కరోనావైరస్ లాక్‌డౌన్: ‘గతంలో రెండు గంటలు ప్రయాణిస్తే వచ్చే ఇంటికి.. ఇప్పుడు ఏడు రోజులైనా చేరుకుంటామనే గ్యారంటీ లేదు’

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ సడలించిన తర్వాత మే 25వ తేదీ నుంచి చాలా ప్రాంతాలకు విమాన సేవలు మొదలయ్యాయి. జూన్ 1వ తేదీ నుంచి 200 రైలు సర్వీసులు మొదలయ్యాయి.

దీంతో, లాక్ డౌన్ కారణంగా చిక్కుపడిపోయిన వారంతా తమ తమ ఇళ్లకు వెళ్లాలని, లేదా చాలా రోజులుగా కుటుంబాన్ని చూడలేని వారు కుటుంబాన్నికలవాలని బయలుదేరారు.

విమానాలు తిరిగినంత మాత్రాన ఇంటికి వెళ్లడం అంత సులువేమీ కాలేదు. అలా ప్రయాణం చేసిన వారిలో నేను కూడా ఉన్నాను. నేను జూన్ 16 వ తేదీన దిల్లీ నుంచి విశాఖపట్నానికి బయలుదేరాను.

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నియమావళిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకే వదిలేయడంతో దేశంలో ప్రయాణాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు.

తెలంగాణ, దిల్లీ లాంటి కొన్ని రాష్ట్రాలలో ప్రయాణీకులను నేరుగా హోమ్ క్వారంటైన్లో ఉండమని చెప్పి పంపేస్తుండగా, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో హైరిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులందరినీ ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచుతున్నారు.

బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షి

లాక్ డౌన్ సడలించిన తర్వాత నా ఇంటికి నేను వెళ్లడం కష్టమవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. కోవిడ్ జీవితాలలోనే కాదు జీవన విధానంలో కూడా చాలా మార్పులు తెచ్చేసింది. ఊర్లో దిగినా కుటుంబాన్ని, స్నేహితులను కలిసేందుకు వీలు లేని పరిస్థితి.

నేను దిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరి రావాలనుకోగానే 7 రోజులు ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అందుకు మానసికంగా సంసిద్ధమై బయలుదేరాను. మాస్క్‌లు, ఫేస్ కవర్లు, ధరించి భయం భయంగా రెండు గంటలు విమానంలో ప్రయాణించిన తర్వాత అసలు ప్రహసనం మొదలవుతుంది.

ఎయిర్‌పోర్టులో దిగగానే ఇంట్లో వాళ్ళు పంపే కారులోనో, టాక్సీ బుక్ చేసుకునో వెళ్లే పరిస్థితి లేదు. మాస్క్, భౌతిక దూరం జైలు కటకటాల కంటే కఠినంగా అనిపిస్తాయి ఆ క్షణానికి.

ఎయిర్ పోర్టులో దిగగానే టెంపరేచర్ పరీక్షించి, ప్రయాణీకుల వివరాలన్నీ నమోదు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో పోలీస్ వ్యాన్లు వెంట రాగా కోవిడ్-19 పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళతారు.

కోవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి హై రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణీకులంతా కచ్చితంగా 7 రోజుల పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఉచిత క్వారంటైన్‌లో కానీ, డబ్బులు చెల్లించి హోటల్ లో కానీ ఉండవచ్చు. హోటల్ స్థాయిని బట్టి 7 రోజులకు 10000 నుంచి 17500రూపాయిలు వసూలు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌కి హై రిస్క్ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారందరికీ ప్రభుత్వం విధిగా కోవిడ్ పరీక్ష నిర్వహిస్తోంది.

