కరోనావైరస్: ‘కేజీహెచ్‌కు వెళ్లడానికి అంబులెన్స్‌కు కాల్ చేశాం.. నాన్న చనిపోవడానికి 20 నిమిషాల ముందు వచ్చింది’

ఫొటో సోర్స్, Rajesh
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
విశాఖపట్నానికి చెందిన రాజేశ్ తన తండ్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో చికిత్స కోసం సుమారు 10 ప్రైవేట్ హాస్పిటళ్ల చుట్టూ తిరిగారు.
సమయానికి చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి గురించి బాధపడుతూ హాస్పిటళ్ల చుట్టూ తిరగడానికి, పరీక్ష చేయించుకోవడానికి తాము పడిన వేదనను ‘బీబీసీ న్యూస్ తెలుగు’కు వివరించారు.
“మా నాన్నగారికి దగ్గు, జలుబు లాంటి లక్షణాలేమి లేవు, కానీ జులై 12న కాస్త నీరసంగా అనిపించడంతో ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించారు. ఆయన రాసిన మందులు తెచ్చుకుని వాడటం మొదలుపెట్టారు కానీ, ఫలితం కనిపించలేదు. నెమ్మదిగా రుచి, వాసన కోల్పోవడం మొదలైంది”.
“జులై 14కి ఇంకా ఆరోగ్యం మందగించడంతో నగరంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్లి ఎక్స్ రే, స్కానింగ్ తీయించుకున్నారు. కానీ, అక్కడ వైద్యులు అప్పటికీ కోవిడ్ పరీక్ష చేయించుకోమని చెప్పలేదు.
జులై 15కి ఆయనకు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయింది. దాంతో ఇక కోవిడ్ పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాం”.
“జులై 16న గ్రామ వాలంటీర్లకు ఫోన్ చేస్తే కింగ్ జార్జి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లమని చెప్పారు. ఆ తర్వాత కోవిడ్ హెల్ప్ లైన్‌కి కాల్ చేశాం”
“కోవిడ్ పరీక్ష ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలి. కోవిడ్ పరీక్ష జరిగే లోపు ఆరోగ్యం విషమిస్తూ ఉండటంతో కనీసం 10 ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లాం. కానీ, టెస్ట్ రిపోర్ట్ ఉంటే గాని ఎవరూ చేర్చుకుని చికిత్స చేయడానికి ఒప్పుకోలేదు”.
“చివరకు నగరంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చేర్చించాం. కానీ, కోవిడ్ లక్షణాలున్నాయని చికిత్స చేయకుండానే వారు వెనక్కి పంపించేశారు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ప్రైవేట్ హాస్పిటల్‌లో కోవిడ్ చికిత్సలకు అనుమతి లేదు గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 8న కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుమతిస్తూ జీవో జారీ చేసినప్పటి నుంచి నేరుగానే రోగులను చేర్చుకుంటున్నామని విశాఖపట్నంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ డాక్టర్ కుచేలబాబు వంకినేని చెప్పారు.
అయితే, హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులు, బెడ్లు ఖాళీ లేనప్పుడు చేర్చుకోవడం సాధ్యపడదని అన్నారు.
ఒక వేళ హాస్పిటల్లో చేరిన రోగికి కరోనా లక్షణాలు కనిపిస్తే శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అయితే, రాజేశ్ తన తండ్రిని తొలుత ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లలేదు. ప్రయివేటు హాస్పిటళ్లు చేర్చుకోకపోవడంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
“ప్రైవేట్ హాస్పిటళ్లు చికిత్స చేయడానికి ఒప్పుకోకపోవడంతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లడానికి అంబులెన్సు కోసం కాల్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఆఖరికి అంబులెన్సుని పిలిపించడానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసి వచ్చింది” అన్నారాయన.
జులై 17న ఆన్లైన్‌లో ఎంఫైన్ యాప్ ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని 18న ఉదయం నగరంలో ఉన్న ఒక ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షకు వెళ్లినట్లు తెలిపారు రాజేశ్. ఈ యాప్ ద్వారా డాక్టర్లను ఆన్ లైన్‌లో సంప్రదించే అవకాశం ఉంటుంది.
