సచిన్ తెందుల్కర్‌కు ప్రఖ్యాత లారియస్ పురస్కారం: ‘ఇరవై ఏళ్లలో ఇదే బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్’

ఫొటో సోర్స్, Getty Images
2011 ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ విజయం తర్వాత 'క్రికెట్ గాడ్' సచిన్ తెందుల్కర్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని, స్టేడియం అంతా ఊరేగించిన ఘట్టం గుర్తుందా!
గత 20 ఏళ్లలో క్రీడల్లో ఆవిష్కృతమైన అత్యద్భుత ఘట్టంగా దీనికి ప్రఖ్యాత లారియస్ వరల్డ్ అవార్డ్స్ పట్టం కట్టింది. సచిన్‌కు స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 పురస్కారం అందించింది.


జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఈ అవార్డుల ప్రదానం జరిగింది.
2017లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని లారియస్ ప్రారంభించింది.
అయితే, గత 20 ఏళ్లలో జరిగిన ఘట్టాలన్నింటిలో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసి, ఈ ఏడాది పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించేందుకు ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో అత్యధిక ఓట్లు సచిన్‌కే పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
'క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్'
సచిన్‌ను సహచరులు భుజాలపై ఎత్తుకుని ఊరేగించిన ఘట్టానికి లారియస్ 'క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్'గా పేరు పెట్టింది.
సచిన్ తన క్రికెట్ కెరీర్‌లో ఆరు వరల్డ్ కప్‌లు ఆడారు. ఆ కప్‌ను ముద్దాడేందుకు ఆయన 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
చివరికి, 2011లో సచిన్ కోరిక నెరవేరింది.
సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా అద్భుత విజయాలతో కప్ అందుకుంది.
సచిన్ రెండు సెంచరీలతో ఆ టోర్నీలో 482 పరుగులు చేశారు.
ఫైనల్లో శ్రీలంకపై భారత్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులంతా సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతటా తిప్పారు.
'ఇన్నేళ్లుగా దేశమంతా ఉంచిన భారాన్ని సచిన్ మోశారు. ఇప్పుడు మేం ఆయన్ను మోశాం'' అని టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ రోజు వ్యాఖ్యానించాడు.
''క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది దీని కోసమే'' అంటూ సచిన్ ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘దేశాన్ని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది’
2011 వరల్డ్ కప్ విజయం తర్వాత ట్రోఫీని, త్రివర్ణ పతాకాన్ని తన చేతుల్లోకి తీసుకున్న క్షణాలు తన జీవితంలో అత్యంత గర్వపడేవని లారియస్ పురస్కారం అందుకున్న తర్వాత సచిన్ అన్నారు.
క్రీడలకు అందర్నీ ఏకం చేసే శక్తి ఉందని, తమ విజయం కూడా అదే గుర్తు చేస్తోందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''ఏ భిన్నాభిప్రాయాలూ లేకుండా, దేశమంతా ఒక్కటి కావడం మనం ఎప్పుడు చూస్తాం? చాలా అరుదుగా ఇది జరుగుతుంది. క్రీడలకు ఆ శక్తి ఉంది. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు నెల్సన్ మండేలాను కలిసే అవకాశం వచ్చింది. ఆయన చెప్పింది కూడా ఇదే'' అని సచిన్ అన్నారు.
ఈ పురస్కారం తనకు మాత్రమే సొంతం కాదని, సవాళ్లను దాటుకుంటూ ఇంకొకరికి స్ఫూర్తినిచ్చేలా ఎదిగిన క్రీడాకారులందరిదీ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.
- ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది
- విరాట్ కోహ్లీ మరో అయిదారేళ్లు ఆడితే... ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి: కపిల్ దేవ్
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- అండర్-19 ప్రపంచకప్ సెమీస్ హీరో యశస్వి జైశ్వాల్... పగలంతా ప్రాక్టీస్, రాత్రి పానీపూరీ అమ్మకం
- బెంగాల్ మదరసాల్లో హిందూ విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు
- హిమాలయాలపై భారీగా చెత్త, శవాలు... శుభ్రత బాధ్యతను ఆర్మీకి ఇవ్వడంపై అభ్యంతరాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