కరోనావైరస్ క్వారంటైన్ భోజనం

విశాఖపట్నానికి ప్రతి రోజు నాలుగు ట్రైన్లు వస్తుండగా రెండు రైళ్లు ఇక్కడే ఆగిపోతుండగా మరో రెండు విశాఖపట్నం మీదుగా ప్రయాణిస్తున్నాయి. సుమారుగా ప్రతి రోజు 1100 మంది ప్రయాణీకులు విశాఖపట్నానికి వస్తున్నట్లు విశాఖపట్నం రైల్వే సీనియర్ డివిజనల్ కమీషనర్ సునీల్ కుమార్ బీబీసీకి చెప్పారు.

హై రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ ప్రభుత్వ క్వారంటైన్ లో 7 రోజులు ఉంచుతున్నారు. తక్కువ ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారిని హోమ్ క్వారంటైన్ కి పంపిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులను కూడా హోమ్ క్వారంటైన్ కే పంపిస్తున్నారు.

తక్కువ ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారికి మాత్రం ప్రతి 1000 మందిలో ఒక శాంపిల్ తీసుకుని రాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

హోటల్లో సాధారణ సమయంలో ఉన్నట్లుగా పరిస్థితులు ఉండవు. రూమ్ ఫ్రెషనర్ల బదులు శానిటైజెర్ల వాసనలు స్వాగతం పలుకుతాయి. మన సామాన్లను తీసుకుని వెళ్ళడానికి గతంలోలా ఎవరూ హోటల్ సిబ్బంది ఉండరు.

రూమ్ శుభ్రం చేయడానికి ఎవరూ రారు. తలుపు బయట నుంచే ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం అందిస్తారు.

హోటల్లో స్పా, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, బార్ పూర్తిగా మూసివేశారు. క్వారంటైన్లో ఉన్నవారంతా తమ గదులకే పరిమితమై ఉంటారు. గతంలోలా హోటల్లో సిబ్బంది అంతగా కనిపించరు.

హోటల్ సిబ్బంది గతంలో సూట్లు ధరించి కనిపించేవాళ్లు. ఇప్పుడు పీపీఈ కిట్లలో కనిపిస్తున్నారు. శానిటైజర్లతో హోటల్ పరిసరాలు ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తున్న సిబ్బంది ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటారు.

అయితే, మొదటి టెస్ట్ లో నెగెటివ్ వచ్చినా రెండవ సారి ఏడవ రోజు మళ్ళీ కోవిడ్ పరిక్ష నిర్వహించి అందులో కూడా నెగెటివ్ వస్తేనే ఇంటికి పంపిస్తున్నారు.

గతంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలంటే డాక్టర్ అనుమతి అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలంటే కూడా డాక్టర్ డిశ్చార్జ్ రాస్తే కానీ, హోటళ్ల వారు చెక్ అవుట్ ఇవ్వటం లేదు. ఆ రోజులకు అదనంగా డబ్బులు చెల్లించాలి. ఈ విషయాన్ని కోవిడ్ కేంద్రం దగ్గర మొదట చెప్పరు. 7 రోజులు ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండాలనుకుని మానసికంగా సంసిద్ధమైన వారికి ఒక్క క్షణం హోటల్ చేతిలో బందీలయినట్లుగా అనిపిస్తుంది.

హోటల్ సిబ్బంది, డాక్టర్.. హోటల్ గెస్ట్ లను దగ్గరుండి రెండవ సారి కోవిడ్ పరీక్షకి తీసుకుని వెళతారు. మళ్ళీ వారు అటు నుంచటే ఎటూ వెళ్లకుండా దగ్గరుండి హోటల్ కి తీసుకుని వెళతారు. నాతో పాటే హోటల్ కి వచ్చినవారు ఇంకా హోటల్ క్వారంటైన్ లోనే ఉన్నారు.

అయితే, ఇది డబ్బులు చెల్లించి హోటళ్లలో ఉండేవారి పరిస్థితి.

