కశ్మీర్ దాడి: తాత మృతదేహం మీద మూడేళ్ల బాలుడి ఆక్రందన... వైరల్‌గా మారిన ఫొటోలు

కశ్మీర్

ఫొటో సోర్స్, TWITTER.COM/KASHMIRPOLICE

    • రచయిత, మజీద్ జహంగీర్
    • హోదా, శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక తీవ్రవాద దాడిలో ఒక వృద్ధుడు చనిపోగా, అతడి మూడేళ్ల మనుమడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వృద్ధుడి మృతదేహం వద్ద ఈ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీనగర్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో బారాముల్లా జిల్లాలో జరిగిన ఆ ఘటనలో ఒక సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దీప్ చంద్ వర్మ కూడా చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని, వారిని ఆస్పత్రిలో చేర్చామని సీఆర్‌పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

సోపోర్ పట్టణంలో పహరా విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ బృందం మీద మిలిటెంట్లు ఉదయం దాడి చేశారు.

రక్తసిక్తంగా ఉన్న తాత మృతదేహం మీద కూర్చుని దిగ్భ్రాంతితో ఉన్న మూడేళ్ల మనుమడి ఫొటోలు గుండెను పిండేసేలా ఉన్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోలీస్ సిబ్బంది ఒకరు ఆ బాలుడిని ఎత్తుకున్నారు. ఆ చిన్నారి పోలీస్ వాహనంలో ఏడుస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.

బాలుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటోలను కూడా పోలీసులు ట్వీట్ చేశారు.

మృతుడు బషీర్ అహ్మద్ కుటుంబం భద్రతా బలగాల మీద తీవ్ర ఆరోపణలు చేసింది.

‘‘ఆయనను సీఆర్‌పీఎఫ్ పోలీసులు ఆపి కారులో నుంచి బయటకు రావాలని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద కాల్పులు జరిపారు’’ అని మృతుడి భార్య బీబీసీతో చెప్పారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, MOHAMMAD ABU BAKER

‘‘కాల్పులు జరిగిన ప్రాంతానికి చెందిన స్థానికులు మాకు సమాచారం ఇచ్చారు. ఆయన కారు నడుపుతున్నట్లయితే ఆయన కారులో ఉండగానే తూటాలు తగిలేవి. కారుకు కొన్ని మీటర్ల దూరంలో తూటాలు ఎలా తగులుతాయి?’’ అని ఇతర కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.

అయితే.. ‘‘సోపోర్‌లో ఉగ్రవాద దాడి జరుగుతున్నపుడు ఓ మూడేళ్ల బాలుడికి తూటాలు తగలకుండా జేకేపీ రక్షించింది’’ అని పోలీసులు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘ఆ బాలుడిని సురక్షిత ప్రాంతానికి తరలించటానికి మేం ప్రాధాన్యం ఇచ్చాం. ఉగ్రవాదులు మాపై కాల్పులు జరుపుతుండటంతో ఆ పని చేయటం చాలా కష్టమైంది. ఆ బాలుడు తన తాతతో కలిసి హంద్వారా వెళుతున్నాడు’’ అని సోపోర్ ఎస్‌హెచ్ఓ అజీమ్ ఖాన్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

భద్రతా సిబ్బంది అమ్జద్‌ను కాల్చి చంపి.. ఆ తర్వాత అతడి మృతదేహం మీద బాలుడిని కూర్చోబెట్టి ఫొటోలు తీశారని మృతుడి భార్య ఆరోపించారు.

సీఆర్‌పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఈ ఆరోపణలన్నిటినీ ఖండించారు.

‘‘నేను, మా ఐజీ ఇప్పుడే ఘటనా స్థలం నుంచి తిరిగివస్తున్నాం. ఆ ప్రాంతాన్ని మేం చూశాం. అన్నిటినీ పరిశీలించాం. ఇదంతా ఒక అబద్ధం. అక్కడున్న ఒక మసీదును ఫజర్ (ఉదయపు ప్రార్థనలు) తర్వా మిలిటెంట్లు ఆక్రమించుకున్నారు. సీఆర్‌పీఎఫ్ అక్కడికి వెళ్లినపుడు వారి మీద కాల్పులు జరిపారు. మరణించిన పౌరుడు ఒక వాహనంలో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎదురు కాల్పుల్లో చిక్కుకున్నాడు.

కశ్మీర్

ఫొటో సోర్స్, BILALBAHADUR/BBC

మిలిటెంట్లు కాల్పులు జరిపినపుడు ఆయన కారు మధ్య నుంచి వెళుతోంది. మిలిటెంట్ల బులెట్లు అతడికి తగిలాయని మేం గుర్తించాం. సీఆర్‌పీఎఫ్ అతడిని కారు నుంచి బయటకు లాగటం కానీ, అతడి మీద కాల్పులు జరపటం కానీ జరగలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

మృతుడు తన కారును ఆపివేసి.. బహుశా భయంతో ఎక్కడన్నా తలదాచుకోవటానికి ప్రయత్నించి ఉండవచ్చునని.. ఆ సమయంలో మిలిటెంట్ల బులెట్లు అతడికి తగిలి ఉండొచ్చని ఆయన చెప్పారు.

‘‘ఎక్కడో దూరంగా కూర్చున్న వాళ్లు సీఆర్‌పీఎఫ్ అతడిని చంపిందని కట్టుకథలు సృష్టిస్తున్నారు’’ అని తప్పుపట్టారు.

పౌరుడి మరణం మీద నిర్ణీత కాలపరిమితిలో పూర్తయ్యేలా దర్యాప్తు చేపట్టాలని జమ్మూ అండ్ కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ) డిమాండ్ చేసింది.

‘‘మృతుడి కుటుంబం చెప్తున్న విషయం, పరిస్థితుల ఆధారాలు.. మృతుడిని క్రూరంగా హత్య చేశారని ప్రాధమికంగా సూచిస్తున్నాయి. పౌరుడి మరణానికి దారితీసిన పరిస్థితుల మీద నిష్పాక్షిక దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించాలి’’ అని ఆ పార్టీ ఒక ప్రకటనలో కోరింది.

కొన్ని రోజుల కిందట దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా ప్రాంతంలో ఒక సీఆర్‌పీఎఫ్ పోస్టు మీద మిలిటెంట్లు దాడి చేసినపుడపు ఆరేళ్ల బాలుడు తూటాలు తగిలి చనిపోయాడు. ఆ దాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను కూడా చనిపోయారు.

గత రెండు నెలల్లో జరిగిన రెండు ఆపరేషన్లలో మిలిటెంట్లు మసీదులను దుర్వినియోగం చేశారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలా దుర్వినియోగం చేయటాన్ని అరికట్టాలని మసీదు కమిటీలను ఆయన కోరారు.

(అదనపు సమాచారం: అమీర్ పీర్జాదా - బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)