సూరత్: ‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో ప్రభుత్వ ట్రైనీ మహిళా క్లర్కులకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు నిర్వహించారన్న ఆరోపణలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
సూరత్‌లో పదుల సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఫిట్‌నెస్ నిరూపణ కోసం ఈ పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చిన్నట్లు కథనాలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై అధికారిక నివేదిక 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
నెలసరిలో ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవడానికి తమ దుస్తులు విప్పించి చెక్ చేసి మానసికంగా వేధించారని గుజరాత్‌లోని భుజ్‌లోని సహజానంద్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థినులు ఆరోపణలు చేసి ఓ వారం కూడా గడవకముందే తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఉద్యోగుల సంఘం గురువారం ఈ గైనకాలజీ పరీక్షల గురించి ఫిర్యాదు చేసింది. ఈ కార్పొరేషన్‌లో దాదాపు 100 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ప్రభుత్వం నడుపుతున్న సూరత్ మున్సిపల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎస్‌డబ్ల్యూఐఎంఈఆర్) ఆసుపత్రిలో ఉద్యోగులకు ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ సందర్భంగా అభ్యంతరకర పరీక్షలు చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగులు మూడేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్నాక, ఉద్యోగంలో కొనసాగాలంటే ఈ పరీక్షలు తప్పనిసరి.


ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

పరీక్షల సమయంలో పది మంది చొప్పున బృందాలుగా విడదీసి ఓ గదిలో తమను నగ్నంగా నిల్చోబెట్టారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా వైద్యులు వచ్చి అభ్యంతరకరంగా ''ఫింగర్ టెస్ట్‌లు'' చేశారని కూడా చెప్పారు.
పరీక్షలు జరుగుతున్న సమయంలో గది తలుపు కూడా సరిగ్గా వేయలేదని, లోపల జరుగుతున్న దృశ్యాలు బయటకు కనిపించకుండా ఒక కర్టెన్ మాత్రమే అడ్డుగా ఉందని ఆ మహిళా ఉద్యోగులు ఆరోపించారు.
పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, ఆసుపత్రి వాటిని నిర్వహించిన తీరు తీవ్ర విచారకరంగా ఉందని ఉద్యోగుల సంఘం వ్యాఖ్యానించింది.
''మహిళా ఉద్యోగులకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తారని నేనూ ఎక్కడా వినలేదు. ఉద్యోగుల ఆరోగ్యం గురించి సందేహాలుంటే, తగిన రీతిలో పరీక్షలు చేయాలి'' అని ఉద్యోగుల సంఘం నాయకుడు అహ్మద్ షేక్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికతో అన్నారు.

ఇటు ఈ వ్యవహారంపై ఆసుపత్రి డీన్ వందనా దేశాయ్ బీబీసీతో మాట్లాడారు.
ఇప్పటివరకూ తమ ఆసుపత్రి 4 వేల ఫిట్‌నెస్ పరీక్షలు చేసిందని, ఒక్కసారి కూడా ఎలాంటి ఫిర్యాదూ రాలేదని ఆమె అన్నారు.
''కచ్చితంగా మేం నియమనిబంధనలు పాటిస్తాం. అందులో సందేహానికి తావులేదు'' అని అన్నారు.
20 ఏళ్ల క్రితం తాను ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకున్నానని, అప్పుడు అందులో గైనకాలజీ పరీక్షలేవీ లేవని ఓ మహిళా ఉద్యోగి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో చెప్పారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సూరత్ మేయర్ జగదీశ్ పటేల్ పీటీఐ వార్తాసంస్థతో అన్నారు.
''మహిళా ఉద్యోగుల ఆరోపణల్లో నిజం ఉందని తేలితే, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని చెప్పారు.
ఇటు ఆరోపణలపై విచారణ జరిపి, నివేదిక అందజేసేందుకు సూరత్ మున్సిపల్ కమిషనర్ బంచ్చానిధి పానీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:
- పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
- ఈ కొండల కింద టన్నుల కొద్దీ బంగారం...
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
- 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...
- ‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









