ఇరాన్‌: 'నా భర్త నన్ను కొడుతుంటే చుట్టుపక్కల వాళ్లు ఇది మామూలే అన్నట్లు చూశారు...'

టెహ్రాన్ మహిళలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భర్త కొట్టినా తిట్టినా వినయంగా ఉండాలని ఇరాన్‌లోని మహిళలకు చెబుతుంటారు.
    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, ఎసెన్షయల్ మీడియా ఇన్‌సైట్

మరియం తన భర్త తనపై అందరి ముందూ ఎలా దాడి చేశారో చెబుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది.

"భర్త భార్యను కొట్టడం సాధారణమేగా అన్నట్లు చుట్టుపక్కల ఉన్న వారు చూశారు. సరైన చట్టం లేదు. సురక్షిత గృహాలు లేవు. పోలీసులు కూడా ఏమీ చేయలేరు. కొన్ని కుటుంబాలైతే ఓహ్! అది వ్యక్తిగత విషయమని అంటూ తమని తాము ఆధునికులుగా భావించుకుంటూ ఉంటారు. "

మరియం కథని ఇరాన్ లో ఎవరూ వినలేదు. కానీ, పాడ్‌కాస్ట్ ప్రసారం చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆమె లాంటి మరెంతో మంది మహిళలు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పుకోని, తాము అనుభవించిన గృహ హింసను మనసు విప్పి చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు.

మరియం (అసలు పేరు కాదు) - ఈ మాధ్యమం ద్వారా సంప్రదాయ సామాజిక నిషేధాలకు స్వస్తి పలుకుతూ మహిళలు గొంతు విప్పడానికి ముందుకు వచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారు.

పర్షియా పురాణాలలో పేర్కొన్న పర్షియా రాణి షెహెరెజాదేలా మహిళలంతా మారాలని మరియం పిలుపునిచ్చారు. ఆమె ‘ది వన్ థౌసండ్ అండ్ వన్ నైట్స్’ అనే పురాణంలో ముఖ్య పాత్రధారి. ఆమె తన కథ చెప్పే నైపుణ్యంతో తన మరణాన్ని నివారించుకుంటారు.

కానీ, మహిళలు నోరు విప్పకూడదనే సంప్రదాయాన్ని నర నరాల్లో నూరి పోసిన సమాజానికి ఈ స్ఫూర్తిదాయక కథలు కొన్ని మైళ్ళ దూరంలో ఉంటాయి.

కుటుంబ విషయం

34 సంవత్సరాల మరియం యూనివర్సిటీలో చైల్డ్ సైకాలజీ కోర్స్ చదువుకునేటప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డారు.

ఆమె ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఆమె తల్లితండ్రులను ఎదిరించాల్సి వచ్చింది. ఆయనను ఆమె ఒక అభ్యుదయవాదిగా , కార్మికుల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా భావించారు.

కానీ, పెళ్ళైన కొన్ని రోజులకే ఆమెకి పరిస్థితులు సరిగ్గా లేవని అర్ధమైంది. ఓటమిని ఒప్పుకోలేకపోవడం, స్వాభిమానం ఆమెను తల్లి తండ్రుల నుంచి సహాయం ఆశించడానికి ఎలా నిరోధించాయో, ఆమె పాడ్ కాస్ట్ లో వివరించారు.

వివాహ బంధంలో ఉన్నన్ని రోజులూ ఆమె శారీరక, మానసిక హింసకి గురయ్యారు. విషయాన్ని మరింత సంక్లిష్టం చేయడానికి ఆమెవే అన్నీ తప్పులు అనేలా భావించేలా చేశారు.

Graphic by Maria Ponomariova

ఫొటో సోర్స్, Getty Images / Maria Ponomariova

ఇరాన్‌లో చాలా మంది మహిళలు నమ్మే "ఒక మహిళ తన భర్త ఇంటికి తెల్లటి పెళ్లి దుస్తులతో అడుగు పెట్టి మళ్ళీ తనపై అంతిమంగా కప్పే తెల్లని వస్త్రంతోనే బయటకు వెళుతుందన్న సిద్ధాంతంతోనే మరియం కూడా పెరిగారు.

