సోన్‌భద్ర: బంగారం నిక్షేపాల వల్లే ఈ ఊరికి ఆ పేరొచ్చిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రజేశ్ మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో వందల టన్నుల బంగారం నిక్షేపాలున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెబుతుండడంతో రెండు రోజులుగా సోన్‌భద్ర పేరు మార్మోగుతోంది.
బంగారం కోసం అన్వేషణలో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) గత పదిహేనేళ్లుగా సోన్‌భద్రలో పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల కిందట జీఎస్‌ఐ బృందం అక్కడ భూమి లోపల బంగారు నిక్షేపాలున్నట్లు నిర్ధరించింది.


ఈ బంగారాన్ని తవ్వాలనే ఉద్దేశంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ-వేలానికి సిద్ధమైంది.
అయితే, తాజాగా జీఎస్‌ఐ ఇక్కడ వేల టన్నుల బంగారం లేదు 160 కేజీల బంగారం దొరికే అవకాశం మాత్రమే ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, GSI
నది పేరు కూడా బంగారమే
సోన్‌భద్ర జిల్లాలో సోన్ నది ప్రవహిస్తోంది. సోన్ అంటే బంగారం అని అర్థం. సోన్‌భద్ర జిల్లా ఉత్తరప్రదేశ్‌లో దక్షిణ చివరన ఉంది. ఈ జిల్లాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. సోన్‌భద్ర జిల్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఇలా నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న ఏకైక జిల్లా భారత్‌లో ఇదొక్కటే.
పారిశ్రామిక ప్రాంతమైన ఈ జిల్లాలో సున్నపురాయి, బొగ్గు, బాక్సైట్ నిల్వలూ ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున దీన్ని 'ఇంధన రాజధాని' అంటుంటారు.
సోన్‌భద్రకు ఆ పేరు ఎందుకు పెట్టారు.. బంగారానికి, ఈ పేరుకు ఏమైనా సంబంధం ఉందా అని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ ఉపాధ్యాయ్‌ను అడిగినప్పుడు ''సోన్ నది వల్ల ఈ జిల్లాకు ఆ పేరు పెట్టారు.. ఆ నదిలో బంగారం ముక్కలు దొరుకుతుండడంతో దానికి సోన్ అనే పేరు వచ్చింది'' అంటూ నదికి, ఆ జిల్లాకు పేరెలా వచ్చిందో చెప్పారు.
సోన్ నదిలోనే కాదు మధ్యప్రదేశ్, ఒడిశాల్లోని కొన్ని నదుల్లోని ఇసుకలోనూ బంగారం దొరికన సందర్భాలున్నాయని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతం
ఈ ప్రాంతంలోని రాళ్లు నదీ ప్రవాహ ఒరిపిడికి విరిగితే అందులో బంగారం ఆనవాళ్లను గుర్తించి కొందరు ఇక్కడ గోల్డ్ వాషింగ్ (ముడి ఖనిజం నుంచి బంగారం సేకరణ) చేసేవారని, ఇటీవల కాలం వరకు ఇక్కడి గిరిజనులు రాళ్ల నుంచి బంగారం సేకరించే ప్రయత్నాలు చేసేవారని ప్రభాకర్ చెప్పారు.
అయితే, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర విభాగపు మాజీ ప్రొఫెసర్ జేఎన్ పాల్ మాత్రం సోన్‌నది వల్లే సోన్‌భద్ర అనే పేరు వచ్చినప్పటికీ ఆ నదిలో బంగారం దొరకడమనేది మాత్రం నిజం కాదన్నారు.
ఇక్కడ గోల్డ్ వాషింగ్ జరిగేదనడానికి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.
ఆగ్రా, గ్వాలియర్ నుంచి బిహార్, బెంగాల్‌లోని గంగానదీ మైదాన ప్రాంతాలవరకు ఉన్న భాగన్నంతా ఐరన్ బెల్ట్ అంటుంటారు.

