జమ్ముకశ్మీర్‌: ఆర్టికల్‌ 370 రద్దుకు ఏడాది.. కశ్మీరీ పండిట్ల జీవితాలలో వచ్చిన మార్పేమిటి

కశ్మీర్‌లో బలగాలు

ఫొటో సోర్స్, EPA/jaipal singh

    • రచయిత, మోహిత్ కంధారి
    • హోదా, జమ్ము నుంచి బీబీసీ హిందీ కోసం

జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35-Aలను గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆ రోజు నుంచి మళ్లీ తమ సొంత ప్రాంతానికి వెళ్లాలని కశ్మీరీ పండిట్ల కుటుంబాలు కలగనడం మొదలుపెట్టాయి. కశ్మీర్‌ లోయకు తలుపులు తెరుచుకున్నట్లు భావించడం ప్రారంభించాయి. తమ కలల కశ్మీర్‌ను వీక్షించడం మొదలుపెట్టారు.

కానీ ఏడాది గడిచిన తర్వాత తాము మోసపోయినట్లు వారు భావిస్తున్నారు. వారు తమ కల కలగానే మిగిలిందని, తమ భూమికి చేరుకోవాలన్నది భ్రమేనని అనుకుంటున్నారు.

" 2019 ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370, 35Aలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఏడాది కాలంగా కశ్మీరీల పునరావాసం కోసం ఏమీ చేయలేదు'' అని పండిట్‌ల వర్గానికి చెందిన 'పానున్‌ కశ్మీర్‌' సంస్థ నేత అగ్నిశేఖర్‌ బీబీసీతో అన్నారు.

డాక్టర్ అగ్నిశేఖర్ అభిప్రాయం ప్రకారం కశ్మీర్‌లో ఏ మార్పు రాలేదు. " ఏడాది కిందట తెరిచిన కిటికీల నుంచి ఇంకా మేం మా కశ్మీర్‌ వైపు చూస్తూనే ఉన్నాం'' అన్నారాయన.

ఆగస్టు 5 రోజు పండగ జరుపుకొనే రోజు మాత్రమేకాదని, ఆందోళన కలిగించే రోజని కశ్మీరీ పండిట్లు అంటున్నారు. ఇది అవకాశాల రోజు మాత్రమేకాదని, అనిశ్చితి దినమని కూడా వారు వాపోతున్నారు.

"మార్పులన్నీ పైపైనే జరిగాయి. లోపలి మైండ్‌సెట్‌లు మారలేదు. గత ప్రభుత్వాలు ఏం చేశాయో ఈ ప్రభుత్వమూ అదే చేస్తోంది'' అని అగ్నిశేఖర్‌ అన్నారు.

"పానున్‌ కశ్మీర్‌ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని మేం గత 30ఏళ్లుగా పోరాడుతున్నాం. కాని ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడూ చర్చలకు పిలవలేదు. మా అభిప్రాయాలను అడగలేదు " అని ఆయన అన్నారు.

మోహిత్ కంధారి

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC

‘కశ్మీరీ పండిట్‌ల ఊచకోత జరిగిందని పార్లమెంటులో అంగీకరించాలి’

"లోయలో కశ్మీరీ పండిట్ల ఊచకోత జరిగిందని ప్రభుత్వం పార్లమెంటులో అంగీకరించాల్సి ఉంది.

అప్పుడే కశ్మీర్ లోయలో మేం మా ఇళ్లకు చేరుకోవడం సులభం అవుతుంది"అని ఆయన అన్నారు.

"బాంబు దాడులకు భయపడి రెండేసి గదులతో నాలుగు వేల ఫ్లాట్లను నిర్మించి, వాటిని కేటాయించే ప్రభుత్వ ప్రణాళికల్లో మేం ఎప్పటికీ భాగం కాలేం. మేం మా ఇళ్లకు తిరిగి రావాలనుకుంటున్నాము. మేం మా నేలపై స్థిరపడాలి. మా పిల్లల భవిష్యత్తు కోసం మేం మా గడ్డకు తిరిగి రావాలి. నిబంధనలన్నీ మేం కోరుకున్న విధంగానే ఉండాలి'' అని అగ్నిశేఖర్‌ స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసినందున కశ్మీరీ పండిట్లకు ఒకేచోట పునరావాసం కల్పించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"కశ్మీరీ హిందూ కుటుంబాలను పునరావాసం కల్పించడానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు'' అని వైద్యనిపుణులు, రచయిత రమేశ్‌ తమిరి బీబీసీతో అన్నారు.

వలస వెళ్లిన వశ్మీరీ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏమీలేదని, కానీ సంవత్సరం గడిచినా ఏ సమస్యను పరిష్కరించలేదని ఆయన అన్నారు.