“ఇంటికి తిరిగి వచ్చిన మరో రెండు గంటల్లో నాన్న ప్రాణం పోయింది. ఆయన మరణించడానికి ఒక 20 నిమిషాల ముందు అంబులెన్సు వచ్చింది. కానీ, హాస్పిటల్‌లో చేరేందుకు ఆయన లేరు” అని తన తండ్రి మరణం గురించి రాజేశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా లక్షణాలుంటే చేర్చుకోవడానికి ప్రైవేట్ హాస్పిటళ్లు ఎందుకు సంశయిస్తున్నాయి?
కొద్దికాలం కిందటి వరకు ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ హాస్పిటళ్లు మాత్రమే చికిత్స అందిస్తూ వచ్చాయి.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జులై 8న రాష్ట్రంలో కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ హాస్పిటళ్లు వసూలు చేయాల్సిన ధరలకు పరిమితులు నిర్ణయిస్తూ జీవో 77 జారీ చేసింది. వైద్యానికి చెల్లించాల్సిన ఖర్చును రూ . 3,250 నుంచి 10,380 రూపాయిల మధ్య నిర్ణయించింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్స అందించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లు కలిపి మూడు క్యాటగిరీలుగా విభజించారు.
కోవిడ్ రోగులకు మాత్రమే చికిత్స అందించే హాస్పిటళ్లు.. కోవిడ్, నాన్ కోవిడ్ రోగులకు చికిత్స అందించేవి.. కోవిడ్ కాకుండా మిగిలిన రోగాలకు వైద్యం అందించే హాస్పిటళ్లుగా వర్గీకరించారు.
తీవ్రమైన లక్షణాలకు చికిత్స అందించే క్యాటగిరి- 1 లో 19 హాస్పిటళ్లు, తేలికపాటి లక్షణాలుండి వైద్యం అందించేందుకు క్యాటగిరి -2 లో 67 హాస్పిటళ్లు, చాలా తేలికపాటి లక్షణాలు లేదా లక్షణాలు లేకుండా పాజిటివ్ సోకిన వారికి చికిత్స అందించేందుకు 3వ క్యాటగిరి లో 275 హాస్పిటళ్లను చేర్చారు.
అయితే , ఇందులో చాలా ప్రైవేట్ హాస్పిటళ్లు పూర్తి స్థాయి కోవిడ్ చికిత్స అందించేందుకు సిద్ధంగా లేవు.
వైద్య సిబ్బంది కొరత, ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై నెలకొన్న సందిగ్థత.. ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు, మౌలిక సదుపాయాల కొరత, వీటన్నిటికీ మించి కరోనా పట్ల నెలకొన్న సామాజిక రుగ్మతే ఈ పరిస్థితికి కారణమని రాజమండ్రి లోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ నవీన్ ఆర్‌జె అభిప్రాయ పడ్డారు.
రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాలలో కోవిడ్ చికిత్స అందించేందుకు ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుమతి లభించలేదని చెప్పారు.
“ఈ మహమ్మారితో పోరాడేందుకు ప్రైవేట్ హాస్పిటళ్లు కూడా భాగస్వామ్యం కావాలనే తపన అయితే కన్పించటం లేదు అని” ఆయన అన్నారు.
వైద్య ఆరోగ్య సిబ్బందికి, జిల్లా యంత్రాంగానికి మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన ప్రజలకు కోవిడ్ వస్తే వెంటనే ఎక్కడకు వెళ్లాలో అర్ధం కావటం లేదని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన హాస్పిటల్లో చేరేందుకు వీలవుతుందా?
విజయనగరానికి చెందిన మరో గృహిణి ఒక వివాహానికి హాజరై వచ్చిన తర్వాత కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. జూన్ 28న టెస్ట్ ఫలితం పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత తనకి నచ్చిన హాస్పిటల్‌ని ఎన్నుకునే అవకాశం ఆమెకు లభించలేదు.
అయితే ఆమెకు కోవిడ్ సోకేటప్పటికీ అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లకు చికిత్స అందించేందుకు అనుమతులు లేవు
ఇక తప్పని పరిస్థితిలో ఆమె లక్షణాలను బట్టి కోవిడ్ నోడల్ ఆఫీసర్ సూచించిన ప్రభుత్వ కోవిడ్ కేంద్రంలోనే చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్ పరీక్ష చేయించుకోవాలన్నా, హాస్పిటల్ లో చేరాలన్నా ఐసీఎంఆర్ నిబంధనలను పాటించడం తప్పనిసరని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విశాఖపట్నం అధ్యక్షురాలు రమణి వివరించారు.
