ఈ ఇస్లామిక్ స్టేట్ ఖైదీలు పశ్చిమ దేశాలకు టైం బాంబుల్లా కనిపిస్తున్నారా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్లామిక్ స్టేట్ ఓటమి తర్వాత పట్టుబడ్డ వేలాది మంది మిలిటెంట్లు, ఇప్పుడు సిరియా జైళ్లలో బందీలుగా ఉన్నారు. అక్కడ ఖైదీల సంఖ్య సామర్థ్యానికి మించిపోయింది. ఇప్పుడు ఆ జైళ్లలో పరిస్థితి మరింత దిగజారింది. అల్లర్లు, హింస, గొడవలు సర్వ సాధారణం అయిపోయాయి.
ఇస్లామిక్ స్టేట్ ఆ మిలిటెంట్లను, వారి భార్యాపిల్లలను విడిపిస్తామని ప్రతిజ్ఞ చేసింది. మరోవైపు మానవ అక్రమ రవాణా గ్యాంగ్ కూడా చురుగ్గా ఉంది. కొన్ని రిపోర్టుల ప్రకారం అది లంచం ఇచ్చి వారిని ఎలాగోలా విడుదల చేయించగలదు.
బ్రిటన్‌లో పుట్టి, సిరియా నుంచి తిరిగి వచ్చిన స్కూల్ విద్యార్థి షమీమా బేగం తన పౌరసత్వం తిరిగి పొందడానికి బ్రిటన్‌లోనే న్యాయపోరాటం చేయవచ్చని ఇదే నెలలో బ్రిటన్‌లోని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో కూడా కోర్టు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గురించి ప్రస్తావించింది.
ఇటీవల బ్రిటన్ మూలాలు ఉన్న ఒక ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ కుర్దుల అదుపులో చనిపోయాడు.
2019లో ఇస్లామిక్ స్టేట్ తాము చెప్పుకున్న ఖిలాఫత్‌లోని చివరి భాగం బాగూజ్ కూడా వారి చేతుల్లోంచి జారిపోయింది. దాంతో అక్కడి పది వేల మందిని అరెస్ట్ చేసి, సిరియాలో కుర్దుల నియంత్రణలో ఉన్న శిబిరాల్లో పెట్టారు.
దీనిని పూర్తి చేయని పనిగా వర్ణించిన విమర్శకులు దీనివల్ల ప్రపంచ భద్రతకే పెను ముప్పు రావచ్చని చెబుతున్నారు.
ఎలాగోలా వారి అదుపులోంచి తప్పించుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ప్రపంచంలోని మిగతా భాగాల్లో ఒక్కటయ్యే ప్రమాదం ఉందని, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ను మళ్లీ ఏర్పాటు చేయవచ్చని ఇదే నెలలో ప్రచురితమైన తమ రీసెర్చిలో కింగ్స్ కాలేజ్ లండన్ డిఫెన్స్ స్టడీస్ విభాగం హెచ్చరించింది.
“మనం ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడానికి కట్టుబడి ఉన్నాం అంటే, దానికి అర్థం వైమానిక ఆపరేషన్ ముగియగానే మనం సంచులు సర్దుకుని వచ్చేయాలని కాదు” అని బ్రిటన్ పార్లమంట్ సెక్యూరిటీ కమిటీ చైర్మెన్, ఎంపీ టోబియాస్ ఎల్‌వుడ్ అన్నారు.

మిలిటెంట్ల వారసులు
“సిరియా, ఇరాక్‌లో పది వేల మంది మిలిటెంట్లు, చాందసవాదులు, వారి సానుభూతిపరులు, వారి కుటుంబాలు ఉన్నాయి. మనం దాఎష్(ఇస్లామిక్ స్టేట్)ను పూర్తిగా అంతం చేయాలనుకుంటున్నామా, లేదా అనేది మనం నిర్ణయం తీసుకోవాలి. లేదంటే వారి భావజాలం సజీవంగా ఉంటుంది. వాళ్లు మళ్లీ రావచ్చు”.
2014-2019 మధ్య సుమారు 40 వేల మంది జిహాదీలు సిరియా, ఇరాక్ వైపు వెళ్లారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరిపోయారు. ఒక అంచనా ప్రకారం వీరిలో సజీవంగా ఉన్న 10-20 వేల మంది విదేశీ మిలిటెంట్లు జైళ్లలోగానీ, పరారీలో గానీ ఉన్నారు.
