కరోనావైరస్: ఈ అఫ్గాన్ అమ్మాయిలు కారు విడిభాగాలతో వెంటిలేటర్లు తయారు చేస్తున్నారు

వెంటిలేటర్
ఫొటో క్యాప్షన్, మార్కెట్ ధరతో పోల్చితే చాలా చౌకగా వెంటిలేటర్లు తయారు చేస్తున్న అఫ్గాన్ అమ్మాయిలు
    • రచయిత, సొదాబా హైదరీ
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలో 2017లో జరిగిన ఓ అంతర్జాతీయ పోటీల్లో ప్రత్యేక అవార్డు అందుకోవడంతో ఆ యువతుల పేర్లు ఒక్కసారిగా పతాక శీర్షికల్లో చేరాయి.

ఇప్పుడు వాళ్లంతా మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరకే ఈ నెలాఖరులోగా వెంటిలేటర్లను అందించేందుకు కాలంతో పోటీ పడుతున్నారు.

కరోనావైరస్ మహమ్మారి అఫ్గానిస్తాన్‌ను కూడా పట్టి పీడిస్తోంది. అయితే అక్కడ సుమారు 3 కోట్ల89 లక్షల జనాభాకు కేవలం 400 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మే 20 సాయంత్రం నాటికి అక్కడ 7,650 కేసులు నమోదు కాగా 177 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటికే వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న దేశంలో, పరిస్థితి విషమిస్తే ఏం చెయ్యాలన్న భయం అఫ్గాన్ అధికారయంత్రాంగాన్ని వెంటాడుతోంది.

“మేం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఒక్క ప్రాణాన్ని నిలపగల్గినా అది ఎంతో ముఖ్యం” అని యువ బృందంలో ఒకరైన 17 ఏళ్ల నహిద్ రహ్మీ బీబీసీతో అన్నారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో అంతంత మాత్రంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థ కోవిడ్-19తో పోరాడే స్థితిలో లేదు.

అఫ్గాన్ డ్రీమర్స్

“అఫ్గాన్ డ్రీమర్స్” గా సుపరిచితులైన ఈ అమ్మాయిల బృందం అఫ్గానిస్తాన్‌లో మొదటి కోవిడ్-19 కేసు నమోదైన పశ్చిమ ప్రావిన్స్‌కు చెందినవారు.

ప్రస్తుతం ఆ ప్రాంతం వైరస్‌కు హాట్ స్పాట్‌గా మారింది. ఇరాన్‌ సరిహద్దుల్లో వైరస్ విజృంభించిన ప్రాంతానికి దగ్గరగా ఉండటమే అందుకు కారణం.

ఈ బృందంలో అమ్మాయిలంతా 14 నుంచి 17 ఏళ్ల లోపు వారే. వీళ్లంతా కలిసి టయోటా కరొల్లా కారులోని మోటార్‌ను, హోండా మోటార్ సైకిల్‌లోని చైన్ డ్రైవ్‌ను ఉపయోగించి ఓ వెంటిలేటర్ నమూనాను తయారు చేశారు.

తాము తయారు చేసిన వెంటిలేటర్లు శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతున్న రోగులకు అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వెంటిలేటర్లు అందుబాటులో లేని సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

“ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యులకు, నర్సులకు ఎంతో కొంత సహాయం చెయ్యాలని ప్రయత్నిస్తున్న ఈ బృందంలో నేను కూడా భాగం కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. వైద్యులు, నర్సులే ఇప్పుడు మా హీరోలు” అని సొమయ ఫారుఖీ అన్నారు.

వెంటిలేటర్ల సమస్య యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తోంది. వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 20 నుంచి 35 లక్షల రూపాయల వరకు ఉంటున్నాయి. ప్రపంచంలోని చాలా నిరు పేద దేశాలుకు వాటిని కోనే స్థోమత లేదు.

