జైపూర్‌లో బాసిత్ ఖాన్ హత్యకు కారణమేంటి... కశ్మీరీలపై ద్వేషంతోనే కొట్టి చంపారా? - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం
కశ్మీర్ సరిహద్దు జిల్లా కుప్వారాలోని కునన్ పోష్‌పోరా గ్రామం. రోడ్డుకు రెండు వైపులా గులామ్ మొహియుద్దీన్ ఖాన్ అలియాస్ బాసిత్ ఫొటోలు ఉన్న బ్యానర్లు కనిపిస్తున్నాయి.
ఆ బ్యానర్లపై 'అమరవీరుడు బాసిత్ చౌక్' అని రాసుంది.
17 ఏళ్ల గులాం మొహియుద్దీన్ ఖాన్ మృతికి సంతాపం తెలపడానికి గ్రామంలో ఉన్న అతడి ఇంటికి బంధువులు, గ్రామస్థులు చాలామంది వచ్చారు.
రాజస్థాన్‌లో కొంతమంది యువకులు బాసిత్‌ను కొట్టినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ వార్త తెలిసి అతడి స్వగ్రామంలో ప్రజలు ఆగ్రహించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీరీలను చంపుతోందని ఆరోపించారు.
గత శనివారం బాసిత్ మృతదేహం అతడి గ్రామానికి చేరుకున్న తర్వాత స్థానికులు అతడి హత్యకు నిరసనగా భారీ ప్రదర్శన చేశారు.
బాసిత్ తల్లి హఫీజా ఏడుస్తున్నారు. "నేను ఈ పిల్లలందరినీ ఏం చేయాలి. బిడ్డా, నువ్వు నన్ను మోసం చేశావ్" అని గట్టిగట్టిగా రోధిస్తోంది.
బాసిత్‌కు తల్లి, నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
నా కొడుకు కోసం చూశా, తన శవం కోసం కాదు
బాసిత్ శ్రీనగర్‌లో గుడ్ విల్ సైనిక స్కూల్‌లో చదువుకున్నాడు. అతడి ఊరు శ్రీనగర్ నుంచి 107 కిలోమీటర్లు ఉంది.
ఇండియన్ ఆర్మీలో జేకేఎల్ఎఫ్ రెజిమెంట్‌లో పనిచేసిన బాసిత్ తండ్రి 2012లో సహజ కారణాలతో చనిపోయారు.
"మేం మా గ్రామంలో చౌరస్తా పేరు మార్చేశాం. మొదట దానిని గమాన్‌దార్ చౌక్ అనేవారు. ఇప్పుడు దానిని బాసిత్ చౌక్ అని మార్చేశాం. పేరు మార్చడం వల్ల, మాకు మా ఊరి బిడ్డ దారుణ హత్య గుర్తుంటుంది. తన మృతికి న్యాయం జరిగేలా పోరాటం చేయడానికి ప్రేరణ లభిస్తుంది" అని గ్రామస్థుడు సాకిబ్ అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
బాసిత్ తల్లి కన్నీళ్లతో, "నేను నా కొడుకు వస్తాడని ఎదురుచూశా... తన శవం కోసం కాదు. నా కొడుకు ఇలా ఇంటికి వస్తాడని నేను అనుకోలేదు. బాసిత్ ఇంటి నుంచి వెళ్తూ, త్వరగా వచ్చేస్తానమ్మా అన్నాడు. తను వెళ్లి మూడు నెలలే అయ్యింది. ఇలా అవుతాడని అనుకోలేదు. నాకు న్యాయం కావాలి. నా కొడుకును హంతకులను నాకు అప్పగించాలి" అన్నారు.
బాసిత్‌కు వరుసకు సోదరుడు అయ్యే ఫిరదౌస్ అహమ్ దార్ కూడా అతడితో కలిసి జైపూర్‌లో పనిచేసేవాడు. బాసిత్‌ను కొట్టి చంపేసినపుడు అతడు రాజస్థాన్‌లోనే ఉన్నాడు.
"ఘటన జరిగిన గంటన్నర ముందు ఖాన్(బాసిత్) నాకు కాల్ చేసి, చాట్ చేయాలి, ఫోన్ చార్జింగ్ పెట్టు అన్నాడు. నేను తనతో.. ముందు నువ్వు గదికి రా, చార్జింగ్ పెడతాలే అన్నాను. కాసేపటికే తను ఇంటికొచ్చాడు. తన తలను రెండు చేతులతో పట్టుకుని ఉన్నాడు" అని దార్ చెప్పాడు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
బాసిత్ మృతి కశ్మీరీలపై ద్వేషం వల్లే జరిగిందా?