కొన్ని పొరుగు దేశాలవారు ఇరాక్ కోర్టులకు కూడా హాజరయ్యారు. కానీ వారిలో చాలామంది అత్యంత దారుణంగా ఉన్న క్యాంపుల్లో బందీలుగా ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ వారికి(వీరిలో మహిళలు కూడా ఉన్నారు) విముక్తి కల్పిస్తామని వాగ్దానం చేసింది. మహిళలను ఇస్లామిక్ స్టేట్ ‘పవిత్ర మహిళలు’గా, ‘ఖిలాఫత్ వధువులు’గా చెబుతుంది.
ఐక్యరాజ్యసమితి నుంచి ఇదే ఏడాది విడుదలైన ఒక అంచనా ప్రకారం కుర్దులు నడిపే క్యాంపుల్లో విదేశీ మిలిటెంట్లకు సంబంధించిన సుమారు 8 వేల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో దాదాపు 700 మంది పిల్లలు ఐరోపా దేశాల నుంచి వచ్చిన మిలిటెంట్లకు చెందినవారు. వారిలో బ్రిటన్ నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. ఐరోపా దేశాలు ఇప్పటివరకూ ఆ పిల్లలను రప్పించడానికి అయిష్టంగా ఉన్నాయి.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ వయలెంట్ ఎక్స్ ట్రీమిజం సంస్థను నిర్వహించే ఎనె స్పెక్‌హార్డ్ గత మూడేళ్లలో రెండు వందల మంది జిహాదీలు, వారి కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బందీలుగా మహిళలు, పిల్లలు
ఆమె ఉత్తర సిరియాలో అల్-హోల్ లాంటి క్యాంపుల్లో కూడా పర్యటించారు. ఈ క్యాంపుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని. అక్కడ ప్రతి వారం ఎవరో ఒకరు పారిపోడానికి ప్రయత్నిస్తుంటారని చెప్పారు.
“అక్కడ ఉంటున్న చాలా మంది మహిళలకు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు తెంచుకున్నారు. కానీ వారు తమపై ప్రతీకారం తీర్చుకుంటారేమోననే ఇప్పటికీ భయపడుతూనే జీవిస్తున్నారు” అన్నారు.
ఆ క్యాంపుల్లో ఇస్లామిక్ స్టేట్ భావజాలం ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వారు మిగతా మహిళలను హత్య కూడా చేస్తున్నారు. వేరే మహిళలు ఉంటున్న గుడారాలకు నిప్పు పెడతారు. రాళ్లు విసరడంతోపాటూ, వేరేవారిపై రాళ్లు ఎలా విసరాలో తమ పిల్లలకు కూడా నేర్పిస్తుంటారు.
అంటే ఈ క్యాంపుల్లో ఉంటున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల కుటుంబాలను జిహాదీలుగా అని భావించాలా అనే ప్రశ్నవస్తుంది.
సమాధానంగా “అలా ఏం కాదు. చాలా కుటుంబాలు మౌనంగా తమ భావజాలం మార్చుకున్నాయి. కానీ వారిలో ఇస్లామిక్ స్టేట్ మహిళా మిలిటెంట్ల భయం ఉంది. ఆ మహిళలు తమపై దాడి చేస్తారేమోనని వాళ్లు బిక్కుబిక్కుమంటుంటారు” అని ఏనె చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ ఖిలాపత్‌గా చెప్పుకునేదానిలో ఈ మహిళలు హిస్బాహ్‌కు చెందినవారు. వీరు ఇస్లామిక్ స్టేట్‌లో మహిళల మోరల్ పోలీసింగ్ కూడా చేస్తారు. ప్రజలకు కఠిన శిక్షలు అమలు చేస్తుంటారు. ఇప్పుడు మహిళలందరూ క్యాంపుల్లో బందీలుగా ఉన్నా, అక్కడ కూడా వారంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఇస్లామిక్ స్టేట్‌లో ఉన్నప్పుడు చేసిన పనులే చేస్తున్నారు.
తన పరిశోధన సమయంలో మహిళను వారి కథ గురించి కూడా అడిగానని, భయంతో చాలా మంది ఏదైనా చెప్పడానికి వెనకాడారని తెలిపారు. తమపైన దాడులు చేస్తారేమోనని వారు భయపడ్డారని ఎనె స్పెక్‌హార్డ్ అన్నారు.
