భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎంతమంది? - ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ హక్కుల విషయంలో భారత్ చేపడుతున్న చర్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
అక్రమంగా వలస వచ్చిన అందరికీ పౌరసత్వం ఇవ్వడమంటూ మొదలుపెడితే బంగ్లాదేశ్ సగం ఖాళీ అయిపోతుందని భారత హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.
భారత్ పౌరసత్వం ఇవ్వడమంటూ మొదలుపెడితే బంగ్లాదేశ్ సగం ఖాళీ అయిపోతుంది.
దీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తమ దేశం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు భారత్ వెళ్లాలని ఎందుకనుకుంటారు అని ప్రశ్నించింది.
ఆ దేశ హోం మంత్రి అసదుజ్‌జమాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు భారత్ వలస వెళ్లాల్సినంతగా బంగ్లాదేశ్ ఏమీ పేద దేశం కాదన్నారు.
భారత్‌కు మా ప్రజలు అక్రమంగా వలస వెళ్లడానికి బంగ్లాదేశ్ ఏమీ పేద దేశం కాదు
ఈ నేపథ్యంలో అసలు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలసలు ఏ స్థాయిలో ఉన్నాయి? రెండు దేశాల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం



ఫొటో సోర్స్, Getty Images
ఎంతమంది బంగ్లాదేశీలు భారత్‌లో అక్రమంగా ఉంటున్నారు?
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీల సంఖ్య విషయంలో వివాదం, గందరగోళం రెండూ ఉన్నాయి. 2014లో అప్పటి హోంశాఖ సహాయ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో 1.2 కోట్ల మంది బంగ్లాదేశీలు భారత్‌లో అక్రమంగా ఉంటున్నారని చెప్పారు.
ఆయన సమాధానంపై పశ్చిమబెంగాల్, అస్సాం ప్రభుత్వాలు ఆ లెక్కలపై అభ్యంతరం తెలపడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. అక్రమ వలసదారుల్లో అత్యధికులను ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు.
2016లో హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులోనే మాట్లాడుతూ.. ''అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారు 2 కోట్ల మంది భారత్‌లో ఉన్నార''న్నారు.
అయితే, ఆయన తాను చెప్పిన లెక్కలకు ఎలాంటి ఆధారాన్నీ చూపించలేదు. దీంతో అప్పటి నుంచి బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల లెక్కల్లో అస్పష్టత అలాగే కొనసాగుతోంది.
ఇక 2015-19 మధ్య పౌరసత్వానికి సంబంధించిన డేటా పెద్దగా ఈ గణాంకాలు తెలుసుకోవడానికి ఉపయోగపడలేదు.

ఆ నాలుగేళ్ల కాలంలో కేవలం 15 వేల మంది బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం లభించింది. అందులో 14880 మందికి 2015లో పౌరసత్వం ఇచ్చారు. అది కూడా బంగ్లాదేశ్‌తో సరిహద్దు ప్రాంతంలో భూమార్పిడి చేసుకోవడం వల్ల భారత్ భూభాగంలోకి వచ్చినవారే వారంతా.
అయితే, ఈ అక్రమ వలసదారులకు సంబంధించిన డేటా కచ్చితంగా లేకపోవడంతో భారత రాజకీయ నాయకులు బంగ్లాదేశీ అక్రమ వలసదారులు భారతీయుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
''వారు పేదలకు దక్కాల్సిన ధాన్యాన్ని తింటున్నార''ని ఇటీవల హోం మంత్రి అమిత్ షా అన్నారు.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది?
జీడీపీ గణాంకాల ప్రకారం చూసుకుంటే భారత్ కంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నట్లే.
అయితే, ఆర్థికాభివృద్ధి పోలికకు జీడీపీ అన్నిసార్లూ సరైన కొలమానం కాదు.
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సంపాదించకునేనాటికి ఆ దేశ జీడీపీ రుణాత్మకంగా ఉంది. కానీ క్రమంగా ఆ పరిస్థితి నుంచి కోలుకుంది.

గత దశాబ్ద కాలంలో స్థిరమైన వృద్ధి కనబరుస్తూ వచ్చిన బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటులో భారత్‌ను దాటి ముందుకెళ్లిందని గత ఏడాది సెప్టెంబరులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
2019 భారత వృద్ధి రేటు అంచనా 5.3 శాతం కాగా బంగ్లాదేశ్ అంచనా వృద్ధి రేటు 8 శాతంగా ఉంది.
వృద్ధి రేటు అధికంగా ఉండడంతో బంగ్లాదేశ్‌కు అభివృద్ధి చెందని దేశం అనే ట్యాగ్ 2018లో పోయింది.

అయినప్పటికీ 2018లో దక్షిణాసియాలో అత్యధిక ద్రవ్యోల్బణ రేటు 5.8 శాతం ఉన్నది బంగ్లాదేశ్‌కే.. ఆ ఏడాది భారత్‌లో ద్రవ్యోల్బణం 3.4 శాతం ఉంది.
అంతేకాదు.. 2018లో భారత్‌లో నిరుద్యోగిత రేటు కంటే బంగ్లాదేశ్‌లో అధికంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర కొలమానాల ప్రకారం చూస్తే..
సామాజికాభివృద్ధి సూచీల్లో భారత్ కంటే బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది. శిశు మరణాలు భారత్ కంటే బంగ్లాదేశ్‌లో తక్కువ. 2020 జండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం భారత్ 112వ స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 50వ స్థానంలో ఉంది.
ఇక పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం విషయంలోనూ బంగ్లాదేశ్ భారత్ కంటే ఎంతో ముందుంది. బంగ్లాదేశ్ పార్లమెంటులో 22 శాతం మంది మహిళలు ఉండగా భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 13 శాతమే.

ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- పౌరసత్వ సవరణ బిల్లు: ఇతర దేశాల్లో మైనారిటీల గురించి భారత్ వాదనలో నిజమెంత...
- రాజస్థాన్‌లో దళిత యువకులపై దాడి: 'మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు'
- భారతీయ ప్రాచీన చిత్రకారుల అద్భుత కృషి 'కంపెనీ పెయింటింగ్స్' పేరుతో ఎందుకు మరుగున పడింది?
- 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?
- కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- ఈ కొండల కింద టన్నుల కొద్దీ బంగారం...
- ‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









