కశ్మీర్: షట్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌ల మధ్య 12 నెలలు, 12 మంది జీవితాలు: ఒక ఏడాదిలో కశ్మీరీల పరిస్థితి ఎలా మారిందంటే...

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని 2019, ఆగస్టు 5న భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆ తర్వాత అక్కడ కఠినమైన కర్ప్యూను విధించింది. టెలీ కమ్యునికేషన్ సేవలను నిలిపివేసింది. వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది.

గత మార్చిలో ఈ లాక్‌డౌన్‌లో సడలింపులు మొదలయ్యాయి. అయితే, ఆ తర్వాత కరోనావైరస్ వ్యాప్తి కారణంగా మరోసారి లాక్‌డౌన్ విధించారు.

గత 12 నెలలను కశ్మీరీలు షట్‌డౌన్‌లు, ఆగ్రహావేశాలు, ఆందోళనల నడుమ గడిపారు.

ఈ నేపథ్యంలో వారి జీవితాల్లో వచ్చిన వార్పులు తెలుసుకునేందుకు, బీబీసీ 12 మంది కశ్మీరీలతో మాట్లాడింది.

సనా ఇర్షద్ మట్టూ
ఫొటో క్యాప్షన్, సనా ఇర్షద్ మట్టూ

సనా ఇర్షద్ మట్టూ, 26

‘‘నేను పని చేస్తున్న రంగంలో వృత్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని విడదీయలేం’’ అని అంటున్నారు సనా ఇర్షద్ మట్టూ. నాలుగేళ్లుగా ఆమె జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

‘‘ఇదివరకు కూడా మేం లాక్‌డౌన్‌లు చూశాం. కానీ, గడిచిన ఏడాది కాలం మాత్రం భయాందోళనల వాతావరణంలో బతికాం. అసలేం జరుగుతుందో మాకు తెలియలేదు. కమ్యునికేషన్ మార్గాలన్నీ నిలిపివేశారు. మా వాణిని బయటకు వినిపించేందుకు మేం కొత్త మార్గాలను వెతుక్కున్నాం’’ అని మట్టూ అన్నారు.

భద్రతా దళాలు సాధారణంగానే తమలాంటి రిపోర్టర్లతో కఠినంగా వ్యవహరిస్తుంటారని, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత వారి తీరు మరింత తీవ్రంగా మారిందని ఆమె చెప్పారు.

‘‘ఇప్పుడు జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేస్తున్నారు. సమాచారం ఇస్తున్నవాళ్లెవరో చెప్పాలని బలవంతం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలంటే, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. నిత్యం భయం మధ్యే ఉంటున్నాం’’ అని మట్టూ చెప్పారు.

‘‘మా ఇంట్లోవాళ్లు కూడా నా గురించి భయపడుతున్నారు. కానీ, నేను నా వృత్తిగత విషయాలను నా కుటుంబంతో పంచుకోను. వారితో వాటి గురించి ఏమీ మాట్లాడను. కొన్ని సార్లు వారితో అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తోంది’’ అని అన్నారామె.

అల్తాఫ్ హుస్సేన్
ఫొటో క్యాప్షన్, అల్తాఫ్ హుస్సేన్

అల్తాఫ్ హుస్సేన్, 55

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత కశ్మీర్‌లో ఆందోళనలు రేగిన సమయంలో అల్తాఫ్ హుస్సనే కుమారుడు ఉసేబ్ అల్తాఫ్ (17) ప్రాణాలు కోల్పోయారు.

తన వెంట పడుతున్న భద్రతా దళాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉసేబ్ నదిలో దూకి ప్రాణాలు కోల్పోయారు. భద్రతా దళాలు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు.

ఏడాది గడుస్తున్నా, ఉసేబ్ మరణాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు. ఉసేబ్‌ను చేర్చిన ఆసుపత్రి కూడా, ఆయన మరణానికి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది.

