కరోనావైరస్ - వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది

- రచయిత, జాయిస్ లియు, గ్రేస్ సోయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వుహాన్ నగరంలో ప్రమాదకర వైరస్ ప్రబలడం మొదలైన కొన్ని వారాల తర్వాత అధికారులు బాధితులకు వ్యాధిని నిర్థరించే విధానంలో కొన్ని మార్పులు చేశారు.
వైద్యం పరీక్షలు నిర్వహించి లెక్కించిన బాధితులతో పాటు, క్లినిక్‌లలో బాధితులుగా నిర్థరించిన వారిని సైతం కరోనా వైరస్ బారిన పడినవారిగా గుర్తించడం మొదలుపెట్టారు. ఇది వైరస్ బాధితుల సంఖ్యలో భారీ పెరుగుదలకు కారణమైంది.


కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో రోగులకు తగినన్ని హాస్పిటల్ బెడ్లు దొరకలేదు. కొంతమందికి సరైన వైద్య సదుపాయాలు అందలేదు.
తమ ఆప్తులకు సరైన వైద్య సహాయం అందక తాము అనుభవించిన వేదనని ఇద్దరు వుహాన్ పౌరులు బీబీసీతో పంచుకున్నారు.
తాతయ్యా, మీ ఆత్మకి శాంతి కలగాలి:షియావు హువాంగ్
చిన్నతనంలోనే తల్లి తండ్రులు చనిపోవటంతో తాత, అవ్వల దగ్గర పెరిగారు హువాంగ్.
ఆయన కోరుకునేది.. 80లలో ఉన్న తన తాత, అవ్వల చివరి రోజులు ప్రశాంతంగా గడిచిపోవడమే.
కానీ, ఒక పదిహేను రోజుల వ్యవధిలోనే ఆయన తాతయ్య కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడి చనిపోయారు. అవ్వ చావు బతుకుల మధ్య విషమ పరిస్థితిలో ఉంది.
జనవరి 20న తాతయ్య, అవ్వ ఇద్దరికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది.
23వ తేదీ నుంచి వుహాన్ నగరాన్ని పూర్తిగా మూసివేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా లేకపోవడంతో 26 వరకు హాస్పిటల్‌కి వెళ్లలేకపోయారు.
29న డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఇద్దరికీ కరోనా వైరస్ సోకిందని తేల్చారు. కానీ మూడు రోజుల వరకు వారిని హాస్పిటల్లో చేర్చటం కుదరలేదు.
"హాస్పిటల్ ఎంతగా నిండిపోయిందంటే.. అక్కడ ఖాళీ మంచాలు లేవు. తాత, అవ్వ ఇద్దరూ అప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మమ్మల్ని హాస్పిటల్ వరండాలో ఉండమన్నారు. హాస్పిటల్ సిబ్బందిని ఎలాగో బతిమాలి ఒక వాలు కుర్చీ, ఒక మడత మంచాన్ని సంపాదించగలిగాను.
కనుచూపు మేరలో ఒక డాక్టర్ కానీ, ఒక నర్స్ కానీ లేరు" అని హువాంగ్ తన డైరీలో రాసుకున్నారు. డాక్టర్లు లేని హాస్పిటల్ స్మశానాన్ని తలపించిందని ఆయన వర్ణించారు.
మరణించడానికి ముందు రోజు రాత్రి తన తాతయ్య పడిన ఇబ్బంది అవ్వకి తెలియకుండా ఉండాలని వరండాలో అవ్వతో మాట్లాడుతూ ఉన్నానని హువాంగ్ చెప్పారు.
"చనిపోవడానికి మూడు గంటల ముందు మా తాతయ్యకి హాస్పిటల్ బెడ్ దొరికింది. ఆఖరి క్షణం వరకు నేను మా తాతయ్యతోనే ఉన్నాను."
"తాత- స్వర్గంలో విశ్రమించు - స్వర్గంలో బాధ ఉండదు" అని చైనా సోషల్ మీడియా పోర్టల్ 'వీబో'లో హువాంగ్ పోస్ట్ చేశారు.
"చాలా మంది రోగులు తమ బంధువులెవరూ పక్కన లేకుండా, కనీసం ఆఖరి చూపుకి కూడా నోచుకోకుండా చనిపోయారు."
హువాంగ్ అవ్వ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆయన పూర్తి సమయం తన అవ్వతోనే గడుపుతున్నారు.
ఈ వ్యాధికి సరైన మందు లేదు, ఆశ వదులుకోవద్దు, తను కోలుకుంటుంది అని డాక్టర్లు చెబుతున్నారని హువాంగ్ చెప్పారు.
"ఇక కాలం ఏం నిర్ణయిస్తుందో చూడాలి"
ఇంతలో హువాంగ్ కూడా అస్వస్థతకి గురై ఫిబ్రవరి 7వ తేదీ నుంచి రెండు వారాల పాటు క్వారంటైన్ ప్రక్రియ కోసం ఒక హోటల్లో అందరికీ దూరంగా ఉన్నారు.

