమెకు మొబైల్స్, ప్లే స్టేషన్స్ అంటే చాలా ఇష్టం. కొత్త మొబైల్ లాంచ్ అయితే చాలు, అది తన చేతుల్లో ఉండాలని హర్మన్ కోరుకుంటుంది. హర్మన్ ఎప్పుడు ఇంటికి వచ్చినా రాత్రి 2 గంటలవరకూ క్రికెట్ గురించే మాట్లాడుతుంది. చాలాసార్లు తన మాటలు వినీ వినీ మాకు బోరు కొడుతుంది" అని బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సోదరి హేమజీత్ చెప్పింది.

బౌలర్లకు నిద్రలేకుండా చేసే హర్మన్‌కు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె "నేను ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోగలను. గేమ్ బోరింగ్‌గా ఉంటే నాకు నిద్రపట్టేస్తుంది" అని చెప్పింది.

మార్చి 8న హర్మన్‌ప్రీత్ 31వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈసారి జట్టును ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చి భారత్‌కు ట్రోఫీ తీసుకురావాలని ఆమె కోరుకుంటోంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)