కరోనావైరస్ టీకా: ప్రపంచ దేశాలు ఆశలు పెట్టుకున్న వ్యాక్సిన్లు ఇవే

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచంలో ఇప్పటివరకూ ఆరు లక్షలకుపైగా మంది మరణించారు. 1.44 కోట్ల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు.
చైనాలోని వుహాన్ నగరంలో 2019 డిసెంబర్‌లో మొదలైన ఈ వైరస్... ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది.
ఇప్పటివరకూ దీనికి ప్రామాణికమైన వ్యాక్సిన్ గానీ, ఔషధం గానీ అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 23 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
కొన్ని దేశాల్లో మనుషులపై నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్‌లో తొలి దశ, రెండో దశల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయి.
భారత్
భారత్‌లో కూడా కోవ్యాక్సిన్ అనే వ్యాక్సిన్‌పై ట్రయల్స్ జరుగుతున్నాయి.
దిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వంద మంది ఆరోగ్యవంతులపై ఈ ప్రయోగాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కూడా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రయోగాల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా జనం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అలా వచ్చినవారికి కరోనావైరస్ పరీక్షలు, కాలేయ పరీక్షలు చేశారు.
ప్రయోగాల్లో పాల్గొంటున్నవారికి వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తారు. మొదటి డోసు ఇచ్చిన తర్వాత రెండు వారాలకు రెండో డోస్ ఇస్తారు. ఇంజెక్షన్ రూపంలో దీన్ని ఇస్తారు.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జైడస్ కెడిలా భారత్‌లో కరోనావ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.
భారత్ బయోటెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్‌కే కొవ్యాక్సిన్ అని పేరు పెట్టారు.
ఇవి కాకుండా దాదాపు మరో ఐదారు భారతీయ సంస్థలు కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి.
ఈ సంస్థల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. డోసుల ఉత్పాదన, ప్రపంచవ్యాప్త అమ్మకాల విషయంలో ఇది ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ సంస్థల్లో ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్
ప్రపంచంలోనే మొట్టమొదటగా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మొదలయ్యయి. ఏప్రిల్‌లోనే అక్కడ మనుషులపై ట్రయల్స్ మొదలుపెట్టారు.
మొదటి దశలో 800 మందిని ఈ ప్రయోగాలకు ఎంపిక చేశారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఓ పరిశోధకుల బృందం ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. జెనర్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న సారా గిల్బర్ట్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.
ఆక్స్‌ఫర్డ్‌లో మనుషులపై వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినట్లు సమాచారం.
అమెరికా
అమెరికాలో పరీక్షించిన కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా పరిశోధకులు ఆశించినట్లుగా ఫలితాలు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాల్సి ఉంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నాసంస్థల్లో డాక్టర్ ఫౌచీ బృందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
జులై 27 నుంచి 30 వేల మందిపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా
ఈ పరిణామాలన్నింటి నడుమ కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాను రష్యా దొంగలించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బ్రిటన్‌లోని రష్యా రాయబారి ఎండ్రెయి కెలిన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అదంతా కట్టుకథ అని కొట్టిపారేశారు.
ఇదివరకు బ్రిటన్‌లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) కూడా రష్యన్ హ్యాకర్లు కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించింది.
కరోనావైరస్‌పై పరిశోధనలను రష్యా నిఘా వర్గాలు లక్ష్యం చేసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని బ్రిటన్ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ వ్యాఖ్యానించారు.
అమెరికా కూడా రష్యాపై ఈ ఆరోపణలు చేసింది.
దాదాపు ఓ వారం క్రితం తమ శాస్త్రవేత్తలు కరోనావైరస్‌కు మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేశారని రష్యా ప్రకటించింది.
సెచెనేవ్ యూనివర్సిటీ విజయవంతంగా మనుషులపై పరీక్షలు జరిపిందని, వారిలో ఓ బృందం జులై 15న, మరో బృందం జులై 20న డిశ్చార్జ్ అవుతారని పరిశోధకులు వెల్లడించినట్లు రష్యా పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా
చైనా ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తుందని ఆ దేశ ఎసెట్స్ సూపర్‌విజన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ సోషల్‌మీడియాలో తెలిపింది.
వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కలిసి తయారుచేసిన వ్యాక్సిన్‌ను రెండు వేల మందిపై ప్రయోగించినట్లు ప్రకటన కూడా వచ్చింది.
అయితే, ఇప్పటివరకూ ఓ ప్రామాణికమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లైతే చైనా ప్రకటించలేదు.
చైనాకు చెందిన సినోవెక్ బయోటెక్ సంస్థ తమ వ్యాక్సిన్‌తో బంగ్లాదేశ్‌లో ట్రయల్స్ చేస్తోంది. దీని మూడో దశ ట్రయల్స్‌కు బంగ్లాదేశ్ ఆమోదం తెలిపింది.
ఇవే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్లు తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
mRNA-1273 వ్యాక్సిన్
అమెరికాకు చెందిన మోడర్న్ థెరాప్యుటిక్స్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇది. ఇప్పటికి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి.
INO-4800 వ్యాక్సిన్
అమెరికన్ సంస్థ ఇనోవియో ఫార్మాసూటికల్స్ INO-4800 వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్‌ను తయారుచేస్తోంది. ప్రయోగాల తొలి దశలో సత్ఫలితాలు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది.
AD5-nCoV వ్యాక్సిన్
చైనా సంస్థ కైంసినో AD5-nCoV అనే వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. దీని మూడో దశ ట్రయల్స్ జరగాల్సి ఉంది.
LV-SMENP-DC వ్యాక్సిన్
చైనాలోని షెంజెన్ జీనోఇమ్యూన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో LV-SMENP-DC అనే వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారు. దీనితోపాటు ఔషధాన్ని తయారుచేసేందుకు కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