అక్కడి పిల్లలు భయంలో, నైరాశ్యంలో జీవిస్తున్నారు. మొదట వారికి ఇస్లామిక్ స్టేట్ అంటే భయం ఉండేది. ఇప్పుడు వారు ఆ క్యాంపుల్లో భయాందోళనలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
భయపడుతున్న దేశాలు
రష్యా ఉత్తర కాకస్ ప్రాంతం నుంచి కూడా భారీ సంఖ్యలో జనం ఇస్లామిక్ స్టేట్‌లోకి వెళ్లారు. అయినా, అది ఇప్పుడు తమ దేశానికి చెందిన పౌరుల భార్యా పిల్లలను తిరిగి దేశంలోకి రానిస్తోంది..
ఐసిస్ మిలిటెంట్ల భార్యాపిల్లలను తిరిగి స్వదేశానికి రప్పించాలనే ఆలోచనను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారని సెయింట్ పీటర్స్ బర్గ్ కాన్‌ఫ్లిక్ట్ అనాలసిస్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ డైరెక్టర్ కేటరీనా సొకిరియాన్సకయా చెప్పారు.
తల్లిదండ్రులు చేసిన పనులకు పిల్లలను బాధ్యులుగా చేయకూడదని ఆమె స్పష్టం చేశారు. వారిని యుద్ధరంగంలో అలా ఎలా వదిలేస్తామన్నారు.
ఇక, ఇస్లామిక్ స్టేట్‌లో అనాథ జిహాదీల విషయానికి వస్తే, దానికి మూడు కోణాలు ఉన్నాయి. చట్టపరమైనవి, మానవీయమైనవి, భద్రతకు సంబంధించినవి.
చట్టపరంగా చూస్తే, వేలాది మందిని, ముఖ్యంగా, పిల్లలున్న వారిని అలా నిరవధికంగా క్యాంపుల్లో వదిలేయడాన్ని సమర్థించలేం.
చాలామంద జీహాదీలు, వారి కుటుంబాలు తాము తిరిగి స్వదేశాలకు వెళ్లి కోర్టులో హాజరు కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. జైలుకు వెళ్లమన్నా, వెళ్తామంటున్నారు.
ఇక్కడ సమస్య ఏంటంటే, పశ్చిమ దేశాల ప్రభుత్వాల్లో వారిని తిరిగి తమ దేశంలోకి తీసుకురావాలంటే భయంగా ఉంది. ఆ చర్యలను స్థానికులు అంగీకరించరు. దాని వల్ల వివిధ పరిణామాలు కూడా ఉండచ్చు. కోర్టులో దోషులనడానికి తగిన సాక్ష్యాలు చూపించలేకపోతే వారిని విడుదల చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్న జైళ్లలో వారి ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా ఉంది. సిరియా, ఇరాక్‌లో ఏళ్లపాటు పోరాటం చేసి, ఛాందసవాద భావజాలం ఉన్న వారిని జైళ్లలో పెడితే, ఏమవుతుందోననే భయం ప్రభుత్వాలను వెంటాడుతోంది.
ఒక భారీ జనాభాపై ఘోర అమానుషాలకు పాల్పడేవారిని, ప్రజలకు బానిసలుగా మార్చేవారిని, మహిళలు, బాలికలపై అత్యాచారాలు చేసే వీరిపై ప్రపంచంలోని ఏ మూలా సానుభూతి లేదు.
దీనినే మానవీయ కోణంలో చూస్తే. సహాయ సంస్థలు ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. క్యాంపుల్లో అమానవీయ పరిస్థితుల గురించి వాటిని ప్రశ్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
ఛాందసవాదంతో భయం
అమెరికా వందలాది మందిని ఎలాంటి న్యాయ ప్రకియా చేపట్టకుండా ఇరాక్ నుంచి తీసుకెళ్లి క్యూబాలో నావికాదళ స్థావరం గ్వాంటనామోబేలో బంధించినప్పుడే, పశ్చిమ దేశాలకు మధ్యప్రాచ్యం మీద ఎలాంటి నైతిక హక్కూ లేకుండాపోయింది.
గ్వాంటనామో బేను స్వయంగా విమర్శించిన ఐరోపా దేశాలు, ఇప్పుడు వారిని తీసుకురావడం చాలా కష్టమైన పని అని చెప్పి ఏదారీ లేని తమ పౌరుల సమస్యలను పట్టించుకోకుండా వదిలేసింది.
చివరికి ఈ మొత్తం సమస్యకు భద్రతా కోణం కూడా ఉంది. ఇది చాలా ప్రమాదమా, ఈ పౌరులను తిరిగి తీసుకువచ్చి, న్యాయస్థానాల్లో నిలబెట్టాలా, లేక వారిని మళ్లీ అక్కడే వదిలేయడమా అనేదానిపై చివరికి ప్రభుత్వాలే ఒక నిర్ణయం తీసుకోవాలి.