ఇరాన్‌లో విస్తృతంగా ప్రబలిన సామాజిక నిబంధనలు ఆమెని వివాహ బంధంలోంచి త్వరగా బయటకు రాకుండా చేశాయని మరియం చెప్పారు.

"సాధారణంగా ఇరాన్ లో ప్రజల కుటుంబ విషయాలు నాలుగు గోడలకే పరిమితమై ఉంటాయి. దాని వలన, గృహ హింస వేళ్ళూనుకుపోయి, మహిళలను ఓపికతో, నమ్మకంతో ఉండమని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఒక రోజు భర్త చేతిలో తీవ్రమైన దెబ్బలు తిని ఇక హాస్పిటల్ లో చేరాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు మరియం ఆ బంధం నుంచి బయట పడాలని నిర్ణయించుకున్నారు.

ఆ అపస్మారక స్థితిలో కదలలేని పరిస్థితిలో,"ఇక్కడ నేనెందుకు ఉన్నాను, నాకిలా ఎందుకు జరిగింది" అని ఆమె తనని తాను ప్రశ్నించుకున్నారు.

కొన్ని వారాల తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి విడాకులకు దరఖాస్తు చేశారు. ఆమె నిర్ణయాన్ని ఆమె తల్లి తండ్రులు సమర్ధించారు. కానీ, బాధితులందరికీ ఆ అదృష్టం లభించదు.

మరియం నిర్వహించే ప్రతీ పాడ్ కాస్ట్‌లో, కుటుంబంలో పురుషుల చేతిలో హింసను భరించిన ఎంతో మంది మహిళలు తమ అనుభవాలను పంచుకుంటారు.

Graphic by Olha Khorimarko

ఫొటో సోర్స్, Olha Khorimarko/GETTY IMAGES

కొత్త చట్టం

వ్యక్తిగత అనుభవాలతో పాటు హింసకు గురవుతున్న మహిళలకు విధానపరమైన చట్ట రక్షణ లేకపోవడం గురించి కూడా ఆమె పాడ్‌కాస్ట్ లో చర్చిస్తారు.

ఇరాన్ లో మూడింట రెండు వంతుల మంది మహిళలు కనీసం ఒక్క సారైనా గృహ హింసకు గురయ్యారని 16 సంవత్సరాల క్రితం గృహ హింస గురించి అధికారికంగా లభించిన గణాంకాలు చెబుతున్నాయి.

ఇరాన్‌లో మహిళలు వివాహం, విడాకులు, ఆస్తి హక్కు, పిల్లల కస్టడీ, జాతీయత, విదేశీ ప్రయాణాలు లాంటి విషయాల్లో చట్ట పరంగా వివక్షకు గురయ్యారని, లండన్ కేంద్రంగా పని చేసే మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ గ్రూప్ 2013 లో విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

ఇరాన్ లో ఒక టీనేజ్ అమ్మాయిని సొంత తండ్రి పరువు హత్య చేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ మహిళలను హింస నుంచి రక్షించే బిల్లును సత్వరమే సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును రూపొందించి చేసి ఒక దశాబ్దం కావస్తోంది.

ఇది చట్టంగా మారడానికి పార్లమెంట్ లో కన్సర్వేటివ్ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ బిల్లు చట్టంగా మారితే 1979 ఇరాన్ విప్లవం తర్వాత మహిళల హక్కుల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుగా పరిగణించవచ్చు.

మహిళల పై జరిగే శారీరక హింసను ఈ బిల్ నేరంగా పరిగణిస్తుంది. అలాగే బహిరంగంగా, గాని సోషల్ మీడియాలో గాని ఎవరైనా హింసకు గురి చేస్తే శిక్షను నిర్దేశిస్తుంది.

వివాహబంధం నుంచి బయటకు వచ్చి అయిదు సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నంత ఆనందంగా ఎప్పుడూ లేనని మరియం చెబుతున్నారు.

ఆమె పాడ్‌కాస్టింగ్‌తో పాటు హింసకు గురైన బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

ప్రజలకు గొంతు విప్పడానికి స్వేచ్ఛ లభిస్తే దేశంలో వేళ్ళూనుకుపోయిన రహస్య సంస్కృతిని రూపుమాపవచ్చని ఆమె భావిస్తారు. ఇలా చేయడం వలన బాధితులకు ధైర్యం ఇచ్చినట్లవుతుందని, ఆమె అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)