ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల్లో రాష్ట్రంలో 4,944 కేసులు నమోదయ్యాయి. 62 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 58,668కు పెరిగింది.
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్నాటకల తర్వాత ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 758గా ఉంది.
వారం రోజులుగా ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్, నాకోతోపాటు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ముందు 24 గంటల్లో 37,162 పరీక్షలు చేయగా.. వీటిలో 16,610 ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు ఉన్నాయి. వీటిలో 1,581 పాజిటివ్‌గా తేలాయి.
జులై 11 తరవాత రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జులై 1 నుంచి ఇప్పటివరకు కేసులు, మృతుల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగాయి.
అన్ని జిల్లాల్లోనూ..
శ్రీకాకుళం జిల్లాలో జులై 1న 63గా ఉన్న పాజిటివ్ కేసులు జులై 21నాటికి 2,963 అయ్యాయి. విశాఖ జిల్లాలో జులై 1న 563గా ఉన్న పాజిటివ్ కేసులు జులై 21 నాటికి 2,430 అయ్యాయి.
విజయనగరంలో జులై 1న 161గా ఉన్న పాజిటివ్ కేసులు జులై 21నాటికి 1,696 అయ్యాయి. కర్నూలులో జులై 1న 2,045గా ఉన్న పాజిటివ్ కేసులు జులై 21నాటికి 7,119 అయ్యాయి.
జులై 1న తూర్పు గోదావరి జిల్లాలో 1,209గా ఉన్న పాజిటివ్ కేసులు జులై 21నాటికి 7756 అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక కేసులున్నది ఈ జిల్లాలోనే.
ప్రతి జిల్లాలోనూ మృతుల సంఖ్య పెరిగింది. అనంతపురం, చిత్తూరు, కడప, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జులై 1 నాటికి 10 కూడా దాటని మృతుల సంఖ్య ఇప్పుడు ఎనిమిది రెట్లు ఎక్కువైంది.
130 మరణాలతో కర్నూలు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
"ముందే ఊహించాం"
కేసులు ఇలా పెరుగుతాయని ముందే ఊహించామని అంటున్నారు ప్రజారోగ్య అధికారులు. అనంతపురం డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు.
"రాబోయే రోజుల్లో కేసులు ఇంకా పెరుగుతాయని మా అంచనా. రోజుకు జిల్లాలో 500 దాకా కేసులు రావచ్చు. ప్రతి వ్యాధికి ఒక కర్వ్ ఉంటుంది. రాష్ట్రంలో కరోనా కర్వ్ ఇప్పుడు పురోగమనంలో ఉంది. ఆగస్టు రెండో వారం వరకు కేసులు ఇలా పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబరు నెలల్లో దీని తిరోగమనం ఉండొచ్చు"అని ఆయన అన్నారు.
దీన్ని ఎదుర్కొనేందుకే పరీక్షల సంఖ్య పెంచినట్టు తెలిపారు డాక్టర్ అనిల్.
"లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ప్రజలు తిరుగుతున్నారు. లక్షణాలు బయటకు కనిపించని వారి నుంచి ముప్పు ఉంది. అందుకే పరీక్షల సంఖ్య పెంచాం. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. పరీక్షలు ఎంత ఎక్కువగా చేస్తే అంత త్వరగా వ్యాప్తిని కట్టడి చేయొచ్చు" అన్నారాయన.
నిబంధనలు పాటించకపోవడం వల్లేనా?
ప్రజలు నిబంధనలు పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలిక్ అన్నారు. "లాక్‌డౌన్ సడలించిన తర్వాత.. పార్టీలు, వివాహాలు, పుట్టినరోజు వేడుకలంటూ ప్రజలు గుమిగూడుతున్నారు. నిబంధనలు పాటించడం లేదు. అధికారులైనా ఎంతవరకు ఆపగలరు? బాధ్యత విస్మరించి వ్యవహరిస్తుంటే ఎంత మందిపై చర్యలు తీసుకోగలం?" అని ఆయన అన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారితో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరిగిందంటున్నారు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను తీవ్ర ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేర్చి.. ఆ రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో జులై 1 నుంచి జులై 20 వరకు 416 కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక వ్యాప్తి జరుగుతోందా?
ప్రజలు నిబంధనలు పాటించడంలేదు అని అధికారులు అంటుంటే.. అసలు ప్రజలకు కరోనాతో 'సహజీవనం' అంటే ఏంటో స్పష్టత ఇవ్వాలంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.
"లాక్‌డౌన్ సడలింపు తరవాత కొన్ని నియమ నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఆ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వారు నియమాలను వక్రీకరించుకొని తిరుగుతున్నారు.. ప్రజలకు అవగాహన కలిగించాలి" అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.
విజయనగరం, నెల్లూరు జిల్లాల ప్రజారోగ్య అధికారులు కూడా ప్రజలు నిబంధనలు పాటించకపోవడంతోనే కేసులు పెరిగాయన్నారు. సామాజిక వ్యాప్తిపై అధికారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని బీబీసీ తెలుగు సంప్రదించింది.
"ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కేసులను ఆపడం సాధ్యం కాని పని. ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు చేస్తున్నాం. మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడమే ఇప్పుడు మా ముందున్న ప్రధాన సవాల్. దాని కోసమే పరీక్షల సంఖ్య పెంచాం"అని ఆయన అన్నారు. సామాజిక వ్యాప్తి జరిగుతుందా? లేదా? అనే అంశాన్ని ఐసీఎంఆరే చెప్పాలని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








