బాలాకోట్ దాడులు: మసూద్ అజర్ నియంత్రణలోని ఆ మదరసా వద్దకు నేటికీ ఎవరినీ అనుమతించరు.. మీడియాతో మాట్లాడటానికి భయపడుతున్న స్థానికులు

- రచయిత, మొహమ్మద్ జుబేర్ ఖాన్
- హోదా, జర్నలిస్టు, బీబీసీ కోసం
ఏడాది క్రితం భారత్ వైమానిక దాడులు జరిపిన పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలో ఇప్పటికీ నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. జనాభా తక్కువగా ఉండే ఈ పర్వత ప్రాంతంలో బయటకు కనిపించని గట్టి నిఘా, భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
పర్యటక కేంద్రంగా మారిన బాలాకోట్ సమీపాన ఉండే చిన్న గ్రామం జబ్బాలో ఏడాది తర్వాత కూడా ఏ మార్పూ లేదు. ఆ దాడుల్లో జబ్బా గ్రామస్థుడైన నోరన్ షా ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. అది ఇప్పటికీ అలాగే ఉంది. క్షిపణుల దాడులతో ఏర్పడ్డ కొన్ని గుంతలు ఇంకా కనిపిస్తున్నాయి.
బాలాకోట్ రోడ్‌లో జబ్బా పొలాలకు ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే భారత యుద్ధవిమానాలు బాంబులు వేశాయి. అక్కడ నుల్లా రోడ్ దాటితే కాంగర్ గ్రామం వస్తుంది. అక్కడ ఎండాకాలం, చలికాలం రెండు కాలాల్లో నీరు ప్రవహిస్తుంటుంది. దీనినే స్థానికులు సేద్యానికి వాడుకుంటారు.
ఏడాది క్రితం ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు స్థానికులు బాగా సహకరించారు. దాడి గురించి కెమెరాల ముందు స్వేచ్ఛగా వివరాలు చెప్పారు. ఏడాది తర్వాత వెళ్తే పరిస్థితి భిన్నంగా ఉంది. స్థానికులెవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరని అర్థమైంది. నిరుడు రోడ్డు పక్కన కాంగర్‌కు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మంది స్థానికులు తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండేవారు. ఈసారి నుల్లా దాటి కాంగర్‌కు వెళ్తుండగా మాతో మాట్లాడేందుకు ఎవ్వరూ సంసిద్ధత వ్యక్తంచేయలేదు.


2019 దాడుల గురించి కొన్ని వివరాలు చెప్పాలని ఓ పెద్దాయన్ను అడగ్గా- అవి జరిగి ఏడాది గడిచిపోయిందని, ఇప్పుడు ఇంకా ఏం తెలుసుకోవాలనుకొంటున్నారని బదులిచ్చి అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
వేరే వాళ్లను పలకరించగా, వాళ్లు కూడా మాట్లాడేందుకు సంసిద్ధత వ్యక్తంచేయలేదు. వాళ్లు భయపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.
జబ్బా బజార్ నుంచి దాదాపు ఓ గంట నడిచి మేం కాంగర్ గ్రామానికి చేరుకున్నాం. ఇళ్లలోని మగవారెవ్వరూ మాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక్కడ వీడియోలు, ఫొటోలు తీయడానికి ఒప్పుకోలేదు. ఇందుకు అనుమతించడం లేదు కూడా! ఇంతలో మా ముందే వాళ్లు సెల్‌ఫోన్లు తీసి ఎవరికో ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మీడియా వాళ్లు వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని అవతలివాళ్లకు చెప్పారు.
ఓ స్థానికుడు మా చేతికి ఫోన్ ఇచ్చి అవతలి మనిషితో మాట్లాడాలన్నారు. మేం ఫోన్ తీసుకొని మాట్లాడగా, తాను ఇంటెలిజెన్స్ వర్గాలకు చెందినవాడినని, అక్కడ ఫొటోలు, వీడియోలు తీయొద్దని అవతలి వ్యక్తి చెప్పారు.

