కరోనావైరస్ తిరుమలలో ఎలా ఉంది... దర్శనాలు నిలిపివేయడమే మంచిదా?

తిరుమల
    • రచయిత, బండి హృదయ విహారి
    • హోదా, బీబీసీ కోసం

తిరుమల అనగానే కిలోమీటర్ల పొడువున్న క్యూలైన్లు, ఇసుక వేస్తే రాలనంత జనం, దర్శనం కోసం, గది కోసం గంటల తరబడి నిరీక్షణ గుర్తుకొస్తాయి. కానీ ప్రస్తుతం తిరుమల అలా లేదు. కరోనా వైరస్ ప్రభావం తిరుమలపై అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తోంది.

తిరుమల కొండకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ అధికారులు పూర్తిగా మూసివేశారు. అలిపిరి కాలినడక మార్గాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరచివుంచుతున్నట్లు పీఆర్ఓ కార్యాలయం తెలిపింది.

కొండ మీద గోవిందుడి నామస్మరణ కొనసాగుతూనే ఉంది. మాడవీధుల్లో భక్తులు పలుచగా కన్పిస్తున్నారు. వెంగమాంబ అన్నప్రసాదం, లడ్డు కౌంటర్లు, కళ్యాణకట్ట, కొండపైకి బస్సులు... అన్నీ కొన్ని మార్పులు చేర్పులతో నడుస్తున్నాయి!

బయటి ప్రపంచంలో కన్పిస్తున్న మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్సింగ్... ఇవన్నీ తిరుమలలో కూడా కన్పిస్తున్నాయి. తిరుమలతోపాటు కొండకిందున్న తిరుపతిలో కూడ కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

‘128 యేళ్ల తర్వాత..!’

కోవిడ్-19 ప్రభావంతో దాదాపు 128 యేళ్ల తర్వాత, మార్చి 20న తిరుమల దేవస్థానాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి జూన్ 11న భక్తులకు దర్శనం కల్పించారు. 1892లో రెండు రోజులపాటు భక్తుల దర్శనంతోపాటు ఏకంగా ఆలయాన్ని కూడా మూసేసినట్లు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ తెలిపారు.

సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60 వేల మంది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కరోనా సమయంలో దర్శనం కొనసాగిస్తే, ప్రమాద తీవ్రత పెరుగుతుందన్న ఉద్దేశంతో అధికారులు దర్శనాలను రద్దు చేశారు.

లాక్‌డౌన్ తర్వాత గుడిని తెరవాలనుకున్న అధికారులు, జూన్ 8, 9 తారీఖుల్లో ఉద్యోగులకు మాత్రమే ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించారు. జూన్ 10న తిరుమల స్థానికులకు, జూన్ 11న భక్తుల కోసం గుడిని తెరిచినట్లు అధికారులు తెలిపారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, జూన్ 15న, టీటీడీలో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ రావడంతో, కరోనా వైరస్ అధికారికంగా తిరుమలకు చేరింది.

తిరుమల

ఫొటో సోర్స్, FACEBOOK

అర్చకులకూ కరోనా!

అలాఅలా విస్తరిస్తూ, జూలై 15 నాటికి టీటీడీ సిబ్బందిలో 176 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 15 మంది అర్చకులు!

ఇప్పటిదాకా తిరుమలలో ‘పెద్ద జీయర్’తోపాటుగా మరో 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ రాగా, కొందరు అర్చకుల రిపోర్ట్స్ ఇంకా రావాల్సివుంది. పాజిటివ్ వచ్చిన అర్చకుల్లో 14 మంది జూలై 25న డిశ్ఛార్జ్ అయ్యారని, చెన్నై అపోలో హాస్పిటల్లో ఒక అర్చకుడు ఇంకా చికిత్స తీసుకుంటున్నారని టీటీడీ పీఆర్ఓ శాఖ తెలిపింది.

ఇప్పటికే టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు ఒకరు, ఆలయంలో దీపాల సేవ చేసే మరో ఉద్యోగి కరోనాతో మరణించారు.

తిరుమలలో కరోనా కేసుల గురించి సమాచారం కోరుతూ ఆలయ ఈఓ అనిల్ సింఘాల్‌‌ అధికారిక మెయిల్‌కు బీబీసీ తరపున ఒక లెటర్ పంపినా, వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈఓ అనిల్ సింఘాల్ స్పందన కోసం బీబీసీ మూడు రోజులు వేచిచూసింది.

అయితే, తిరుమలలో వెంకటేశ్వరుడి దర్శనాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కరోనా విషయంలో తిరుపతిపై తిరుమల ప్రభావం ఉందని కొందరు చెబుతుంటే, దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం, అలా అని నిరూపించలేం కూడా అని అధికారులు అంటున్నారు.