‘‘ఫుట్‌బాల్ ఆడతానని ఉసేబ్ బయటకు వెళ్లాడు. శవమై ఇంటికి తిరిగివచ్చాడు. పోలీసులు మాత్రం ఆ రోజు ఎవరూ చనిపోలేదని అంటున్నారు. ఘటనకు సాక్షులు ఉన్నారు. కానీ, కేసు ఫైల్ చేయడం లేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగా. అయినా, నాకు న్యాయం జరగలేదు’’ అని అల్తాఫ్ అన్నారు.

మునీఫా నజీర్
ఫొటో క్యాప్షన్, మునీఫా నజీర్

మునీఫా నజీర్, 6

ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఓ ఘర్షణలో మునీఫా చిక్కుకుంది.

ఎవరో ఉండేలుతో కొట్టిన రాయి, ఆమె కుడి కంటికి తగిలింది.

‘‘చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్నా. నాకు ఇప్పుడు ఏదీ గుర్తు లేదు. నా చదువు అంతా మరిచిపోయా. నాకు నూటికి నూరు మార్కులు వచ్చేవి. నా కన్ను బాగైన తర్వాత, వైద్యురాలిని అవ్వాలనుకుంటున్నా. నాకు వైద్యులంటే ఇష్టం. నాకు నయమవ్వడానికి వాళ్లే సాయం చేశారు’’ అని మునీఫా అంటోంది.

మునీఫా తండ్రి స్థానికంగా ఉన్న ఓ వార్తా సంస్థలో కెమెరామాన్‌గా పనిచేస్తున్నారు. మునీఫా కన్ను పూర్తిగా చూపు కోల్పోయిందని, ఫీజులు చెల్లించే పరిస్థితి లేక తనను బడి మాన్పించానని ఆయన చెప్పారు.

‘‘నాకు అంతా నీడల్లాగే కనిపిస్తోంది. పుస్తకాలు చదవలేకపోతున్నాను. ఎక్కడికీ వెళ్లలేకపోతున్నా. పదిహేను రోజులు గడిస్తే, స్కూల్‌కు వెళ్లొచ్చని వైద్యులు అన్నారు. కానీ, ఇప్పటికే ఏడాది గడిచింది’’ అని మునీఫా చెప్పింది.

ఫరూక్ అహ్మద్
ఫొటో క్యాప్షన్, ఫరూక్ అహ్మద్

ఫరూక్ అహ్మద్, 34

అహ్మద్ పేద నేపథ్యం నుంచి ఆర్థికంగా కాస్త ఉన్నత స్థితికి ఎదిగారు.

బాలుడిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని ఓ బస్టాండులో డ్రైవర్లకు ఆయన సాయం చేస్తుండేవారు.

2003లో తాను కూడబెట్టుకున్న డబ్బు, తన భార్య నగలు అమ్మి సొంతంగా ఓ బస్సు కొనుక్కున్నారు.

ఆ తర్వాత ఆయనకు ఓ వ్యాపార భాగస్వామి తోడయ్యారు. బ్యాంకు రుణం కూడా తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన దగ్గర ఏడు బస్సులు ఉన్నాయి. కాకపోతే, ఇప్పుడు అవేవీ తిరగడం లేదు. కశ్మీర్‌లో రవాణా రంగం కుదేలైపోయింది.

‘‘ఈ మధ్యే బస్సుల ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం రూ.4 లక్షలు కట్టాల్సి వచ్చింది. కానీ, ఒక్క రూపాయి ఆదాయం కూడా రాలేదు. నా ఉద్యోగుల్లో ఏడుగురు పూట గడవని పరిస్థితికి చేరుకున్నారు. నా కుటుంబ పోషణే భారంగా మారింది. వాళ్లకు నేను ఎలా సాయం చేయగలను. గౌరవప్రదమైన జీవనోపాధి పొందేందుకు నా లాంటి వాళ్లు విలువైన ఆస్తులను అమ్ముకున్నారు. అప్పులు చేశారు. సంపాదించకుండా, అప్పులు ఎలా తిరిగించాలి?’’ అని అహ్మద్ అంటున్నారు.

బ్యాంకు రుణం తీర్చేందుకు అహ్మద్ ఇప్పుడు కూలీగా పనిచేస్తున్నారు.