అయితే, తాము రూపొందిస్తున్న వెంటిలేటర్ ధర మాత్రం 45వేల రూపాయల కన్నా తక్కువే ఉంటుందని ఈ యువతులు చెబుతున్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

లాక్ డౌన్ కారణంగా నగరంలోని అన్ని దుకాణాలు మూసి వేయడంతో విడి భాగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడమే ప్రస్తుతం వాళ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.

అయితే ఈ బృందం వ్యవస్థాపకుడు ప్రముఖ వాణిజ్య వేత్త, టైమ్ మ్యాగజైన్ గుర్తించిన వంద మంది ప్రతిభావంతుల్లో ఒకరైన రొయ మెహబూబ్ మాత్రం ఈ నెలాఖరు నాటికి తమ టీం వెంటిలేటర్లను అందిస్తుందని చెబుతున్నారు.

“ఇప్పటికే దాదాపు 70శాతం పనిని వాళ్లు పూర్తి చేశారు. ఇక కావాల్సింది కేవలం ఎయిర్ సెన్సార్ మాత్రమే. విడి భాగాలతో దాన్ని తయారు చెయ్యాలంటే ఆలస్యమవుతుంది. అందుకే దాని కోసం ఇప్పుడు మేం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే దీని ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యింది. రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో మేం పరీక్షించాం కూడా. ఇప్పుడు మా బృందం సెకెండ్ ఫేజ్‌లో ఉంది. అది పూర్తయితే ఇక మార్కెట్లోకి ప్రవేశపెట్టడమే” అని మెహబూబ్ అన్నారు.

అఫ్గానిస్తాన్ మహిళల అక్షరాస్యత 30 శాతం కన్నా తక్కువే. ఈ పరిస్థితుల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు ఎంతో మందికి స్పూర్తినిస్తుందని ఈ యువ బృందం భావిస్తోంది. ఇకనైనా మహిళల దృక్పథంలో మార్పు వస్తుందని ఇంజనీరింగ్ రంగంలో వారి భాగస్వామ్యం పెరుగుందని వీరు ఆశిస్తున్నారు.

“చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో చెప్పడానికి మేం చేపట్టిన ఈ ప్రాజెక్టే సాక్ష్యం. బాల్యం నుంచే చదువుకోవడం వల్ల సమాజంలో స్త్రీలు మరింత కీలక పాత్రను పోషించగలరు”అని ఈ యువ బృందంలో మరో సభ్యురాలు 16 ఏళ్ల ఎల్హమ్ మన్సోరి అన్నారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొదటిసారి అమెరికా వీసాను తిరస్కరించినప్పుడు ఈ అమ్మాయిలు వార్తల్లోకెక్కారు.

ప్రభుత్వ సాయం

ఈ బృందం చూపించిన చొరవను అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానించింది.

“మాకు ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా వెంటనే అందించాలని దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారులను ఆదేశించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని మెహబూబ్ చెప్పారు.

అఫ్గానిస్తాన్ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ అమ్మాయిల ప్రయత్నానికి చేయూతను అందిస్తోంది.

“వాళ్లు చేస్తున్న ప్రయత్నాన్ని మేం అభినందిస్తున్నాం. అయితే ఇతర శాస్త్ర పరిశోధనలలో ఉన్నట్టు ఇందులో కూడా తయారు చెయ్యడం, దాన్ని అభివృద్ధి చెయ్యడం, ప్రి క్లినికల్ రీసెర్చ్, ఆపై మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషించి ఆమోదించడం వంటి వంటి అనేక దశలు ఉంటాయి” అని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాహిద్ మయర్ బీబీసీతో అన్నారు.

“అయితే రోగి క్షేమానికే ముందు మేం ప్రాధాన్యమిస్తాం. అందుకే కరోనావైరస్‌ రోగులపై ప్రయోగించే ముందు వాటిని మేం లాబొరేటరీలలో జంతువులపై ప్రయోగిస్తాం” అని వాహిద్ స్పష్టం చేశారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఇవి కూడా చదవండి