అభినందన్ విమానం పాకిస్తాన్‌లో ఎలా కూలింది, ఆ సమయంలో అక్కడున్నవాళ్లు ఏమన్నారు?

ఫొటో సోర్స్, ISPR handout
- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019 ఫిబ్రవరి 27న హొరా అనే చిన్న పట్టణంలో మహమ్మద్ రజాక్ చౌధరీ తన ఇంటి ముందు మంచంపై కూర్చొని బంధువుతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని సంహనీ జిల్లాలో ఉందీ పట్టణం. ఇది నియంత్రణ రేఖకు దాదాపు 4 కి.మీ.ల దూరంలో ఉంది.
రజాక్ ఇల్లు ఓ చిన్నకొండ పైభాగాన ఉంది.
''పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఉదయం నుంచీ విమానాలు ఎగురుతున్న చప్పుడు వినిపిస్తూ ఉంది'' అని ఆ రోజు జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నారు రజాక్.

దానికి ముందు రోజు భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి, బాలాకోట్ అనే ప్రాంతంలో బాంబులు జారవిడిచాయి. నియంత్రణ రేఖకు 30 మైళ్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.
''ఈ పరిణామాలను మేం ఊహించలేదు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వెంటవెంటనే రెండు పెద్ద పేలుళ్లు చప్పుళ్లు వినిపించాయి. ఏదో జరిగిందనిపించి ఓ క్షణం ఆగా. మళ్లీ ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టా. కొంచెం సేపటి తర్వాత ఆకాశంలో ఏదో పొగలా కనిపించింది. కిందకు వేగంగా పడుతూ వచ్చింది. దగ్గరగా వచ్చాక, పెద్ద నిప్పు ముద్దలా కనిపించింది'' అని రజాక్ చెప్పారు.
మరింత దగ్గరికి వచ్చాక అది ఓ విమాన శకలమని రజాక్‌కు అర్థమైంది.

రజాక్ ఉన్న చోటుకు ఒక కిలో మీటర్ దూరంలో విమానం మండుతూ కూలిపోయింది. అది పాకిస్తాన్ విమానమా, భారత్ విమానమా అన్నది అప్పుడు తనకు కచ్చితంగా తెలియదని చెప్పారు రజాక్.
ఇంకోవైపు ఓ పారాచూట్‌తో ఒక మనిషి అక్కడున్న కొండపై దిగుతుండటం రజాక్‌కు కనిపించింది. ఆయనున్న చోటుకు అది కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది.
రజాక్ వెంటనే తన ఇంటి పక్కనుండే అబ్దుల్ రెహమాన్‌కు ఫోన్ చేశారు. వెళ్లి, అదేంటో చూడాలని ఆయనకు చెప్పారు.

తాను అప్పటికే పారాచూట్‌ను చూశానని అబ్దుల్ రెహమాన్ చెప్పారు.
కిందకు దిగింది పాకిస్తానీ సైనికుడై ఉండొచ్చని భావించి, ఓ జగ్గులో నీరు తీసుకుని ఆ దిశగా పరుగెత్తుకు వెళ్లానని వివరించారు.
''మా ఇంటికి ఎదురుగా ఉన్న కొండపై ఉన్న చెట్టుపై ఆ పారాచూట్ పడుతుందనుకున్నా. కానీ, ఆయన ( భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్) నేర్పుగా తన దిశను మార్చుకున్నారు. కొండ మీద చదునుగా ఉన్న చోట దిగారు'' అని అబ్దుల్ రెహమాన్ చెప్పారు.
పారాచూట్‌పై భారత జెండా ఉండటం చూశానని, త్వరగా ఆయన దగ్గరకు వెళ్లానని అన్నారు.
''అభినందన్ నన్ను చూశారు. ఆయన శరీరం చుట్టూ ఇంకా పారాచూట్ ఉంది. తన జేబులో నుంచి పిస్టల్‌ను తీశారు. నా వైపు గురిపెట్టి, 'ఇది భారతా, పాకిస్తానా?' అని అడిగారు. నేను పాకిస్తాన్ అని చెప్పా'' అని రెహమాన్ చెప్పారు.
''అప్పుడు 'ఇది ఏ ప్రాంతం?' అని ఆయన అడిగారు. ఖిలా అని నా నోటికి వచ్చింది చెప్పా. వెంటనే ఆయన నేలపై కూర్చున్నారు. పిస్టల్‌ను కడుపుపై పెట్టుకుని, రెండు చేతులు పైకెత్తి 'జై హింద్, కాళీ మాతాకీ జై' అంటూ అరిచారు. తనకు బాగా దెబ్బలు తగిలాయని, నీళ్లు ఇవ్వమని అడిగారు'' అని వివరించారు.