మేమేమీ నిషేధిత ప్రాంతంలో లేమని, గత ఏడాది ఇక్కడి నుంచి వార్తలు అందించామని, అప్పుడు ఆంక్షలేవీ లేవని, ఇప్పుడెందుకు అనుమతించడం లేదని ఫోన్లో మేం ఆయన్ను ప్రశ్నించాం. స్థానికులను మీడియాతో ఎందుకు మాట్లాడనివ్వడం లేదని, వాళ్లను మాట్లాడనివ్వాలని అడిగాం. ఆయన కాసేపట్లో తిరిగి ఫోన్ చేస్తానని బదులిచ్చారు. మా చుట్టూ ఉన్న స్థానికులందరూ ఓ ఐదారు నిమిషాల్లో అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
ఇంకో స్థానికుడు ఫోన్లో ఆదేశాలు అందుకొంటూ కనిపించారు. కొంతసేపు మా వెంట ఉండాలని ఆయన్ను కోరాం. "మేం పేదవాళ్లం. ఇక్కడే ఉండాల్సిన వాళ్లం. మేం (వాళ్లు) చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది" అని ఆయన సమాధానమిచ్చారు.
దాడులు జరిగిన ప్రదేశానికి చాలా దగ్గర్లో ఉండే కాంగర్ గ్రామంలోని నోరన్ షా ఇంటి వద్దకు మేం నడుచుకుంటూ వెళ్లగా, ఆయన మాకు దూరంగా కొండ వైపు నడవడం మొదలుపెట్టారు. మాకు కొంత సమయం కేటాయించి మాట్లాడాలని మేం అడిగాం. తాను గడ్డి కోయాల్సి ఉందని ఆయన బదులిచ్చారు. అదో శుక్రవారం. వాస్తవానికి ఇక్కడ ప్రతి శుక్రవారం స్థానికులు ఏ పనీ చేయరు.

నిషేధిత ప్రాంతం
కాంగర్లో చిట్ట చివరన కొండపై నోరన్ షా ఇల్లు ఉంది. దాన్ని దాటి వెళ్తే పర్వతాలు, అడవులు ఉన్నాయి. ఇంటికి ఎగువన ఉండే థన్నా పర్వత ప్రాంతంలోనే తలీముల్ ఖురాన్ మదరసా ఉందని చెబుతారు. నోరన్ షా ఇంటి నుంచి మదరసాకు వెళ్లే సాధారణ మార్గం ఏదీ కనిపించలేదు. స్థానికులైతే అరగంటలో అక్కడికి నడిచి వెళ్లొచ్చని కొందరు చెప్పారు. మదరసాకు సాధారణ దారి జబ్బా బజార్లో బాలాకోట్ రోడ్ ప్రాంతం నుంచి ఉంది. కానీ ఆ మార్గంలో రాకపోకలకు అనుమతి లేదు.
నోరన్ షా ఇంటి వరకు ఎవరైనా రావొచ్చని, ఏడాది క్రితంగాని, ఇప్పుడుగాని మదరసా వైపు మాత్రం ఎవరూ వెళ్లలేదని మాతో కొందరు చెప్పారు. అక్కడేం జరుగుతోందో ఎవరికీ తెలియదు.
కాంగర్ ప్రాంతం లేదా జబ్బా బజార్ ఎక్కడి నుంచైనా సరే తలీముల్ ఖురాన్ మదరసాకు వెళ్లే దారులన్నింటిలో ఇప్పటికీ అప్రకటిత నిషేధం ఉంది. పాకిస్తాన్ మీడియా సంస్థలు లేదా విదేశీ మీడియా సంస్థల తరపున పనిచేసే కొందరు జర్నలిస్టులను ఈ దిశగా అనుమతించకపోవడమే కాదు, వారికి కొన్ని కఠినమైన ప్రశ్నలు కూడా ఎదురవుతాయి.

ఫొటో సోర్స్, @OfficialDGISPR
గతంలో తాను ఓ వార్తాకథనం నిమిత్తం ఈ ప్రాంతానికి వెళ్లానని, కానీ నోరన్ షా ఇంటి కన్నా ఎగువకు వెళ్లలేకపోయానని ఓ జర్నలిస్టు మాతో చెప్పారు.
అంతకన్నా ముందుకు వెళ్లడానికి తనను నోరన్ షా ఇంటి వద్దకు తీసుకెళ్లిన స్థానికులు అంగీకరించలేదని ఆయన చెప్పారు. తర్వాత తాను ఒంటరిగా వెళ్లే ప్రయత్నం చేశానని తెలిపారు. "ఐదు నుంచి ఏడు నిమిషాలు ముందుకు వెళ్లిన తర్వాత నన్ను కొందరు ఆపి, ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని చెప్పారు. అది పర్వతాలు, అడవులు ఉన్న ప్రాంతం, ఏమైనా జరగొచ్చు అని వారించారు. నా భద్రత దృష్ట్యా నన్ను ముందుకు పోనివ్వబోమని చెప్పారు" అని ఆయన వివరించారు.