ఇక్రా అహ్మద్
ఫొటో క్యాప్షన్, ఇక్రా అహ్మద్

ఇక్రా అహ్మద్, 28

ఇక్రా అహ్మద్‌కు ఒకరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు. అందుకే, ఆమె సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారం పెట్టుకున్నారు.

తన పని ద్వారా కశ్మీర్ సంస్కృతిని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నానని ఆమె అంటున్నారు. తమ ఉత్పత్తులను ఆమె ఆన్‌లైన్‌లో అమ్ముతుంటారు.

‘‘ఇంటర్నెట్ షట్‌డౌన్ నా వ్యాపారానికి పెద్ద అవరోధంగా మారింది. 2జీ మొబైల్ నెట్‌వర్క్ సేవలున్నా, అవి ఎందుకూ పనికిరాలేదు. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా... ఇలా మాకు అంతర్జాతీయంగా కస్టమర్లు ఉన్నారు. కానీ, చాలా మంది కస్టమర్లు కశ్మీరీలే. 2జీ ఇంటర్నెట్ స్పీడ్‌తో వాళ్లు మా ఉత్పత్తులను మొబైల్‌లో సరిగ్గా చూడలేరు. గతంలో ప్రతి వారమూ మాకు 100-110 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు 5-6 మాత్రమే వస్తున్నాయి’’ అని ఇక్రా అన్నారు.

ఆర్డర్లు ఆలస్యమవుతుండటంపై అంతర్జాతీయ కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఇక్రా అంటున్నారు.

‘‘ఇలాగైతే ఎక్కువ రోజులు నా వ్యాపారం సాగదు. నా నెలవారీ ఖర్చులు రూ.2లక్షల వరకూ ఉంటాయి. నా వద్ద ఏడుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. నేనేమీ సంపాదించుకోలేకపోతే, వారికి ఎలా వేతనాలు ఇవ్వాలి?’’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

బాద్రుద్ దుజా
ఫొటో క్యాప్షన్, బాద్రుద్ దుజా

బాద్రుద్ దుజా, 24

‘‘ఓ న్యాయ విద్యార్థిగా, నేను రాజ్యాంగం గురించి చదువుకుంటున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రాథమిక హక్కులు, న్యాయ ప్రక్రియ గురించి చదువుతున్నా. కానీ, ఇవన్నీ కేవలం పదాలు. వారు నిర్మించిన కోట కూలుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు న్యాయ విద్య ఒక జోక్‌లాగా మారిపోయింది’’ అని బాద్రుద్ దుజా అన్నారు.

న్యాయవాది అవ్వాలన్న తన నిర్ణయం పట్ల ఇప్పుడు దుజా అసంతృప్తితో కనిపిస్తున్నారు.

‘‘మాట్లాడటం దేనికైనా పరిష్కారం. కానీ, ఇప్పుడు మాట్లాడితే జైలు పాలవ్వచ్చు. కశ్మీర్‌లో మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఓ సంస్థలో ఇంటెర్న్‌గా నేను పనిచేస్తున్నా. మీడియాతో మాట్లాడినందుకు ఓ వ్యక్తిని వ్యానులో పడేసి, పోలీసులు తీసుకువెళ్లడం నేను చూశా. మేం చట్టం గురించి చదివింది, దాన్ని కాపాడాల్సిన వాళ్లే ఉల్లంఘిస్తుండటం చూడటానికి కాదు. నేను ఇప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కుంటున్నా’’ అని ఆయన అన్నారు.

మంజూర్ భట్
ఫొటో క్యాప్షన్, మంజూర్ భట్

మంజూర్ భట్, 29

మంజూర్ భట్ జమ్మూకశ్మీర్‌లో బీజేపీ మీడియా విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్నారు.

బీజేపీలో చేరినందుకు తన కుటుంబం, స్నేహితులు తనను దూరం పెట్టారని ఆయన అంటున్నారు.

కొందరు అంటున్నట్లుగా తాను ‘నరకానికి వెళ్లనని’, స్థానిక ప్రజలకు తాను సాయపడుతున్నానని మంజూర్ భట్ అన్నారు.

