డోనల్డ్ ట్రంప్‌ను ఇష్టపడే దేశాలు, వ్యతిరేకించే దేశాలు ఇవి.. మరి, భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారు?

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఇతర దేశాల్లో ఎలా చూస్తారు? ఏ దేశాలు ఆయన్ను అభిమానిస్తున్నాయి? ఏ దేశాలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నాయి? అనే అంశంపై 'ప్యూ రీసెర్చ్ సెంటర్' సర్వే చేసింది.

2019 మే నుంచి అక్టోబరు మధ్య 33 దేశాల్లోని 37 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.

ఇరాన్ మిలటరీ జనరల్ కాసిం సులేమానీని హతమార్చడానికి ముందే జరిపిన ఈ సర్వేలో ట్రంప్ గురించి వివిధ దేశాల ప్రజలు ఏమనుకుంటున్నారో ప్యూ రీసెర్చ్ చెప్పింది.

ప్రపంచ ప్రజానీకం ఏమనుకుంటోంది?

ప్యూ రీసెర్చీ సంస్థ సర్వే చేసిన దేశాల్లో 29 శాతం దేశాల ప్రజలు ట్రంప్‌పై విశ్వాసం కనబరిచారు. ట్రంప్ విదేశాంగ విధానం కారణంగా మిగతా దేశాల్లో ఆయనపై విశ్వాసం కనబడలేదని ప్యూ రీసెర్చ్ పేర్కొంది.

వాణిజ్య సుంకాలు, పర్యావరణం, ఇమిగ్రేషన్, ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న విధానాలు ఆయనకు అనేక దేశాల్లో చెడ్డపేరు తెచ్చాయి.

ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరపడంపై ట్రంప్‌కు ఈ 33 దేశాల ప్రజల నుంచి కొంత మద్దతు కనిపించింది. సగటున 41 శాతం మంది ఈ విషయంలో ట్రంప్‌ను బలపరిచారు.

గ్రాఫ్

ఒబామా రోజులతో పోల్చితే...

ట్రంప్ అంటే ప్రపంచ దేశాల ప్రజలు పెద్దగా ఇష్టపడనప్పటికీ అమెరికాపై మాత్రం కొంత అనుకూలత చూపుతున్నారు. అయితే, ఇది గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి కంటే భారీగా తగ్గింది.

ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చిన తరువాత అమెరికా పట్ల ప్రపంచ దేశాల ప్రజల్లో ఉన్న సానుకూలత గత ప్రభుత్వంలో ఉన్నప్పటి కంటే గణనీయంగా తగ్గిపోయందని ప్యూ రీసెర్చ్ సెంటర్ చెప్పింది.

అయితే, గత ఏడాది(2019)లో అంతకుముందు కంటే కొంతవరకు మెరుగైందని ఈ సంస్థ వెల్లడించింది. కొన్ని దేశాల్లోని రైట్ వింగ్ మద్దతుదారులే ఇందుకు కారణం కావొచ్చని ఆ సంస్థ విశ్లేషించింది.

గ్రాఫ్

ఇతర నాయకులతో పోల్చితే ట్రంప్ పరిస్థితేమిటి?

ఇతర దేశాల నేతలు ఏంజెలా మెర్కెల్(జర్మనీ), ఇమాన్యుయల్ మేక్రాన్(ఫ్రాన్స్), వ్లాదిమిర్ పుతిన్(రష్యా), జిన్‌పింగ్(చైనా)లతో పోల్చినప్పుడు ట్రంప్ పట్ల ప్రపంచ దేశాల ప్రజలు ఏమాత్రం విశ్వాసం చూపుతున్నారనే విషయంలో భిన్న ఫలితాలొచ్చాయి. కొన్ని దేశాలలో ట్రంప్ మిగతా నేతల కంటే ముందుండగా కొన్ని దేశాల్లో మాత్రం వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది.

ఈ అయిదుగురు నేతల్లో ఎవరూ అన్ని ప్రాంతాల్లో మెప్పు పొందలేదు కానీ ఉన్నంతలో జర్మనీ చాన్సలర్ ఏంగెలా మెర్కెల్ సగటున అందరి కంటే ముందు నిలిచారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అందరి కంటే ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకోగా పుతిన్, జిన్‌పింగ్‌లు ఆయన తరువాత స్థానాల్లో ఉన్నారు.

అయితే, రైట్ వింగ్‌కు చెందినవారిలో ట్రంప్ పట్ల సానుకూలత అధికంగా ఉంది. ఆరు దేశాల్లో ఆయన పట్ల 50 అంతకంటే ఎక్కువ శాతం మంది విశ్వాసం కనబరిచారు.

గ్రాఫ్

ఏఏ దేశాల ప్రజలు ట్రంప్‌ను ఇష్టపడుతున్నారు?

మొత్తంగా చూసుకుంటే ప్రపంచ దేశాల ప్రజలు ట్రంప్‌ను ఇష్టపడుతున్నట్లుగా కనిపించనప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం ఆయన పట్ల ప్రజల్లో విశ్వాసం ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంది.

ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆయన పట్ల ఆదరణ ఉంది. కెన్యా, నైజీరియా ప్రజలు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందిన జాబితాలో ఈ రెండు దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లోనూ ట్రంప్‌పై మంచి అభిప్రాయమే కనిపించిందని ప్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.

గ్రాఫ్

సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలకు చెందిన ఒక దేశాధినేతకు వైట్‌హౌస్ నుంచి ఆహ్వానం అందడమనేది ట్రంప్ అధ్యక్షుడయ్యాకే జరిగింది. 2018లో నైజీరియా అధ్యక్షుడు ముహ్మాందు బుహారీని వైట్ హౌస్ ఆహ్వానించింది.

అంతేకాదు, ఒబామా ప్రభుత్వం కాలం నాటి నిర్ణయాన్ని మార్చుతూ ట్రంప్ ప్రభుత్వం నైజీరియాకు 12 యుద్ధ విమానాలనూ విక్రయించింది.

ఇక ట్రంప్‌కు మంచి ఆదరణ ఉన్న ఫిలిప్పీన్స్‌పై ట్రంప్‌కి కూడా మంచి సానుకూల భావనలున్నాయి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్‌పై అనేక దేశాల్లో వ్యతిరేకత ఉన్నా ట్రంప్ మాత్రం ఆయన్ను ఎప్పుడూ ప్రశంసిస్తుంటారు.

రోడ్రిగో ఫిలిప్పీన్స్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ చేపట్టిన చర్యలు అద్భుతమని ట్రంప్ 2017లో కొనియాడారు. ట్రంప్ చేసిన ఆ ప్రకటన అప్పట్లో వివాదాస్పదమైంది. రోడ్రిగో మాదక ద్రవ్యాల నియంత్రణ పేరుతో జనాన్ని ఇష్టమొచ్చినట్లు హతమారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇక ఇజ్రాయెల్ ప్రజలు ట్రంప్‌ని ఇష్టపడడం కూడా వింతేమీ కాదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ట్రంప్ మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎంతో కాలంగా మద్దతిస్తోంది.

బుష్, ఒబామా, ట్రంప్‌లలో ఎవరికెంత మద్దతు

తన అంతర్జాతీయ విధానాల కారణంగా ట్రంప్ అంటే చాలాదేశాల్లో వ్యతిరేకత కనిపించింది. అతని కంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన ఒబామా, బుష్‌లపైనా వారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో వ్యతిరేకత ఉందని ప్యూ రీసెర్చ్ చెబుతోంది.

గ్రాఫ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)