‘ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’

- రచయిత, సో సో హటూన్, రిబెకా హెన్సెకే
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఆ రోజు గనుల్లో వందల మంది రంగురాళ్ల వేటలో ఉన్నారు. అంతలోనే అక్కడున్న కొండచరియ విరిగిపడింది. ‘సీ థూ ఫ్యో’ అక్కడి నుంచి పరుగెత్తడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే లోపలలే నీరు, బురద, రాళ్ల మధ్య కూరుకుపోయాడు.
ఉత్తర మయన్మార్‌లోని కాచిన్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతి పెద్ద జేడ్ (పచ్చలు) గనులు ఉన్నాయి. 21 ఏళ్ల ‘సీ థూ ఫ్యో’ ఈ జేడ్ గనుల్లోనే కష్టపడి పనిచేసేవాడు.
"నా నోట్లోకి బురద నీళ్లు వెళ్లిపోతున్నాయి. రాళ్లు మీద పడుతున్నాయి. వేగంగా వస్తున్న నీరు నన్ను మరింత కిందకు తోసేస్తోంది. నేను ఇక చనిపోతాననే అనుకున్నాను" అని సీ థూ అన్నారు.
ఆ రోజు ప్రమాదం నుంచి సీ థూ ఎలాగోలా తప్పించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన స్నేహితులు ఏడుగురు ఆ ప్రమాదంలో చనిపోయారని తెలిసింది.
ఈ ఏడాది జులై 2న మయన్మార్‌లో జరిగిన ప్రమాదంలో కొండ చరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్‌లో జరిగిన మైనింగ్ ప్రమాదాల్లో ఇది అత్యంత ఘోరమైనది.
‘‘మేమంతా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఒకే మంచం మీద పడుకునేవాళ్లం" అని సీ థూ తన స్నేహితులను తలుచుకుంటూ చెప్పారు.
"నేనెందుకు బతికున్నానా? అని కుమిలిపోతున్నాను. ఇదంతా ఒక పీడ కల అయితే బాగుణ్ను. ఆ రోజు ఆ ప్రమాదం జరగలేదు, నా స్నేహితులంతా బతికే ఉన్నారు అని తెలిస్తే బాగుండేది" అంటూ బాధపడ్డారు.
కాచిన్ రాష్ట్రంలోని జేడ్ గనుల్లో ఏటా వానా కాలంలో పెద్ద పెద్ద కొండ చరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోని 70 శాతం పచ్చరాళ్లు ఈ గనుల నుంచే వెలికి తీస్తారు. ఏటా వందల కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది.
ఈ రంగు రాళ్లను చైనావాసులు ఎక్కువగా ఇష్టపడతారు.

అత్యంత ఘోరమైన ప్రమాదం
జులైలో జరిగిన ఈ ప్రమాదం ఇప్పటివరకు మయన్మార్‌లో జరిగిన ఇలాంటి ప్రమాదాలు అన్నిటిలోనూ అత్యంత ఘోరమైనది.
"సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఎక్కువ మందికి తెలిసింది. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ ఫోన్లు లేకపోతే ప్రమాదం గురించి అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు" అన్నారు సీ థూ.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మయన్మార్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
దీని వెనుక కారణాలను పరిశోధించడానికి, నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించడానికీ సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి ఓహ్న్ విన్ నేతృత్వంలో ఒక బృందాన్ని నియమించింది ప్రభుత్వం.
ఈ బృందం తయారుచేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. నివేదిక ఫలితాలను ప్రజలకు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారంతా అత్యాశాపరులని మంత్రి విన్ ఆరోపించారు.
వర్షా కాలంలో గనులు అధికారికంగా మూసివేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రభుత్వం ముందే హెచ్చరించింది. "ఇదంతా అత్యాశ వలనే జరిగింది" అని మంత్రి విన్ అన్నారు.