‘‘తిరుమలకు రోజుకు 12 వేలమంది భక్తులు దర్శనానికి వస్తే, వారిలో ఒక్కరికి కూడా కరోనా లేదని ఏరకంగా హామీ ఇవ్వగలం?’’ అని తిరుపతిలోని ఒక సీనియర్ పాత్రికేయులు బీబీసీతో అన్నారు. కానీ తన పేరు ప్రస్తావించడానికి వారు ఇష్టపడలేదు.

తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఇదివరకే కరోనాతో మరణించారు. తాజాగా జూలై 24న కరోనా కారణంగా టీటీడీ ఉద్యోగి తిరుపతిలో మరణించారు. ఆలయ అర్చకులు సైతం తమ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ అన్నారు.

అర్చకులకు కరోనా వైరస్ సోకడానికున్న అవకాశాల గురించి ఆయన మాట్లాడుతూ... ‘‘తిరుమల గర్భాలయం చాలా ఇరుకుగా ఉంటుంది. అక్కడున్న అర్చకులకు, భక్తులకు ఆరోగ్యకరమైన దూరమే ఉంటుంది. క్యూలైన్లలో భక్తులు మాస్కులు పెట్టుకున్నా, గర్భగుడి దగ్గరకు వెళ్లినపుడు కొందరు మాస్కులు తీసేసి, గోవిందా..! అని అరుస్తుంటారు. అప్పుడు వీరి నోటి నుంచి వెలువడే తుంపర్లు గాలిలోకి విడుదల అవుతున్నాయి. కొన్ని గంటలపాటు వైరస్ గాల్లో ఉంటోంది. వైరస్ బయటికి వెళ్లడానికి ఎలాంటి అవకాశమూ ఉండదు. అర్చకులు బయటకు రావాలన్నా, లోపలకు పోవాలన్నా ఈ దారిలోనే వెళ్లాలి. ఈవిధంగా అర్చకులకు కరోనా సోకివుండవచ్చు’’ అని తిరుపతి జర్నలిస్టు అన్నారు.

జూలై 15 నాటికి టీటీడీ సిబ్బందిలో 176 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది
ఫొటో క్యాప్షన్, జూలై 15 నాటికి టీటీడీ సిబ్బందిలో 176 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది

‘దర్శనాలు రద్దు చేయడం మంచిది’

తిరుపతి సీనియర్ పాత్రికేయులు ప్రస్తావించిన విషయాన్నే మాజీ ఆలయ అర్చకులు రమణ దీక్షితులు కూడా సమర్థించారు.

‘‘భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నపుడు, భక్తిపారవశ్యంలో గోవింద నామస్మరణ చేస్తారు. అపుడు పాజిటివ్ వ్యక్తుల ద్వారా... అర్చకులు గర్భగుడి నుంచి బయటకు వస్తున్నపుడు, లోనికి వెళ్తున్నపుడు వైరస్ సోకే ప్రమాదం ఉందన్న విషయాన్ని కొట్టిపారేయలేం. ఇలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని రమణ దీక్షితులు బీబీసీతో అన్నారు.

కరోనా నేపథ్యంలో దర్శనాల గురించి, అర్చకుల సంక్షేమం గురించి ఆయన మాట్లాడుతూ... ‘‘వీఐపీ దర్శనాల పేరుతో కొందరిని అర్చకులకు మరీ దగ్గరగా, మొదటి మెట్టు వరకు పంపుతున్నారు. నేను ఒక సైంటిస్ట్‌గా చెబుతున్నాను... ఇలా చేస్తే వ్యాధి స్ప్రెడ్ కావడానికి అవకాశం ఎక్కువ. భక్తులు ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు, వారిది రెడ్ జోన్ వాళ్లా, లేదా గ్రీన్ జోన్ వాళ్లా అన్నది అర్చకులకు తెలీదు. వాళ్లకు కోవిడ్ ఉందో లేదో తెలీదు. టిక్కెట్లు కొన్నందువల్ల వారిని వీఐపీ దర్శనాలకు అనుమతిస్తున్నారు. అందువల్ల వైరస్ వ్యాప్తికి మనమే అవకాశాలను కల్పిస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘లాక్‌డౌన్ పీరియడ్‌లో కొండపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. లాక్‌డౌన్ సడలించాక, దర్శనాలు ప్రారంభించాకనే తిరుమలలో కేసులు పెరిగి ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరాయి. దర్శనాలు ఆపేస్తే దేవాలయానికి జరిగే నష్టం ఏదీలేదు. స్వామివారికి జరగాల్సిన ఆరాధనాక్రమాలన్నీ ఏకాంతంగా నిర్వహించవచ్చు. సాధారణంగా దర్శనాల విషయలో అర్చకులు జోక్యం చేసుకోరు. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దర్శనాలు లేకపోతే మంచిదని మా అభిప్రాయం’’ అని రమణ దీక్షితులు బీబీసీతో అన్నారు.

