కరోనావైరస్: హైదరాబాద్‌లో ఇళ్లల్లో ఆక్సిజన్ సిలిండర్లు... మార్కెట్లో పెరిగిన డిమాండ్

ఆక్సిజన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“డాడీ నాకు ఆక్సిజన్ అందడంలేదు చనిపోతున్నా, బాయ్ డాడీ’’ అంటూ తన చివరి క్షణాల్లో తండ్రికి వీడియో పంపిన రవికుమార్… హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ జనరల్ చెస్ట్ ఆస్పత్రిలో జూన్ 27న మరణించారు.

“ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆక్సిజన్ పెట్టలేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపోదాం”... ఇదీ తన చివరి క్షణాల్లో సోదరుడు సాయినాథ్‌కు మనోజ్ పంపిన చివరి మెసేజ్. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సమయానికి చికిత్స అందక జూన్ 4న మరణించారు మనోజ్.

చాలా ఆసుపత్రులు తిరిగినా వైద్యం అందక రోహిత్ అనే వ్యక్తి జూన్ 21 న మరణించారు.

వీరు ప్రాణాలు వదిలిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే వైద్యం అందుతుందో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే, ఆస్తులు అమ్ముకునే స్థాయిలో బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు.

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది

కరోనావైరస్ బారినపడిన వారిలో ప్రధానంగా కనిపించే సమస్య శ్వాస అందకపోవడం.

కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారిని, లక్షణాలు లేకపోతే, హోం క్వారంటైన్‌కే పరిమితం చేస్తున్నారు.

కరోనా ప్రాథమిక స్థాయిలో ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, లక్షణాలు తీవ్రమై ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే, ఆసుపత్రులకు వెళ్లాలి.

అయితే, ఆసుపత్రులు అంటే భయంతో కొందరు ముందస్తుగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు.

గోషామహల్‌కు చెందిన ఖదీర్ బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ తనకు జులై 5న కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని తెలిపారు. లక్షణాలు లేకపోడంతో ఇంటి వద్దే ఐసొలేషన్‌లో ఉన్నానని చెప్పారు.

“ఎనిమిది రోజుల క్రితం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. నా మిత్రులు వెంటనే ఇంట్లోనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వెళ్లాలంటే భయం వేసింది. తెలిసిన డాక్టర్ సహాయంతో ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకున్నా. ఓ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ చేసింది. ఫోన్‌లోనే డాక్టర్ సూచనల మేరకు నా భార్య ఆక్సిజన్ మోతాదు మార్చుతూ వచ్చింది. ఇలా గండం నుంచి బయట పడ్డాను. ఆసుపత్రికి వెళ్తే, ఏమవుతుందో తెలియదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లు చెల్లించే పరిస్థితి మాకు లేదు. రిస్క్ అని తెలిసినా, ధైర్యం చేశాం. అనామకంగా సహాయం అందక ఆసుపత్రిలో పోయేకంటే, ఇంట్లోనే వైద్యం మేలు అనించింది” అని అన్నారు ఖదీర్.

బేగంపేట్‌లోనూ ముందుగానే ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేసి పెట్టుకున్నఓ కుటుంబం బీబీసీతో మాట్లాడింది. కానీ, వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరింది.

“నా భార్యకు ఊపిరితిత్తుల సమస్య ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఒక వేళ తన ఆరోగ్య పిరిస్థితి విషమిస్తే, ఆక్సిజన్ దొరకదేమోనని భయం అనిపించింది. అందుకే ముందుగానే ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేసి పెట్టుకున్నాం” అని ఆ కుటుంబంలోని వ్యక్తి చెప్పారు.

చాలా మంది నేరుగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తుండటంతో, వాటికి ఇప్పుడు కొరత ఏర్పడింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చాలా మంది నేరుగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తుండటంతో, వాటికి ఇప్పుడు కొరత ఏర్పడింది

ఆక్సిజన్ సిలిండర్లను చాలా మంది ముందస్తుగా కొనుగోలు చేస్తుండటంతో వాటికి డిమాండ్ పెరిగింది. నేరుగా పంపిణీదారుల వద్దకే వెళ్లి జనాలు కొనుగోలు చేస్తున్నారు.

అలాంటి పంపిణీదారుల్లో ముజీద్ ఖాన్ ఒకరు. హైదరాబాద్ శివారుల్లో ఉండే ఆయన నగరంలోని వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తారు.

కొద్ది రోజులుగా వ్యక్తులు తన దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన బీబీసీతో చెప్పారు.

“సాధారణంగా మేం నేరుగా సిలిండర్లను ఎవ్వరికీ అమ్మం. కానీ, నెల రోజులుగా మా వద్దకు చాలా మంది వస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికీ ఇవ్వడం లేదు. కరోనావైరస్ రాకముందు నా ప్లాంట్‌లో రోజుకి 12 మంది పని చేసేవారు. ఇప్పుడు రోజుకి 50-60 మంది పని చేస్తున్నా, సరిపోవడం లేదు. ప్లాంట్ బయట క్యూలు ఉంటున్నాయి” అని అన్నారు ముజీద్.