ఇప్పటివరకూ సిరియా నుంచి 400 మంది తిరిగి బ్రిటన్ చేరుకున్నారు. వారి వల్ల పెద్దగా ఎలాంటి భద్రతా సమస్యలూ రాలేదు. కానీ, వారిలో ఎక్కువ మంది సిరియాలో తిరుగుబాటు ప్రారంభమైన సమయంలో అక్కడికి వెళ్లారు.
ఈరోజు బ్రిటన్ అంతర్గత భద్రతా ఏజెన్సీ ఎంఐ15, పోలీసులు క్యాంపుల్లో ఉంటున్న వారు కాస్త ఎక్కువ ఛాందసవాదులని ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే వారు ఏళ్ల తరబడి హింసకు పాల్పడ్డారని, లేదా హింసను చూస్తున్నారని చెబుతున్నారు.
రష్యా నిపుణులు కేటరీనా సొకిరియాన్సకయాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి.
“మనం అందులో మానవీయ కోణం గురించి ఏం మాట్లాడ్డం లేదు. భవిష్యత్తులో తలెత్తే ఏదైనా జిహాదీ ఛాందసవాద ఆపరేషన్‌ను అడ్డుకోవాలంటే, ఈ సమస్యకు పరిష్కారం వెతకడం చాలా అవసరం. ఎందుకంటే మనం వారు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో క్యాంపుల్లో ఉండడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం” అన్నారు.
నిందితులు ఇరాక్ లేదా సిరియా చట్టాలను ఎదుర్కునేలా చూడాలని అనుకుంటున్నట్టు బ్రిటన్ హోంశాఖ చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
తర్వాత ఏంటి?
మగ మిలిటెంట్లను అక్కడే వదిలి మహిళలు, పిల్లలను తిరిగి తీసుకురావడం సాధ్యమేనా అనే ప్రశ్నకు, అలా చేయవచ్చని ఎనె స్పెక్‌హార్డ్ చెబుతున్నారు.
“అలాంటి మహిళలు చాలామంది ఉన్నారు. వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టాలి. వారికి శిక్ష మాఫీ చేయవచ్చు. ఒకవేళ, వారు జైలుకు వెళ్లినా, వారి పిల్లలు వారిని కలవవచ్చు. కనీసం వారు సిరియాలో వేధింపులు భరించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది” అన్నారు.
తల్లులు, పిల్లలను తిరిగి తీసుకురావడం అన్నిటికంటే మంచిది. కానీ, అది కష్టమైతే కనీసం పిల్లలనైనా తిరిగి స్వదేశానికి తీసుకురావాలి.
ఈ రెండు విషయాలతో ఒకటి మాత్రం స్పష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నిరవధికంగా వారిని అలా అక్కడే వదిలేయలేం.
ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడానికి సాయం చేసిన సిరియా, కుర్దులు ఇప్పుడు బందీలను ఉంచిన క్యాంపులకు భద్రత అందిస్తున్నారు. వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
అధ్యక్షుడు ట్రంప్ తన సైనిక దళాలను తిరిగి పిలిపించిన తర్వాత కుర్దులకు ఇప్పుడు టర్కీ దళాల దాడుల ముప్పు ఎదురవుతోంది.
అటు క్యాంపుల్లో ఉన్న మిలిటెంట్ల గురించి కుర్దుల వాదన స్పష్టంగా ఉంది. “ఈ మొత్తం ఇస్లామిక్ స్టేట్ బందీల్లో ఐరోపా దేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. మేం వీరిని ఎంతోకాలం కాపాడలేం. మీరు వారిని తిరిగి తీసుకెళ్లాలి” అని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- గోరఖ్‌పూర్ డాక్టర్ కఫీల్‌ఖాన్‌ను ఎందుకు జైలు నుంచి విడుదల చేయడం లేదు?
- చైనా - అమెరికా వివాదం: చెంగ్డూలో అమెరికన్ కాన్సులేట్‌ను ఖాళీ చేయించిన చైనా
- కరోనావైరస్ తిరుమలలో ఎలా ఉంది... దర్శనాలు నిలిపివేయడమే మంచిదా?
- అరారియా అత్యాచార కేసు: బాధితులే బోనులో ఎందుకు నిల్చోవాల్సి వస్తోంది?
- కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని భారతదేశం ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








