కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?.. భారీ అధ్యయన నివేదిక విడుదల చేసిన చైనా

ఫొటో సోర్స్, AFP
కోవిడ్-19 గా పిలుస్తున్న కరోనావైరస్ చైనాను అతలాకుతలం చేయడం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఆ దేశ వైద్య శాఖ అధికారులు ఓ భారీ అధ్యయన నివేదికను విడుదల చేశారు.
ఇప్పటి వరకూ నమోదైన 70000 కేసుల్లో 80శాతం మందిలో ప్రాథమిక దశ లక్షణాలున్నాయని, వీరిలో వృద్ధులు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని 'చైనీస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీసీడీసీ) వెల్లడించింది.


వైద్య సిబ్బంది కూడా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. మరణాల రేటు 2.3% ఈ నివేదిక తెలిపింది.
కరోనా వైరస్‌కు అత్యంత ప్రభావితమైన హుబేలో మరణాల రేటు 2.9% ఉండగా, ఇది మిగిలిన దేశం మొత్తం మీద 0.4% ఉంది.
మంగళవారం నాటి ప్రభుత్వ వివరాల ప్రకారం ఇప్పటివరకూ 1868 మంది మరణించగా, 72,436 మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
సోమవారం నాడు 98 మంది చనిపోగా, 1886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 93 మరణాలు, 1807 కేసులు హుబేలోనే నమోదయ్యాయి.
12000కు పైగా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఈ అధ్యయనం ఏం చెబుతోంది?
సీసీడీసీ సోమవారం వెల్లడించిన నివేదిక చైనీస్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో కూడా ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా చైనా వ్యాప్తంగా ఫిబ్రవరి 11 నాటికి నిర్థరించిన, అనుమానిత, గుర్తించిన, ఎలాంటి లక్షణాలు చూపించని... మొత్తం 72314 కోవిడ్-19 కేసులను పరిశీలించింది.
ఇప్పటి వరకూ భావిస్తున్న వైరస్ లక్షణాలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రక్రియలను ఈ అధ్యయనం నిర్థరించింది. చైనా వ్యాప్తంగా నమోదైన 44672 కేసులకు సంబంధించి మరింత వివరంగా విశ్లేషణ చేసింది.
వాటిలో కొన్ని పరిశీలనలు...
- 80.9% ఇన్ఫెక్షన్ కేసులు ప్రాథమికమైనవి, 13.8% తీవ్రమైనవి, కేవలం 4.7% మాత్రమే అత్యంత తీవ్రమైనవి.
- 80 ఏళ్లు దాటిన వృద్ధుల్లో మరణాల రేటు (14.8%) ఎక్కువగా ఉంది.
- 9 ఏళ్ల లోపు చిన్నారుల్లో ఎవరూ మరణించలేదు, 9 నుంచి 39 ఏళ్ల మధ్యలో మరణాల రేటు 0.2% ఉంది.
- ఆ పై వయసు వారిలో మరణాల రేటు క్రమంగా పెరుగుతోంది. 40ల్లో ఉన్నవారిలో ఇది 0.4% కాగా, 50ల్లో ఉన్న వారిలో ఇది 1.3%. ఇక 60ల్లో ఉన్నవారిలో 3.6%, 70ఏళ్లు పైబడినవారిలో మరణాలు రేటు 8% నమోదైంది.
- లింగ నిష్పత్తి ప్రకారం చూస్తే, పురుషుల్లో మరణాల రేటు (2.8%) స్త్రీలు (1.7%) కన్నా ఎక్కువగా ఉంది.
- అప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే వారికి కూడా కోవిడ్-19తో ప్రమాదం ఎక్కువే. కార్డియోవాస్కులర్ డిసీజ్‌తో బాధపడేవారిలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ, ఆ తర్వాత డయాబెటిక్ రోగులు, దీర్ఘకాల శ్వాస సమస్యలున్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిపై కరోనా వైరస్ వేగంగా ప్రభావం చూపుతుంది.
ఇక వైద్య సిబ్బందికి ఉన్న ముప్పు గురించి కూడా ఈ నివేదిక ప్రస్తావించింది.
ఫిబ్రవరి 11 నాటికి మొత్తం 3019 మంది వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్‌కు గురవ్వగా, వీరిలో 1716 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇందులో ఐదుగురు మరణించారు.
కోరోనావైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించి, నిర్థరించడం ఎలా అనే వివరాలను ఫిబ్రవరి 13న చైనా సవివరంగా వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్ ఎలా ఉంటుంది?
జనవరి 23-26 మధ్యలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 వరకూ అది తగ్గుతూ వస్తోంది.
కొన్ని నగరాలను పూర్తిగా మూసి ఉంచడం, ముఖ్యమైన సమాచారాన్ని వేర్వేరు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం (ఉదాహరణకు.. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, తగిన జాగ్రత్తలు వహించడం), రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను తరలించడం వంటి చర్యలు ఈ తగ్గుదలకు దోహదం చేశాయి.
చాలామంది ప్రజలు తమ విహారయాత్రలను ముగించుకుని తిరిగి వస్తున్న సందర్భంలో ప్రస్తుతం మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం చేసినవారు సూచించారు. లేదంటే మరోసారి వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
చైనాలో కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వుహాన్ నగరాన్ని పూర్తిగా మూసి ఉంచారు. దేశంలోని ఇతర నగరాల్లో కూడా రవాణా, బయట తిరగడంపై అనేక తీవ్రమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