‘‘అధికారమో, డబ్బు సంపాదించడమో నా లక్ష్యం కాదు. ప్రజల జీవితాలను మార్చాలి. మా యువత తుపాకులు పడుతున్నారు. ఇది పరిష్కారం కాదు. కశ్మీర్‌లో చనిపోతున్నవారు కూడా నా సోదరులే. కానీ, హింస సమాధానం కాదు’’ అని ఆయన చెప్పారు.

జావెద్ అహ్మద్
ఫొటో క్యాప్షన్, జావెద్ అహ్మద్

జావెద్ అహ్మద్, 35

శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో అహ్మద్ 25 ఏళ్లుగా పడవ నడుపుతుండేవారు. రోజూ రూ.500 దాకా వచ్చేవి.

కానీ, ఇప్పుడు పర్యాటకులు లేకపోవడంతో ఆయనకు ఉపాధి లేకుండా పోయింది.

దీంతో అహ్మద్ కూరగాయలు అమ్మడం మొదలుపెట్టారు.

తన పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందవుతోందని ఆయన అంటున్నారు.

‘‘మా భవిష్యతు నాశనమైపోయింది. భయంతో పర్యాటకులెవరూ రావడం లేదు. కశ్మీర్‌లో ఉన్న అందరికీ ఇది కష్ట కాలం. కానీ, పర్యాటక రంగంపై ప్రభావం విపరీతంగా పడింది’’ అని అహ్మద్ అన్నారు.

పడవలు నడుపుకునేవారికి రూ.వెయ్యి చొప్పున సాయం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని... కానీ, విద్యుత్ బిల్లు కట్టేందుకు కూడా అవి సరిపోవడం లేదని ఆయన అంటున్నారు.

‘‘అంతా దేవుడిపైనే వదిలేశా. ఇక నాకు ఆశలు లేవు’’ అని అహ్మద్ అన్నారు.

ఫలాహ్ షా
ఫొటో క్యాప్షన్, ఫలాహ్ షా

ఫలాహ్ షా, 12

‘‘భారత్‌లోని మిగతా ప్రాంతాల్లో విద్యార్థులకు చదువుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ, కనీస విద్యకు కూడా మేం నోచుకోలేని స్థితిలో ఉన్నాం. ముఖ్యమైన పాఠాలేవీ వినలేకపోతే, భవిష్యతులో మేం పోటీ పరీక్షల్లో ఎలా నెగ్గుతాం’’ అని ఫలా అంటున్నారు.

‘‘సైన్స్, గణితంలోని మౌలికమైన విషయాలు కూడా నాకు అర్థం అవడం లేదు. ఇంటర్నెట్ లేకపోవడంతో, వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ తిరిగివచ్చింది. కానీ, స్పీడ్ చాలా తక్కువగా ఉంది. పుస్తకంలో చదువుకుందామనుకున్నా, మౌలికమైన విషయాలు కూడా తెలియకపోవడంతో ఇబ్బంది ఎదురువుతోంది’’ అని చెప్పారు.

స్కూల్, ఉపాధ్యాయులు, స్నేహితుల లోటు తనకు తెలుస్తోందని ఫలాహ్ అంటున్నారు.

‘‘ఇల్లు వదిలి వెళ్లడమే లేదు. ఏడాదిగా ఇక్కడే ఉంటున్నా. వేరే ఏ రాష్ట్రంలోనైనా ఏడాది పాటు లాక్‌డౌన్ ఉంటే, విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసేవారు. ఇళ్లలో ఉండిపోయేవారు కాదు. కానీ, మేం ఆందోళన చేయలేం. ఎందుకంటే మమ్మల్ని జైల్లో పెట్టొచ్చు’’ అని ఆమె అన్నారు.

సాజిద్ ఫరూక్
ఫొటో క్యాప్షన్, సాజిద్ ఫరూక్

సాజిద్ ఫరూక్, 43

ఫరూక్ హోటల్ వ్యాపారంలో ఉన్నారు. తమ కుటుంబంలో ఆయన మూడో తరం వ్యాపారి.

కశ్మీర్‌లో భవిష్యత్తు తనకు ఆశాజనకంగా అనిపించడం లేదని ఫరూక్ అన్నారు.

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ మొదలైనప్పటి నుంచి, ఇక్కడున్న పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు.