తిరుమల అర్చకులు తిరుపతిలో నివాసం ఉంటారు. తిరుపతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజూ తిరుపతి నుంచి రావడం వల్ల ప్రమాదం అని భావించి, నెలలో 15 రోజులపాటు అర్చకులు తిరుమలలోనే ఉండాలని, టీటీడీ సూచించింది. అందుకుగాను, అర్చకుల కోసం ‘అర్చక భవన్’లో విడిది ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొందరు అర్చకులకు కరోనా సోకడంతో వారిని ‘అర్చక భవన్’ నుంచి ‘వకుళ భవన్’కు మార్చారు. అర్చక భవన్‌లో కామన్ డార్మిటరీ, డైనింగ్ ఉండేది కానీ వకుళ భవన్‌లో విడిగా గదులను కేటాయించారు అని పీఆర్ఓ విభాగం తెలిపింది.

సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60వేల మంది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60వేల మంది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు

60 వేల నుంచి 6 వేలకు

తిరుమలను ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ అని భక్తులు చెబుతుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు రోజుకు లక్షకు పైగా భక్తులు వచ్చిన చరిత్ర ఉందని అధికారులు అన్నారు. ఇక సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60 వేలకు తగ్గకుండా భక్తులు శ్రీనివాసుడి దగ్గరకు వస్తారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తిరుపతి, తిరుమలలో కరోనా వ్యాపి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు దర్శనాలను తగ్గించారు.

లాక్‌డౌన్ తర్వాత ఆన్‌లైన్‌లో 9 వేలు, ఆఫ్‌లైన్‌లో 3 వేల మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చేవారు. కానీ తిరుపతి పట్టణంలో వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం వల్ల, 3 వేల ఆఫ్‌లైన్ టికెట్లను రద్దు చేశారు. జూలై 20 నుంచి కేవలం 9 వేల ఆన్‌లైన్ దర్శనం టోకెన్లను మాత్రమే అధికారులు ఇస్తున్నారు.

తిరుమలలో గదుల సంగతి?

తిరుమలలో మొత్తం 6,500 గదులకు గాను గతంలో 70 వేల నుంచి 1 లక్ష దాకా భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం 5-6 వేల మంది భక్తులు మాత్రమే కొండకు వస్తున్నట్లు టీటీడీ ప్రజాసంబంధాల విభాగం తెలిపింది.

ప్రస్తుతం తిరుమలలో గదులను సరి, బేసి విధానంలో కేటాయిస్తున్నామని అధికారులు తెలిపారు. అంటే, భక్తులకు కేటాయించే గదుల మధ్య ఒక గదిని ఖాళీగా ఉంచుతున్నారు. అలా ఈరోజు ఖాళీగా ఉంచిన గదులను మరుసటి దినం భక్తులకు కేటాయిస్తున్నారు. మరోవైపు, కేటాయించిన గదులను ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం తిరుమల గదుల ఎక్స్టెన్షన్ రద్దు చేశారు. గతంలో 72 గంటల వరకు భక్తులు తమ గదుల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు 24 గంటల తర్వాత గదులను ఖాళీ చేయాలని అధికారులు బీబీసీకి వివరించారు.

తిరుమల

ఫొటో సోర్స్, Getty Images

కళ్యాణకట్ట కట్టుదిట్టం

భక్తులు తలనీలాలు సమర్పించే మొక్కును కళ్యాణకట్టలో తీర్చుకుంటారు. ఆలయ క్షురకులు భక్తుల తలనీలాలను ఇక్కడే తీసివేస్తారు.

కరోనా భయంతో, దేశవ్యాప్తంగా బార్బర్ షాపులను ప్రభుత్వం మూసేసిన విషయం అందరికీ అనుభవమే. ఈ నేపథ్యంలో, వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ. అందుకే కళ్యాణకట్టలో పనిచేసే ఆలయ క్షురకులకు టీటీడీ పీపీఈ కిట్లను పంపిణీ చేసింది.

