హైదరాబాదీ నగిషీ కళ: ఒబామా ప్రశంసలు అందుకున్న ఈ కళ అంతరించిపోతుందా?

హైదరాబాదీ కళ
    • రచయిత, రిపోర్ట్: సంగీతం ప్రభాకర్
    • హోదా, కెమెరా: నవీన్ కుమార్ కె

నిజాం పాలనలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ హైదరాబాదీ ఆర్ట్ అంతరించిపోతోంది.

"మేము ఈ కళను బతికించడానికి పెద్ద వాళ్లకు వారి చిత్రాలను నగిషీ చేసి ఇస్తున్నాము. ఈ కళను బతికించడానికి ఏమైనా సహకారం వస్తుందనే ఆశతోనే అలా చేస్తున్నాం. కానీ మేం కూడా ఎంత వరకు చేయగలం? మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమో"... నగిషీ చెక్కడం ఆపి, ఇదంతా చెప్పి మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యారు మొహమ్మద్ అబ్దుల్ వాసిఫ్. హైదరాబాద్ టపాచబుత్ర నివాసి అబ్దుల్ వాసిఫ్ ఈ కళపై పనిచేస్తున్న నాల్గో తరం కళాకారుడు.

వీడియో క్యాప్షన్, వీడియో: అంతరించిపోతున్న అరుదైన హైదరాబాదీ కళ

అద్భుతమైన చరిత్ర

లోహాలపై నగిషీలు చెక్కే ఈ కళకు ప్రత్యేక చరిత్ర ఉంది.

ఈ కళాకారుల మొదటి తరం మొహమ్మద్ అహ్మద్, అబ్దుల్ కరీమ్.. నిజాం ప్రభుత్వ కరెన్సీ డిజైన్, రాజముద్రలు, ఆయుధాలపై నగిషీలు రూపొందించేవారు.

అంతే కాకుండా అప్పటి ప్రముఖులకు వారి ముద్ర ఉండేలా రకరకాల డిజైన్లున్న షేర్వాణీ గుండీలను రూపొందించేవాళ్లు.

హైదరాబాదీ కళ

రెండో ప్రపంచ యుద్ధంపై రూపొందించిన కళాకృతితో వీరి మూడో తరం కళాకారుడు షబ్బీర్ అహ్మద్‌కి ప్రభుత్వం ఛీఫ్ డిజైనర్ ఉద్యోగం ఇచ్చింది.

మొదట్లో వీరు బంగారు, వెండి రేకులపై డిజైన్లు చెక్కేవారు. ఇప్పుడు జర్మన్ సిల్వర్ రేకుపై నల్లని పొడి పూత పూసి చెక్కుతున్నారు. ఒక్కో డిజైన్ చెక్కడానికి వీరికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది.

బరాక్ ఒబామా, మిషెల్లీ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎందరో ప్రముఖుల నుంచి వీరి ప్రతిభకు ప్రశంసలు అందుకున్నారు.

కాలం గడుస్తున్నకొద్దీ ఆదరణ తగ్గటంతో తమ ముందు తరం ఎవరూ ఈ కళను నేర్చుకోవడానికి సిద్ధంగా లేరని, తాము కూడా బతుకుదెరువు కోసం రేడియం స్టిక్కరింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ వంటి పనులు చేస్తున్నామని, గత వేసవికాలంలో కూలర్లు అమ్మామని చెప్పారు వాసిఫ్.

హైదరాబాదీ కళ
ఫొటో క్యాప్షన్, వాసిఫ్

"చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మా నాన్న ఈ కళను బతికించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డర్స్ రావట్లేదు. చాలా కష్టపడుతున్నారు. చాలా కాలం నుంచి చేసేదే... పెద్దవాళ్ల చిత్రాలను చెక్కి వారికి బహుమతిగా ఇవ్వడం తప్ప వేరే ఆర్డర్స్ రావట్లేదు. అందుకే నేను ఈ కళపై ఆధారపడకుండా ఇంజినీరింగ్ చేస్తున్నా" అని చెప్పారు వాసిఫ్ కుమారుడు అహ్మద్ మొహియుద్దీన్.

మోదీ, కేసీఆర్

ఈ కళ అంతరిచిపోతుంటే మీకెలా అనిపిస్తోంది? అని ప్రశ్నిస్తే... మూడో తరం కళాకారుడు, చీఫ్ డిజైనర్‌గా పదవీ విరమణ పొందిన షబ్బీర్ అహ్మద్ 1975లో తనకు ఆర్మీ వారు ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని చూపిస్తూ.. "బతకడానికి వేరే పని చేయాల్సి వస్తోంది. మేమేం ఏం చేయగలం? ప్రపంచంతో పాటు వెళ్లాలి కదా" అన్నారు.

హైదరాబాదీ కళ
ఫొటో క్యాప్షన్, 1975లో ఆర్మీ వారు ఇచ్చిన ప్రశంసాపత్రం

"మాకు ఒకవేళ మళ్లీ పనులు రావడం మొదలైతే మా తర్వాత తరంవారు వారంతట వారే ఈ కళను నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను బలంగా నమ్ముతున్నా" అని ఆశాభావం వ్యక్తం చేశారు వాసిఫ్.

హైదరాబాదీ కళ
ఫొటో క్యాప్షన్, ఖురాన్

ఖురాన్ చెక్కడమే లక్ష్యం

"ఖురాన్‌లో 30 అధ్యాయాలు ఉంటాయి. అందులో 2 అధ్యాయాలను నగిషీలుగా చెక్కాం. మొత్తం పూర్తి చేయడానికి మాకు నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. ఖురాన్‌ని చెక్కాలనేది మా నాన్న కోరిక. దాన్ని మేం ఎలాగైనా పూర్తిచేస్తాం. మా కళ ఉన్నా లేకపోయినా మేం చెక్కిన ఖురాన్ చరిత్రలో నిలిచిపోతుంది" అంటూ తాము చెక్కిన రెండు అధ్యాయాలను చూపించారు వాసిఫ్.

హైదరాబాదీ కళ

మా కళ బతుకుతుందనే ఆశ

"ఈ కళ ప్రసిద్ధి చెంది ప్రపంచమంతా తెలుసుకోవాలి. మోడరన్ ఆర్ట్, కాన్వాస్ ఆర్ట్‌కి లభించినంత ఆదరణ ఈ ప్రాచీన కళకి లభిస్తుందని నా నమ్మకం. ఒక వేళ ఆన్ లైన్, ఈ-కామర్స్ సంస్థల నుంచి సహకారం లభించి, తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే ప్రపంచానికి ఈ కళ తెలుస్తుంది. అంతేకాదు మన పురాతన కళ జీవించి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తుంది’’ అని అంటున్నారాయన.

వాసిఫ్ మాతో మాట్లాడినంత సేపు తమ కళ అంతరించిపోదని, ఎలాగైనా ముందుతరాలకు అందుతుందని, జీవించే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)