కారులో కరోనావైరస్ సోకకుండా ఏర్పాటు చేసిన మైనం తెర
ఫొటో క్యాప్షన్, కారు ప్రయాణంలో కరోనావైరస్ సోకకుండా ఏర్పాటు చేసిన మైనం తెర

శ్రీకాకుళం ప్రభుత్వ క్వారంటైన్ లో ఉచితంగా ఉన్న ఒక వ్యక్తి బీబీసీ తో మాట్లాడుతూ సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి విడిగా గదులు కూడా ఇచ్చినట్లు చెప్పారు. వేలెత్తి చూపే లోపాలేవీ తాను గమనించలేదని చెప్పారు.

ఇలా లాక్ డౌన్ తర్వాత ప్రయాణాలు చేసి వచ్చిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వారికి డబ్బులు 7 రోజుల కోసం ఎలా కట్టాలో అర్ధం కాక నా కళ్ళ ముందే కొంత మంది కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూసాను.

కానీ, జూన్ 16 వ తేదీన దిల్లీ నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఒక సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి సన్నద్ధం అవుతున్న తన పేరు వెల్లడి చేయడానికి ఇష్టపడని ఒక అమ్మాయి ఇంకా ఒక ప్రైవేట్ హోటల్ రూమ్ లోనే ఉన్నారు .

టెస్ట్ ఎప్పుడని అడుగుతుంటే,“మీ శాంపిల్ మిస్ అయింది. వెయిట్ చేస్తే వివరాలు తెప్పిస్తామని రోజులు పొడిగిస్తున్నారు తప్ప చెక్ అవుట్ చేయడానికి అనుమతి ఇవ్వటం లేదని” బీబీసీ కి చెప్పారు.

“గది శుభ్రంగానే, సౌకర్యవంతంగానే ఉంది. ప్రతి రోజు ఇంటి నుంచి ఎవరో ఒకరు భోజనం తెచ్చిస్తున్నారు. కానీ, ఇలా ఎన్ని రోజులకి డబ్బులు కట్టాలో అర్ధం కావటం లేదని" అన్నారు.

“7 రోజులు గడిచినా టెస్ట్ చేయటం లేదు. జూన్ 16 వ తేదీన ప్రయాణం చేసి వస్తే జూన్ 23వ తేదీకి ఆమెకి 7 వ రోజు పూర్తవుతుంది. కానీ, నాతో మాట్లాడే సమయానికి ఆమెకి రెండవ సారి టెస్ట్ జరగలేదు”.

వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కేఎస్ జ‌వ‌హర్ రెడ్డి

ఫొటో సోర్స్, K S JAWAHAR REDDY

ఫొటో క్యాప్షన్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కేఎస్ జ‌వ‌హర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు 20000 - 22000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కోవిడ్-19 పరీక్షలు అధిక స్థాయిలో జరగడం వలన కేసులను ట్రేస్ చేసి క్లస్టర్లను తొందరగా గుర్తించి చికిత్స చేయడం వీలవుతుందనే ఉద్దేశ్యంతోనే అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కేఎస్ జ‌వ‌హర్ రెడ్డి బీబీసీకి తెలిపారు.

“కోవిడ్ మొదలైన తొలి రోజుల్లో శాంపిల్ ని పూణేకి పంపించాల్సిన స్థితి నుంచి మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో శాంపిళ్లు పరీక్షించడానికి ల్యాబ్ లు ఏర్పాటు చేసాం”.

దేశంలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రాంతాలైన దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, చెన్నైలాంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణీకులను 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కి పంపిస్తున్నట్లు చెప్పారు.

అలాగే, రాష్ట్రమంతా కొన్ని ప్రత్యేక కోవిడ్ హాస్పిటళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అయితే, కొన్ని హోటళ్లు మాత్రం రెండవ టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం వచ్చే వరకూ హోటళ్లు చెక్ అవుట్ చెయ్యనివ్వటం లేదని చెప్పగా, ఈ విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

రాష్ట్రమంతా 40000 మందికి సరిపోయే విధంగా కొన్ని ప్రత్యేక కోవిడ్ హాస్పిటళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కూడా పెంచుకున్నట్లు చెప్పారు. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మారుస్తున్నట్లు చెప్పారు.

