పన్ను సంస్కరణలపై మోదీ కీలక ప్రకటన, నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు

ఫొటో సోర్స్, NARENDRA MODI/YOU TUBE
దేశంలోపన్ను చెల్లింపుదారుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ‘ట్రాన్సపరెంట్ టాక్సేషన్-ఆనరింగ్ ద ఆనెస్ట్’( నిజాయితీపరులకు గౌరవం) అనే వేదికను ప్రారంభించారు. “దేశంలో జరుగుతున్న నిర్మాణ సంస్కరణల ప్రక్రియ ఇప్పుడు ఒక కొత్త దశకు చేరుకుంది. దేశంలోని నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారుల జీవితాలు సరళతరం అయినపుడు, వారు ముందుకు వెళ్లగలరు, అలా దేశాభివృద్ధి జరుగుతుంది. దేశం కూడా ముందుకు వెళ్తుంది” అన్నారు.
ప్రధానమంత్రి ఈ వేదికకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాల గురించి వివరంగా చెప్పారు.
‘ట్రాన్సపరెంట్ టాక్సేషన్-ఆనరింగ్ ద ఆనెస్ట్’ ద్వారా మూడు ప్రధాన పన్ను సంస్కరణలు ఉంటాయి. ‘ఫేస్‌లెస్ అసెస్‌మెంట్’, ‘ఫేస్‌లెస్ అపీల్’, ‘టాక్స్ పేయర్ చార్టర్’. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, టాక్స్ పేయర్స్ చార్టర్ గురువారం నుంచే తక్షణం అమలులోకి వచ్చాయి. ఫేస్‌లెస్ అపీల్ సదుపాయం సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా పౌరులకు అందుబాటులోకి వస్తుంది.
“మన పన్నుల వ్యవస్థ సీమ్‌లెస్(నిరంతరాయంగా), పెయిన్ లెస్(బాధ లేకుండా) ఫేస్‌లెస్‌గా ఉండేలా ప్రయత్నిస్తున్నామని” ప్రధానమంత్రి చెప్పారు.
సీమ్‌లెస్ అంటే ప్రతి పన్ను చెల్లింపుదారుడు గందరగోళానికి గురికాకుండా, వారి సమస్యను పరిష్కరించేలా ఆదాయ పన్ను విభాగం పనిచేయాలి. పెయిన్‌లెస్ అంటే టెక్నాలజీ నుంచి నిబంధనల వరకూ అన్నీ సులభంగా ఉండాలి. ఫేస్‌లెస్ అంటే పన్నుచెల్లింపుదారుడు, టాక్స్ ఆఫీసర్ ఎవరు అనేదానికి సంబంధమే ఉండకూడదు.
“ఇప్పటివరకూ మనం ఏ నగరంలో ఉంటే, ఆ నగర ఆదాయ పన్ను విభాగం మన స్క్రూటినీ, నోటీస్, సర్వే, జప్తు లాంటి పనులు చూసుకునేది. వీటిలో ఆ నగరానికే చెందిన పన్ను విభాగం అధికారి కీలక పాత్ర పోషించేవారు. ఇప్పుడు ఆ పాత్ర ఒక విధంగా అంతమైపోయింది. ఇప్పుడు స్క్రూటినీ కేసులను దేశంలో ఏ ప్రాంతంలోనో ఉన్న ఏ అధికారికో కేటాయిస్తారు. వచ్చే ఆదేశాలను వేరే రాష్ట్రానికి చెందిన బృందం సమీక్షిస్తుంది” అని మోదీ చెప్పారు.
ఈ ఫేస్‌లెస్ టీమ్ ఎవరు అనేది కంప్యూటర్ నిర్ణయిస్తుంది. దానివల్ల పన్ను చెల్లింపుదారుడు, ఆదాయ పన్ను విభాగం రెండింటికీ చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే విభాగంలోవారితో పరిచయాలు పెంచుకోవడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం లాంటి వాటికి తెరపడుతుంది. విభాగం అనవసర న్యాయపరమైన చర్యల నుంచి బయటపడుతుంది. కేసులను బదిలీ చేయడానికి ఉపయోగించే ఎనర్జీ కూడా ఆదా అవుతుంది.
టాక్స్ పేయర్ చార్టర్ గురించి మాట్లాడిన ప్రధాని, దానిని పన్నుచెల్లింపుదారుడి హక్కులు, బాధ్యతను, ప్రభుత్వ బాధ్యతలను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పన్ను చెల్లింపుదారుడికి గౌరవం
దీని ద్వారా పన్ను చెల్లింపుదారుడి పట్ల న్యాయమైన, మర్యాదపూర్వకమైన, హేతుబద్ధ ప్రవర్తన ఉంటుందని భరోసా ఇచ్చామని ప్రధాని చెప్పారు.
“ఇప్పుడు ఆదాయ పన్ను విభాగం పన్నుచెల్లింపుదారుడి గౌరవాన్ని సున్నితత్వంతో చూసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపన్ను విభాగం ఇప్పుడు ఏ ఆధారం లేకుండా పన్నుచెల్లింపుదారుడిని అనుమానంగా చూడలేదు. అంతేకాదు, పన్నుచెల్లింపుదారుడికి కూడా బాధ్యతలు ఉంటాయి. వ్యవస్థ పన్నులతోనే నడుస్తుంది కాబట్టి పన్ను చెల్లింపుదారుడు పన్నులు చెల్లించాలి. దానివల్ల దేశం తన బాధ్యతలను నిర్వహించి, ఉజ్వలభవిష్యత్తు దిశగా అడుగులు వేయగగలుగుతుంది. అలాగే, పన్ను సంబంధిత అంశాల్లో అపీల్ కూడా ఫేస్‌లెస్‌గా ఉంటుంది” అని ప్రధాని అన్నారు.
నమ్మకం ప్రభావం క్షేత్రస్థాయిలో దేశప్రజలపై ఎలా ప్రతిబింబిస్తుంది అనేది అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం అని ప్రధాని అన్నారు.
“2012-13లో ఎంతమంది పన్ను చెల్లించేవారో, వారిలో 0.94 శాతం మందిపై స్క్రూటినీ ఉండేది. 2018-19లో ఈ గణాంకాలు 0.26 శాతానికి తగ్గాయి. అంటే కేసుల స్క్రూటినీ, దాదాపు నాలుగు రెట్లు తగ్గింది. మార్పు ఎంత విస్తృతంగా ఉందో ఇది వివరిస్తోంది” అని వివరించారు.
“ఈ ప్రయత్నాలన్నింటి మధ్య గత 6-7 ఏళ్లలో పన్నులు చెల్లించే వారి సంఖ్యలో దాదాపు రెండున్నర కోట్ల వృద్ధి కనిపించింది. కానీ, 130 కోట్ల మంది ఉన్న దేశంలో అది ఇప్పటికీ చాలా తక్కువని కూడా చెప్పుకోవాలి. ఇంత పెద్ద దేశంలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించగల సామర్థ్యం ఉన్నవారు, ఇంకా పన్ను వలకు చిక్కడం లేదు. వారు స్వయం ప్రేరణతో ముందుకు రావాలి, ఇది నా అభ్యర్థన, ఆశ కూడా” అని ప్రధానమంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
- 12 నెలలు, 12 మంది జీవితాలు: ఒక ఏడాదిలో కశ్మీరీల పరిస్థితి ఎలా మారిందంటే...
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- చైనా నుంచి దిగుమతులు తగ్గితే.. చైనాకు భారత ఎగుమతులు పెరిగాయి.. ఎందుకు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








