దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది?

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
మంగళవారం రాత్రి దిల్లీలో జరిగిన హింసను నిరసిస్తూ కొందరు హైదరాబాద్‌లో కొవ్వొత్తులతో రోడ్లపైకి వచ్చి నిరనసలు తెలిపారు. అయితే వారు తమ నిరసనను తెలియజేయడం అంత సులభంగా జరగలేదు. సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటూ పీపుల్స్ ప్లాజా వద్ద కలవాలని నిర్ణయించుకున్నారు.
కానీ వారు అక్కడకు చేరుకోవడం ఇలా మొదలయ్యిందో లేదో... పోలీసులు వెంటనే వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. జనం గుమికూడకుండా పెద్ద సంఖ్యలో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే కొద్ది సేపట్లోనే నగరంలో ఒక్క చోట కాదు ఏకంగా మొత్తం 3 ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ ర్యాలీలలో పాల్గొన్నారు.


2 నెలలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు
2019 డిసెంబరు 20 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో అయితే దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో కనపిస్తునే ఉన్నాయి.
జనవరి 10న ట్యాంక్ బండ్ పై వేలాది మందితో జరిగిన భారీ నిరసన ప్రదర్శన కావచ్చు. లేదా రచయతలు, కవులూ ఒక్క చోట చేరి సీఏఏకి నిరసనగా నిర్వహించిన కవి సమ్మేళనం కావచ్చు లేదా పోలీసుల్ని తరచు చికాకు పెట్టే ఫ్లాష్ మాబ్‌లు కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో నిరనస ప్రదర్శనలు జరుగుతూనే వస్తున్నాయి.
అప్పుడూ ఇప్పడూ ఒకేలా ఉన్నాయి
తన రెండేళ్ల కొడుకును ఇంట్లో వదలి, రోజూ ఏదో ఒక చోట సీఏఏకి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు షిబా మినాయ్. అందరిలోనూ అభద్రత, భయాందోళనలున్నాయని... దిల్లీలో తాజా హింసకు ఆ భయాలే కారణం అంటున్నారు షిబా.
అందరూ గుంభనంగా ఉన్నారు. ద్వేషం, చిరాకు, విరక్తి అనేవి చాలా చిన్న మాటలు. గొడవలు అప్పుడూ ఇప్పుడు ఒకేలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను ఐదేళ్ల వయసులో ఉండగా హైదరాబాద్‌లో తలెత్తిన ఘర్షణల్ని షిబా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాము హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండేవాళ్లమని, సరిగ్గా రాత్రి గొడవలు జరుగుతాయనగా తన ఇంటితో సహా మరొకరి ఇంటిపై నల్లటి గుర్తులు వేశారని చెప్పారు. వెంటనే తాము ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు.
ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్న షిబాపై ఇప్పటికై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ''ప్రజాందోళనలకు మేం గొంతుక కావాలి" ఇది ఆమె మాట. సీఏఏ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాటలు బాగానే చెబుతోందని కానీ మేం చేతల్లో ఆశిస్తున్నామని షిబా చెప్పుకొచ్చారు .
వాళ్లు సీఏఏకి వ్యతిరేకమని చెబుతున్నారు కానీ సమస్య కేవలం సీఏఏతో మాత్రమే కాదు, ఎన్పీఆర్, ఎన్నార్సీల యొక్క విస్తృత రూపమే సీఏఏ. అందుకే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు జనంలో నమ్మకాన్ని కల్గించలేకపోతున్నాయన్నారు. ఎంతో మంది హిందువులు, సిక్కులు తమకు మద్దతిస్తున్నారని చెప్పారు. దిల్లీ ఘటనలతో దేశమంతా ఏకమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు.

హైదరాబాద్లో తరచుగా జరిగే ఫ్లాష్ మాబ్ నిరసనల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు ఫహీమ్. డిసెంబర్ నుంచి సీఏఏపై నిరసనలు జరుగుతున్నా వాటి గురించి హైదరాబాద్‌కి ఏమీ పట్టడం లేదని ఆయన అంటున్నారు. జో హోగా... దేఖా జాయేగా... అన్నట్టు హైదరాబాదీల తీరు ఉంటోందని చెప్పుకొచ్చారు.
జనం పెద్దగా పట్టించుకోడవం లేదు కనుక దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై పెద్దగా ఉండదని బీబీసీకి చెప్పారు.
20 రోజులుగా స్వచ్చంద నిరనస
గత 20 రోజులుగా చార్మినార్ దగ్గర వ్యాపారులు స్వచ్చందగా నిరసన చేస్తున్నారు. రోజూ రాత్రి పూట పావుగంట సేపు లైట్లు ఆర్పేసి వారు సీఏఏకి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. తక్కువలో తక్కువగా తాము చేయగలిగింది ఇదే అన్నారు ఒక వ్యాపారి. తాము ఇలా చెయ్యడాన్ని గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి చెయ్యొద్దంటూ బలవంతం చేస్తున్నారని బీబీసీకి ఆయన చెప్పారు. అయితే మా నిరసనలకు హిందువులు కూడా తమ సంఘీభావం తెలపడం తమకు ఎంతో ఆనందం కల్గిస్తోందని అన్నారు.

