అర్ణబ్ గోస్వామి కేసును సీబీఐకి అప్పగించటానికి సుప్రీంకోర్టు నిరాకరణ

అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, REPUBLIC TV

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్ణబ్ గోస్వామి మీద నమోదైన ఎఫ్ఐఆర్‌లను సీబీఐ దర్యాప్తుకు అప్పగించటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

మహారాష్ట్రలోని పాల్‌ఘడ్‌లో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్‌పై జరిగిన దాడులకు, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి సంబంధం ఉందనిచెప్తూ అర్ణబ్ తన టీవీ షోలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కొన్నిచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఆ ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ అర్ణబ్ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ సంఘటన ఒక ప్రాంతంలో చోటు చేసుకుందని, కానీ అదే ఫిర్యాదు మీద వివిధ ప్రాంతాల్లో కేసులు నడుస్తున్నాయని పేర్కొంది.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేయటం జరగదని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. కేసును నాగపూర్‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అదే సమయంలో.. 32వ అధికరణ కింద చేసిన ఫిర్యాదును కొట్టివేయరాదని కూడా కోర్టు నిర్ణయించింది. అర్ణబ్ గోస్వామి న్యాయ సహాయం కోసం కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది.

''అన్ని ఎఫ్ఐఆర్‌లు, ఫిర్యాదులు ఒకే ప్రసారంలోని అవే అంశాలకు సంబంధించినవి. ఫిర్యాదులన్నీ ఒకే తరహాలో ఉన్నాయి. ఫిర్యాదుల్లోని భాష, అంశాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి'' అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

ఫిర్యాదులపై దర్యాప్తు జరపకుండా పోలీసులను నిరోధించలేదని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుకు ఉందని ధర్మాసనం చెప్పింది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది.. నిజం చెప్పినంత మేరకు ఉండాలని వ్యాఖ్యానించింది.

అయితే.. ''స్వేచ్ఛ అనేది ఎన్నడూ సంపూర్ణంగా ఉండదు. రాజ్యాంగంలోని 19-1 అధికరణ ప్రకారం.. పాత్రికేయుల స్వాతంత్ర్యం పెద్ద విషయం. స్వతంత్ర మీడియా లేకుండా స్వతంత్ర పౌరులు ఉండరు. స్వతంత్ర పౌరులు లేకుండా స్వతంత్ర మీడియా ఉండదు'' అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.

కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసే అధికారాన్ని మితంగా ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.

ఈ కేసుల్లో అర్ణబ్ గోస్వామి మీద ఎటువంటి చర్యా చేపట్టకూడదంటూ మూడు వారాల పాటు ఇచ్చిన రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. అదే సమయంలో గోస్వామికి భద్రత కల్పించాలంటూ ముంబై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.

కేసు ఏమిటి?

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనిగాగాంధీ మీద అర్ణబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యల మీద వివిధ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మహారాష్ట్ర ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ ఫిర్యాదు చేయటంతో నాగపూర్ పోలీసులు అర్ణబ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను 10 గంటలకు పైగా ప్రశ్నించారు.

అల్లర్లను ప్రేరేపించటం, రెండు వర్గాల మధ్య మతం, జాతి ప్రాతిపదికగా శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, మత ఉద్వేగాలను రెచ్చగట్టటం తదితర సెక్షన్ల కింద అర్ణబ్ గోస్వామి మీద ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

దీంతో అర్ణబ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మీద నమోదైన ఎఫ్ఐఆర్‌లన్నిటినీ రద్దు చేయాలని కోరారు.

ఈ పిటిషన్ మీద ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూ.. మూడు వారాల పాటు అర్ణబ్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. తాజాగా తీర్పును ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)