ఫొటో సోర్స్, Pro. Prabhakar Upadhyay
ఇనుము ఇక్కడి ప్రాంతాల్లో విరివిగా దొరుకుతుందని ప్రొ. ప్రభాకర్ ఉపాధ్యాయ్ అంటున్నారు. గంగా పరిసర ప్రాంతాల్లో రెండో పట్టణీకరణ ఇనుము దొరకడం వల్లే జరిగిందని చెప్పారు.
‘‘సోన్‌భద్రలో సోన్‌కోర్వా అనే ప్రాంతం ఉంది. బంగారం కోసం వెతుకుతూ చాలా తవ్వకాలు జరిగాయి. ఇప్పటికీ కొన్ని అవశేషాలు దొరుకుతున్నాయి. అయితే తవ్వకాలు లోతుగా జరగలేదు. 20 అడుగుల వరకూ తవ్వి, ఎంతో కొంత బంగారం దొరికితే ఆపేస్తున్నారు. బంగారం పెద్ద మొత్తంలో ఉందని ముందు నుంచీ సంకేతాలు లభిస్తూనే ఉన్నాయి’’ అని ప్రభాకర్ ఉపాధ్యాయ్ అన్నారు.
పురాతత్వ శాఖ కూడా ఈ ప్రాంతంలో చాలా తవ్వకాలు జరిపిందని, కానీ ఖర్చులకు తగినట్లుగా ఇక్కడ బంగారం దొరకకపోవడంతో ప్రయత్నాలు ముందుకు సాగలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, sonbhadra.nic.in
‘‘నేను పీహెచ్‌డీ కోసం అక్కడికి వెళ్లా. అక్కడి కొన్ని రాళ్ల అవశేషాల్లో బంగారం పాళ్లు ఎక్కువగా కనిపించాయి. కొన్నింటిని మేం అక్కడి నుంచి తీసుకువచ్చాం. పేపర్‌వెయిట్‌లుగా వాటిని వాడుతున్నాం’’ అని ప్రభాకర్ ఉపాధ్యాయ్ చెప్పారు.
‘మైనింగ్ అండ్ మినరల్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా’ పేరుతో ప్రభాకర్ 2005లో ఓ పుస్తకం కూడా రాశారు. బంగారంతోపాటు ఇతర ఖనిజాలు కూడా సోన్‌భద్రలో ఉన్నాయని అందులో ఆయన ప్రస్తావించారు.
సోన్‌భద్ర ఆదివాసీ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ ఆదివాసీ సంస్కృతి ఉంది.
దీన్ని వెనుకబడిన ప్రాంతంగా పరిగణిస్తారు. అయితే, ఈ ప్రాంతంలో చాలా మార్పులు వచ్చాయి. సిమెంటు, ఇసుక, థర్మల్ విద్యుత్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
పురాతత్వ తవ్వకాల్లో ఇక్కడ ప్రాచీన నాగరికత ఆనవాళ్లు దొరికాయని అలహాబాద్ వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ జేఎన్ పాల్ అన్నారు. ఇక్కడ గోల్డ్ వాషింగ్ పని జరిగేదని చెబుతుంటారని, ఇది ప్రచారంలో ఉన్న విషయం మాత్రమేనని ఆయన చెప్పారు.
‘‘అశోకుడి శాసనాలు ఇక్కడ దొరికాయి. అశోకుడి పాలనలో ఇక్కడ జనాలు జీవించారనడానికి ఇది సాక్ష్యం. మౌర్యుడు, గుప్తుడి కాలంలోని వస్తువులు కూడా లభించాయి. అయితే, బంగారం దొరకడం మాత్రం ఇదే మొదటిసారి’’ అని జేఎన్ పాల్ అన్నారు.
ఇక్కడి నేలలో బంగారమే కాకుండా, యురేనియం ఆనవాళ్లు కూడా లభించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
1980ల్లో పురాతత్వ పరిశోధన కోసం తాను సోన్‌భద్రకు వెళ్లినట్లు ప్రొఫెసర్ పాల్ చెప్పారు. లోహ నిక్షేపాల కోసం అన్వేషణ సాగించామని, అప్పుడు బంగారం ఆనవాళ్లు మాత్రం దొరకలేదని ఆయన అన్నారు. ఇనుము ఆనవాళ్లు ముందు నుంచీ దొరుకుతూనే ఉన్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సోన్‌భద్ర్ జిల్లాకు దక్షిణాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపుర్, పశ్చిమాన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగరౌలీ జిల్లాలు ఉన్నాయి.
రాబర్ట్స్‌గంజ్ సోన్‌భద్ర జిల్లాకు కేంద్రం.
జిల్లాలో ని వింధ్యా ప్రాంతంలో కొన్ని ప్రాచీన చిత్రలేఖనాలున్న గుహలు కూడా ఉన్నాయి.
రాళ్లపై చిత్రలేఖనాలకు ఈ ప్రాంతం పేరు పొందింది. లఖానియా గుహలు, కైమూర్ కొండల్లో ఇవి ఉన్నాయి.

ఫొటో సోర్స్, sonbhadra.nic.in
ఈ చిత్రలేఖనాలు 4వేల ఏళ్ల క్రితం నాటివని చెబుతుంటారు. అప్పటి సంస్కృతి, విశ్వాసాలను అవి ప్రతిబింబిస్తాయి.
ఖోడ్వా కొండ, ఘోరమంగార్‌లోనూ ప్రాచీన రాతి చిత్రలేఖనాలు కనిపిస్తాయి.
ఈ ప్రాంతంలో రెండు ఆనకట్టలు కూడా ఉన్నాయి. అవే రిహంద్, బరకంధ్రా.

ఇవి కూడా చదవండి:
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- ఐసన్‌హోవర్ నుంచి ఒబామా వరకు.. భారత్‌లో అమెరికా అధ్యక్షుల పర్యటనలు ఇలా సాగాయి...
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- సీఏఏ-ఎన్ఆర్సీ: పెళ్లి, పుట్టినరోజు సర్టిఫికెట్ల కోసం హైదరాబాద్‌లో దరఖాస్తుల వెల్లువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









