భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రతీక్ జఖార్
- హోదా, బీబీసీ మానిటరింగ్
వివాదాస్పదమైన హిమాలయ సరిహద్దుల్లో ఎవరు ఎక్కువ రవాణా సదుపాయాలను నిర్మిస్తారనే విషయంలో భారత్, చైనా పోటీ పడుతున్నాయి.
భారత్-చైనా సరిహద్దుల్లోని భారత్ వైమానిక స్థావరానికి (ఇండియన్ ఫార్వర్డ్ ఎయిర్ బేస్) వెళ్లేందుకు భారత్ ఒక కొత్త రహదారిని వేసింది. ఈ రోడ్డు నిర్మాణమే గత నెలలో గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఆ ఘర్షణలో 20 మందికి పైగా భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఎయిర్‌స్ట్రిప్ వరకు వెళ్లగలిగేలా 255 కిలోమీటర్ల పొడవున దార్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీయెస్‌డీబీఓ) రోడ్డు వేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగిన ఈ రహదారి నిర్మాణం గత ఏడాది పూర్తయ్యింది.
ఒకవేళ సరిహద్దుల్లో ఘర్షణలు ఏర్పడితే సైన్యాన్ని వేగంగా తరలించడానికి, వస్తువుల రవాణాకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది.

జూన్ 15 న జరిగిన గాల్వన్ ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండు దేశాల మధ్య 3500 కిలో మీటర్ల పొడవైన సరిహద్దు రేఖ కచ్చితంగా ఎక్కడ ఉందన్న విషయం ఎప్పుడూ వివాదాస్పదమే! దీనిపై రెండు దేశాలకు ఒక అంగీకారం లేదు. ఫలితంగా ఇరు పక్షాల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న ఘర్షణలు జరుగుతుంటాయి.
సరిహద్దు వెంబడి రవాణా సదుపాయాలు
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి రోడ్లు, రైలు మార్గాలు, వైమానిక క్షేత్రాలను నిర్మించడానికి భారత్, చైనా భారీగానే వనరులను కేటాయిస్తున్నాయి.
డీయెస్‌డీబీఓతో సహా ఈ మధ్య కాలంలో భారత్ చేపట్టిన నిర్మాణాలే చైనాకు ఆగ్రహం కలిగించాయని విశ్లేషకులు భావిస్తునారు. అయితే చాలా ఏళ్లుగా చైనా కూడా సరిహద్దుల వెంబడి ఇలాంటి నిర్మాణాలను అనేకం చేపట్టింది. రెండు దేశాలు కూడా అవతలి వైపువారు తమపై పైచేయి సాధించడానికే ఈ నిర్మాణాలు చేపడుతున్నతున్నట్టు భావిస్తున్నాయి.
2017 వేసవిలో కూడా డోక్లామ్ పీఠభూమి దగ్గర రెండు దేశాల మధ్య ఘర్షణ నెలకొనడానికి కారణం చైనా.. భారత్-చైనా-భూటాన్ సరిహద్దు దగ్గరర్లో రోడ్డు విస్తరణకు పాల్పడడమేనని వార్తలు వచ్చాయి.
లద్దాఖ్ రాజధాని లేహ్‌కు, అత్యంత కీలకమైన దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌ని కలిపే డీయెస్‌డీబీఓతో రోడ్డు నిర్మాణం వల్ల భారత్‌కు రక్షణ సామగ్రిని ఒక చోటు నుంచీ మరో చోటుకు తరలించగలిగే సామర్థ్యం పెరిగింది.
ఈ రోడ్డు ఎల్ఏసీకి సమాంతరంగా కారాకోరం పాస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, INDIAN AIR FORCE/TWITTER
ఈ రోడ్డు నిర్మాణానికి ముందు దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌కు పరికరాలను, సామాగ్రిని హెలికాఫ్టర్ల ద్వారా మాత్రమే తరలించేవారు.