పాకెట్ మనీ కోసం ప్రారంభించి..
యన్ నైంగ్ మ్యో అనే మరో యువకుడు చేతికి దొరికిన ఒక పెద్ద నూనె పీపాను పట్టుకుని ఆ ప్రమాదం నుంచి బతికిబయటపడ్డారు.
కొందరైతే దొర్లి వస్తున్న శవాలను ఆసరాగా చేసుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.
పర్యావరణ శాఖ మంత్రి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని యన్ నైంగ్ తెలిపారు.
"ప్రమాదం వెనక కారణాలను పరిశోధించమని ప్రభుత్వం వారికి చెప్పింది. కానీ వాళ్లు మమ్మల్ని నిందిస్తున్నారు. అసలే దుఃఖంలో ఉన్న మాకు ఇది మరింత బాధ కలిగిస్తోంది" అని యన్ నైంగ్ అన్నారు.
23 యేళ్ల యన్ నైంగ్ తలపై 14 కుట్లు పడ్డాయి. ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. ఈయన బర్మీస్ సాహిత్యంలో డిగ్రీ చేశారు. మొదట్లో పాకెట్ మనీ కోసం సెలవుల్లో జేడ్ గనుల్లో పని మొదలెట్టారు.
డిగ్రీ అయ్యాక మరే పని మీద దృష్టి పెట్టలేక జేడ్ గనులకే పరిమితమయ్యారు. ఇది తప్ప తను మరింకే పనీ చేయలేనని ఆయన భావిస్తున్నారు.
సీ థూ అంత చదువుకోలేదు. పదేళ్లకే స్కూలు మానేయాల్సి వచ్చింది. 2008 లో వచ్చిన నర్గీస్ తుఫాన్ తన కుటుంబానికి ఆధారమైన వరి చేలను నాశనం చేసింది.
అతని కుటుంబలో పది మంది సభ్యులున్నారు. అందరూ కలిసి జేడ్ గనుల పక్కనే నివాసముంటున్నారు. సీ థూ పొద్దున్నే ఐదింటికి లేచి జేడ్ వేటలో పడతాడు. ఒక్కోసారి రోజంతా పనిచేస్తూ ఉంటాడు.

అవే కారణాలు
జేడ్ గనుల్లో ఎక్కువమంది పని చేయడానికి నిరుద్యోగం, పేదరికం కారణాలు. ఆ గనుల చుట్టుపక్కల ప్రాంతాలపై మయన్మార్ ప్రభుత్వానికి నియంత్రణ తగినంత లేకపోవడంతో అక్కడ గనుల తవ్వకాలు చేపట్టగలుగుతున్నారు.
"బాధితులను నిందించడం వల్ల ప్రయోజనమేమిటి? వారు అక్కడ ఎందుకు పనిచేయాల్సి వస్తోందో కారణాలు విశ్లేషించకుండా నింద వారిపై మోపడం సమంజసం కాదు. అక్కడ చట్టం సరిగ్గా లేకపోవడం, అధికారం చలాయించడమే ముఖ్య కారణాలు’’ అని పాల్ డొనోవిట్జ్ అభిప్రాయపడ్డారు. డొనోవిట్జ్ గ్లోబల్ విట్నెస్ అనే సంస్థలో పనిచేస్తున్నారు. సహజ వనరుల దోపిడీని నిరోధించే దిశలో ఈ సంస్థ పనిచేస్తుంది.
పెద్దపెద్ద కంపెనీలు మయన్మార్ సైన్యంతో కుమ్మక్కై రహస్యంగా మైనింగ్ జరుపుతున్నాయని ఈ సంస్థ ఆరోపిస్తోంది.
స్థానిక సాయుధ తిరుగుబాటు దళాలు, మాదక ద్రవ్య విక్రయ సంస్థలు కూడా సొంత లాభాల కోసం ఈ గనుల్లో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు.
"ప్రభుత్వం ఈ గనుల వలన రావాల్సిన లాభాలను 80 నుంచి 90 శాతం కోల్పోతోంది" అని డొనోవిట్జ్ అన్నారు.
నేచురల్ రిసోర్స్ గవర్నెన్స్ ఇన్‌స్టిట్యూట్ 2019 లో చేసిన విశ్లేషణ ప్రకారం సంవత్సరానికి 1500 కోట్ల డాలర్ల జేడ్ మైనింగ్ జరుగుతోందని అంచనా. కానీ ఇందులో చాలావరకూ అక్రమ తవ్వకాలే. సంవత్సరానికి కొన్ని మిలియన్ల మైనింగ్ మాత్రమే జరుగుతోందని అధికారిక లెక్కలు చూపుతున్నాయి.

