దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో ఇప్పుడు జరిగినంత హింస దశాబ్దాల కాలంలో ఎప్పుడూ జరగలేదు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేకుల, అనుకూలుర మధ్య చిన్న ఘర్షణలుగా మొదలైన ఈ హింస వెనువెంటనే హిందూ-ముస్లింల మధ్య పూర్తిస్థాయి మత ఘర్షణల రూపం తీసుకుంది.
సాయుధ అల్లరి మూకలు అడ్డే లేదన్నట్లు పేట్రేగిపోగా, హింసను నిరోధించడానికి పోలీసులు తగిన విధంగా స్పందించలేదని తెలుస్తోంది.
మసీదులు, ఇళ్లు, దుకాణాలపై అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. కొన్నిసార్లు పోలీసుల కళ్ల ముందే ఈ దాడులు జరిగాయనే ఆరోపణలున్నాయి.
దాడుల వార్తలు అందిస్తున్న జర్నలిస్టులను విధ్వంసకారులు ఆపి, "మీ మతం ఏమిటి" అని అడిగారు. గాయపడ్డ ముస్లింలను జాతీయ గీతం ఆలపించాలని అల్లరి మూక బలవంతపెడుతున్న, ఓ యువకుడిని కర్కశంగా కొడుతున్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. భయాందోళనతో ఉన్న ముస్లింలు, అన్ని మతాలవారు నివసించే ప్రాంతాలను వదిలివెళ్లడం మొదలైంది.


ఘర్షణలు మూడు రోజులపాటు కొనసాగి 20 మందికి పైగా చనిపోయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ట్విటర్లో స్పందిస్తూ- శాంతియుతంగా ఉండాలంటూ తొలిసారిగా పిలుపునిచ్చారు. బాధితుల పట్ల సానుభూతిగాని, విచారంగాని వ్యక్తంచేయలేదు.
దిల్లీ పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. దిల్లీ పోలీసుల ఘోర వైఫల్యాన్ని, ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి వీధుల్లో కలియతిరిగి ఉద్రిక్తతలను చల్లార్చలేకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.
ఒకవైపు అల్లరిమూకలు అడ్డూ అదుపూ లేదన్నట్లు రెచ్చిపోగా, మరోవైపు బాధితులు నిస్సహాయులైపోయారు.

ఫొటో సోర్స్, Reuters
దిల్లీ హింసను భారత్‌లో జరిగిన రెండు అత్యంత దారుణమైన మత ఘర్షణలతో పోలుస్తున్నారు. ఈ పోలిక ఆశ్చర్యకరమేమీ కాదు.
1984లో దిల్లీలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా గార్డులు కాల్చి చంపేసిన తర్వాత జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపు మూడు వేల మంది ప్రజలు చనిపోయారు.
2002లో గోధ్రాలో రైలు దహనంలో 60 మంది హిందూ యాత్రికులు చనిపోయిన తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించారు. మృతుల్లో అత్యధికులు ముస్లింలు. అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
1984 దిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్లలో, 2002 గుజరాత్ అల్లర్లలో పోలీసుల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి.
ప్రస్తుత దిల్లీ హింసపై వ్యాజ్యాలను విచారిస్తున్న దిల్లీ హైకోర్టు- 1984 తరహా హింసను తాము మరోసారి జరగనివ్వజాలమని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, AFP
దిల్లీ అల్లర్లు 1984, 2002 నరమేధాల (పోగ్రమ్) మాదిరి కనిపిస్తున్నాయని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్ అయిన అశుతోష్ వార్ష్‌ణేయ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో మతహింసపై ఆయన విస్తృతంగా పరిశోధిస్తూ వస్తున్నారు.
అల్లర్లను అడ్డుకొనేందుకు పోలీసులు తటస్థ వైఖరితో చర్యలు తీసుకోకపోయినా, అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు వాళ్లు ప్రేక్షక పాత్ర వహించినా, కొన్ని సందర్భాల్లో మూకలకు సాయపడినా ఇలాంటి మారణకాండ జరుగుతుందని ప్రొఫెసర్ అశుతోష్ చెప్పారు. గత మూడు రోజుల్లో దిల్లీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు స్పష్టమైంది. "ప్రస్తుత దిల్లీ ఘర్షణల హింస 1984 దిల్లీ లేదా 2002 గుజరాత్ హింస స్థాయికి చేరుకోలేదు. ఈ హింస మరింతగా పెరగడాన్ని నివారించడంపై దృష్టి కేంద్రీకరించాలి" అని ఆయన సూచించారు.
ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరంలోని నియోజకవర్గాల్లో పర్యటించిన రాజనీతి శాస్త్రవేత్త భాను జోషి, మరికొందరు పరిశోధకులు- బీజేపీ యంత్రాంగం ప్రజల్లో లేనిపోని అనుమానాలు, మూస ఆలోచనలు, నిష్కారణ భయం కలిగించేలా ప్రచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఓ ప్రాంతంలో బీజేపీ మహిళా కౌన్సిలర్ ఒకరు ఓటర్లతో- "మీకు, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు, డబ్బు ఉన్నాయి. ఉచితాల (ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఉచిత్ విద్యుత్, ఉచిత నీరు విధానాలనుద్దేశించి) గురించి ఆలోచించడం మానేయండి. ఈ దేశమే లేకుండా పోతే, ఉచితాలూ ఉండవు" అని చెబుతుండటం వారి దృష్టికి వచ్చింది.
భారత్ అత్యంత భద్రంగా ఉన్న తరుణంలో దేశ భద్రత గురించి సృష్టించిన ఇలాంటి భయం ఇప్పటికే ఆయా వర్గాల మధ్య ఉన్న విభజనను పెద్దది చేస్తోందని, మనుషుల్లో అనుమాన బీజాలు నాటుతోందని భాను జోషి చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాలపై- ప్రజల్లో మత ప్రాతిపదికన చీలిక తెచ్చే విధంగా దిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం సాగించింది. బీజేపీ నాయకులు యథేచ్ఛగా విద్వేష ప్రసంగాలు చేశారు. వారిని ఎన్నికల కమిషన్ మందలించింది.
సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో ముస్లిం జనాభా అధికంగా ఉండే షాహీన్‌బాగ్‌లో మహిళలు చేపట్టిన నిరసనను బీజేపీ నాయకులు ప్రచారంలో ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. నిరసనకారులను దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు యత్నించారు.
"ఈ ప్రచారం వల్ల లేనిపోని అనుమానాలు, విద్వేషం సాధారణమైపోయాయి. వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ పేజీల్లో, కుటుంబాల్లో జరిగే సంభాషణల్లో ఇవి కనిపించాయి" అని భాను జోషి వివరించారు.
దిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను మూడు రోజుల్లో పోలీసులు ఎత్తేయించకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులను బీజేపీ నాయకుడు ఒకరు ఆదివారం హెచ్చరించారు. ఆ మరుసటి రోజే ఘర్షణల వార్తలు వెలువడ్డాయి. అనంతరం మత ఘర్షణలతో పెద్దయెత్తున హింస చోటుచేసుకొంది.

ఇవి కూడా చదవండి:
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
- దేవుడికే లక్షలు దానం చేస్తున్న బిచ్చగాడు
- మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్
- కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- దిల్లీ హింస వెనక కుట్ర ఉందన్న సోనియా గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









