దిల్లీ హింస: పోలీసుపై తుపాకీ గురిపెట్టిన ఈ వ్యక్తి ఎవరు? - Fact Check

ఫొటో సోర్స్, Pti
పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, (సీఏఏ) వ్యతిరేకవాదుల నిరసనలు ఈశాన్య దిల్లీలో సోమవారం హింసాత్మకంగా మారాయి. ఈ గొడవల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మొత్తం 13 మంది మృతి చెందారు. 48 మంది పోలీసులు, 90 మందికి పైగా సామాన్య ప్రజలు గాయపడ్డారు.
అయితే, ఈ ఘర్షణలు మొదలైన తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో ఎర్ర చొక్కా ధరించిన ఓ వ్యక్తి పోలీసుకు తుపాకీ గురిపెట్టాడు. అతడి వెనుక చాలామంది జనం ఉన్నారు. అతని వెంట జనాల గుంపు కదులుతున్నట్లు కనిపిస్తుంది. అతడు గాలిలోకి కాల్పులు జరుపుతున్న శబ్దం కూడా వినిపిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
'ది హిందూ' పత్రిక జర్నలిస్టు సౌరభ్ త్రివేది ఈ వీడియోను ట్వీట్ చేసి, "సీఏఏ వ్యతిరేక నిరసనకారులు కాల్పులు జరుపుతున్నారు. అందులో ఒక వ్యక్తి పోలీసులపైకి తుపాకీ గురిపెట్టాడు " అంటూ రాశారు.
ఆ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. పీటీఐ జర్నలిస్టు రవి చౌదరి కూడా ఆ వ్యక్తి ఫొటో తీశారు. కానీ, అతని పేరును వెల్లడించలేదు. అతడి పేరు మహమ్మద్ షారుఖ్ అని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. అతని వివరాలను తెలుసుకునేందుకు దిల్లీ పోలీసులను బీబీసీ సంప్రదించింది. కానీ, అటువైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కాల్పుల ఘటన గురించి ట్విటర్‌లో చాలా చర్చ జరిగింది. సీఏఏకు అనుకూలంగా ప్రదర్శన చేస్తున్నవారిలో అతడు ఒకరని, అతని వెనుక కాషాయ రంగు జెండాలు ఉన్నాయని కొందరు ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, AFP
దిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఒక ఫొటోను ట్వీట్ చేస్తూ... తుపాకీ ఎక్కుపెట్టిన ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్త అని, అతనికి కపిల్ మిశ్రాతో, బీజేపీతో సంబంధాలు ఉన్నాయని అన్నారు.
సీఏఏ అనుకూల ప్రదర్శనలో మహ్మద్ షారుఖ్ భాగమా? అతని వెనకున్న ప్రజల చేతుల్లో కాషాయ జెండాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.
ఇంగ్లిష్ వార్తాపత్రిక 'ది హిందూ' జర్నలిస్టు సౌరభ్ త్రివేది సోమవారం సంఘటనా స్థలంలో తీసిన ఈ వీడియోను బీబీసీకి చూపించారు.
"నేను అప్పుడు మౌజ్‌పూర్ నుంచి బాబర్పూర్ వెళ్తున్నాను. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ మధ్య వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని నాకు తెలిసింది. అక్కడ చాలామంది రాళ్లు రువ్వుతున్నారు. రెండు వైపుల నుంచీ జనం వస్తున్నారు. నేను ఉన్న చోట, ప్రజలు సీఏఏకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. అవతలివైపున ఉన్నవారు సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారిలో ఒకరు చేతిలో పిస్టల్ పట్టుకుని ఉన్నారు. అతని వెనకున్న జనాలు రాళ్లు రువ్వుతున్నారు. మొదట పోలీసుకు తుపాకి గురిపెట్టి పారిపోవాలని హెచ్చరించాడు. కానీ, ఆ పోలీసు అక్కడే నిలబడ్డారు. ఆ తరువాత అతడు ఎనిమిది రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు" అని సౌరభ్ వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాకు దొరికింది. ఈ వీడియో చూసిన తరువాత, ఆ సాయుధుడి వెనకున్న జనాల చేతిలో కాషాయ జెండాలు లేవని, వాస్తవానికి అవి తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు ఉన్న ప్లాస్టిక్ పెట్టెలని మాకు తెలిసింది. నిరసనకారులు రాళ్లు తగలకుండా ఆ పెట్టెలను కవచంగా వాడుతున్నారు.
మహ్మద్ షారుఖ్ కుటుంబంతో మాట్లాడేందుకు కూడా మేము ప్రయత్నించాం. కానీ, సాధ్యం కాలేదు.
అయితే, ప్రత్యక్ష సాక్షితో మాట్లాడి, వీడియోను నిశితంగా పరిశీలించిన తరువాత, మొహమ్మద్ షారుఖ్ సీఏఏ అనుకూల ప్రదర్శనలో భాగం కాదని, అతని వెనకున్న జనాల చేతుల్లో కాషాయ జెండాలు లేవన్న రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:
- బంగారం నిక్షేపాల వల్లే 'సోన్‌భద్ర'కు ఆ పేరొచ్చిందా?
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