అసలు ఈ ఆక్సిజన్ సిలిండర్ల విక్రయం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు కొంత మంది పంపిణీదారులు, విక్రయదారులతో బీబీసీ తెలుగు మాట్లాడింది.

వారిలో చాలా మంది వారి పేర్లు తెలిపేందుకు సుముఖత చూపలేదు. హైదరాబాద్‌లోని ఆటోనగర్‌కి చెందిన మొహమ్మద్ ఓమర్ షరీఫ్ పారిశ్రామిక అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరా చేస్తుంటారు.

ప్రస్తుతం కోవిడ్ రోగుల వైద్యం కోసం ఆక్సిజన్ అవసరం పెరగడంతో పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా కొంత కాలం ఆపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో తన వ్యాపారానికి బ్రేక్ పడిందని ఒమర్ షరీఫ్ వివరించారు.

ఆక్సిజన్ కోసం రోజూ తనకు 300-350 కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు.

“ఆన్‌లైన్‌లో నా నంబర్ ఉంది. అలా చాలా మంది నాకు ఆక్సిజన్ కోసం ఫోన్లు చేస్తున్నారు. నాకు తెలిసిన మేరకు ఎక్కడ ఆక్సిజన్ దొరుకుతుందో చెప్పి, సాయం చేస్తున్నా. చాలా మంది భయంతో ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు. 15 రోజుల నుంచి పరిస్థితి ఇలాగే ఉంది” అని ఓమర్ షరీఫ్ అన్నారు.

హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాయి

సిలిండర్లలో రెండు సైజులు ఉంటాయి. ఒకటి 10 లీటర్లది. మరొకటి 46.7 లీటర్లది.

సాధారణంగా అంబులెన్సులలో ఎమర్జెన్సీలకు పది లీటర్ల సిలిండర్లు వాడుతుంటారు.

రోగి శాచురేషన్‌ను అంటే నిమిషానికి ఎంత ఆక్సిజన్ కావాలి అన్నదానిపై ఆ సిలిండర్ ఎంతసేపు వస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 10 లీటర్ల సిలిండర్ ఎనిమిది నుంచి పది గంటలు వస్తుంది.

మెడికల్ ఆక్సిజన్ కోసం వాడే ‘బీ’ టైప్ 10 లీటర్ల సిలిండర్ ధర రూ.7,500 నుంచి రూ.8,000 వరకూ ఉంటుంది. దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తారు. అంటే ఒక్క సిలిండర్ ధర రూ.8,500 నుంచి రూ.9,440 వరకూ ఉంటుంది. ఫిల్లింగ్ కోసం రూ.50, సర్వీస్ చార్జీ రూ.100... ఈ మొత్తంపై 12 శాతం జీఎస్టీ పడుతుంది.

కానీ, ఇప్పుడు 46.7 లీటర్ల బల్క్ సిలిండర్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సిలిండర్ ధర రూ.11,500 నుంచి రూ.12,000. దీనిపై 18 శాతం జీఎస్టీ కలిపితే రూ.13,750 నుంచి రూ.14,160 వరకూ ధర ఉంటుంది. దీని ఫిల్లింగ్ కోసం రూ.123, సర్వీస్ చార్జీ రూ.170 తీసుకుంటారు. వీటికి 12 శాతం జీఎస్టీ పడుతుంది.

46.7 లీటర్ల బల్క్ సిలిండర్ సాధారణంగా 24 గంటల దాకా వచ్చే అవకాశం ఉంది.

సిలిండర్లతోపాటు రోగికి ఆక్సిజన్ పెట్టేందుకు వివిధ వైద్య పరికరాలు కావాల్సి ఉంటుంది. వాటి కోసం సుమారు రూ.1200 దాకా ఖర్చు అవుతుంది.

ఇవన్నీ పంపిణిదారుల దగ్గర ఉండే ధరలు.

విక్రయదారుల దగ్గర ‘బీ’ టైప్ 10 లీటర్ల సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ.200-250 దాకా ఉంటుంది.

అనేక మంది పంపిణీదారులు, విక్రయదారులతో మాట్లాడి బీబీసీ తెలుసుకున్న ధరల వివరాలు ఇవి.

ఆక్సిజన్ అవసరం ఉన్న వారి కోసం సిలిండర్లను అద్దెకు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. వాటి నుంచే సాధారణంగా కావాల్సిన వారు సిలిండర్లను తీసుకుంటుంటారు.

కానీ, ఇప్పుడు చాలా మంది నేరుగా సిలిండర్లను కొనుగోలు చేస్తుండటంతో, వాటికి కొరత ఏర్పడింది.

ఇదే అవకాశంగా తీసుకొని కొందరు పంపిణీదారులు, విక్రయదారులు ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.

నిరుపేద రోగులు, హోం క్వారంటైన్‌లో వైద్యం చేయించుకుంటున్న రోగులను ఆదుకునే ఉద్దేశంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాయి.

భారత్‌లో కోవిడ్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, AFP

హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఆసీఫ్ నగర్, మలక్‌పేట్‌, చంద్రాయన్ గుట్ట, గోల్కొండ ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి జులై 2 నుంచి జులై 7 వరకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేశామని జమాత్-ఇ-ఇస్లాం అనే సంస్థకు చెందిన హామెద్ మొహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి బీబీసీతో చెప్పారు.

