ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రశాంతంగా సాగుతున్న నీటి ప్రవాహంలో ఓ పెద్ద రాయి విసిరితే ఏమవుతుంది? ఒక్కసారిగా నీళ్లలో పుట్టిన తరంగాలు, అలలు అలజడిని కలిగిస్తాయి. ఆ అలలు కొంతదూరం ప్రయాణించి సద్దుమణుగుతాయి.
న్యూ దిల్లీలోని సౌత్ బ్లాక్ (రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం)లోని అధికారుల్లో చాలామందికి కూడా సుప్రీంకోర్టు తీర్పుతో ఇలాంటి అలజడే కలుగుతోంది.
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు తీర్పునిచ్చే సమయంలో వారంతా చాలా జాగ్రత్తగా దాన్ని విన్నారు.


తీర్పు అనంతరం "హృదయపూర్వక స్వాగతం" అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే, అంతా అదే అభిప్రాయంతో లేరు.
"ఈ తీర్పు మమ్మల్ని మరింత మరింత ముందుకు తీసుకెళ్తుంది. మనం ఓ కొత్త చోటులో అడుగుపెడుతున్నాం. ఇది సుప్రీంకోర్టు తీర్పు. కాబట్టి అమలు చేయాలి. మా న్యాయ నిపుణులు దీన్ని పరిశీలిస్తారు. అయితే, మహిళాధికారులు ఉండకూడదు అని సైన్యం అనుకోవడం లేదు. 1992 నుంచే సైన్యంలో మహిళల నియమాకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూడా ఈ తీర్పు వచ్చే ముందు వరకూ కూడా మేం ఎన్నో చర్యలు చేపట్టాం. మేం ఈ విషయంలో నెమ్మదిగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించినా చాలా విశ్వాసంతో ఉన్నాం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఏం జరిగింది?
భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
భారత సైన్యంలో పనిచేస్తున్న అందరు మహిళాధికారులకు వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ వర్తింపజేయాలని కోర్టు వెల్లడించింది.
ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలుచేయాలని సూచించింది.
ప్రస్తుత తీర్పుతో సైన్యం పురుషులతో సమానంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
దీన్ని మరింతగా చర్చించే ముందు, అసలు 'శాశ్వత కమిషన్' అంటే ఏంటో తెలుసుకోవాలి.
సైన్యంలో ర్యాంకులను నిర్దేశించేది ‘శాశ్వత కమిషన్’. శాశ్వత కమిషన్ లేకపోతే సిబ్బంది త్వరగా పదవీ విరమణ చేస్తారు. లేదా బలవంతపు ఉద్వాసనకు గురికావచ్చు.
శాశ్వత కమిషన్ మంజూరైన మహిళా అధికారులకు పదోన్నతులు సహా అన్ని రకాల ప్రయోజనాలు వర్తింపజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సర్వీసులో ఉన్నవారితోపాటు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించి, అంశం పెండింగ్‌లో ఉన్న సమయంలో పదవీవిమరణ పొందిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.
అయితే, ఇవి సైన్యంలో మహిళలను అనుమతించిన విభాగాలకు మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతానికి జడ్జ్ అడ్వొకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్, సిగ్నల్స్, ఇంజినీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డినెన్స్ కోర్, ఇంటెలిజెన్స్ దీని పరిధిలో ఉన్నాయి.
క్షేత్ర పోరాట విధులను నిర్వర్తించే పదాతిదళం, ఆర్టిలరీ, ఆర్మర్డ్ కోర్ విభాగాలను ఇందులో చేర్చలేదు.
పరిమిత సర్వీస్ కమిషన్‌పై సైన్యంలో చేరిన మహిళలందరినీ శాశ్వత కమిషన్‌కు పరిగణించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏం జరగలేదంటే..
‘వివిధ ఉద్యోగ నియామకాల్లో’ మహిళలకు అవకాశం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఇదివరకు సుప్రీం కోర్టుకు తెలిపింది. అంటే, పరోక్షంగా దాని అర్థం ‘కమాండింగ్ రోల్స్’లో ఆ అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమనే.
‘కమాండ్ నియామకాలు’ ఎంతో కీలకం. దీనివల్ల ఆఫీసర్ల ప్రమోషన్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
ఆఫీసర్ కేడర్‌లో మాత్రమే మహిళలకు సైన్యంలో ప్రవేశం కల్పిస్తున్నారు. జవాన్లుగా (ఇతర ర్యాంకులు) అవకాశం ఇవ్వడం లేదు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మహిళలకు బెటాలియన్ కమాండర్ సహా అన్ని రకాల పోస్టులకు అర్హత ఉంది. అయితే, వారిని అనుమతించిన విభాగాలకే అది పరిమితం.