"ఏమైందో మాకు తెలీదు. నాతో తలనొప్పిగా ఉందన్నాడు. మేం టాబ్లెట్ ఇచ్చాం. ఆటోలో రావడం వల్ల చలికి తలనొప్పి వచ్చిందేమో అనుకున్నాం. తర్వాత బయటికెళ్లాడు. అతడితో బయటికెళ్లిన మా ఫ్రెండ్ తాహిర్ లోపలికి వచ్చి ఖాన్‌కు ఏదో అయ్యిందని అన్నాడు. మేం ఖాన్‌ను డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలని అనుకున్నాం. అప్పుడు నేను తన కళ్లు చూశా, కాస్త వాచి ఉన్నాయి. తర్వాత వాంతులయ్యాయి. మేం వెంటనే క్యాబ్ బుక్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లాం" అని దార్ చెప్పాడు.
"మేం ఆస్పత్రికి వెళ్లగానే డాక్టర్లు తను డ్రగ్స్ తీసుకున్నాడేమో అన్నారు. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు. ఖాన్ పరిస్థితి దిగజారడంతో డాక్టర్లకు ఏం అర్థం కాలేదు. తర్వాత మేం వాళ్ల అంకుల్‌కు, సాహిల్ అనే అతడికి ఫోన్ చేసి జరిగింది చెప్పాం. అప్పుడు పార్టీ సమయంలో కొంతమంది యువకులు ఖాన్‌ను కొట్టారని సాహిల్ మాకు చెప్పాడు" అన్నారు దార్..
సూఫియాన్ అనే ప్రత్యక్షసాక్షి సాహిల్‌కు దాని గురించి చెప్పాడు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
"మేం ఆ విషయం డాక్టరుకు చెప్పాం వాళ్లు, తల లోపల దెబ్బలు తగిలాయని అన్నారు. తర్వాత ఖాన్‌ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. తర్వాత రోజు ఆపరేషన్ కూడా చేశారు. రాత్రి 9 గంటలకు ఆ దెబ్బలవల్ల అతడు చనిపోయాడు".
"భారత్‌లో కశ్మీరీలను లక్ష్యంగా చేసుకున్నారని దార్ చెప్పారు. నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన తర్వాత భారత్‌లో కశ్మీరీలకు ఎలాంటి సమస్యా రాదని చెప్పారు. కానీ భారత్‌లో అసలు ఏం జరుగుతోందని నేను ఆయన్ను అడగాలని అనుకుంటున్నా. మా పట్ల ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోంది" అని ప్రశ్నించారు.
ఖాన్ మృతి తర్వాత తనకు కూడా అక్కడ ఉండాలంటే భయమేసిందని డార్ చెప్పారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
ఆ రాత్రి ఏం జరిగింది?
రాజస్థాన్ వెళ్లిన బాసిత్, కొందరు కశ్మీరీ స్నేహితులతో కలిసి జైపూర్‌లోని హసన్‌పురా ప్రాంతంలో క్యాటరింగ్ పని చేస్తున్నాడు.
ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న మరో కశ్మీరీ యువకుడు సూఫియాన్ గొడవ జరిగినప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందో జైపూర్ నుంచి బీబీసీకి చెప్పాడు.
"ఆ రాత్రి 12 గంటలకు మేం పని ముగించుకుని, వ్యాన్ దగ్గరకు వెళ్లాం. దాని ముందు తలుపు తెరిచి ఉంది. డ్రైవర్ వెనక నిద్రపోతున్నాడు. ఖాన్ వెనక డోరు తట్టి తలుపు తెరవమని డ్రైవరుకు చెప్పాడు. ముంబయికి చెందిన ఆదిత్య అనే యువకుడు ముందు సీట్లో ఉన్నాడు. తలుపు కొట్టి, డిస్టర్బ్ చేయద్దని అతడు ఖాన్‌ను తిట్టాడు. ఖాన్ అతడితో లోపలికొచ్చి రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు. దాంతో ఆదిత్య అతడి కాలర్ పట్టుకున్నాడు. మరో ఇద్దరు యువకులు వచ్చి ఖాన్‌ను పట్టుకున్నారు".