ఇప్పుడు అదనపు రహదారులు, బ్రిడ్జ్‌లు నిర్మించాక భారత గస్తీ సిబ్బంది తేలిగ్గా ముందుకు సాగడానికి మార్గం సులువయ్యింది. అలాగే పరికరాలను, సామగ్రిని స్థావరాల నుంచీ సులువుగా పైకి చేర్చగలుగుతున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న వ్యూహాత్మక పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
ఇటీవల ఘర్షణల తరువాత కూడా అక్కడ రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తూనే ఉంటామని భారత్ సంకేతాలను ఇచ్చింది. చైనా సరిహద్దు వెంబడి లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం జార్ఖండ్ నుంచీ 12,000 మంది కార్మికులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సరిహద్దుల్లో చైనాకు దీటుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత్ తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ ప్రాంతంలో విస్తారమైన రోడ్డు, రైల్వే నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
73 వ్యూహాత్మక రహదారులను, 125 బ్రిడ్జ్‌లను నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి. కానీ, వాటి నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 35 రోడ్లు మాత్రమే పూర్తిచేశారు. ఈ ఏడాది చివరికి మరో 11 రోడ్లు నిర్మించనున్నారు.
మరో 9 వ్యూహాత్మక రైలు మార్గాలు నిర్మించడానికి కూడా భారత్ ఆమోదించింది. చైనా సరిహద్దు వెంబడి మిస్సమారి-టేంగా-తవాంగ్, బిలాస్‌పూర్-మండి-మనాలి-లేహ్ లైన్లతో సహా 9 రైల్వేలైన్లను నిర్మించనున్నారు. వీటి ద్వారా భారత్ సైన్యం భారీ యుద్ధ సామగ్రిని తరలించడానికి వీలు కలుగుతుంది.
విమాన సదుపాయాల విషయానికొస్తే, ఎల్ఏసీ వెంబడి 25 ఎయిర్‌ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్(ఏఎల్‌జీ) నెట్‌వర్క్‌ను విస్తరించడంపై భారత్ దృష్టి సారించింది.
ఇప్పటికే ఉన్న ఏఎల్‌జీల ఆధునీకరణతో పాటూ 7 కొత్త ఏఎల్‌జీలను నిర్మిస్తామని 2018లో భారత్ ప్రకటించింది.
చైనా సరిహద్దుల్లోని అసోం రాష్ట్రంలో ఉన్న కీలక భారత వైమానిక దళ స్థావరం ఛబువాలో సుఖోయ్-30 అధునాతన యుద్ధ విమానాలను, చేతక్ హెలికాప్టర్లను మోహరించారు. ఈ స్థావరాన్ని ఇటీవల అభివృద్ధిచేశారు.
కఠినమైన వాతావరణ పరిస్థితులు, బడ్జెట్ పరిమితులు, భూసేకరణ సమస్యలతోపాటు ప్రభుత్వ విధానాల జాప్యం కారణంగా సరిహద్దు వెంబడి భారత్ చేపట్టే నిర్మాణ కార్యక్రమాలు అనుకున్నంత సజావుగా సాగట్లేదు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు మెరుగుపడ్డాయనే చెప్పుకోవచ్చు. అయితే, పనులు ఇంకా చాలా వేగం అందుకోవాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా రవాణా అభివృద్ధి
మరోవైపు చైనా విమాన స్థావరాలను, కంటోన్మెంట్‌లను, ఇతర మౌలిక సదుపాయాలను త్వరత్వరగా నిర్మిస్తోంది.
2016 నుంచీ భారత్, భూటాన్, నేపాల్ సరిహద్దు ప్రాతాలను అనుసంధానించే కొత్త మార్గాలను పెంచింది.
పాత షిన్‌జియాంగ్-టిబెట్ రహదారిని, భారత్-చైనా సరిహద్దు వెంబడి సాగే జాతీయ రహదారి జీ219కు కలిపే ప్రయత్నాలు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో మెడోగ్, జాయుల మధ్య కాంక్రీట్ రహదారిని ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామని చైనా ప్రకటించింది.