ప్రైవేట్ హాస్పిటళ్లు వసూలు చేసే ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం అందరినీ కోవిడ్ పరీక్ష చేసేందుకు గాని, చికిత్స అందించేందుకు గాని అనుమతించటం లేదని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రైవేట్ హాస్పిటళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి?
“హాస్పిటల్ నిర్వహిస్తున్న ఒక డాక్టర్‌గా నాకు రెండు సందిగ్ధాలు ఉన్నాయి”, అని విశాఖపట్నం లో ఏబీసీ హాస్పిటల్‌లో క్రిటికల్ కేర్ నిపుణులు, పల్మనాలజిస్ట్ కవిత అన్నారు.
హాస్పిటల్లో కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కావల్సిన ఐసోలేషన్ వార్డులను తయారు చేయడం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించగలగడం ఒక సవాలైతే, హాస్పిటల్‌లో వైద్య, వైద్యేతర సిబ్బందిని పనికి రమ్మని ఒప్పించడం ఇంకొక సవాలుగా మారిందని అన్నారు.
"నాలోని డాక్టర్ సేవ చేయాలని ఎంత తపన పడినా నా దగ్గర పని చేస్తున్న సిబ్బంది లేనప్పుడు నేనెలా హాస్పిటల్ నడపగలను? “
సిబ్బంది లేకుండా నేను ఎలా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తానని ప్రశ్నించారు.
వైద్య ఇన్సూరెన్సు , ఆరోగ్య శ్రీ లాంటి పధకాలు పని చేస్తాయా?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ కేసులను కూడా ఆరోగ్య శ్రీ పధకం కింద చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.
కానీ, కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు ఇన్సూరెన్సు అయితే రోగిని చేర్చుకోమని చెబుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్పొరేట్ ఉద్యోగి బీబీసీకి చెప్పారు. రోగిని చేర్చుకోవాలంటే ముందుగానే కొన్ని లక్షల రూపాయిల అడ్వాన్స్ చెల్లించమని అడుగుతున్నాయని చెప్పారు.
కోవిడ్ డ్యూటీలకు హాజరయ్యేందుకు డాక్టర్లు సాధారణంగా తీసుకునే రుసుము కంటే మూడింతలు ఎక్కువగా చెల్లించమని యాజమాన్యాలను డిమాండ్ చేయడంతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు దిక్కు తోచని స్థితిలో పడ్డాయని డాక్టర్ రమణి అన్నారు.
“దీంతో, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు కూడా రోగి నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోక తప్పడం లేదు.” వ్యవస్థాగత కారణాల వలన ప్రైవేట్ హాస్పిటళ్లు కూడా ఇన్సూరెన్సు , ఆరోగ్య శ్రీ పథకం ఉన్న వారికి చికిత్స చేసేందుకు అంగీకరించటం లేదు" అని ఆమె అన్నారు.
కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సమయంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్ప మరో మార్గం లేదని డాక్టర్ రమణి అన్నారు.
“అవగాహన పెంచడమే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు”
అయితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్ గా కేటాయించిన ఏ హాస్పిటల్ కైనా వెళ్లి చేరవచ్చని, ఆంధ్ర ప్రదేశ్ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని చెప్పారు. హాస్పిటల్ క్యాటగిరీని జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు.
అయితే, కోవిడ్ పరీక్ష చేయించుకోకుండా కోవిడ్ హాస్పిటల్‌కి వెళితే అక్కడ పాజిటివ్ ఉన్న రోగులతో కలవడం వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉందని.. ఆ కారణంగా హాస్పిటళ్లు చేర్చుకోకపోవచ్చని అన్నారు.
కోవిడ్ లక్షణాలతో నాన్ కోవిడ్ హాస్పిటల్‌కి వెళ్లినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ కేంద్రాలకు వెళ్లి పరీక్ష చేయించుకుని చికిత్స చేయించుకోవడం మంచిదని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