ఆమె నోట్లో నుంచి రక్తం పడింది: డా చున్
జనవరి మొదటి వారంలో డా చున్ తల్లికి జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరం, జలుబు అయి ఉంటుందనుకుని ఆయన కుటుంబం దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కోటీ పది లక్షల జనాభా ఉన్న వుహాన్ నగరాన్ని నెమ్మదిగా కబళించిన వైరస్ గురించి వాళ్లు అంతకు ముందు ఎప్పుడూ వినలేదు.
వారం రోజుల పాటు ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ ఆమె జ్వరం తగ్గలేదు. జనవరి 20న కరోనా వైరస్ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని అధికారులు ప్రకటించాక, తన తల్లిని జ్వరంతో బాధపడే వారికి చికిత్స చేసే ఓ అవుట్ పేషెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు డా చున్.
ఛాతీ స్కానింగ్, రక్త పరీక్షలు చేసిన తర్వాత ఆయన తల్లికి కరోనా వైరస్ సోకిందని డాక్టర్లు తేల్చారు.
మా అమ్మకి ఇన్ఫెక్షన్ సోకిందంటే ఈ రోజుకీ నేను నమ్మలేకపోతున్నానని డా చున్ అన్నారు.
కానీ, నాకు మరిన్ని చేదు వార్తలు వినాల్సి వచ్చింది. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి కావల్సిన పరికరాలు లేకపోవడంతో మా అమ్మని హాస్పిటల్లో చేర్చుకోవడానికి డాక్టర్లు ఒప్పుకోలేదు. జనవరి నెలాఖరు నాటికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే పరికరాలు కేవలం 8 హాస్పిటళ్లలో మాత్రమే ఉన్నాయి.
కరోనా వైరస్‌కి వైద్యం అందించే హాస్పిటల్లో మా అమ్మని చేర్చుకోవడానికి తమకు అధికారం లేదని అక్కడి డాక్టర్లు చెప్పారు. కరోనా వైరస్ బాధితులకి బెడ్ కేటాయించే అధికారం కేవలం స్థానిక హెల్త్ కమిషన్‌కి మాత్రమే ఉంటుందని డాక్టర్లు చెప్పారు. వ్యాధి నిర్థరణ పరీక్ష తాము చేయలేమని, మా అమ్మకి బెడ్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
ఇది తన తల్లి ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదని డా చున్ అంటారు. 200 వందల మంది సభ్యులు ఉన్న 'వి చాట్' గ్రూప్‌లో బాధితుల కుటుంబ సభ్యులు ఇలాంటి బాధలనే పంచుకుంటున్నారు.
ఏ హాస్పిటల్ దగ్గరైనా బెడ్ దొరుకుతుందేమోనని మా తమ్ముడు హాస్పిటల్ దగ్గర క్యూ లైన్లలో నిల్చున్నాడు.

తన తల్లిని తీసుకుని క్లినిక్‌కి వెళ్లినపుడు వైద్యం తీసుకుంటూ కొందరు, వైద్యం అందక కొందరు తన కళ్ల ముందే చనిపోవడాన్ని చూశానని డా చున్ చెప్పారు.
"మృతదేహాలని గుడ్డలతో చుట్టి సిబ్బంది తీసుకెళ్లేవారు. వారందరివీ కరోనా వైరస్ మరణాలుగా లెక్కిస్తారో లేదో నాకు తెలియదు".
డా చున్ తల్లి పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. ఆమె నోటి నుంచి రక్తం కక్కడం మొదలైంది. ఆమె మూత్రంలో కూడా రక్తం వస్తోంది.
జనవరి 29వ తేదీన తల్లిని హాస్పిటల్లో చేర్చారు.
కానీ, తన తల్లికి హాస్పిటల్లో చేరిన తొలినాళ్లలో వైద్యం అందించడానికి తగిన వైద్య పరికరాలు లేక తక్షణవైద్యం అందలేదని ఆయన చెప్పారు.
తన తల్లి కోలుకుంటుందనే ఆశని మాత్రం ఆయన వదులుకోవట్లేదు.
(బీబీసీతో హువాంగ్, డా చున్ మాట్లాడుతున్నప్పుడు వారు సోషల్ మీడియాలో వాడే పేర్లను చెప్పారు).

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ పశ్చిమ బెంగాల్‌లోని ఈ పల్లెపై ఎలాంటి ప్రభావం చూపించింది
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
- కరోనావైరస్ ప్రభావంతో చైనాకు ఏపీ, తెలంగాణల మిర్చి ఎగుమతులు పడిపోయాయా?
- కరోనావైరస్ దెబ్బకు బుధవారం ఒక్క రోజే హుబేలో 242 మంది మృతి
- కరోనావైరస్ వైరస్ సోకిన వాళ్ల దగ్గరకు వెళ్లారా లేదా అన్నది చెప్పే యాప్
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- రైలు ప్రయాణికులను హడలెత్తించిన 'కరోనావైరస్ బాధితుడు'
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- మంట పుట్టించే ఘాటైన ఆహారాన్ని జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