"ఆదిత్య అతడి తలపై కొడుతున్నాడు. నేను ఖాన్‌ను కాపాడాలని ప్రయత్నించా. కానీ నన్ను అడ్డుకున్నారు. నేను అదంతా చూస్తూనే ఉన్నా. వాళ్లు నా ముందే ఖాన్‌ను కొడుతున్నారు. వాళ్లు దేనితోనో తన తలపై బలంగా కొట్టారని ఖాన్ నాకు తర్వాత చెప్పాడు" అని సోఫియాన్ చెప్పాడు.
ఇదంతా జరిగిన తర్వాత తమ బాస్ కూడా, "ఎఫ్ఐఆర్ వెనక్కి తీసుకోకపోతే నిన్ను కూడా నీ ఫ్రెండ్ దగ్గరికే, కోమాలోకి పంపించేస్తానని" తనతో అన్నట్లు సూఫియాన్ చెప్పాడు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
మేం మళ్లీ అక్కడికి వెళ్లం
"నేను దీని గురించి పోలీస్ రిపోర్టు ఇవ్వలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిని నేనొక్కడినే. ఖాన్‌ను కొట్టిన వాళ్లు, ఖాన్ లాగే మిగతా కశ్మీరీలను ఇక్కడ నుంచి తరిమికొడతామని అంటుండడంతో నేను భయపడ్డాను" అని చెప్పాడు.
కశ్మీరీ అయినందుకే ఖాన్‌ను కొట్టి చంపారని సూఫియాన్ భావిస్తున్నాడు.
ఖాన్ మరో స్నేహితుడు తాహిర్ అహ్మద్ కూడా అతడితోపాటు రాజస్థాన్ వెళ్లాడు. అతడు కూడా దార్, సూఫియాన్ మాటలతో ఏకీభవించాడు.
"అక్కడ మమ్మల్ని సందేహిస్తున్నారు. మేం అక్కడికి వెళ్లినపుడు స్థానికులు మమ్మల్ని అనుమానాస్పదంగా చూశారు. వాళ్లు మాతో చాలా కఠువుగా ప్రవర్తించేవారు" అని చెప్పాడు.
అక్కడ కశ్మీరీలను చాలా ఇబ్బంది పెడుతున్నారని సాహిల్ చెప్పాడు. "కశ్మీరీ కాబట్టే ఖాన్‌ను చంపారు. మేం మళ్లీ అక్కడకు వెళ్లం. మాకు చాలా భయంగా ఉంది" అన్నాడు.
కునూన్ పోష్‌పోరాకు చెందిన హబీబ్ "ఎంతోమంది అక్కడ ఉంటున్నారు. మా పట్లే ఇంత తేడా ఎందుకు చూపిస్తున్నారు. మీరు భారత్‌లో ముస్లింల పట్ల అన్యాయం చేశారని నేను మోదీకి చెప్పాలని అనుకుంటున్నా. ఇప్పటివరకూ మీరు కశ్మీర్‌కు చేసిన అన్యాయానికి మేం బదులు తీర్చుకుంటాం" అన్నారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
ఖండించిన పోలీసులు
కానీ భారతీయ జనతా పార్టీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.
భారత పాలిత కశ్మీర్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ బీబీసీతో "ఇలాంటి ఘటనలకు బీజేపీని బాధ్యులు చేయడం తప్పు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీజేపీపై ఆరోపణలు చేసేవారు, ఆ యువకుడి హత్య ఎలా జరిగిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడగాలి" అన్నారు.
జమ్ముకశ్మీర్ పోలీసులు కూడా ఫిబ్రవరి 7న ఒక ప్రకటనలో "గులాం మొహియుద్దీన్ ఖాన్ అలియాస్ బాసిత్ మృతి గురించి ప్రచారం చేస్తున్న వార్తలు నిజం కాదు. పోలీసులు వాటిని ఖండిస్తున్నారు" అని చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం బాసిత్ మృతి లించింగ్ వల్ల జరగలేదు.
పోలీసులు తమ ప్రకటనలో "బాసిత్ జైపూర్‌లో క్యాటరర్‌గా పనిచేస్తున్నాడు. తనతో కలిసి పనిచేసే కొంతమందికి, అతడికి గొడవ జరిగింది. అందులో బాసిత్ గాయపడ్డాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం బాసిత్ మృతి మరికొందరితో గొడవపడ్డం వల్లే జరిగింది. దీనికి సంబంధించి మేం ఒకరిని అరెస్టు కూడా చేశాం" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - యోగి ఆదిత్యనాథ్
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