"కాశ్మీరీ పండిట్ల ఊచకోతలపై నిజానిజాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. మారణ హోమం ఏ స్థాయిలో జరిగిందో తేలనంత వరకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి విజయం దక్కదు'' అని ఆయన అన్నారు.

"కశ్మీర్‌ నుంచి తరలి పోయిన పండిట్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది స్వల్పమే. వారు 60 ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. వారు సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు" తమిరి అన్నారు.

"కశ్మీర్‌ లోయలోని కాశ్మీరీ పండితులు తమ ఇళ్ళు, పొలాలు, తోటలను తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చింది. ఈ రోజు వరకు వాటిని వెనక్కి తీసుకోలేకపోయారు. వారి వస్తువులను సరైన ధర లభించలేదు" అని అన్నారు డాక్టర్‌ తమిరి.

"కశ్మీర్ లోయకు వెళ్లాలనుకున్న నిరుద్యోగ యువకులు ప్రధానమంత్రి ఉపాధి ప్యాకేజీ కింద పని చేయవలసి వస్తోంది" అని ఆయన బీబీసీతో అన్నారు. "మాపై ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. కాశ్మీరీ పండిట్ల కోసం ఏర్పాటు చేసిన జగతి పునరావాస కాలనీల్లో పరిశుభ్రత లేదు, ఉపాధి అవకాశాలు లేవు. వారు సొంతంగా కష్టపడి జీవిస్తున్నారు'' అని అన్నారు.

డాక్టర్‌ రమేశ్‌ తమిరి
ఫొటో క్యాప్షన్, డాక్టర్‌ రమేశ్‌ తమిరి

2018లో కశ్మీర్ లోయలోని అనంతనాగ్‌ జిల్లాకు చెందిన బ్రహ్ పంచాయతీ నుండి సర్పంచి పదవిని గెలుచుకోవడం ద్వారా రాకేశ్‌ కౌల్‌ తన ప్రాంతంలో పనిచేయడం ప్రారంభించాడు. కాని జూన్‌లో ఆ ప్రాంతంలో ఒక సర్పంచి హత్య తర్వాత వాతావరణం మారిపోయింది.

"నేను నవంబర్ 2018లో బాధ్యతలు స్వీకరించా. అప్పటి నుండి ఈ రోజు వరకు గృహ నిర్మాణం గురించి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఈ డిమాండ్లు అమలు కాలేదు" అని రాకేశ్‌ కౌల్‌ బీబీసీతో అన్నారు.

ఏడాది కాలంగా ఇక్కడ ఎలాంటి మార్పు రాలేదని రాకేశ్ కౌల్ చెప్పారు.

"మా గుర్తింపు గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. జమ్ములో మమ్మల్ని నమ్మడం లేదు. కాశ్మీర్‌లో నమ్మడం లేదు. మా ప్రభుత్వ పత్రాలన్నింటిని ముందు కశ్మీర్‌లోయలో, తర్వాత జమ్ములో వెరిఫై చేస్తున్నారు. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఎలా ఉందో, తీసేసిన తర్వాత కూడా అలాగే ఉంది'' అని కౌల్‌ అన్నారు.

స్థానికత సర్టిఫికెట్ సమస్య గురించి మాట్లాడిన కౌల్‌ "మేం శతాబ్దాలుగా కశ్మీర్‌లో ఉంటున్నాం. మా పూర్వీకుల ఇక్కడే ఉన్నారు. మళ్లీ ఇప్పుడు నివాస ధ్రువీకరణ కోసం కష్టపడాల్సి వస్తోంది" అని అన్నారు."నేను ఇంకా భయ భయంగానే కశ్మీర్‌ లోయకు వెళ్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మాకు భద్రత కల్పించలేదు" అన్నారు.

పండిట్ల కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్య వసతులు అందేలా ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చాలని రాకేశ్‌ కౌల్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాకేశ్ కౌల్‌
ఫొటో క్యాప్షన్, రాకేశ్ కౌల్‌

ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత కూడా తాను సొంత ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదని, కశ్మీరీగా తన గుర్తింపు రద్దు చేశారని, దిల్లీలో పని చేస్తున్న రాజు మోజా బీబీసీతో అన్నారు. "నాకు జమ్మూ-కాశ్మీర్‌వాసిగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు అది లేదు. రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం నేను నా గుర్తింపును నిరూపించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలి '' అని ఆయన అన్నారు.