పిజి విద్యార్థులు, నర్సులను కూడా విధుల్లోకి తీసుకుని వైద్య సిబ్బందిని పెంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో నియమించిన గ్రామ వాలంటీర్లు గ్రామాలలో కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తగిన సహకారం అందిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న ప్రతి వాహనంలో హై రిస్క్ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్న వారికి రాష్ట్రంలోని చెక్ పోస్టుల దగ్గరే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

బస్సుస్టేషన్ల దగ్గర కొంత మందికి మాత్రమే శాంప్లింగ్ విధానంలో పరీక్షలు చేస్తున్నారు.

రాష్ట్రంలో వైద్య వ్యవస్థని, అధికార యంత్రాంగాన్ని కోవిడ్ 19 నిర్వహణకు సమాయత్తం చేసినట్లు జవహర్ రెడ్డి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్లో జూన్ 23 వ తేదీ నాటికి 10002 కేసులు నమోదు కాగా 5284 యాక్టివ్ కేసులున్నాయి. 4589 మంది కోలుకున్నారు. 119 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్ కి బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారందరికీ ప్రభుత్వం విధిగా కోవిడ్ పరీక్ష నిర్వహిస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇదిలా ఉంటే దిల్లీలో ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి జూన్ 07 వ తేదీన దిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ఆయన స్వగ్రామం సిరిసిల్లకి వెళ్లారు.

“అక్కడ కేవలం థర్మల్ స్క్రీనింగ్ చేసి పంపేశారు. నా వివరాలేమీ సేకరించలేదు. నేనెక్కడికి వెళుతున్నాను అనే విషయం గురించి కూడా అడగలేదు”, అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్పొరేట్ ఉద్యోగి బీబీసీ కి వివరించారు.

నేనే స్వయంగా మునిసిపల్ సిబ్బందికి కాల్ చేసి దిల్లీ నుంచి వచ్చానని చెబితే, జూన్ 08 వ తేదీన స్థానిక పోలీస్ వచ్చి నా వివరాలు తీసుకున్నారు. వైద్య సిబ్బంది ని పంపిస్తాం. 14 రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్లిపోయారు. కానీ, పరీక్ష చేయడానికి కానీ, క్వారంటైన్ స్టాంప్ వేయడానికి కానీ ఎవరూ రాలేదని తెలిపారు.

“అయితే, నేను రెడ్ జోన్ నుంచి వచ్చాను కదా, ఒక్క సారి పరీక్ష చేయమని అడిగితే మీకు కరోనా లక్షణాలు లేవు కాబట్టి పరీక్ష చేసే పని లేదని అధికారులు చెబుతున్నారు. నేనింకా మా ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి గాని, మాట్లాడడానికి కానీ, ధైర్యం చేయలేకపోతున్నాను. నాకు మాత్రం ఇప్పటికీ భయంగానే ఉందని", అన్నారు.

లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు పెరగడంతో తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబ్లలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జూన్ 15 వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు.

కోవిడ్ లక్షణాలు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో జూన్ 23 వ తేదీ నాటికి 9553 కరోనా వైరస్ కేసులు నమోదైతే 5109 యాక్టివ్ కేసులున్నాయి. 4224 మంది కోలుకున్నారు. 220 మరణాలు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే దిల్లీలో కోవిడ్ సోకి 14 రోజులు క్వారంటైన్ లో ఉన్న మరో వ్యక్తి కి ఏ విధమైన టెస్ట్ చేయకుండానే ఇంటికి పంపేసినట్లు చెప్పారు.

దిల్లీలో జూన్ 23 వ తేదీ నాటికి 66602 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24988 యాక్టివ్ కేసులు, 39313 మంది కోలుకున్నారు. 2301 మరణాలు నమోదయ్యాయి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)