మరోవైపు సీఏఏ విషయంలో హిందువులు అనుసరిస్తున్న తీరు తనకు చాలా నిరాశనకు కల్గిస్తోందన్నారు స్థానిక వ్యాపారి నారాయణ. తాను సీఏఏ నిరసనల్లో పాల్గొంటున్నానని, కానీ దిల్లీ ఘర్షణలు తన నమ్మకాన్ని వమ్ము చేశాయని బీబీసీకి చెప్పారు. అవి కచ్చితంగా ప్రణాళిక ప్రకారం చేసిన గొడవలే. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు నా అభిప్రాయంతో ఏకీభవించరని, హిందువులకు ప్రమాదం ఉందన్న ఓ తప్పుడు ప్రచార ప్రభావం వారిపై ఎక్కువగా ఉండటం దురదృష్టకరమని అన్నారు.
ప్రజలకు అసౌకర్యం కల్గించే ప్రదర్శనలను అనుమతించం- హైదరాబాద్ పోలీసులు
మరోవైపు ప్రజలకు అసౌకర్యాన్ని కల్గించే ఎటువంటి నిరసన ప్రదర్శనలకు అనుమతిచ్చేది లేదని హైదరాబాద్ సిటీ పోలీసులు పదే పదే చెబుతూ వస్తున్నారు . అంతే కాదు నగరం మొత్తం గస్తీని పెంచారు కూడా. నగర కమిషనరే స్వయంగా హైదరాబాద్ పాత బస్తీలో జరుగుతున్న పెట్రోలింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అటు దిల్లీ ఘర్షణలపై రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "దేశ రాజధాని దిల్లీలో ఘర్షణలు తీవ్ర బాధాకరం, మనం భారతీయులం ఎంత సున్నితమైన, దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నామో ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. భారతీయుల ప్రాణాలు, భారతదేశ ప్రతిష్ట, రెండిటినీ ఫణంగా పెట్టాం. ప్రపంచం అంతా చూస్తోంది. బేధాభిప్రాయాలను నాగరికంగా పరిష్కరించుకోవడం ద్వారా ప్రపంచపు పెద్ద ప్రజాస్వామ్యానికి మేలు చేద్దాం'' అని కేటీఆర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ''జరిగింది మత ఘర్షణలు కాదు. 2002 గుజరాత్ అల్లర్లను గుర్తు చేసే మారణహోమం'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
నిత్యం భయంతో ఎంత కాలం ?
ఇక జైదా లాంటి వ్యక్తులు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఉండటంపై కూడా పునరాలోచనలో పడుతున్నారు. తన భర్త సౌదీలో ఉద్యోగం చేస్తున్నారని, తాను కూడా డిగ్రీ చదువుకున్నానని చెప్పారు.
ఓ ఏడాదో రెండేళ్లో సౌదీలో పని చేసి తిరిగి భారత్‌కు వచ్చి స్థిరపడదామని నిన్న మొన్నటి వరకు అనుకున్నామన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని చూసిన తర్వాత వీలైనంత త్వరగా సౌదీ వెళ్లిపోదామని భావిస్తున్నట్టు బీబీసీకి చెప్పారు. కావలంటే ఖర్చుల్ని తగ్గించుకొనైనా బతకవచ్చు కానీ నిత్యం భయంతో ఎంత కాలం ఉండగలమని ఆమె ప్రశ్నించారు.
మొత్తంగా దిల్లీలో తలెత్తిన హింస ప్రభావం హైదరాబాద్‌లోనూ ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం ద్వారా అటువంటిదేం లేదన్న వాతావరణం కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ... ప్రజల మనసులో మాత్రం భయం గూడుకట్టుకుని ఉంది.

ఇవి కూడా చదవండి
- దిల్లీ హింస: సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘర్షణలు హెడ్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మృతి
- 'వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి ప్రతీక తాజ్‌మహల్' - డోనల్డ్ ట్రంప్
- భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని ప్రాణాలు పోగొట్టుకున్నారు
- దేవుడికే లక్షలు దానం చేస్తున్న బిచ్చగాడు
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- దిల్లీ హింస: కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ
- దిల్లీలో హింస: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్లకు మించి ఏమైనా చేయగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









