కరోనావైరస్: హాస్పిటల్‌లో 86 రోజులు కోవిడ్‌తో పోరాడి ఇంటికి వచ్చారు

ఫొటో సోర్స్, SHEERIN KHOSROWSHAHI-MIANDOAB
- రచయిత, క్రిస్ బ్రామ్‌వెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బబాక్ ఖోష్రోవ్‌షాహిని మార్చి 22 తెల్లవారుజామున 4 గంటలకు ఆసుపత్రికి తరలించారు. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో ఆసుపత్రిలో చేరిన ఆయన 86 రోజుల తర్వాత బైటికి వచ్చారు. కాని ఈ 86రోజుల యుద్ధం సామాన్యమైంది కాదు.
బబాక్ ఆసుపత్రిలో ఉన్న ఈ సమయంలో కోవిడ్ -19 కారణంగా సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో బబాక్ సుదీర్ఘ యుద్ధమే చేశారు.
ఈ యుద్ధం కథ ఆయన మాటల్లోనే
నిజం చెప్పాలంటే నాకు కోవిడ్-19 ఎలా వచ్చిందో తెలియదు. ఏమి జరిగిందో నేను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను. కానీ నాకు అర్థం కాలేదు
నేను చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటాను. ఏ పని చేసినా ప్రతిసారి చేతులు కడుక్కునే వాడిని. దాన్ని నేనెప్పుడూ మర్చిపోలేదు.
ఎక్కడికి వెళ్లినా కారులో వెళ్లేవాడిని. అయినా ఎందుకొచ్చిందో తెలియదు కానీ...ఎప్పుడు మొదలైందో మాత్రం చెప్పగలను.
అది శుక్రవారం. నా భార్య నన్ను చూడటానికి వచ్చారు. అయితే ఈ సమయంలో ఆమె రావడం అంత మంచిది కాదని నాకు అనిపించింది. నాకు జ్వరంగా ఉంది. అయితే టెంపరేచర్ మరీ అంత ఎక్కువగా లేదు.
ఇది కోవిడ్ కావచ్చన్న అనుమానం నన్ను పీడిస్తూనే ఉంది. అందుకే నా పార్ట్‌నర్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాను. మరుసటి రోజు కూడా నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు.
ఇంట్లో ఉన్న పాత థర్మామీటర్‌ను వెతికి పట్టుకుని టెంపరేచర్ చూసుకోవడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు 38.5 డిగ్రీ సెల్సియస్ జ్వరం ఉంది. ఇదేదో ప్రమాదకారిగా మారుతోందని నాలో నేనే అనుకున్నాను.

ఫొటో సోర్స్, SHEERIN KHOSROWSHAHI-MIANDOAB
పని చేయడం మానేసిన ఒక ఊపిరితిత్తి
నేను వెంటనే హెల్ప్‌లైన్ 111కు కాల్ చేశాను. ఏడు రోజుల తర్వాత అతను 999కు కాల్ చేయాలని చెప్పారు. అప్పటికే నాకు జ్వరం పెరిగిపోయింది. ఆరోగ్యం క్షీణించింది.
ఒక గది నుండి మరొక గదికి వెళ్ళడం కూడా కష్టమే. లేచి ఏ వస్తువులను తీసుకోలేని పరిస్థితికి వెళ్లిపోయాను. విషయం తెలిసిన నా స్నేహితుడు 999 హెల్ప్‌లైన్‌కు కాల్ చేశారు.
మార్చి 22న ఆసుపత్రిలో చేరాను. ఆసుపత్రిలో అది నా మొదటి రోజు. అక్కడ నన్ను ఒకపక్క గదిలో పడుకోబెట్టారు. ఒక నర్సు నాకు ఆహారం వడ్డించారు. చికెన్ ఇచ్చారు. దాన్ని తినడడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.
ట్రాకియోస్టమీ సాయంతో నాకు ఆహారం అందించారు. నేను వెంటిలేటర్ మీద ఉన్నాను. చాలా ఆక్సిజన్ అవసరం. నా ఎడమ ఊపిరితిత్తి పని చేయడం మానేసింది.
కళ్ళు తెరిచినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, నన్నెందుకు ఇక్కడ ఉంచారు అని అడగలేదు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు. నేను మాట్లాడలేకపోతున్నాను. మనసంతా గందరగోళంగా ఉంది.
ఏదైనా చెప్పాలంటే నర్స్ నాకు పెన్ను, పేపర్ ఇవ్వాల్సి వచ్చేంది. కానీ రాసి కూడా సరిగా చెప్పలేకపోయేవాడిని. తర్వాత నాకు కీబోర్డ్ ఇచ్చారు. కానీ ఆ పని కూడా సరిగా చేయలేకపోయాను.
ఆసుపత్రిలో చేరడానికి కొద్దిరోజుల ముందు వరకు నేను బాగా రాయగలిగే వాడిని. ఒకరోజు నా ఫిజియోథెరపిస్ట్ నాతో చెప్పింది నేను ఎన్నటికీ మర్చిపోలేను. " మీరు ఆసుపత్రి నుంచి క్షేమంగా బయటకు వెళతారు'' అయిన ఆయన నాకు చెప్పారు.