తర్వాతి రోజు జబ్బా బజార్ బాలాకోట్ రోడ్‌కు వెళ్లేటప్పుడు తలీముల్ ఖురాన్ మదరసాకు వెళ్లేందుకు ప్రయత్నించానని ఆ జర్నలిస్టు తెలిపారు. "సాధారణ దుస్తుల్లో ఉన్న కొందరు నన్ను వారితోపాటు తీసుకెళ్లారు. వాళ్లు దురుసుగా ప్రవర్తించలేదు. 10-11 గంటలపాటు నాపై ప్రశ్నల వర్షం కురిపించారు. నా కార్యాలయం నుంచి, సహోద్యోగుల నుంచి విదేశీ నంబర్లపై నా మొబైల్‌కు వచ్చిన కాల్స్ గురించి ఆరా తీశారు. తర్వాత నా సహోద్యోగుల చొరవతో అక్కడి నుంచి నా కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించారు" అని ఆయన వివరించారు.
మదరసాకు వెళ్లేందుకు ప్రయత్నించిన మరో జర్నలిస్టు- అప్పుడు కొందరు తనను అడ్డుకొన్నారని, కార్లో ఉన్న తన ల్యాప్‌టాప్, మొబైల్, కెమెరాలు తనిఖీ చేశారని చెప్పారు. దీని గురించి తన సహోద్యోగులకుగాని, కార్యాలయానికి తెలియజేసేందుకు అంగీకరించలేదన్నారు. గంటలపాటు ప్రశ్నించి తర్వాత వెనక్కు వచ్చేందుకు అనుమతించారని తెలిపారు.

బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పటి నుంచి తలీముల్ ఖురాన్ మదరసాను మూసి ఉంచారు.
దాడులు జరిగిన రోజు రాత్రి వరకు ఈ మదరసాలో 300 నుంచి 400 మంది వరకు విద్యార్థులు ఉండేవారని స్థానికులు చెప్పారు.
దాడులు జరిగినప్పుడు తొలుత మదరసాలో ఏదో జరిగిందని అనుకొన్నామని ఓ వ్యక్తి చెప్పారు. మదరసాకు దగ్గర్లో బాంబులు పడ్డాయని, అది దెబ్బతినలేదని తర్వాత తెలిసిందన్నారు. తెల్లవారిన తర్వాత తాము కాంగర్ ప్రాంతానికి వెళ్లామని, అక్కడ సైనిక సిబ్బంది పెద్దసంఖ్యలో కనిపించారని, ముందుకు వెళ్లకుండా తమను అడ్డుకొన్నారని తెలిపారు. దాదాపు ఉదయం ఎనిమిది గంటల వరకు సైనిక సిబ్బంది అక్కడే ఉన్నారని చెప్పారు. తర్వాత మీడియా ప్రతినిధులు వచ్చారని, ఈలోపు సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, వారి స్థానంలోకి ఫ్రంటియర్ కానిస్టేబులరీ సిబ్బంది వచ్చారని వివరించారు.
ఆ రోజు రాత్రి మదరసాపై దాడి జరిగిందని అనుకొన్నామని, కానీ దానికి ఏమీ కాలేదని మరుసటి రోజు ఉదయం తెలిసిందని మరో వ్యక్తి పేర్కొన్నారు.
బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పటి నుంచి మదరసాను మూసివేసినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి కార్యకలాపాలూ సాగడం లేదన్నారు. అప్పుడప్పుడు మదరసాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుంటారని, మదరసా బాగోగులు చూసుకొనేందుకే తాము అక్కడ ఉన్నామని వారు చెబుతుంటారని వెల్లడించారు.