దర్శనం

భక్తులకు కేటాయించిన సమయానికి వస్తే, ప్రస్తుతం అరగంట సమయంలో వారి దర్శనం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దర్శనం క్యూ లైన్లలో భక్తుల మధ్య 2 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు అన్నారు. ఆలయం లోపల, బయట కూడా మార్కింగ్స్ వేసి, భక్తుల మధ్య దూరం ఉండేలా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

లడ్డు కౌంటర్ల వద్ద కూడా ఇలాంటి పద్దతి పాటిస్తున్నామన్నారు. గతంలో 67 లడ్డు కౌంటర్లు ఉంటే ప్రస్తుతం 25 కౌంటర్లు మాత్రమే ఉన్నాయి.

తిరుమల దర్శనంలో మరో ముఖ్య ఘట్టం ‘తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం.’

ఈ అన్నప్రసాద కేంద్రంలో గతంలో వేయి మంది భక్తులు ఒకేసారి కూర్చుని భోజనం చేసేవారని, అధికారులు అన్నారు. కరోనాకు ముందు ఒక టేబుల్‌కు నలుగురు భక్తులు కూర్చుని భోజనం చేస్తే, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు.

రమణ దీక్షితులు
ఫొటో క్యాప్షన్, రమణ దీక్షితులు

తిరుపతిపై తిరుమల ప్రభావం?

తిరుపతి పట్టణంలో కరోనా కేసులు ఆందోళనకరంగా మారాయి. గత జూన్ నెలలో నెమ్మదిగా రిజిస్టర్ అయిన కోవిడ్ కేసులు, జూలైలో రాకెట్‌లా దూసుకుపోయాయి. తిరుపతిలో ప్రతి 100 శ్యాంపిల్స్‌లో 15 కేసులు పాజిటివ్‌గా వస్తున్నాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త బీబీసీకి తెలిపారు.

జూన్ 10 వరకు తిరుపతి పట్టణంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 40.

జూన్ 11న తిరుమల దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి జూన్ 30 వరకు 276 కేసులు నమోదయ్యాయి.

జూలై 12వతేదీ వరకు 853 కేసులు, జూలై 13వతేదీ వరకు 928 కేసులు నమోదయ్యాయి. జూలై 25వతేదీ వరకు తిరుపతి పట్టణంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,237 అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

పైన ప్రస్తావించిన మొత్తం కేసుల్లో డిశ్చార్జ్ అయినవారు, మరణించినవారి సంఖ్య కూడా కలిసివున్నాయి.

ప్రస్తుతం జూలై 25న తిరుపతి పట్టణంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 785. ఇంతవరకు 1425 మంది డిశ్ఛార్జ్ అవ్వగా, 27 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

.

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, .

‘తిరుమల మాత్రమే కారణం కాదేమో’

తిరుపతి పట్టణంలో తిరుమల దర్శనాలకు ముందు, తర్వాత అనే ఒక విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తిరుమల వల్ల మాత్రమే తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్నాయనడం సరికాదని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త బీబీసీతో అన్నారు.

‘‘తిరుమలకు వచ్చే భక్తుల్లో కరోనా సోకినవారు కూడా ఉండొచ్చు అన్న విషయాన్ని కొట్టిపారేయలేం. అలా అని, రోజూ కొండకు వచ్చే 6-7వేల మంది భక్తులందరికీ కోవిడ్ పరీక్షలు చేయడం అసాధ్యం’’ అని భరత్ గుప్త అన్నారు.

‘‘తిరుమల ప్రభావం తిరుపతిపై ఉండొచ్చు, పూర్తిగా ఉండదని చెప్పలేం. కానీ తిరుపతి పట్టణంలో మాత్రమే కోవిడ్ కేసులు పెరగడంలేదు. చాలా జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజుకు దాదాపు 2.5లక్షల టెస్టులు చేస్తున్నాం. తిరుమలకు వచ్చే 7వేలమందికి టెస్టులు చేయాలంటే, దేశంలో మూడు శాతం టెస్టులు ఇక్కడే జరగాలి. అది అసాధ్యం. అలాగని నెగెటివ్ రిపోర్టులున్నవారే దర్శనానికి రావాలని ఆదేశించలేం’’ అని భరత్ గుప్త అన్నారు.

ప్రస్తుతం రోజుకు 4,500-5000 టెస్టులు చేస్తున్నామని, టెస్టుల సంఖ్యతోపాటే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిందని ఆయన చెబుతున్నారు.

‘‘తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల్లో కూడా కొందరికి ర్యాండమ్‌గా పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటిదాకా దాదాపు 400మంది భక్తులకు పరీక్షలు చేశాం. వారిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. గణాంకాల ప్రకారం తిరుమల చాలా సేఫ్. తిరుమలలో టీటీడీ తీసుకున్న చర్యలు అద్భుతం’’ అని భరత్ గుప్త బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)