ఫొటో సోర్స్, Getty Images
తదుపరి జరిగేదేంటి..
రాబోయే కొన్ని రోజులు, వారాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.
ద్వారాలు తెరవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూనే, సరిహద్దుల్లో ఉన్న సవాళ్ల గురించి సైన్యం ప్రస్తావిస్తోంది.
నియంత్రణ రేఖ వెంబడి, సియాచిన్‌లో, చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద మహిళలను పోరాట విధుల్లో నియమించేందుకు తగినట్లుగా సైన్యానికి మౌలిక వసతులు లేవని అంతర్గత వర్గాలు అంటున్నాయి.
‘‘సియాచిన్‌లో నియమిస్తే... ఓ చిన్న గుడారాన్ని ఐదుగురు జవాన్లు, ఓ మహిళా అధికారి పంచుకోవాలి. నియంత్రణ రేఖ వద్ద ఒకే బంకర్‌లో ఉండాలి. అందుకే, దీనికి ఇంకా సమయం పడుతుంది’’ అని ఓ అధికారి అన్నారు.
ఎటూ క్షేత్ర పోరాట విధుల్లో అవకాశాలు మహిళలకు దూరమయ్యాయి. అనుమతించిన విభాగాల్లో భాగంగానైనా ‘క్రియాశీల ప్రాంతాలకు’ దగ్గరగా పనిచేసే అవకాశాలు వారికి రావాలి.
పురుషులతో సమానత్వం కల్పించారు కాబట్టి, అనుమతించిన విభాగాల్లో మహిళలు కమాండింగ్ అధికారులుగా మారతారు.
ఇది సైన్యానికి చాలా కొత్త విషయం.
కమాండింగ్ అధికారి హోదాలో పురుషుల్లాగే కఠినమైన ప్రాంతాల్లోని సేనలను సందర్శిస్తూ మహిళలు కనిపించాలి.
ప్రాధాన్యం పెరుగుతుంది కాబట్టి సైన్యంలో చేరేందుకు మహిళలు మరింత ఆసక్తి చూపుతారు.

వాయు సేన, నౌకాదళంలో పరిస్థితి ఇది..
ఫైటర్ విమానాలు నడపడం సహా అన్ని విభాగాల్లోనూ మహిళలకు వాయుసేన అవకాశం కల్పిస్తోంది.
అయితే, అధికారి పోస్టులకు మాత్రమే వారిని తీసుకుంటోంది. అదర్ ర్యాంక్స్‌లో తీసుకోవడం లేదు.
అధికారుల సంఖ్యాపరంగా చూస్తే వాయుసేనలోనే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. 2019 జూన్ నాటికి వాయుసేనలో మహిళల శాతం 13.28 గా ఉంది.
నౌకాదళంలో మహిళలు 6.7 శాతం ఉన్నారు. సైన్యంలో వారి వాటా 2019, జనవరి నాటికి 3.89 శాతం.
‘సీ గోయింగ్’ విభాగాల్లో నౌకాదళం మహిళా అధికారులను అనుమతించడం లేదు.
రాబోయే రోజుల్లో పురుషులతోపాటు మహిళా అధికారులకూ శిక్షణను ఇచ్చేందుకు వీలుగా నౌకాదళం శిక్షణ నౌకలను సమరకూర్చుకుంటోంది. అన్ని విభాగాల్లో మహిళలను అనుమతించే దిశగా అడుగులు పడేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని రక్షణశాఖ గత ఏడాది మార్చిలో వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి.
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
- శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- నా తల్లిని ఎందుకు చంపారు... ఎంతోకాలంగా వాళ్లను అడగాలనుకున్న ప్రశ్న ఇది
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- బెంగాల్ మదరసాల్లో హిందూ విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
- పాకిస్తాన్లో క్షమాభిక్షలు కొనుక్కుంటున్న హంతకులు
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- సెక్స్ వర్కర్లకు విముక్తి: బలవంతంగా ‘చాకిరీ’ చేయించే విధానం రద్దు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