ఇంతలో గ్రామస్తులు ఆ ప్రాంతంలో పోగవ్వడం మొదలుపెట్టారని రెహమాన్ అన్నారు. ''పాకిస్తాన్ కా మత్లబ్ క్యా - లా ఇలాహ ఇల్లల్లాహ్, పాక్ ఫౌజ్ జిందాబాద్'' అంటూ వారిలో కొందరు నినాదాలు చేశారని తెలిపారు.
''అభినందన్ అప్రమత్తమయ్యారు. ఓ చేతిలో పిస్టల్ పట్టుకుని, మరో చేత్తో కాలి వద్ద ఉన్న జేబులో నుంచి ఓ చిన్న కాగితం ముక్క తీశారు. దాన్ని నమిలి, మింగేశారు. ఇంకో పెద్ద కాగితం ఉంది. దాన్ని ఆయన మింగలేకపోయారు. చిన్న, చిన్న ముక్కలుగా చింపారు'' అని రెహమాన్ చెప్పారు.
ఆ తర్వాత, అభినందన్ కొండ కింది వైపు పరుగెత్తడం మొదలుపెట్టారని రెహమాన్ వివరించారు.
''నేను ఆయనను పట్టుకోవాలనుకున్నా. కానీ, ఆయన వద్ద ఆయుధం ఉంది. కాబట్టి వెనకే పరుగెత్తా. నాతోపాటు కొందరు గ్రామస్తులు కూడా వచ్చారు'' అని చెప్పారు.
మొదట అభినందన్ మట్టి రోడ్డులో పరుగెత్తారని, కొంచెం సేపటి తర్వాత దిశ మార్చుకుని పొగ వస్తున్న దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారని రెహమాన్ చెప్పారు.
''కూలిపోయిన విమానం నుంచి ఆ పొగ వస్తోంది. కొందరు గ్రామస్తులు అభినందన్ పైకి రాళ్లు విసిరారు. ఆయన పరుగెత్తుతూ ఉన్నారు. ఆ తర్వాత చిన్న కాలువ వచ్చింది. అందులో దూకారు. అందులో నీళ్లు తక్కువగా ఉన్నాయి. కొద్ది సేపు ఆగి, అక్కడ నీళ్లు తాగారు'' అని వివరించారు.
తన ఇంటి దగ్గర ఉండే మహమ్మద్ రఫిక్‌కు ఫోన్ చేసి, ఓ తుపాకీ తెమ్మని చెప్పానని రెహమాన్ అన్నారు.

తాను వెంటనే ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకుని, కాలువ వైపు పరుగు మొదలుపెట్టానని రఫిక్ చెప్పారు.
''నేను వస్తుండగానే, స్థానిక యువకులు నా దగ్గరి నుంచి తుపాకీ లాక్కున్నారు. అభినందన్‌ను కాల్చొద్దని వాళ్లకు చెప్పా. ప్రాణాలతో, సురక్షితంగా పట్టుకోవాలని చెప్పా. అభినందన్ ఓ రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయానికి సైన్యం మా ప్రాంతానికి వచ్చేసింది. సైనికుల్లో ఒకరు కూడా గాల్లోకి కాల్పులు జరిపి, నీళ్లలోకి దూకారు. 'నారా-ఎ-హైద్రీ, యా అలీ' అని అరుస్తూ ఆయన్ను పట్టుకున్నారు. అప్పుడు అభినందన్‌ను చేతిలో ఉన్న పిస్టల్ పడేసి, చేతులు పైకెత్తి లొంగిపోయారు. ఆయన్ను ఓ కారులో ఎక్కించుకుని, సైనికులు తీసుకువెళ్లిపోయారు'' అని రఫీక్ చెప్పారు.
అభినందన్ పట్టుబడ్డ ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంలో కోట్లా అనే ప్రాంతం ఉంది. ఇది నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంటుంది. మహమ్మద్ ఇస్మాయిల్ ఇక్కడ పాఠశాలను నడుపుతున్నారు.
అభినందన్ విమాన శకలాలు ఈ ప్రాంతంలోనే పడ్డాయి.

ఫొటో సోర్స్, ISPR HANDOUT
ఆ విమానం గాల్లో గింగిరాలు కొట్టడం తాను స్కూల్‌లో నుంచి చూశానని చెప్పారు ఇస్మాయిల్.
''అది ఇళ్లపైకి పడేలా వచ్చింది. దేవుడి దయ వల్ల ఎవరూ లేని ప్రదేశంలో పడింది. నేను వెళ్లేసరికి అది మండుతూనే ఉంది. ఇంకా అందులో కొన్ని పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి. దానిపై భారత జెండా ముద్ర కనిపించింది. కొన్ని గంటల పాటు ఆ విమానం మండుతూ ఉంది'' అని వివరించారు.
కొన్ని వారాల పాటు ఆ శకలాలు అలాగే ఉన్నాయని, ఆ తర్వాత పాక్ సైన్యం వచ్చి వాటిని తీసుకువెళ్లిందని ఇస్మాయిల్ చెప్పారు.
''విమానం కూలిన చోట పడిన గుంత ఇప్పటికీ ఉంది. కొన్ని శిథిలాలు కూడా ఇప్పటికీ చూడొచ్చు'' అని అన్నారు.
ఆ ప్రాంతం చాలా వారాల పాటు సందర్శక ప్రదేశంగా ఉందని, దాన్ని చూసేందుకు చాలా మంది వచ్చేవారని చెప్పారు ఇస్మాయిల్.
ఇవి కూడా చదవండి:
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - యోగి ఆదిత్యనాథ్
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