కాచిన్ గనుల్లోంచి బయటపడిన జేడ్ చాలా వరకూ చైనా సరిహద్దు దాటుతోందని భావిస్తున్నారు. చైనాలో ఎగువ తరగతిలో బంగారం కన్నా జేడ్‌కే ఎక్కువ విలువ ఉందని చెబుతారు.
2019 లో తీసుకొచ్చిన చట్ట ప్రకారం జేడ్ మైనింగ్‌లో విదేశీ పెట్టుబడులను నిషేదించినప్పటికీ చైనా మైనింగ్ కంపెనీలు జాయింట్ వెంచర్లను సృషిస్తున్నాయి. ప్రభుత్వం 25%, చైనా సంస్థ 75% వాటాలను పంచుకుంటున్నాయి అని యూ మున్ థూ చెప్పారు.
పారదర్శకత కోసం మైనింగ్ కంపెనీల యాజమాన్యాల వివరాలను ప్రభుత్వం గత ఏడాది ప్రచురించింది. అయితే 163 కంపెనీలలో 8 మాత్రమే సైన్యాధికారులు లేదా స్థానిక సాయుధ దళాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు తెలిపాయని గ్లోబల్ విట్నెట్ రిపోర్ట్‌లో తేలింది.
గ్లోబల్ విట్నెస్ రిపోర్ట్ ప్రకారం మయన్మార్ మిలటరీ యాజమాన్యంలోని సంస్థ ఎంఈహెచ్ఎల్ నమోదు వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి. ట్రిపుల్ వన్ మైనింగ్ కంపెనీ వివరాలు జాబితాలో లేనే లేవని ఆ రిపోర్ట్ తెలిపింది.

ఆశ అడుగంటుతోంది
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించేందుకు అనేక మంది కొండ చరియలు విరిగినపడిన ప్రదేశంలో గుమికూడారు. ప్రముఖ బౌద్ధ భిక్షువు సితాగూ సయాడాతో సహా 200 మంది బౌద్ధ భిక్షువులు బౌద్ధ ఆచారాలను అనుసరించి చనిపోయిన వారికి కర్మలు జరిపి నివాళులు అర్పించారు.
నివాళులు అర్పించిన వారిలో దా మూ మూ కూడా ఉన్నారు. మాండలే నుంచి 20 గంటలు ప్రయాణించి తప్పిపోయిన తన 37ఏళ్ల కొడుకు కో యార్జర్‌ను వెతికే పనిలో ఉన్నారు ఆమె.
"ఎవరైనా దొరికారన్న ప్రతిసారీ నా కొడుకేనేమోనని వెళ్లి చూస్తున్నాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పైకి, కిందకి ఎక్కి దిగి ఆమె మోకాళ్లు వాచిపోయాయి.
ప్రభుత్వం, సహాయక సంస్థలు అందిస్తున్న నష్ట పరిహారం 3,500,000 క్యాట్లు (2,500 యూఎస్ డాలర్లు) అందాలంటే ఆమెకు తన కొడుకు మృతదేహం దొరకాలి.
"నా కొడుకు ఇక లేడని నాకు తెలుసు. అతని మృతదేహం దొరుకుతుందన్న ఆశ కూడా క్షీణించిపోతోంది. నా కొడుకు గదిలో తన జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాను" అని ఆమె తెలిపారు.
ఇది జరిగిన నెల తరువాత అక్కడి ప్రజలు మళ్లీ యథావిధిగా జేడ్ తవ్వకాల వేటలో పడ్డారు. ఎంతోమంది చిన్న పిల్లలు తల్లిదండ్రులతో పాటు కొండలెక్కుతున్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసినప్పటికీ మళ్లీ ఈ ప్రమాదకరమైన పనిలో పడ్డారు.
జులైలో ప్రమాదం జరిగిన పది రోజుల తరువాత సీ థూ జేడ్ మైన్స్ దగ్గరకి వెళ్లారు. తన గాయాలు పూర్తిగా మానిపోయాక మళ్లీ పనిలోకి వెళతానన్నారు. తన స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన గోతిలోకి చూస్తూ "ఈసారి ఏదైనా చెడు జరగకముందే నేను పారిపోతాను" అన్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