ఫొటో సోర్స్, TOLGA AKMEN
నా చుట్టూ నలుగురు డాక్టర్లు
నాలో కదలికలను పెంచడం ఇప్పుడు డాక్టర్ల లక్ష్యం. నన్ను బెడ్ చివరకు జరగమన్నారు. తర్వాత కుర్చీలో కూర్చోడానికి లేవమన్నారు. నెమ్మదిగా లేచి నడవమన్నారు.
నేను కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో ఆ యూనిట్‌ను కదిలించడానికి ప్రయత్నించాను. దీనికి నన్ను డాక్టర్ అభినందించారు. ఇప్పుడు మీరు చేసిన పని ఒక మారథాన్‌తో సమానం అన్నారు.
ఫిజియోథెరపిస్ట్ నన్ను నిలబడమని అడిగిన తర్వాత సుమారు 30 రోజులు నేను నిలబడే స్థితిలో లేను. అసలు నేను ఎప్పటికైనా కోలుకోగలనా అని నాలో నేను ప్రశ్నించుకున్నాను.
నేను పూర్తిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను. మరుసటి రోజు నేను లేవడానికి ప్రయత్నించాను. అప్పుడు కూడా ఫిజియోథెరపిస్ట్ అదే మాట చెప్పారు. "మీరు త్వరలోనే ఇంటికి వెళ్లగలుగుతారు'' అని. అప్పటి నుంచి నేను ఇంటికి వెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను.
సుమారు 50 రోజుల తరువాత నన్ను జనరల్ వార్డులోకి మార్చారు. అంటే నేను ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళడానికి ఇది ఆరంభం అన్నమాట. కానీ ఒకటి రెండు రోజుల తరువాత నాలో వణుకు మొదలైంది. మళ్లీ జ్వరం వచ్చింది. వెంటనే నర్సును గట్టిగా కేక వేసి పిలిచాను.
నలుగురు వైద్యులు పరుగెత్తుకుంటూ వచ్చారు. అరగంటలో నన్ను అక్యూట్ మెడికల్ యూనిట్ (ఏఎంయు)కు తరలించారు. నాకు ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది.

ఫొటో సోర్స్, OLI SCARFF
అయినా ఆసుపత్రి నుంచి బైటపడ్డాను
నా గొంతు కండరాలు చాలా బలహీనంగా ఉన్నాయి. నేను ఇంతకాలం ఆసుపత్రిలో ఉండటానికి కారణం కూడా ఇదే. వైద్యులు నాతో చాలా రకాల వ్యాయామాలు చేయించారు. ఎక్కువ నీరు తాగమని చెప్పారు.
నాకు ట్రీట్‌మెంట్ చేసిన వైద్యుల బృందం నేను ఇంటికి వెళ్లేటప్పుడు ఎలాంటి పైపులు, బ్యాగులు తగిలించుకోకుండా వెళ్లగలనని నమ్మకంతో ఉన్నారు.
ఇద్దరిని తలుచుకుని నేను ఉద్వేగానికి లోనవుతున్నాను. ఒకటి బ్రిటన్‌వారి నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్), రెండోది నా కుటుంబం. నేను బతికి ఉన్నానంటే దానికి కారణం ఎన్‌హెచ్‌ఎస్ వారే.
చాలా రోజుల తరువాత ఆసుపత్రి నుండి బయటకు రావడం ఎలా ఉందో చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. నేను ఆసుపత్రికి వచ్చినప్పుడు చెట్లకు ఆకులు లేవు, కానీ నేను వెళ్తున్నప్పుడు అవి పచ్చగా కనిపించాయి.
నేను తిరిగి వస్తానన్న గ్యారంటీ లేదని ఇక్కడ పని చేస్తున్న వారితో చెప్పాను. ఇప్పుడు నన్ను నేను సెమీ రిటైర్డ్‌గా భావిస్తాను. వైరస్ పోయింది. కానీ ఆసుపత్రిలో చేరిననాటి అనుభవాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.
నాకిప్పుడు శ్వాస బాగానే ఉన్నప్పటికీ సాఫ్ట్‌ఫుడ్‌నే తింటున్నాను. ఆసుపత్రి నుంచి వచ్చే నాటికి నేను రెండు మూడు కిలోల బరువు పెరిగాను. కాకపోతే నాకిష్టమైన ఇరానియన్ కబాబ్‌ను మిస్సవుతున్నాను.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- సైనికులు సోషల్ మీడియా యాప్‌లు ఉపయోగిస్తే ప్రమాదం ఏంటి?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కారంచేడు దాడికి 35 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- ఈ ఫొటోతో చైనాను అమెరికా మంత్రి ఆటాడుకున్నారా? జిన్‌పింగ్‌ను ఇబ్బంది పెట్టారా?
- సూర్యుడిపై ‘క్యాంప్ ఫైర్’.. ఇంత దగ్గరగా సూర్యుడిని ఫొటోలు తీయడం ఇదే తొలిసారి
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