“ఒక్క ఆసిఫ్‌నగర్ సెంటర్‌లోనే రెండు రోజుల్లో 170 సిలిండర్లు పంపిణీ చేశాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికే ఇచ్చాం. మేమే సిలిండర్లను కొనుగోలు చేసి, ఫిల్లింగ్ చేయించి, ఉచితంగా సరఫరా చేశాం. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు... ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసేందుకు వ్యక్తులకు లేదా సంస్థలకు అనుమతి లేదని అంటూ మా సెంటర్లను మూసేయమన్నారు. ఇవి ఎక్కడి నియమాలు? తెలంగాణలో వైద్యం అందక చాలా మంది చనిపోవడానికి కారణం తెలంగాణ సర్కారే. వైద్య ఖర్చు భరించలేని వారిని, వారి చావుకే వదిలేసింది ప్రభుత్వం” అని అన్నారు హామెద్ మొహమ్మద్ ఖాన్.

అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తమకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్లు కూడా ఆయన చెప్పారు.

“అధికారుల ఆదేశాల మేరకు మా వద్ద ఉన్న సిలిండర్లను లైసెన్స్ ఉన్న సంస్థలకు అందజేశాం. చాలా మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా వద్దకు వస్తున్న వారికి టోకెన్లు ఇచ్చి, లైసెన్స ఉన్న సంస్థల వద్దకు వారిని పంపుతున్నాం. వాటి ఖర్చును మేం భరించేటట్లు ఆ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’’ అని హామెద్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు.

నగరంలో ఆక్సిజన్ సిలిండర్లపై జరుగుతున్న దందాపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలు కూడా అక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.

నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను నిల్వ ఉంచితే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, ఎక్సప్లోజివ్స్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారన్న ఆరోపణలపై జులై 12న హైదరాబాద్‌లోని ముషీరాబాద్ వద్ద ఒకరిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.

నిందితుడి వద్ద నుంచి 19 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు డిప్యుటీ కమీషనర్ పి.రాధా కృష్ణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

కరోనా వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న భారత్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, కరోనా వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న భారత్

జూలై 14 న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ మరో వ్యక్తిని అరెస్టు చేసిందని, అతడి వద్ద నుంచి 87 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.

నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న వారు, ఆసుపత్రులు మాత్రమే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలి.

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసీఏ) , పేలుడు పదార్థాల సంస్థ, పోలీసులు ఉమ్మడిగా అక్రమ విక్రయాలపై నిఘా పెట్టారు.

నగరంలోని 55 పంపిణీదారులు, 16 తయారీ యూనిట్లలో అధికారులు తనిఖీలు చేశారు. 14 మంది పంపిణీదారులు, ఒక తయారీ యూనిట్ రికార్డుల్లో తప్పులు ఉన్నటు గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేశారు.

“ఆక్సిజన్‌ను కూడా ఔషధంగానే పరిగణిస్తాం. డాక్టర్ పర్యవేక్షణలోనే రోగులకు ఆక్సిజన్‌ ఇవ్వాలి. ఇంటి వద్ద ఇవ్వడం సరైన పద్ధతి కాదు” అని డీసీఏ డైరెక్టర్ ప్రీతీ మీనా బీబీసీతో అన్నారు.

ఆక్సిజన్ సిలిండర్ల నిర్వహణలో ఏవైనా పొరపాట్లు జరిగితే, అవి పేలిపోయే అవకాశం ఉందని... ప్రత్యేక పీడనం వద్ద ఆక్సిజన్‌ను నిల్వ చేయాల్సి ఉంటుందని అధికారులు బీబీసీతో చెప్పారు.

ముందస్తుగా కొనుగోలు చేసి సిలిండర్లను నిల్వ చేసుకోవవడం, బ్లాక్ మార్కెట్ కారణంగా ఆసుపత్రుల్లో కొరత ఏర్పడిందని తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ సంఘం సభ్యులు బీబీసీతో చెప్పారు.

గాంధీ, నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ టాంక్లు ఉన్నాయి.

వీటిలో ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం లేదని అంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రావు.

“గాంధీ ఆసుపత్రిలో కొరత వచ్చే అవకాశం లేదు. 20 కిలో లీటర్లు, ఆరు కిలో లీటర్ల రెండు లిక్విడ్ ఆక్సిజన్ టాంక్లు ఇక్కడ ఉన్నాయి. తగినంత సరఫరా ఉంది” అని అన్నారు.

ఆక్సిజన్ కొరత రాకుండా విధానపరమైన చర్యలేమైనా తీసుకుంటున్నారా అన్న విషయం గురించి ప్రభుత్వ అధికారులను ఆరా తీసేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఈ కథనం ప్రచురించే సమయానికి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

కరోనావైరస్ వ్యాప్తికి ముందు ఎంత ఆక్సిజన్ వినియోగం అయ్యేది, ఆ తర్వాత ఎంత పెరిగిందన్న సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని అధికారులు తెలిపారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)