మదరసాలో స్థానికేతర విద్యార్థులకే బోధన సాగేదని, తమ పిల్లలు ఎప్పుడూ అక్కడ చదువుకోలేదని స్థానికులు తెలిపారు. స్థానిక పిల్లలు స్థానిక మసీదు పరిధిలోని మదరసాలో ఖురాన్ గురించి అధ్యయనం చేసేవారని చెప్పారు. తలీముల్ ఖురాన్ మదరసాలో అక్కడి వసతిగృహంలో ఉండే విద్యార్థులే చదువుకొనేవారన్నారు.
దట్టమైన అడవులతో కూడిన మాసర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్వత సానువుల్లో ఈ మదరసా ఉంది. 2015లో 'బిలియన్ ట్రీ ఫారెస్టేషన్ ప్రాజెక్ట్'లో భాగంగా ఈ అటవీ ప్రాంతానికి ఈ పేరు పెట్టారు. పర్యావరణం, అడవుల పరిరక్షణకు చేపట్టిన అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇది.

ఫొటో సోర్స్, Getty Images
మదరసా ఉన్న ప్రాంతంలో మనుషుల రాకపోకలు చాలా పరిమితం. ఇది 1980ల్లో ఏర్పాటైందని స్థానికులు చెప్పారు. గతంలో ఈ మదరసాలో అఫ్గానిస్తాన్ విద్యార్థులు ఉండేవారని, 1990ల్లో అఫ్గానీ విద్యార్థుల స్థానంలో ఇతర పాకిస్తానీ, కశ్మీరీ విద్యార్థులు వచ్చారని తెలిపారు.
1990ల ప్రారంభంలో నిషేధిత హర్కతుల్ అన్సార్ ఏర్పాటు చేసినప్పుడు మదరసా ఈ సంస్థ నియంత్రణలో ఉండేది. మౌలానా మసూద్ అజర్ ఈ సంస్థలో ఉండేవాడు.
హర్కుతల్ అన్సర్ ఆధ్వర్యంలోని సాద్-ఎ-జిహాద్ పత్రికకు మసూద్ అజర్ ఎడిటర్‌గా ఉండేవాడు. తర్వాత భారత పాలిత కశ్మీర్‌లో అతడిని అరెస్టు చేశారు. 1999 డిసెంబర్లో కాందహార్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్‌తో భారత్ అతడిని విడుదల చేయాల్సి వచ్చింది. తర్వాత అతడు పాకిస్తాన్ చేరుకొని నిషేధిత జైషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. తర్వాత తలీముల్ ఖురాన్ మదరసా నేరుగా అతడి నియంత్రణలోకి వెళ్లింది.
2019 వైమానిక దాడుల తర్వాత, బాలాకోట్ రోడ్‌లో పెట్టిన మదరసా బోర్డులు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించాయి. ఇప్పుడా బోర్డులు ఇక్కడ కనిపించడం లేదు.

పర్యటక కేంద్రాలు
దాడుల తర్వాత కాంగర్, జబ్బా పర్యటక కేంద్రాలుగా మారాయి.
నరన్, కగన్, బాలాకోట్, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అక్కడ ఆగేవారు.
అబోటాబాద్ నివాసితుడు ఖుర్రమ్ ఖాన్ నిరుడు కాంగర్ ప్రాంతంలోని నరన్‌కు కుటుంబంతోపాటు వెళ్లారు.

"భారత్ దాడులు జరిపిన ప్రాంతాన్ని చూద్దామని మా పిల్లలు అడిగేవారు. పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ప్రాంతంలో కాసేపు తిరిగాం" అని ఆయన చెప్పారు.
భారత్ దాడుల తర్వాత చాలా మంది పర్యటకులు ఈ ప్రాంతానికి రావడం మొదలైందని బాలాకోట్‌లో ట్యాక్సీ డ్రైవర్ సర్దార్ ఫర్హాన్ తెలిపారు. పర్యటకుల సంఖ్య పెరగడం మొదలయ్యాక, ఈ ప్రాంతానికి ఎవరినీ తీసుకువెళ్లొద్దనే ఆదేశాలు తమకు అందాయని ఆయన వెల్లడించారు.
ఈ ప్రాంతానికి సాధారణ ప్రజలు రావడం పెరిగాక, అలాంటి వారికి సహకరించవద్దని తమకు చెప్పారని స్థానికులు తెలిపారు. పర్యటకులకు స్థానికులు దారులు మూసేశాక, వారి తాకిడి తగ్గింది. అయినా ఇప్పటికీ కొందరు పర్యటకులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి:
- యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది
- మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్
- యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్
- హార్వే వైన్‌స్టీన్: అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- పంటలను నాశనం చేస్తున్న మిడతలతో ఆకలి తీర్చుకుంటున్న యుగాండా ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