భారత సరిహద్దులకు దగ్గరగా టిబెట్‌లో రెండో పెద్ద నగరమైన షిగాట్సేను షించీ మీదుగా చెంగ్డూకు కలుపుతూ కొత్త రైల్వేలైను నిర్మాణాన్ని చేపట్టింది.

సిక్కింకు దగ్గరలో షిగాట్సే, యాడోంగ్‌ల మధ్య మరో కొత్త రైల్వేలైను నిర్మించేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది.
భారత్‌కు సమీపంలో డజనుకు పైగా చైనా విమానాశ్రయాలున్నాయి. టిబెట్‌లో ఉన్న 5 విమానాశ్రయాలను సైనిక ప్రయోజనాల కోసమే కాకుండా, దేశ పౌరుల రాకపోకలకు కూడా వినియోస్తున్నారు.
ఇవే కాకుండా మరో మూడు కొత్త విమానాశ్రయాలను నిర్మించడానికి చైనా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఒక సర్‌ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎస్ఏఎం), కొన్ని అధునాతన ఫైటర్ జెట్లను పాంగోంగ్ సరస్సుకు 200కిమీ దూరంలో ఉన్న గారి గున్సా ఎయిర్‌ఫీల్డ్ వద్ద చైనా మోహరించింది.
వైమానిక దళం విషయంలో చైనా కన్నా భారత్‌కే సానుకులత ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వైమానిక స్థావరాలు ఎల్ఏసీకి దూరంగా ఎక్కువ ఎత్తులో ఉండడంవలన జెట్లు తక్కువ భారాన్ని, ఇంధనాన్ని మాత్రమే తీసుకెళ్లగలవు.

ఫొటో సోర్స్, Getty Images
అసలెందుకీ రవాణా నిర్మాణాలు?
రెండు దేశాలు సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రధాన కారణం, పూర్తి స్థాయి ఘర్షణలు వచ్చినప్పుడు సైన్యం, యుద్ధ సామగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్న ఆలోచనే.
“ఈ నిర్మాణాలన్నీ పుర్తయ్యాక కొన్ని కీలకమైన భూభాగాల్లోకి భారత సైన్యం పెద్ద ఎత్తున వెళ్లగలిగే అవకాశం ఉంటుంది" అని సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సొసైటీ 2019 రిపోర్ట్ తెలిపింది.
"ఘర్షణ వచ్చినప్పుడు తన సైన్యాలను సులువుగా కదిలించగలిగేలా సరిహద్దుల్లో చైనా తన బలాన్ని పెంచుకుంటోంది. దానికి దీటుగా మనల్ని మనం రక్షించుకోవడానికి వీలుగా భారత్ ఈ నిర్మాణాలను చేపడుతోంది” అని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన రాజేశ్వరి పిళ్లై తెలిపారు.

ఫొటో సోర్స్, China Ministy Online
ఇంతవరకూ సరిహద్దుపై తమ బలగాలు అడుగుపెటినట్టు వచ్చిన ఆరోపణలన్నిటినీ రెండు దేశాలూ ఖండించాయి.
సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న చర్చలన్నీ విఫలమయ్యాయి.
ఇటీవల సరిహద్దుల్లో చేపట్టిన కసరత్తుల్లో తమ అధునాతన నిర్మాణాల వల్ల చైనా సైన్యం ఎంత వేగంగా కదలగలిగిందో తెలుపుతూ ఆ దేశ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
"అతి తక్కువ సమయంలో పెద్దయెత్తున తన సైన్యాన్ని ఎక్కడైనా మోహరించగలిగే సామర్థ్యాన్ని చైనా పెంపొందించుకుంది. ఎత్తైన ప్రాంతాలకు కూడా చాలా తొందరగా సైన్యాన్ని పంపగలుగుతుంది" అని ఒక చైనీస్ అధికారి గ్లోబల్ టైమ్స్ పత్రికకు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








