దిల్లీ: జామియా హింసపై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ... బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజీ

ఫొటో సోర్స్, JCC
- రచయిత, కీర్తి దూబే
- హోదా, ఫ్యాక్ట్ చెక్ టీమ్, బీబీసీ
జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో గత డిసెంబర్ 15న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేసిన సమయంలో పోలీసులు వారిపై చేసిన దాడికి సంబంధించి ఓ కొత్త వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయమైంది.
25 సెకన్ల నిడివి ఉన్న ఆ సీసీటీవీ క్లిప్‌లో పోలీసులు లాఠీలతో లైబ్రరీలోని విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. విద్యార్థులు కుర్చీల కింద దాక్కోవడం, కొట్టొద్దని ప్రాధేయపడటం కూడా ఆ వీడియోలో రికార్డైంది.


జామియా కోఆర్డినేషన్ కమిటీ ఆదివారం ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ట్విటర్‌లో ఇది వైరల్ అయ్యింది.
అయితే, ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ ప్రశ్నలకు సమాధానాలను రాబట్టేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జామియా కోఆర్డినేషన్ కమిటీలోని ప్రధాన సభ్యుడు సఫోరా బీబీసీతో ఈ విషయం గురించి మాట్లాడారు.
‘‘ఫిబ్రవరి 16న ఈ వీడియో వచ్చింది. ఇది ఎమ్ఏ-ఎంఫిల్ లైబ్రరీ మొదటి అంతస్తులోని సీసీటీవీ ఫుటేజ్. కాలేజీ యాజమాన్యం దీన్ని పోలీసులకు సమర్పించింది. మాకు కూడా ఇవ్వండని మేం కోరాం. ఇది కీలక సాక్ష్యమని, కోర్టులో సమర్పిస్తామని యాజమాన్యం చెప్పింది. రెండు నెలలు గడిచినా, పోలీసులపై చర్యలేవీ మొదలుకాలేదు. ఘటనను అందరూ మరిచిపోయారు’’ అని అన్నారు.
ఈ వీడియో ఎలా సంపాదించారన్న ప్రశ్నకు.. ‘‘యూనివర్సిటీలో మెహఫిల్ ఏ జామియా అనే లోకల్ వెబ్‌సైట్ ఉంది. అక్కడినుంచే ఈ వీడియో తీసుకున్నాం’’ అని సఫోరా బదులిచ్చారు.
మెహఫిల్ ఏ జామియా సభ్యుడు మహమ్మద్ ఆరిఫ్‌తోనూ బీబీసీ మాట్లాడింది. ఆయన యూనివర్సిటీలో బీఎస్‌సీ ఫిజిక్స్ ఆనర్స్ విద్యార్థి.
‘‘ఫిబ్రవరి 15 అర్ధరాత్రి ‘స్టూడెంట్ ఆఫ్ బిహార్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఓ విద్యార్థి ఈ వీడియో పోస్ట్ చేశాడు. కొందరు రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఆ విద్యార్థి భయపడిపోయి వీడియో డిలీట్ చేసి, గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. నేను అతడితో మాట్లాడా. తనను ఎక్కడ ఇరికిస్తారోనని అతడు భయపడుతున్నాడు’’ అని ఆరిఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/KirtiDubey
రెండు వీడియోలను అతికించి ఈ 29 సెకన్ల క్లిప్‌ను తయారుచేశారు. దాని నిడివి గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు వీడియో నిడివి ఇంకా ఎక్కువ ఉండొచ్చని, వీడియో ఫ్రేమ్‌ల వేగం కూడా కొంచెం తక్కువ ఉందని కొందరు చెబుతున్నారు.
‘‘అసలు వీడియో సెకనకు 10 ఫ్రేముల వేగంతో ఉంది. పోలీసుల చర్యలను స్పష్టంగా చూపించాలని మేం దాన్ని 20 ఫ్రేములకు పెంచాం’’ అని ఆరిఫ్ అన్నారు.
ఈ వీడియో ప్రామాణికత విషయమై జామియా పబ్లిక్ రిలేషన్స్ అధికారి అహ్మద్ అజీమ్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘జామియా అధికారిక ఖాతా నుంచి దీన్ని ట్వీట్ చేయలేదు. కానీ, నాకిది అసలు వీడియోనే అనిపిస్తోంది. దీని గురించి నేను ఇప్పుడు ఇంతకన్నా ఏం చెప్పలేను’’ అని అజీమ్ అన్నారు.
పోలీసులకు దీన్ని సమర్పించారా అన్న ప్రశ్నకు.. ‘‘ఇప్పుడు నేనేమీ చెప్పను. కొంత సమయం ఇవ్వండి’’ అని బదులిచ్చారు.
ఈ వీడియో గురించి దిల్లీ పోలీసుల స్పందనను కూడా బీబీసీ కోరింది.
‘‘ఈ వీడియోను మేం చూశాం. ఏదైనా చెప్పడానికి ముందు మేం విచారణ జరపాల్సి ఉంటుంది’’ అని దిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఎంఎస్ రాంధ్వా అన్నారు.
‘‘మాకు మద్దతుగా ఎవరూ లేరు. రెండు నెలలు గడిచినా, పోలీసులపై ఎలాంటి చర్యలూ లేవు. మాతో ఎలా వ్యవహరించారన్నది ప్రపంచమంతటికీ తెలియాలని కోరుకుంటున్నాం. న్యాయవ్యవస్థపై కూడా మాకు నమ్మకం ఉంది. మాకు ఎదురైన దారుణాన్ని చూసైనా, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’’ అని సఫోరా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతామని దిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ (క్రైమ్) ప్రవర్ రంజన్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ వీడియోను జామియా యూనివర్సిటీ అసలుదేనని భావిస్తున్నట్లు బీబీసీ విచారణలో తెలుసుకుంది. పోలీసులు కూడా వీడియో ప్రామాణికతపై సందేహాలేవీ వ్యక్తం చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇది డిసెంబర్ 15 సాయంత్రం ఆరు గంటల సమయంలోని వీడియో అయ్యుండొచ్చు.
ఆ రోజు విద్యార్థులు తమపై రాళ్లు రువ్వారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము స్పందించాల్సి వచ్చిందని దిల్లీ పోలీసులు చెబుతూ వస్తున్నారు.
మరోవైపు పోలీసులు బలవంతంగా వర్సిటీలోకి ప్రవేశించి, అమాయక విద్యార్థులపై దాడిచేశారని వర్సిటీ వీసీ నజ్మా అఖ్తర్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి.
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