‘‘ఈ హోటల్ కట్టడానికి మాకు మూడు తరాలు పట్టింది. కానీ, 1990 నుంచి మేం కేవలం కాలం వెళ్లదీస్తున్నాం అంతే. ఇప్పుడు వ్యాపారం అస్థిరమైపోయింది’’ అని ఫరూక్ అన్నారు.

‘‘హోటల్‌లో వాడుకున్నా, వాడుకోకపోయినా రూ.2 లక్షల విద్యుత్ బిల్లు మేం చెల్లించాల్సిందే. ఇతర సర్వీస్ ఛార్జీలు కూడా కట్టాలి. వ్యాపారం మెరుగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కశ్మీరీలు బాధగా ఉన్నప్పుడు, మిగతా దేశం సంబరాలు చేసుకుంటుంది. మిగతా దేశం బాధగా ఉన్నప్పుడు, మేం సంబరాలు చేసుకుంటాం. అంతా రాజకీయమైపోయింది. ప్రతి విషయంలోనూ సంఘర్షణే. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం ఎలా నడుపుకోగలం?’’ అని ఫరూక్ ప్రశ్నించారు.

బిలాల్ అహ్మద్
ఫొటో క్యాప్షన్, బిలాల్ అహ్మద్

బిలాల్ అహ్మద్, 35

బిలాల్ అహ్మద్‌ కశ్మీర్‌లో రైతు. ఆయనకు పండ్ల తోట ఉంది. కశ్మీర్ వ్యవసాయ రంగం ఆదాయంలో పండ్ల తోటల నుంచి వచ్చే వాటా ఎక్కువే.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు, లాక్‌డౌన్ వల్ల తాను ఇప్పుడు భూమి అమ్ముకునే ఆలోచన కూడా చేసే పరిస్థితి వచ్చిందని బిలాల్ అంటున్నారు.

ఈసారి త్వరగా వచ్చిన హిమపాతం వల్ల తన తోట దెబ్బతిందని, దీనికి తోడు తోటలో పనిచేసేందుకు మనుషులు కూడా సరిగ్గా దొరకలేదని ఆయన అన్నారు. ఫలితంగా దిగుబడి తగ్గిపోయిందని చెప్పారు.

‘‘యాపిల్ పండ్ల ద్వారా ఏటా రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది రూ.30 వేలు మాత్రమే వచ్చింది. నా సోదరుడైతే పండిన పంటను, కొనేవారు లేక పడేశాడు. పరిస్థితి ఇలాగే ఉంటే, నేను భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది. నేను వేరే పని చేయలేను. పెద్దగా చదువుకోలేదు’’ అని బిలాల్ అన్నారు.

మహ్మద్ సిద్దిక్
ఫొటో క్యాప్షన్, మహ్మద్ సిద్దిక్

మహ్మద్ సిద్దిక్, 49

సిద్దిక్ కుండలు తయారుచేస్తూ, జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ముడి పదార్థాలు లేక, ఆయన పని ఆగిపోయింది.

కశ్మీర్‌లో ఇసుక, రాళ్ల తవ్వకాలకు స్థానికేతర కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులు జారీ చేసింది. దీంతో సిద్దిక్ లాంటి వేల మంది స్థానికుల ఉపాధిపై ప్రభావం పడింది.

‘‘ప్రభుత్వం మట్టి తవ్వకాన్ని నిషేధించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని వాళ్లు అంటున్నారు. ఇన్నేళ్లు ఈ కోర్టులు ఎక్కడ ఉన్నాయి? నా లాంటి వాళ్ల కుటుంబాలు ఏమైపోతాయని ఆ జడ్జిలు ఆలోచించలేదా? మేం ఆకలితో చావాలనుకుంటున్నారా? లాక్‌డౌన్ కారణంగా నా ఉత్పత్తులన్నీ అమ్ముడు పోకుండా మిగిలిపోయాయి. కొత్తవి చేయడం ఆపేశా. కూలీగా పనిచేస్తున్నా’’ అని సిద్దిక్ అన్నారు.

ఫొటోలు: ఆబిద్ భట్, రిపోర్టింగ్: జహంగీర్ అలీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)