" ఆర్టికల్‌ 370 రద్దును మేము స్వాగతించాము" అని కాశ్మీరీ పండిట్ల నాయయకుడు రవీందర్ కుమార్ రైనా బీబీసీతో అన్నారు. కానీ నివాస ధ్రువీకరణ పత్రం జారీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైనా ఖండించారు. "కశ్మీరీ అయినందున మా గుర్తింపును మళ్లీ మళ్లీ నిరూపించుకోవలసి వస్తోంది. పండిట్లు లేకుండా కశ్మీర్‌ ఎక్కడిది" అని ఆయన అన్నారు.

"ఇతర రాష్ట్రాల్లో పని చేయడానికి వెళ్లడానికి ముందే కశ్మీరీ పండితులు పెద్ద సంఖ్యలో లోయ నుంచి వలస వచ్చారు. కాని ఈ రోజు వారు తమ గుర్తింపును కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు" అని రైనా అన్నారు.

"గత సంవత్సర కాలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి. కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. లోయ నుంచి బైటికి వెళ్లిన కశ్మీరీ పండిట్ యువత ఇప్పటికీ కశ్మీర్‌లోనే ఉన్నారు. లోయలో పనిచేసే ప్రభుత్వం వారి సమస్యలు వినాలి" అని పదేళ్లుగా కశ్మీర్‌లోయలో పని చేస్తున్న రుబన్‌ సప్రూ బీబీసీతో అన్నారు. "ఈ కశ్మీరీ పండితులు చాలాకాలంగా కశ్మీర్ లోయలో నివసిస్తున్నారు. కానీ మిగతా సమాజానికి దూరంగా ఉన్నారు. వారికి స్థానికులతో సన్నిహిత సంబంధాలు లేవు. వారు ప్రభుత్వం ఇస్తున్న భద్రత నడుమ శిబిరాలలో కాలం గడుపుతున్నారు" అన్నారు సప్రూ.

ప్రస్తుతం దాదాపు 4వేలమంది నిరాశ్రయులైన కశ్మీరీలు కశ్మీర్ అంతటా వేర్వేరు శిబిరాల్లో నివసిస్తున్నారు. పునరావాసం గురించి వారు జమ్ములో ప్రభుత్వం ముందు డిమాండ్‌ వినిపిస్తూనే ఉన్నారు.

గత కొన్నేళ్లుగా కశ్మీర్‌ పండిట్‌ కుటుంబాలు చీలికలు పేలికలుగా మారిపోయి జమ్మూకశ్మీర్‌లో, రాష్ట్రం వెలుపలా ఆశ్రయం పొందున్నారని, వారందరూ కశ్మీర్‌ తిరిగి రావడం సాధ్యం కాదని సప్రూ అన్నారు.

1990లలో కశ్మీర్‌ను వదిలిపోయిన పండిట్లు, 2010లో ప్రభుత్వ ఇచ్చే ఉద్యోగం కోసం మరోసారి కుటుంబాన్ని వదిలి పెట్టాల్సి వచ్చిందని సప్రూ అభిప్రాయపడ్డారు.

2010లో 3,000 మంది కశ్మీరీ పండిట్లకు ప్రధానమంత్రి రిలీఫ్ ప్యాకేజీ కింద లోయలో ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగ ప్యాకేజీని పునరావాసంతో ముడిపెట్ట వద్దని ఆయన అన్నారు.

"జగతి పునరావాస క్యాంప్‌లో 40,000 మంది కశ్మీరీ పండితులు నివసిస్తున్నారు. అందరూ ప్రస్తుతం నివాస ధ్రువీకరణ పత్రం గురించి ఆందోళన చెందుతున్నారు'' ఆ కాలనీలో చాలాకాలంగా నివసిస్తున్న లోలాబ్‌ వాసి ప్యారేలాల్ పండిట్‌ బీబీసీతో అన్నారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, EPA

నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వాటిని పెంచవద్దని ఆయన కోరుతున్నారు. ఏడాది కాలంలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. "రాష్ట్రంతో సంబంధం లేనివారికి నివాస ధ్రువీకరణ అవసరం తప్ప శతాబ్దాలుగా కశ్మీర్లో నివసిస్తున్న వారికి కాదు" అని ఆయన అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఇప్పుడు కశ్మీరీ పండిట్ల సొంత ప్రాంతానికి తిరిగి రావడం అనే సమస్య అలాగే ఉండిపోయిందని ప్యారేలాల్ పండిట్‌ చెప్పారు.

అయితే గత 60ఏళ్లుగా కశ్మీర్‌కు దూరంగా జీవించడం నేర్చుకున్న వారు అన్నింటినీ వదిలి తిరిగి స్వస్థలానికి రావడం చాలా కష్టమని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)